ఎదురు చూసెడి రోజు

ఎదురు చూసెడి రోజు – ఎంతకీ రాదాయె !
ఏరువాకలు ఎన్నో కరిగి చెరితలు ఆయే!!

కన్ను తెరిచిన నాడు – ఎరుకున్న లేకున్న,
కలియజూచితి నంత – ఆ జాడ నెరుగంగ !
కంట కనపడకున్న – వెంటనే యుందన్న,
ఎరుక ఏమరకుంటి – అనుదినము దినదినము!!

ఎదురు చూసెడి రోజు ఎంతకీ రాదాయె !

తడబడడుగులు మాని – తీరుగా నడిచినా ,
నడక పరుగుగ మారి – పందెమే గెలిచినా!
సూటిగా ప్రతి అడుగు – అడుగకెరిగిన రోజు,
ఎరిగి ఒల్లని రోజు – ఒల్లకున్నాగాని ఒడిన చేర్చెడి రోజు!!

ఎదురు చూసెడి రోజు ఎంతకీ రాదాయె !

ఉయ్యాల జంపాల ఊపిరుల సైయాట,
ఉరుకున్నాగాని ఊరకుండని ఊట!
ఉనికియై ఉల్లాస మందించు సోహాలు ,
సోలిపోయే రోజు – అహపు ఆఖరి రోజు!!

ఎదురు చూసెడి రోజు ఎంతకీ రాదాయె !

వియ్యాల కైయాల విలువ వీగెడి రోజు,
వీనులందేవేవో విందు జేసెడి రోజు!!
మరుపు మరుగున నలిగి తొలగి నిలిచిన రోజు,
నగి నగీ నాయెదుట నిలిచెడాఖరి రోజు!!

ఎదురు చూసెడి రోజు ఎంతకీ రాదాయె !
ఏరువాకలు ఎన్నో కరిగి చెరితలు ఆయే!!
అందుకొని నా పిలుపు ఎదురొచ్చి కనరాద!!
చందమైనందములు వివరించి గొనరాద!!!

                  
                      
                      
                       
                    
                    
                      
                                       

Leave a comment