పాప ఫలం

ఫలియించి పాపాలు పుడమి జేరితినయ్య 

పెను దుఃఖముల దారి కోరి  దూరితినయ్య

దురిత దూరుడవీవు దిక్కంచు ఎరిగింప ,  

ఎరుక కలిగెనే కానీ సన్నుతియింపగ తెలియ !!

పలువీధులం తిరిగి పలు నామముల నెంచి,  

పలికితిని పలుమారు పెదవులలిసే దాక ,

పుణ్య నదులను మునిగి తనువంత తడిపితిని,

తనువలసెనేగాని తెరపి నే గననైతి !!

గుడి మెట్లపై నేను పలుమారు మ్రొక్కితిని ,

మెట్టు మెట్టుకు వంగి వందనము జేసితిని ,

వేవేల భక్తులను దరిజేర్చు దారియని ,

అలుపెరుంగక వేడి వొడిలి నే నలిగితిని !

అర్చనలు వేవేలు అందజేసెడివారు ,

అందు నందనవనము నేనాస గోనబోను,

గోవింద యనినిన్ను కొలుచువారలు పొందు ,

గోధూళి ధామంబు నేనడుగగా బోను,!

 పద్మాక్షి శ్రీలక్ష్మి పట్టు పదముల నీడ,

సుంతైన  కొంతైన నే వేడుకొనబోను  !

వల్లభా యని నిన్ను వలచు వనితలుకొరు ,

వక్ష సీమను నేను ఎన్నడడుగగబోను !    

దురిత హారిణి దుర్గ మదినేలు మహారాజు ,

మదినేలు నీ ఛాయ చేరనెన్నగబోను !        

అంబుజోదర నీదు అరవింద నయనాలు,

ఆని మురిసెడి తావు తగిలుండు తెరవిమ్ము!!

నీ నయనములు కురియు చంద్రికల చిరుజల్లు ,

ఎంచి కురిసెడి తావు తగిలుండు తలపిమ్ము  ,

నాడు నేడని లేక  ఏనాడు ఎపుడైనా ,    

ఎరుక గొని నీ ఉనికి ఎరిగుండు ఎరుకిమ్ము!!

ఎరుక జారిననాడు ఏమరక ఎరిగించి ,

ఏలుకొనవైయ్య  యని వేడుకొందును నేడే !!

ఏనాడు ఏతెలివి ఎటులుండొనో తెలియ ,

నేటి శోకము నందే  నీ దయను అర్ధింతు !!    

శోధించి శోధించి ఏమెరుగ  నెంతువయ,

 నీ నిదుర ఉహలన చిందినొక చినుకునయ,

నిలుచు తావేలేక నిలకడెరుగక  లేక ,  

నలిగి మలిగే చిన్న చెరిత చినుకును నేను!

నిదురమానికనైనా నీ కల్పనల కనుము ,
మా కన్నులూరేటి నీటి మడుగుల కనుము
మురిపాల నిను ముంచి మురిపించు నీ ఊహ ,
ఊరడింపులు మాకు నీజతగ అందించు !!

జనకుడను నేనంచు ఎరుక పరచితివెపుడో ,   

జనని నీ ఊహ యని పలుమారు పలికితివి ,

మీరెరుగనీ చినుకు ఏటికుదయించెనో ,

ఎరిగి చెంతను జేర్చి చింత తొలగగజేయు !!                               

Leave a comment