తలుపులన్నీ తెరచి తలవాకిటన నిలచి,
తరలి రమ్మని నిన్ను పలుమారు పిలినా,
తరణ మిది కాదంచు తొలగి యుందువుగాని,
తలుపవే నా మొరను మన్నించు తరిని!!
తలపులను పలుకుగా పలికేటి పంజరము,
పలికేటి పలుకులిక పస తరిగి యున్నాయి,
పలుకేది పలికినా తలపు సరి రాదాయె,
తరుణ మెన్నడు నీవు తరలి నను జేరగా!
కనుపాప ఫలకాన కదలాడు నీడలను,
కమనీయమని తలచి మురియలేకునాను,
తెరచాటుగా నిలచి ఊహలూదుట మాని,
మరుగు విడి నా కనుల వెలిగునది ఎపుడో!
వీనులందిన ధ్వనులు మనసు జేరుట మానె,
మనసు అలజడి మడుగు అలసటొందుట మానె,
అలవిగానీ సడికి పరమార్ధ మెరుగనే,
అలుక మానిక నన్ను అలరింప రాదా!
వెన్ను గావగ నీవు వెన్నంటి యుందువట,
యజమాని నేగానె నీ ముందు నడువా!
లేని పెత్తనమిచ్చి పొల్లు లెన్నగ తగున,
తుంటరాటలు మాని తోడీయ రాదా!