ఎరుక కో మనవి

ఎరుక లేకున్న నే నెరిగుంతు నా మనవి ,
ఎరుక నీవగు నీకు ఏమంచు ఎరిగింతు!
ఎదిరి దారెరిగేటి ఎరుక కరవగు నేను ,
ఏ విన్నపము జేసి నీ చరణముల కందు!!!

కరవు కాటకమైన – కనలేని కనులైన,
సొంపెరుంగని అంగ వైభవము గలిగున్న,
తలపు మొలకల లోన మొలిచెనా నీ తలపు,
తొలగి తరలేనంట తనురాసి వేదనలు !!
||ఎరుక లేకున్న నే నెరిగుంతు నా మనవి ,
ఎరుక నీవగు నీకు ఏమంచు ఎరిగింతు! ||

కనక రాసులు కోరి – సుర వైభవము కోరి;
తనువు తొలగక మెలుగు ఆయువును కోరి;
దిశలు దిక్కుల సీమ ధిక్కారియై కూడ ,
కూరిమిన నీ కోలువు కొనక ధరకొరిగేరు !!
||ఎరుక లేకున్న నే నెరిగుంతు నా మనవి ,
ఎరుక నీవగు నీకు ఏమంచు ఎరిగింతు! ||

కటిక దారుల నడచి తనువు నొవ్వగ జేసి,
పలుమారు నిను వేడి బడలి వొడిలే రొకరు!
తులసి దళమున కొకరు – చెటికె డటుకుల కొకరు,
తరగుటెరుగని నీదు నెయ్యమును గొన్నారు!
||ఎరుక లేకున్న నే నెరిగుంతు నా మనవి ,
ఎరుక నీవగు నీకు ఏమంచు ఎరిగింతు! ||

తనువు నొవ్వగ నేను తపము సల్పగ లేను,
కళ్ళె మెరుగని మనసు కుదురు జేయగ లేను,
కాల జలనిధి నడుమ సుడిలోన మనలేను,
నీ శరణు నీయగల విన్నపము అనలేను!!
||ఎరుక లేకున్న నే నెరిగుంతు నా మనవి ,
ఎరుక నీవగు నీకు ఏమంచు ఎరిగింతు! ||

తలచినే తలపైన నీ ఎరుక నంటారు,
నడచినే దిశ యైన నీ వంక నంటారు,
తీరెరుంగని నన్ను నీ తీరమున జేర్చు,
పలుమారు నిను బాయ ఓరిమిన దరిజేర్చు !
||ఎరుక లేకున్న నే నెరిగుంతు నా మనవి ,
ఎరుక నీవగు నీకు ఏమంచు ఎరిగింతు! ||

Leave a comment