చెట్టు కొమ్మలమీద ఈరోజు పుట్టి రేపటికి వాడిపోయె పువ్వులను చూసిన ఒక ప్లాస్టిక్ పువ్వు , నిరంతరం పుడుతూ చస్తూ ఉండే వనాల గురించి తెలుసుకునే ప్రయత్నం చూసిన …. .
పద్మబాంధవు పట్టి పలుకరించని పూవు,
పలుమారు తలపోసి పద్మసంభవు పితను,
ఎరుక నెంచగ నెంచె ఏమరపు సాకులను,
సాకు కొమ్మల పట్టి విచ్చి వీగుట జూసి!!
గడచిపోయే ఋతువు గురుతేదొ తెలిపేను,
చేరు ప్రొద్దుల జేరి తెలియజేయగ తాను ,
పొడుచు ప్రొద్దుల పద్దు పట్టదే ఆ చెలిమి,
పంచ పలుకుల పుంత పిన్నయై తొలగేను!! (పంచ-share)
చిగురాకు చీరెలను శృంగార మమరించి,
విసిగి వీగిన వనులు-తొలగి తడిసిన వనులు,
జతవీడి భువిజేరు చినుకు చెలియల జేరు,
రవి కరంబుల సెగల సొమ్మసిల్లె వనులు!!
వెండి కొండల కొమ్ము మోహమోపగ లేక,
అరుణ కిరణము మోపి చెలిమి కబురంపగా
తాపమోపని తుహిన కరిగి చిందిన చినుకు,
సందడుల అందెలతొ సవ్వడందిన వనులు!!
ఊహలల్లిన గూడు ఉనికి చెదరిన వేళ,
ఊరటొందగ లేని యదలు కుమిలే వేళ,
ఉదయాస్తమానాల ఉనికి ఒకటిగ దోచు,
తనువాసులను గాంచి వగచేటి వనులు!!
భవతాప హరు భావ మధు పానమందగా,
మనసు నెమ్మది నంద ఏకాంత నెలవుకై,
తను బంధముల జంట సంగమెల్లను వీడు,
తరుమూల సంగులను పోషించు వనులు!!
తుమ్మెదల తొందరల తుంటరాటల లోనె,
నెయ్యంబు నెలకొంచు నెనరొందు నానాడు,
తరిగి పెరిగే వనులు తరు గెన్న వేనాడు,
జలజాక్షు జతబాసి మనజాల వేనాడు!!
మెరుగు తరుగులు లేని సౌకుమార్యపు సీమ,
నలుగు టెరుగని నవ్య సౌదర్య సంజాత,
ఋతువు లెరుగని నిత్య లావణ్య లతిక,
ఎరుగదే ఏనాడు పరిణతుల నడక!!
నిలకడెరుగని వనిన నిలిచియున్నాగాని,
నీరజాక్షుని ఉనికి కలనైన కనలేదు,
కనికరించెవరైన ఎరిగించ నెంచరే,
గంధ మందలి గంధ మింతైన తెలియా!!