మము రక్షింపగా వేగమే రారా – లక్ష్మీనరసింహా!
దుందుడుకు దైత్యులను దునుమాడగ నిక జాగునుజేయకయా!!
నాడు స్తంభమున మాటుజేరి నీ భక్తుని గాచితివొ!
దైత్యుడైన నీ బంటును చేదగా జగమే నిండితివొ!!
స్వామి ! మము రక్షింపగ వేగమే రారా – లక్ష్మీనరసింహ !!
జయుని సన్తో మరి విజయుని సన్తో !
ధరణి జేరి ఇటు ధాటిగ నడచిరి !
హరియనువారల హరియించుట తమ
హక్కని చాటుతూ దునుముచుండిరిట!!
||మము రక్షింపగా వేగమే రారా – లక్ష్మీనరసింహా!||
శుమ్భనిశుమ్భలు సమిసిపోయిరని,
అలుపుదీర నివాదమరచితివో !
నాడు సంద్రమున మునిగినవారలు
నేడు ధరణిపై దాడులుచేసిరి!!
||మము రక్షింపగా వేగమే రారా – లక్ష్మీనరసింహా!||
అంకమందమరి నంబుజాక్షి తో,
పొంగి పొరలినా విషపు చిందులవి,
హరుని జేరకవి నగరిజొచ్చినవి,
పరిహరింపనిక దిక్కునివేగా !!
||మము రక్షింపగా వేగమే రారా – లక్ష్మీనరసింహా!
సురలను గావఁగ సుందరాంగి వై
వైరుల వంచన జేసినా దోషము ,
దుడుకు రూపియై దునుముచునున్నది,
దండధారివై దండనజేయరా !!
||మము రక్షింపగా వేగమే రారా – లక్ష్మీనరసింహా!||
శంకర గురువరు గాచిన వాడవు,
సకల శరణముల నొసగెడివాడవు,
లేనితావులిక లేనేలేవుయని ,
నిండిజగములను నడుపుచుండు హరి!!
||మము రక్షింపగా వేగమే రారా – లక్ష్మీనరసింహా!||
స్వామి !మము రక్షింపగా వేగమే రారా – లక్ష్మీనరసింహా!
దుందుడుకు దైత్యులను దునుమాడగ నిక జాగునుజేయకయా!!
నాడు స్తంభమున మాటుజేరి నీ భక్తుని గాచితివొ!
దైత్యుడైన నీ బంటును చేదగా జగమే నిండితివొ!!
స్వామి ! మము రక్షింపగ వేగమే రారా – లక్ష్మీనరసింహ !!