కరుణించుమో రంగా ! కరుణించుమో !!
ఏమేరక నీ తలపె – తలపోయు తలపిచ్చి ,
కరుణించుమో రంగా ! కరుణించుమో !!
నాదమందున నిన్నె నిలకడగ నిలుపంగ ,
నారదుండునుగాను – కరుణించుమో!!
పలుకు పలుకున నిన్ను పలికించి మురియంగ,
సుకమౌనియునుగాను – కరుణించుమో !!
కరుణించుమో! రంగా- కరుణించుమో!!
ఆటాపాటలనిన్ను – పలుమారు కవ్వింప,
గొల్లబాలుడగాను – కరుణించుమో!!
మురిపెమున దరిజేర్చి – వెన్న మీగడ కుడుప,
గోపకాంతను గాను – కరుణించుమో!!
కరుణించుమో! రంగా- కరుణించుమో!!
ఏమరక ఏనాడు – నీ నుతుల నుడువంగ,
సురవైరి సుతుగాను – కరుణించుమో!! (ప్రహ్లాదుడు}
నిక్కముగ నీ పూజ – నిరతమును జేయఁగ,
అంబరీషుడగాను – కరుణించుమో!!
కరుణించుమో! రంగా- కరుణించుమో!!
లాలిపాటలుపాడి – జోలలుపగానిన్ను,
నందు నంగన గాను – కరుణించుమో!!-
పాట పాదముల నీదు – గుణగానమును జేయ,
త్యాగరాజును గాను – కరుణించుమో!!
కరుణించుమో! రంగా- కరుణించుమో!!
రామరామా యంచు – రమియించి మురియంగ,
అనిల నందను (హనుమంతుడు)గాను కరుణించుమో!!
కాలగతులను కనుచు – నీ లీల లెరుగంగ,
కాక భుశుండ గాను – కరుణించుమో!!
కరుణించుమో! రంగా- కరుణించుమో!!
ఏలు వాడవనంచు – ఎరిగించినారెవరో!!
దాస దాసుడవంచు – నిను పొగడినారెవరో!!
ఆటు పోటుల జగతి – ఆటవిడుపట నీకు,
ఆలించి నామొరలు – మరలించి కరుణించు!!
కరుణించుమో! రంగా- కరుణించుమో!!
కరుణించుమో ! రంగా! కరుణించుమో!!
ఏమేరక నీ తలపె – తలపోయు తలపిచ్చి ,
కరుణించుమో రంగా ! కరుణించుమో !!