సకలమందున నీవు – నీలోనె సకలంబు
సకల సాక్షివి నీవు – సావధానమునొందు !!
సకలమందున నీవు నీలోనె సకలంబు,
నీరజాక్షా నిన్ను ఏమంచు భావింతు?
నేడు కన్నుల గట్టి కరిగిపోయే జగతి,
కరగకుండెటి నిన్ను కలిగెట్లు కరిగేను?
||సకలమందున నీవు – నీలోనె సకలంబు
సకల సాక్షివి నీవు – సావధానమునొందు ||
ఆద్యంతములు లేని ఆనందరూపుడవు,
రూపు గట్టిన జగతి అనురూపియటనీకు,
రూపమందున లేక అనురూపమందేల,
కొరత భావన నిండి క్రుంగేను ఈ జగతి?
||సకలమందున నీవు – నీలోనె సకలంబు
సకల సాక్షివి నీవు – సావధానమునొందు ||
ముందు కరుగక తాను కలిగుండు నాలోనె,
కదిలి కురుగుచు గూడ ఇమిడుండు నాలోనె,
చినుకు చినుకుగ కరిగి కలిగుండు లోలోనె,
తరగుటెరుగని నిన్ను కరుగునది ఏమెరుగు?
||సకలమందున నీవు – నీలోనె సకలంబు
సకల సాక్షివి నీవు – సావధానమునొందు ||
దశ మారినాగాని దయను మానగతగునా,
చేర రమ్మను చెలిమి అలుపన్న దెరుగునా,
చేర దారులు నెరపి చేయుత నందించి,
చేరకున్నను చేరి చెలిమినందగ జేయు!!
||సకలమందున నీవు – నీలోనె సకలంబు
సకల సాక్షివి నీవు – సావధానమునొందు ||
అంతరంబేలేక నిండియుండిన నీవు, తనువులంతరమందు తగిలుండ లేదా?
దాపు నుండియు తాను దూరాన తోచేను,
అంతరంబులు పెంచి ఏమంద జేసేవు?
||సకలమందున నీవు – నీలోనె సకలంబు
సకల సాక్షివి నీవు – సావధానమునొందు ||
తోడ బుట్టినవారు తండోప తండాలు,
తోడుండగా నాకు తెలియరే ఒకరైన,
తనువెంత తోడైన తొలగియుండే నేదొ,
దాని నందగ లేక లోనేదొ వెలితాయె!
||సకలమందున నీవు – నీలోనె సకలంబు
సకల సాక్షివి నీవు – సావధానమునొందు ||
వెదురు వేణువు నూది వేదాలు పలికించి
వెన్నెలాటల దేలు వన్నెకాడవు నీవు!
బ్రతుకు ఊపిరులూద పలికేటి నాదంబు,
వేద వైభవమేల పలుకలేకున్నాయి?
||సకలమందున నీవు – నీలోనె సకలంబు
సకల సాక్షివి నీవు – సావధానమునొందు ||
నీ కనులు కురిసేటి కరుణ చినుకుల తడిసి,
మురిసి మొలచిన జగతి కరుణేల కరువాయె!
నీ మోవి దరహాస సుధల పండిన పలుకు,
పరుషమై ఈ జరతి పలుమారు పలుకేల!!
||సకలమందున నీవు – నీలోనె సకలంబు
సకల సాక్షివి నీవు – సావధానమునొందు ||
మూలమందెడి దారి దరియుండి ఎరిగించి,
కలత నలిగిన కనుల కన్నీరు మరిపించి,
చెంతనుంటి వనన్న చెలువంబు నెరిగించి,
చెదిరి చితికెడి మనసు మాలిమిన మన్నించి!!
సకలమందున నీవు – నీలోనె సకలంబు
సకల సాక్షివి నీవు – సావధానమునొందు !
సన్నుతింపగ నెవరు స్తుతి నందు వారెవరు,
భక్తవరదా విడకు నా భావనెపుడూ!!