విన్నపం 

దుఃఖ మెరుగని దారి దురిత దూరా నడుపు,
దూరాన గలవన్న వెరపు మాలో మాపు||

వెన్నంటి యే కాక ఇరుపార్వశ్యముల నీవె,
ఎదిరి దారియు నీవె ఎదనిండయును నీవె,
ఏమరక ఆ ఎరుక ఎలుగెత్తి ఎరిగించు,
ఎరిగించినా ఎరుక నా మతిన కరిగించు!!

||దుఃఖమెరుగని దారి దురితదూరా నడుపు,
దూరాన గలవన్న వెరపు మాలో మాపు||

కంటి వెలుగువు నీవె కనువిందుయును నీవె,
కలవరైబై (మది) కలచు కల్ల కలయును నీవె,
ఎరిగి తొలగుండగల ఎరుక మదిలో నాటు,
ఏమరక ఆ మొలక నిలచి పెరుగగ చూడు!!

||దుఃఖమెరుగని దారి దురితదూరా నడుపు,
దూరాన గలవన్న వెరపు మాలో మాపు||

తనువు చేతులు మోడ్చి తలవంచి నాగాని,
మనసు మరుగాయెనని మౌనమొందగ బోకు,
ఎండైన వానైన ఎగుడు దిగుడుల జగతి,
తిరిగి అలసెడి తనువు ఆరాటమును గనుము!!

||దుఃఖ మెరుగని దారి దురిత దూరా నడుపు,
దూరాన గలవన్న వెరపు మాలో మాపు||

కుదురెరుంగని మనసు కుంగుటెరుగుని గాని,
తనువు తాపము మాన్ప నీ మెప్పు గొనలేదు!
అక్కరెరుగని మనసు అరలోన అమరించి,
ఆదుకొన వెనుకాడ నీతి యగునే నీకు!

||దుఃఖ మెరుగని దారి దురిత దూరా నడుపు,
దూరాన గలవన్న వెరపు మాలో మాపు!!

జనకుడను నేనంచు కవుల కలములు నింప,
నిండదే మా బ్రతుకు కనుల వెలుగులు నిండ,
జాడవై జతజేరి జగతి నడిపెడి వాడ,
జాలి చినుకులు మాని జీవనాదము నింపు!

||దుఃఖ మెరుగని దారి దురిత దూరా నడుపు,
దూరాన గలవన్న వెరపు మాలో మాపు!!

Leave a comment