ఉల్లాసమే కాని ఉసురు ఊపిరి నొల్ల,
ఉదయ సంధ్యల నడుమ నడయాడు నేను!
జిలుగు వెలుగులె గాని ముసురు చీకటి నొల్ల,
రే పగటి జంటతో జతయుండు నేను!!
వెర్రిదేమో జగతి పంచి ఇచ్చేనన్ని,
ఎదురు కొంచెంబైన ఏనాడు గొనకున్న,
కరగి కరవున మునిగి కుంగిపోదా ఎపుడొ!
ఏమిటో ఈ జగతి తీరు తరి తెలియదే!!
వెలుగు వాకగు వాడు ఎడతెరపి గొనకుండ,
కుండ పోతగ వెల్గు కుమ్మరించే వేళ,
సుంతైన సుంకంబు ఏల గొనకున్నాడు,
వెల్గు బాసెడి నాటి గతి తెలియకున్నాడు!!
చుక్కలన్నిటి నడుమ ఠీవిగా వెలిగేటి,
చలువ వెలుగులు చిలుకు రేరాజు వీడు,
సుధ చిలికి పండించు ఓషధుల సుంకంబు,
కొసరి కొంచెంబైన తానడగ బోడు!!
చినుకు తాకిడి కోర్చి చిల్చి తన గుండియను,
చిరు మొలకలను పెంచి పండించి పంటలను,
రాసులుగ పోసేసి మిన్నకుండే పుడమి,
తన తాపమునకింత సుంకమని కోరదే!
నది లోని నీరములు తూగి తిరిగే అలలు,
ఊపిరై ప్రతి వారి ప్రాణ పాలన జేసి,
తన తనువు తెరపికై తరువు జొచ్చే వాడు,
ఏ సుంకమును లేని సంచార మేలనో!!
దేవరలు దానవులు ధరనడచు మానవులు,
కాసు కొంచెంము లేక కాలమున మనలేరు!
వీరి జాతేమందు వైన మేమని ఎంతు?
కాసు కోరకె వీరు కురిపింతురే కొసరి!!
వారి మన్నన లేక మనలేని ఈ తనువు,
మన్నించదే వారి వితరణల వైభవము!
కొంతైన సుంతైన తనవంతుగా కొంత,
పంచి పండుగ జేయ యోచనల మునిగేను!!
మూలమందలి గుణము మొలకలో కరువాయె!
పోషణల పోలికలు పొంతనే లేదాయె!
లోపమెందున గలదు లోకేశుడా తెలుపు,
తెలియగల్గిన తెలివి తేటగా వెలిగించు!!