విడిది

నిలుకడెరుగని జగతి రహదారి తీరాన,
నిలువగా నీకింత నీడనిచ్చేనంచు,
అలసిపోయినవేళ అతిథివై చేరేవు,
ఆదమరువకుమోయి అర నిముషమైనా!!

నీటి నురుగుల బొమ్మ – నిలువెత్తు బొమ్మ,
గాలి నడయాడగా నడిచేటి బొమ్మ!!

అవధిలేనాకాశము తన కొంగులో గట్టి,
మెరిసేటి సెలయేటి దరహాసముల కొమ్మ!
ఎదనిండ ఆకాశపు నునుపు చెక్కిళ్ళలో ,
తన సోయగములెంచి మెరిసేటి రెమ్మ !!

నీటి నురుగుల బొమ్మ – నిలువెత్తు బొమ్మ,
గాలి నడయాడగా నడిచేటి బొమ్మ!!

రవి కిరణ కణికలను రవ్వలన్నీ దూసి ,
లోనున్న ఆకాశపు లోగిళ్ళలో నింపి ,
ఉడికించి ఊరించి చిరుగాలినురికించి,
పొంగి పంతములాడు పసలేని బొమ్మ !!

నీటి నురుగుల బొమ్మ – నిలువెత్తు బొమ్మ,
గాలి నడయాడగా నడిచేటి బొమ్మ!!

తనది తానను తలపు తనువంత నిండగా ,
బంధాలు వైరాలు బహుళమై పొంగగా ,
ఆటుపోటుల ఆట అలుపెరుంగక ఆడి,
అణిగిపోయొకనాడు నీటమునిగే బొమ్మ !!

నీటి నురుగుల బొమ్మ – నిలువెత్తు బొమ్మ,
గాలి నడయాడగా నడిచేటి బొమ్మ!!

నికడెరుగని జగతి నిలువనెన్నగబోకు,
సావధానమునొంది సరిదారి శోధించు ,
తరలిపోయెడివారు తండోపతండాలు ,
జగతి నిలుపగబోదు జాడలొకరివియైన!!

తుదిలేని పయనాన తరలనెంచితివేలో,
తరలగా ఇచటేమి దారి జాడలు లేవు,
లోనున్న నీ అహమె ఆది వెలుగనియెంచి ,
కనుల నింపుక నీవు నీదారి నల్లుకో !!

తుదిమొదలు లేనట్టి వింతైనదీదారి ,
నడకెంత నడిచినా తరిగిపోదీదారి ,
అలసటోందుట మాని నిలకడెంచితివేని,
తనకు తానే తరిగి తుది జేర్చునీదారి !!

నిలువరింపుము ఓయి భవ బాటసారి ,
నీలోని నిటలాక్షు ఉనికి నెరుగంగా!
పూరకంబువు నీవు పరిపూర్ణుడట వాడు ,
పయనమెచటికి ఇంక పొందగానేమి ? .

Leave a comment