పూవు లేని పూజ

పూవు లేనీ పూజ – పదములల్లిన పూజ ,
మనసు మౌనమునుంచి మొలచినీ పూజ ,
పలుమారు తలపోయ తరుగుటెరుగని పూజ ,
తలుపవే మన్నింప ముని మనోరమణా !!

మనోవీధిన మెదలు నీ భావ సంగతులే
ఆవాహనంబంచు అరుదెంచ మందు !
భావాల పాదులే (నీకు) కనకాసనంబంచు ,
అర్పించి నిను వసతి కూర్చుండమందు !!

పూవు లేనీ పూజ – పదములల్లిన పూజ ,
తలుపవే మన్నింప ముని మనోల్లాసా!

పాప పుణ్యపు చింత పలుమారు తలపోయ
పొగిలి మనసున పొంగు చినుకులన్ని,
కలశమందున జేర్చి పాద్యమిదె గోనుమంచు
నీ పాదముల యందు కుమ్మరింతు !!

పూవు లేనీ పూజ – పదములల్లిన పూజ ,
తలుపవే మన్నింప ముని మనోల్లాసా!

ప్రేమ నిండిన పలుకే సురగంగ చినుకంచు ,
అర్ఘ్యమని నీ కరము సేవించు కుందు,
మమత నిండిన ప్రేమ ఆ పలుకులో నిండ,
ఆచమన తీర్ధమని నీకు అర్పింతు !!

పూవు లేనీ పూజ – పదములల్లిన పూజ ,
తలుపవే మన్నింప ముని మనోల్లాసా!

ముసురు మోహపు పొరలు పెకలించి పలుమారు
వసతి వస్త్రమనెంచి వొసగేను నీకు !
మనసు చిలికే కళలు పన్నీటి కడవలని,
అభిషేక స్నానమున కర్పింతు నీకు !!

పూవు లేనీ పూజ – పదములల్లిన పూజ ,
తలుపవే మన్నింప ముని మనోల్లాసా!

మలిగిపోయిన కలల కాటుకను అందించి,
మొగ్గ తొడగని ఆశ అగరు గంధమునిచ్చి ,
మొలక ఉహల మంచి ముత్యాల సరులిచ్చి,
శృంగార మమరింతు సిరి మనోల్లాసా !!

పూవు లేనీ పూజ – పదములల్లిన పూజ ,
తలుపవే మన్నింప ముని మనోల్లాసా!

చెదరి పోవని కలలు, చేరవచ్చే కలలు,
చిగురు చిగురున వగపు చిందించు కలలు,
నదురు బెదురూ లేక కవ్వించి కవ్వించి,
కనుల గట్టకె తొలగి కరిగేటి కలలు !

చేరి చెంతన నిలిచి చెలిమి చేసే కలలు,
చేజారి జాలిగా అనునయించే కలలు,
అందజేసెడి తళుకులద్ది చేసిన నగలు ,
అందముగా అమరింతు ఆనంద నిలయా !!

పూవు లేనీ పూజ – పదములల్లిన పూజ ,
తలుపవే మన్నింప ముని మనోల్లాసా!

ఉనికే ఉల్లాసముగ ఉరేగు భావాలు,
నాడు నేడుల మధ్య నలిగేటి భావాలు,
పడుగు పేటగ నేసి పట్టు వలువగ జేసి,
అర్పింతు నే నీకు వసుధజన పోషా!!

పూవు లేనీ పూజ – పదములల్లిన పూజ ,
తలుపవే మన్నింప ముని మనోల్లాసా!

నీ ఉనికిగా నాకు సంతరించిన వన్ని,
నైవేద్యముగ నీకు అర్పింతునయ్యా !
నీ వైరి నాలోన చాటు మాటున దాగి,
రగిలించు తామాసపు హారతిని గొనుమా !!

పూవు లేనీ పూజ – పదములల్లిన పూజ ,
తలుపవే మన్నింప ముని మనోల్లాసా!

నిత్య సంతుష్టుడవు నీకేమి తరుగయ్యా ,
నీదె నీకర్పించగా తెరవీయ వయ్యా !!
ముని మానసోల్లాస మరుగేల నయ్యా,
మారాము చాలించి పూజందు మయ్యా !!

పూవు లేనీ పూజ – పదములల్లిన పూజ ,
మనసు మౌనమునుంచి మొలచినీ పూజ ,
పలుమారు తలపోయ తరుగుటెరుగని పూజ ,
తలుపవే మన్నింప ముని మనోరమణా !!

Leave a comment