కాలం

       మహాభారతం శాంతి పర్వం :భీష్ముడు ధర్మరాజుతో : తన ఐశ్వర్యాన్ని పోగొట్టుకుని వేరే జన్మలలో సంచరిస్తున్న బలి చక్రవర్తి ఇంద్రుడి ప్రశ్నకు : యగ్యాలు, వ్రతాలు నిర్వహించటం , శీలవంతుడై జీవించడం వంటి విషయాలు కాలగతిని మార్చలేవు . కాలగతికి అవి కారణాలు కాజాలవు  అని సమాధానం ఇచ్చాడు.

కాల గతులే గతులు – శూలికైన తమ్మిచూలికైనా !

రూపు గట్టిన పురుషుడందె కన్నియ రూపు,

రూపమెరుగనివాడు అంబికా పతి ఆయె !

కాలు మించినవారు కానరారు వినరారు ,

కాల గతులే గతులు – శూలికైన తమ్మి చూలికైనా !!

కశ్యప ప్రజాపతి భార్యలు – దితి , అదితి .

దితి – సంతానం దైత్యులు                                                

అదితి : సంతానం అమరులు / దేవతలు 

 ప్రహ్లాదుడి మనుమడైన బలిచక్రవర్తి ని అణిచి – ఇంద్రుడికి సింహాసనం ఇచ్చాడు శ్రీమహావిష్ణువు

దితి తపః ఫలముగా  ఉదయించినా రాజు ,   

అదితి సంతును కూల్చి అమరలోకము మెట్టి,

విబుధ జన సేవలను ఎంతగా చేసినా,

సురలోక వంద్యున్డు మన్నించ లేదే!!

మరుగుజ్జు యైబుట్టి మహిమ లెన్నోజూపి,     

అగ్రజుడె అధికుడని దితిపుత్రు నణగించి ,

యశము గాంచినవాని ఏమంచు మన్నింతు?

 కాల  గతులే గతులు ఏ కాలమందైన ,  

కటిక సత్యమనెరిగి మౌనమొందికను!!  

స్వర్గం లో ఉన్న పాండురాజుకి ” రాజసూయం” చేయటం వల్ల బ్రహ్మ లోక ప్రాప్తి కలుగుతుంది అని తెలిసి , నారద మునీంద్రుడి ద్వారా ధర్మరాజుకు “రాజసూయ యాగం” చేయవలసిందిగా కబురు పెట్టాడు. రాజసూయ యాగం వలన అపారమైన జన నష్టం జరుగుతుంది అని తెలిసీ, తండ్రి కోరిక మేరకు ధర్మరాజు ఆ మహా యజ్జ్యం చేసాడు

 బ్రహ్మ లోకము బడసి  భాసించవలెనంచు    

 వ్యాసనందను మదిన మొగ్గతొడిగిన కోర్కె ,

 విస్తరించొకనాడు కురుక్షేత్రము పొంగ ,

 కులము కూలెడి రణము రగిలిపోలేదా !

 ధర్మ రక్షణ యంచు ధాత్రీ మనోహరుడు,   

 ధర్మనందను ననుజు రధసారదై నిలిచి ,

కులము కూల్చెడి రణము నడిపించే లేదా!

కాల గతులకు తగిన కారణంబెరుగంగ,

తగదు నీకని తెలిసి మౌనాన మనము !!  

జప యజ్జ్య హోమాల శోభిల్లు భారతము,

రామ పాదము సోకి రంజిల్లు భారతము,     

మురళి మధురామృతము గ్రోలినీ భారతము ,

ఇనుప గొలుసుల నలిగి తెగటార లేదా !!

 కాలమంటని వాడు కాల అంబుధి  తేలి,  

 కలల ఊయల ఊత ఊరడిల్లుచు తనూ,

 ఉదయించు ఊహలకు ఉల్లాసమును పెంచ,

 ఊదునేమో గతులు కాల నర్తనకు !!

 ఊపిరందిన కాలుడుప్పొంగిపోవా!!

మాయకవ్వలి వాడు కాల వంద్యుడు వాడు,

నెపము లేకనె జగము లూహించు వాడు ,    

నేరమేమని నాది నగుబాటు జేసేను,

కాలు పదముల నలిగి వీగిపోవగ నేను !!

 వాహినై పరవళ్ల పరుగు తీసెడి  జాణ,

నూత్న రచనలు మొలువ నిన్న చెరిపెడి బాల,

నిత్య  యవ్వని తాను భూత భవితలు లేవు,

ఊహ ఉల్లాసాల ఉద్యానవని ఆమె !!

ఉప్పెనై ఉప్పొంగి పురము మించిన వేళ,

నియతి చేతల చితికి చెరిత సమసిన వేళ,     

పురము సోహాపు లయల సోలిపోయిన వేళ ,

కాల ఝుంకారాలు కుల పద్మముల చీల్చి ,

పురమూలమును జేరి భీతిగొలిపెడి వేళ!!

ఉదయించదా  లేత కరుణ కిరణంబొకటి ,

ఊహలుదయించేటి అవ్వాని ఉరములో !

ఏకాంత వాసమున విసుగుగొని  వేసారి 

ఉబుసుపోకకు తాను అల్లనెంచిన జగము, 

అల్లకల్లోలమై లయల లయమాయెనని!!

నగధరా వేగపడి నన్నేలు ఈ క్షణమే ,

కాల పద ఘటనమున నలిగి వీగకముందే!

కాల నర్తన వడికి ఒడిలి ఒరగకముందే !!

కమ్మి కాలుడు నన్ను కబళించి కొనముందే!!  

 

Leave a comment