2024 బాటసారీ! మరలి చూడకు!!2025

బాటసారీ !! మరలి చూడకు!
మరుగుజేరెను నీదు అడుగులు!!
కాలమను కాపరిని మరువకు,
కరుణ నెరుగడు! తోడు వీడడు!!

గడచిపోయిన చేదు తీపులు
గడియనైనిక ఎంచబోవకు!
కాలుడందిన వింత విందది,
వాతాపి తోడుగ వెడలిపోయెను!!

బాటసారీ! మరలిచూడకు!
మరుగు జేరిన రుచులు వేదుకకు !!

చేతనున్నీ చిరుత కాలమె
ఊతనిచ్చును ఊహ నడకకు!
అడుగు మోపిన తరుణమందే,
అంకురించును తరుణ బాటలు!

బాటసారీ ! మరలిచూడకు!!
నాటి అడుగుల జాడ వేదుకకు!!

బాటచేరెడి గమ్య మేదని ,
అడుగనెంచకు – తెలుపరెవ్వరు!!
తోడు తోచెడివారలెవ్వరు ,
తోడుకాదను ఎరుక నెరుగుము!!

బాటసారీ! మరలిచూడకు!!
తోటివారల జాడ వేదుకకు!!

నాటి ఊసులు, నేటి ఊహలు,
కరిగి విందుగ కనుల నిండగ,
మనసు మౌనపు పొరలమాటున
నిదుర చెదరని కలను తలుపుము!!

బాటసారీ! మరలి చూడకు!!
చూడ నీకట నిలువదేమియు!!
చెదరిపోయెను అడుగు జాడలు!
చేరనున్నవి నేటి అడుగులు!!

         
        

Leave a comment