తనువు తొలిగేనాడు తగిలుండుమయ్యా !!

పాలు మీగడ వెన్న నీకు నైవేద్యమిడి,
పాతకము బాపునని పలుమారు కుడిచితిని,
పాశ ఘాతపు బాధ ఓపలేదీతనువు
పావనాకార నను ప్రేమతో కొనిపొమ్ము!!

పాయసాన్నము నీకు కుడుపలేదని నన్ను,
పాపకూపమునందు పడద్రోయగాబోకు,
పాపనాశివి నీవు పలుమారు నిను తలతు,
పాదదాసుని నన్ను పలుమారు మన్నించు!!

పొల్లుమాటలు నేను పలుమారు పలికినా,
పొల్లి నీమోహంబు పలుకులంటిన నాడు
పొగడగా నేనిన్ను పలికేటి పలుకులనే ,
పొల్లుపోవక నీవు పలుమారు ఆలించు!!

కూడబెట్టిన సిరులు కూడ మసలినవారు,
కునుకు తీరినయట్లు కరిగిపోయిన వేళ,
కూరిమెరిగిన నీవు కూడినను మన్నించి,
కుశలమడుగుచు నన్ను కొంపోవగా రారా !!

ఓరిమింతయులేక ఒరిగిపోయెడినాడు,,
ఒంటరై ఈ జగతి విడచి నే చనునాడు,
ఒరిగిపోయిన తనువు చితి చేరి చితుకంగ ,
ఒణికిపోయెడి నన్ను ఒడిచేర్చి ఓదార్చు!!

తనువు తొలిగేనాడు తోడుండమని నిన్ను,
తనువు మాటున ఒదిగి పలుమారు వేడెదను!
తోయజాక్షా నిన్ను తలుప ఓరిమిలేని ,
తరుణమున దయనొంది తగిలుండుమయ్యా !!

Leave a comment