భక్త వత్సలుడు

నిన్నె  నమ్మినవారి నగుబాటు నోర్వవని ,

వింత వింతలు జేయ వింతగాదయ మాకు !

తులసి దళముల తళుకు మణుల మించేనంచు,

తూగి తరుణుల మోహమణగించి మెప్పించి,

మురిసి మురిపెమునొందు కథలు వినియున్నాము!!

అసురు గూల్చిన నాడు అలుపేరుంగని నీవు,

గొల్లలాటల అలసి సేదదీరిన కథలు,

క్రీగంట భువనముల శాసించగల కనులు ,

నంద కాంతకు దడిసి భీతిచెందిన కథలు,

జోల పాటల విన్న రామకథలో  కరిగి ,

ధనువు నందగ ఉరికి తెల్లబోయిన కథలు,

విన్నకొలదీ విందు వినులండేది విందు ,

చెలుల సంగపు రుచులు పట్టి కుడిపెడి  కధలు !!

చిటికెడటుకులె చాలు చెలుని కటకట దీర్ప ,

ఒక్క మెతుకే చాలు ద్రుపదు పట్టిని బ్రోవ ,

యుగము గడచిన నేమి- నిదుర మునిగిన నేమి,

బ్రోవనీవే యన్న చేరి చెలువము కుడుప!

శరణు నివేయంచు చరణమంటిన వారి ,

చేరి చెరితను మర్చి మన్ననెంచిన కధలు,

తరుగు నొల్లని కథలు నీ లీల సంగతులు ,

చెల్లు కాలము లేని చేవగల్గిన కథలు !!

రంగ రంగా యన్న ఇల్లాలి బ్రోవగా ,

అత్త ఆరళ్ళతో నలిగి నడిపిన కథలు,

పాచికలు పంచుకొని ఆటాడు సఖునికై ,

చెరకు కుప్పలు నమిలి ఘింకరించిన కథలు ,

వైశ్వానరుని సేవ వదలనొల్లని ఇంతి ,

వంటశాలను నింపి విందుజేసిన కధలు!!

కొల్ల కొల్లలు కధలు కొరతలేనీ కధలు ,

మనసు మోహము నొందు మధురమైనీ కధలు!!

చెరిత  నేలినవారి చేవ నెరుగను నేను,

వందనంబని నీకు వినయమొందను నేను,

అహము నిండిన మనసు అదుపు నొల్లదు నాది,

అదునుజూసిక  నీవే హరియించు అహమెల్ల,

కటిక కార్యములెన్నొ పలుమారు జేసినా ,

కారణము నీవెయని పలుకు పంతము నాది,

వాదులాడగ వలదు జీవజనకుడ వీవు,

ఆదరించిక నన్ను ఆదుకోను కథ నడుపు||

నేడైన రేపైనా  మాపెప్పుడోయైన  ,

నీకు తప్పని లీల – యోచనేలయ ఇంక ?

కోటాను కోట్లలో ఒక్కడని  తలచేవొ ,

ఏటికీ పంతమని ఏమరచి యుండేవొ ,

ఎడబాటు ఆటలిక ఆడి అలసితిననెంచి,                                                 

చెరిపి ఈ చేరితమును చేదుకోవయ్యా !!

Leave a comment