సడి లేని అడుగులవి వడిలేక నడిచేను
అడుగడుగులో జతగ విడివడక నడిచేను
సడి లేని అడుగులవి వడి వడిగ నడచేను
తడబడని అడుగులవి మితినెరిగి నడచేను
అడుగడుగులో అడుగు జత కలిపి నడచేను
దుడుకు దారుల నడక అడలుడిగి నడిచేను (అడలు: భయము )
నడక నేర్పిన అడుగు అడుగు తోడగు అడుగు
తడబడడుగుల వెంట తొలగ కుండెడి అడుగు
బ్రతుకు బాటల వెంట జంట నడచే అడుగు
ఉనికి తొలగిన కూడా తొలగ కుండెడి అడుగు
తప్పటడుగులనాడు తూలనెంచని అడుగు,
తలపులెటు నడిచినా తోడు వీడని అడుగు,
తొందరని తూలినా తూలనెంచని అడుగు,
తోడు నడచునేగాని తోడుండనా అడుగు!!
కలిమిలేముల వెంట కరుగు సంధ్యల వెంట,
చిగురు ఊయల జంట చిటపటల చితి వెంట,
కలనైన ఇలనైన కలిసి నడిచేడి అడుగు
యుగము లలసిన కూడా అలసటేరుగని అడుగు!
ఎన్నడెంచెనొ తాను జగతిదారుల నడువ,
మారు ఋతువు వెంట కరుగు యుగముల జంట,
పాదపంబుల వెంట పలు పాదముల జంట,
ధృతి నెరిగి సడి లేక నడువ నేర్చిన అడుగు!
రేడైన రైతైన దిగివచ్చు భవుడైన,
యజ్ఞ యాగములైన నరమేధ రణమైన,
తడబడదు విడివడదు వింతైనదీ అడుగు
వివరించగా నేదో జంటనుండెడి అడుగు!!
అడిగి తెలిసినవారు అడుగకేరిగినవారు,
అడుగడుగు జత నడిచి జంట నొందిన వారు,
అవని అనరుల సడుల లయల నెరిగినవారు,
“అడుగు’ భావము తెలిపి ముడిమడియరాదా!!