డోల డోల డోలా డోల – నందబాల డోల,
వసుధను వైకుంఠంబుగఁజేసెడి –
వరమందిన ఆ వనితామణిమది
డోల డోల డోలా డోల – నందబాల డోల!!
సురవైరులు తమ వైరిని కనుగొన,
వివిధగతుల మది విచలిత మొందగ!
డోల డోల డోలా డోల – నందబాల డోల!!
వారిజనయనులు హరి సంగతినొందగ,
పలు సేవల మది యోచన సేయగ!
డోల డోల డోలా డోల – నందబాల డోల!!
హరి పద స్పర్శకు మేదినిమురియుచు,
పులకితయై విరి విందులుసేయగ!
డోల డోల డోలా డోల – నందబాల డోలా!!
కాళియు పడగన నర్తన జేసేడి ,
హరి పదిమందిని పరిజనమదిసడి
డోల డోల డోలా డోల – నందబాల డోలా !!
గోవర్ధనగిరి గొడుగున నిలచిన ,
గోవులఁగాంచిన దేవరాజు మది ,
డోల డోల డోలా డోల – నందబాల డోలా !!
గొల్లల గోవుల రూపున నాడెడి,
గోవిందుని గన పద్మభవునిమది,
డోల డోల డోలా డోల – నందబాల డోలా !
రాసలీల గన గగనమునిండిన ,
సురసంతతిమది సంతసమందిన!
డోల డోల డోలా డోల – నందబాల డోలా!!
నందుని అంగన దండన వెఱపున,
పాదమువిడి హరి కనుల పొంగు సుధ!!
డోల డోల డోలా డోల – నందబాల డోల!!
లేగలు కుడువని పొదుగుల పాలను,
పంతమాడి హరి హరియింపఁగని,
డోల డోల డోలా డోల – నందబాలాడాలా !!
కంసునికై గొను చందన గంధము,
వాని వైరికిడు అతివంతరంగ గతి,
డోల డోల డోలా డోల – నందబాలడోలా!
అంతరంగమున అతిసుందరుడౌ,
హరిలీలలు గని సంతసించుమది ,
డోల డోల డోలా డోల – నందబాల డోల !!
డోల డోల డోలా డోల – నందబాల డోల !!