ఈ కవిత నేను డిగ్రీ చదివే రోజులది (1970-80) అయుండాలి. ఆ పుస్తకం ఆఖరి పేజీ లో ఉంది. ఈ పాత కవితలు చూసినప్పుడు , మా తమ్ముడు వీటిని ఎందుకు నా పుస్తకాలు వెతికి వెతికి వీటిని జాగ్రత్త చేశాడా , అనిపిస్తుంది. ఆ కవితలు నేను ఎదగ లేదు అని నాకు చెబుతున్నట్టు అనిపిస్తుంది ……
సవిత మదిలో పలుకు తేట పలుకుల వాడ,
నీ పలుకు పూమాల తుమ్మెదను ననుజేయి !!
కలుష హారిణి యైన గంగా స్రవంతి లా ,
నాకల నంటేటి హిమవన్నగంబు లా ,
వెన్నెలకు పొంగేటి కడలి హృదయంలా ,
మన్మధుని కౌగిటిన మెరిసేటి వానిలా !
సవిత మదిలో పలుకు తేట పలుకుల వాడ,
నీ పలుకు పూమాల తుమ్మెదను ననుజేయి !!
శంకరుని గళములో పలికేటి సృతులలా, ( సృతులు : శబ్దములు/అక్షరాలు )
గోపబాలుని పెదవి పలికించు మురళిలా ,
శ్రీ శారదా దేవి మీటేటి వీణలా ,
( మహతి పలికెడియట్టి మధురంపు స్వరములా )
పద్మాసనుని ముఖము పలుకు వేదములా!!
సవిత మదిలో పలుకు తేట పలుకుల వాడ ,
నీ పలుకు పూమాల తుమ్మెదను ననుజేయి ()
మాతృ వాత్సల్యముతో లాలించు తల్లిలా ,
సత్ప్రవర్తన నేర్పి పెంచేటి తండ్రిలా ,
జ్ఞాన దానంబిచ్చి దీవించు గురువులా ,
బ్రతుకు బాటన తోడు నిచ్చేటి ప్రియుడిలా !
సవిత మదిలో పలుకు తేట పలుకుల వాడ ,
నీ పలుకు పూమాల తుమ్మెదను ననుజేయి ()
ప్రళయ తాండవమాడు నటరాజు పాదముల,
యుగసంధి వేళలో కనువిప్పు క్రియలలా ,
కల్లోలమును రేపు వికృతలోచనలలో ,
సద్బోధనల జేసి దరిజేర్చు విభునిలా !
సవిత మదిలో పలుకు తేట పలుకుల వాడ ,
నీ పలుకు పూమాల తుమ్మెదను ననుజేయి ()
జగదాంబ మదిలోని పూర్ణస్త్రీత్వములా ,
సత్వ భాసితమైన సత్య తేజములా ,
జగదేక తేజమగు స్వచ్ఛ ప్రణవములా ,
గుణరహితమైనట్టి పరమాత్మ గీతిలా !!
సవిత మదిలో పలుకు తేట పలుకుల వాడ ,
నీ పలుకు పూమాల తుమ్మెదను ననుజేయి ()