ఉడిపి లో ఉన్న శ్రీకృష్ణ విగ్రహం గురించి ప్రచారంలో ఉన్న ఒక కథని ఆధారంగా ఈ చిన్న కవిత.
రుక్మిణి దేవి శ్రీకృష్ణ పరమాత్మ ని – అయన బాల్య రూపాన్ని చూపించమని కోరింది. అప్పుడు కృష్ణ పరమాత్మ ఆమెకి తన బాల్య రూపంలో ఉన్న ఒక విగ్రహాన్ని బహూకరించాడు . కొంతకాలానికి ఆ విగ్రహం బృందావనంలోని గోపీచందన మట్టిలో చేరి మరుగునపడింది. మరి కొంతకాలానికి మహా భక్తుడైన మధ్వాచార్యులను చేరి , వారి వలన ఉడిపిలో ప్రతిష్టించబడి – ఈరోజుకి మనందరి పూజలు అందుకుంటోంది .
అడుసు ఆపగ కలద ఆనతందక నీది –
అంబుజోదర నీకు మరుగేలనయ్య!!
నీవే తోడని ఎంచి – చేర వచ్చిన చెలియ,
మురిపాన నిను జేరి మనసు తెలిపిన వేళ,
వల్లేయని వరమిచ్చి కూర్చి ఇచ్చిన ప్రతిమ,
మరుగుజేసితి వెపుడొ మమునేడు బ్రోవంగ,
మనసు అడుసుల మరుగు – మరుగు జేయుము నేడే!!
అడుసు ఆపగగలద ఆనతందక నీది – అంబుజోదర నీకు మాటేలనయ్య!!
అడుసుమాటున దాగి ఆదమరచినవాడ,
పట్టి నావన పెట్టి తరలిపోయేటినాడు,
సురనాయకుని బంటు మింట సందడి చేసి,
భీతి గొలిపేడి పిడుగు ఉరుములై వెంటాడ,
ఉలికిపడి బెదిరేవో! ఉని కెరిగి పిలిచేవో!!
అడుసు ఆపగగ కలద ఆనతందక నీది – అంబుజోదర నీకు మాటేలనయ్య!!
మడుగులో పన్నగపు ఫణుల నాడిన వాడ,
గోవర్ధనంబెత్తి కులముగాచిన వాడ,
గొల్ల రూపుల నాడి పురము నిలిపిన వాడ,
పసివార కడతేర్చు పడతి చన్నును కుడిచి,
పగలు సెగలను మరుగు – మరుగు చేసిన వాడ!
అడుసు ఆపగగలద ఆనతందక నీది – అంబుజోదర నీకు మాటేలనయ్య!!
కన్నులారగ నిన్ను కననెంచు కలనెంచి,
కడలి కెరటపు ఊపు నీ ఊపిరిని ఎంచి,
నీ నామమే కుడిచి – నీ చరితనే తలచి,
నిత్య సంధ్యల నిలచు నీ దివ్య రూపమును,
మనన చేసెడివాని మన్నింప పిలచేవో!
అడుసు ఆపగగలద ఆనతందక నీది – అంబుజోదర నీకు మాటేలనయ్య!!
నాటి జనకుని భాగ్య మందీయ నెంచేవో,
మరలి మారాముతో మురిపాలు కుడిచేవో,
నాటి యమునను మించు కడలి అలలను వీడి,
కననెంచు కన్నులకు కరువు కొరతను దీర్చ,
ఆచార్యు వొడిచేరి ఉడిపికై తరలేవొ!
అడుసు ఆపగగలద ఆనతందక నీది – అంబుజోదర నీకు మాటేలనయ్య!!
కనకదాసును కనగ కరుణ కలిగిన వాడ,
కుంగు భానుని దిశకు మరలి నిలచినవాడ,
భక్త మందారమా ! మముగావగా నెపుడు,
మనసు అడుసుల మరుగు కడతేర్చి కదిలేవు!
కరుణ కాసారమా! కరుణ కనగానెంచి,
కఠిన చరితలు చెరిపి – చేరబిలువయ్యా !!!!!!!!!