అరుణ కిరణపు వెలుగు లమరి మెరయగ నీవు ,
కటిక చీకటులన్ని కడుపులో దాచుకొని,
అణిగియుంటిని నీదు పాద పద్మము క్రింద !
వెలుగు వాకవు నీవు – తొలగు చీకటి నీవే!!
సుగుణాల రాశివని సన్నుతింపగ నిన్ను,
కానీగుణములనెల్ల కాజేసి కలబోసి ,
తనువంత నింపుకుని మసలుచుంటిని నేను,
నీకు ప్రతిరూపమును ప్రతిగుణములును నీవే!
పాలపుంతల పరుపు పవళించి ఆనాడు ,
ఉలుకుపలుకూ లేక జోలలూగుచునుండ,
తుంటరాటన నిన్ను కవ్వించి కరిగినా ,
అసుర ఉనికినినేను – ఆ ఉనికియును నీదే !
చక్కదనముల కుప్ప మామేటి రాయుడిని ,
కూడి కులములు నిన్ను కీర్తింపగానెంచి ,
మురికి మైలలనెల్ల నామేను చుట్టితిని,
తేట తెరపులు నీవు – మకిలి మైలయు నీవే !!
తలచి నిను పలుమారు తనువంత పులకించి,
మధుర భక్తిన నిన్ను కులమెల్ల కొలువగా,
వైర భావనాలన్ని భరియింపనెంచితిని ,
మధుర భక్తియు నీవే – వైరియైనను నీవే !!
సాధుజన సంగుడని సత్వగుణ రూపుడని,
సకల జన సందోహంబు కొనియాడగా నిన్ను,
తామసోల్లసినై తామాసపు తనువైతి,
సాధు సత్వము నీవే – తామసంబును నీవే !
మధుర ఫలముల రుచులు నీవు చవిచూతువని,
ఫలరాసులను నేను ఎంచి రుచిచూసితిని ,
వగరు పాషాణములు నాయందే దాచితిని,
మధుర మైనను నీవే – అరకు అయినను నీవే !!
మోహనా యనినిన్ను ముదముతో కొలువంగ,
జగతి వికృతులెల్ల వింత వలువగ నేసి,
సుంతైనా విడువకే శృంగార మమరితిని !
మోహనంబును నీవే – వెగటైనయును నీవే!!
నీ వైభవము కోరి దిన దినము అను దినము ,
తేట కళలన నిన్ను కొలువునమరించినా !
నీ నీడ జాడలను మోసి మలిగెడి నాకు,
సుంతైన తెరపీయ తలుపవే ఎపుడూ!!
హరి హరీ యని ఒకడు హర హరా యని ఒకడు,
ముదము తో నీ యశము పలుమారు పొగడగా,
మురిపాన నీ మోవి కురిపించు వెన్నెలలు ,
వెతల తుడుచుననంచు వేచి బడలితినయ్య!!
పగవారి కైన నీ పరమ దయనే పంచు
కానీ గుణములనెల్ల కాలాన కరిగించు,
నీలోని వెలుగులను నీ జగతిలో నింపు,
నీరజాక్షా నన్ను గురుతెరిగి పాలించు !!
