మాయ తళుకులు చూచి ఇంచుక మోహమొందితినంతె గాని,
మదన జనకుని మనసు గెలిచిన పురహరుని పూజలును మరతునా!
ఉదయ భానుని లేత వెలుగుల వైభవము కొనియాడుచూ,
కాల సంధ్యను కొంత తడవటు ఆలసించితి నంతె గాని,
లోని వెల్గులు మేలుకొల్పే గాయత్రి గానము మరతునా!
తుమ్మెదకు తన మోము జూపక సిగ్గులొలికే పూల చూచుచు,
నీదు రచనల సొగసులో మైమరపు నొందితి నంతె గానీ,
కన్నె పూవులు నీదు పదముల చేర్చి పేర్చుట మరతునా!
మోహ నర్తన సోయగంబుల రుచుల నెంచగా గగన వాసులు,
అతిధులై ఈ భూతలంబున సందడుల సడి చేయుచుండగ,
అల్పుడగు నే నెంతవాడి విదుషి మాయను గెలువగా!
ఏటి నీటిన సంధ్యవార్చుక గట్టు జేరిన పిల్ల తెమ్మెర,
వంటి నంటిన చిన్న చినుకులు జల్లి వడిగా తరలిపోతే,
వందనము నీవందు తీరుకు మైమరపు నొందుట తగనిదా!
రూపు గట్టని చలువ తెమ్మెర తూగి తగిలిన తీరు నెంచుచు,
కొమ్మ రెమ్మన నిలువ లేనని ఊగులాడెడి విరుల చూచుచు,
నెమ్మదెరుగని తొందరేదో జగతి నడతని ఎంచనగునా!
నిలకడెరుగని సూర్యచెంద్రులు నిలువ నీయరు భూతలంబును,
తొందరేదో తెలియలేకనె నిదుర మానుక పరుగు తీయును!
ఇంత తొందర పొందులో నే నెమ్మదించగ ఎట్థులోర్తువు!
రెప్ప పాటులు రేపవళ్ళుగ సూర్య చంద్రులే చూచు కన్నుగ,
భూతలంబే పాదపీఠిగ గగన సీమలె ఛత్ర ఛాయగ,
తీరి తీరుగ తీర్చియున్నా నీదు వైభవ మేమనెంతును!
అంతమెరుగని తీరికొందుచు వివరమించుక వీడనెంచక,
గడ్డి పూవును గగన తారను తగిన తరిలో ఓర్చి పేర్చుచు,
నీవు సలిపిన సృష్టి రచనను నిలకడగ నే నెంచతగనా!
భ్రాత నీవని తాతనీవని జనని జనకుల రూపు నీదని,
మూడు మూర్తుల నీదు రూపే అణువు అణువుగ జగంబాయని
ఎరుక జేసిన తపోమూర్తుల భావముల నే నెరుగవలదా!
రూపు గట్టిన నిలకడవు ఈ జగతి కేలో నిలకడీయవు,
నెమ్మదిన నే నిలుతునన్నా నిలువదే ఏ నిముషమిక్కడ,
తెలియ కోరిన తెలియ జేసెడి తీరికెరుగరు ఎవరునిచట!
రమ్యమగు రమణీయ జగతిని రెప్పలార్పక చూతుమన్నా,
గాలి కోర్వక వెలుగు కోర్వక పాడు రెప్పలు వాలిపోవును,
చెదరి పోయెడి చూపు ఊతగ జగతి నేపగిదెరుక గొందును?
మాయ పద మంజీర నర్తన మోహమందగ జేయుచుండగ,
కదలితే ఆ జతుల లయలకు లోపమేదో మొలచునంచూ,
నిలచి నెమ్మది నొందు వాడగు నీదు తనయుడ నేనయా!!
తరుణమున నిను తలుప లేదని- మోహ మాయన మునిగినాని,
తొలగి నా గతి తలుపకుండుట తీరుగాదని విన్నవింతును!
నీదు రచనన రమియింపకుండుట – దొడ్డతనమది యగునె నీకు!!
కరుణ నెంచుము కమల లోచన – కాఠిన్యమును నీ కన్నులోర్వవు,
తాత నీవని నేను మరచిన – నన్ను మరచుట నీకు తగునా!
తలపులో నిను నిలుపకున్నా – తనువు నీదని మరువ బోకయ!!
చేతలేవో చేయలేదని – దరిచేరు దారుల చెదర జేయకు!
మాయ మోహపు లాలి పాటకు జోల లూగెడి నీకు తనయుడ,
ఎట్టులో నను చేరదీయుము చేదరు చింతన చెరపివేయుము!!
