వసతి

ఈ భూమికి వచ్చే ప్రతి జీవికి తగిన వసతి కలిగించి గౌర వీస్తుంది భూమి . ఆ వసతి కేవలం ఈ భూమికే పరిమితం. అది ఏ నాడు సొంతం కాదు. భూమి అన్నింటిని recycle చేస్తూనే ఉంటుంది, దానికి తరుగు లేదు, పెరుగుదలా లేదు.

నీదికానీ వసతి తగిలించు బంధాలు ,
బంధనాలై నిన్ను బాధించుచున్నా,
మరలనెంచని మనసు మారాము నాలించి ,
మరచి మాధవు నీవు మననెంచ నెలా ?

అచ్చరలు కిన్నెరలు అమరేంద్ర పాలితులు ,
అలక అలుపులు దీర విడిది నెంచెడి నెలవు,
సుడులు తిరుగుచు తాను సూర్య చంద్రుల వెంట ,
పరుగు నెచటికో తాను పయనించు నెలవు !!

చేరవచ్చెడి వారి నాదరించగ తాను ,
తన తనువు చీల్చుకొని వసతిచ్చు నెలవు,
కొలువుండు కాలాన తన సోయగములన్ని ,
కొసరి కుడుపుచు మరుల నందించు నెలవు!

కొలువున్న ప్రతివారు కొలువు సొంతమనెంచి ,
వసతి వన్నెల తరుగు తలపోసి వగియగా ,
వాగువగా పనిలేదు కొండిదే కొత్తదని,
తలపులకు తగు వసతి మలచిచ్చు నెలవు !!

సుంకమడుగగబోదు సుంతైన నిన్నెపుడు ,
మారు వసతుల నొసగ విసుగొందబోదు !
సాటి వసతులవాని వైరి యని తలపోసి ,
వసతి కూల్చినగాని వైరమెంచని నెలవు!

ఆదరం బెంచి నిను ఎంత మన్నించినా,
తన తనూ రేణువుల తెగనాడదీ నెలవు!
పలుకరించే వారు పలుకనెంచనివారు,
తమ వసతులకువారు పరిమితంబగువారె!!

ఎంత చేరువ యైన పొరుగువారే వారు,
తమ వసతి సీమలను ఏనాడు విడలేరు,
కల్లలగు బంధాలె బాంధవ్యములనెంచి ,
చింత చెరసాలలన చేరుటెంచెదవేల !!

త్రిగుణ శృంగారాల మరగి మురిసే మనసు ,
వసతి జారిన నాడు ఒంటరై మిగిలేను,
మారు వసతుల జేర మందలించును నిన్ను,
మరలు దారుల దారి దరికైనా పోనీదు!!

మరలిపోవలె నీవు నేడైన రేపైన,
నెలవు కాదిదినీది తోడు లేరెవరిచట,
ఆనాటి నీ తోడే ఏనాటికిని జోడు
మనసు లాలన జెసి మరలించ తగదా!!

నీది కానీ వసతి తగిలించు బంధాలు ,
బంధనాలై నిన్ను బాధించుచున్నా,
మరల నెంచని మనసు మారామునాలించి,
మరచి మాధవు నీవు మననెంచనేల ?

Leave a comment