గాలిపటం

నీలి నింగిన సాగి మబ్బు గుబురుల దూరి ,
యశము గాంచితినంచు ఉప్పొంగి ఎగిరేను,
దారి తెన్నులు లేని గగన తలముల తరలి,
తొలుత లేనొక దారి పరుగు పరుగున సాగు!!

జిలుగు పటమును నేను గాలిపటమును నేను!!

అంచులేనంబరపు తళుకు తీరములన్ని ,
తనపాద ముద్రతో తరియింప చేతునని ,
నింగి ముంగిట తానె గురుతులెన్నో నింపి ,
రంగవల్లుల జిలుగు రచియింతునని ఎంచు !!

జిలుగు పటమును నేను గాలిపటమును నేను!!!

జిలుగు పటమును నేను గాలిపటమును నేను,
నీ చేతి సూత్రమున నాగతులు గలవన్న ,
ఎరుక ఏమరినేను ఏదారి తిరిగినా ,
విడువబోకాయ నన్ను ఏమరిచి ఎపుడైనా!!

గర్వించి గగనాన సంచరించే వేళ,
నాదన్ను నీచేతి దారమని మరిచేను,
కవ్వించు పంతాల కసి మిసిమి నొందగా ,
వెన్నంటినా ఊత విడువగా నెంచేను!!,

కలువ కన్నుల వాని కరుణ కాసారమున,
తగిలి మెలిగెడి వసతి బంధమని తలపోసి,
వీడి వెడలగ నెంతు మోహమాయను చిక్కి,
క్రుంగనీకయ నన్ను నీకరుణ బరి నుంచి !!

చెలిమి వీడకుమయ్య చెపల చిత్తము నాది,
చెంత చేర్చుక నన్ను చెలువార సవరించి ,
ఎరుకపరచవె నాదు ఏలికవు నీవెయని ,
ఏమరచినానేను ఏమరక యుందువని !!

జిలుగు పటమును నేను గాలిపటమును నేను,
గగన తలమున సాగ నీ యూతే నిక్కమను,
నిజము మరచిన నేను భ్రమల తేలినగాని,
భ్రమల భోగమునందు నను వీడి జనబోకు !!

జిలుగు పటమును నేను గాలిపటమును నేను!!!!!

Leave a comment