ఏనాడూ ఏపూజ

ఏనాడూ ఏపూజ ఏ తీరు జేసితినో
ఏమరక ఆ అజుని తలచు తల్లిని గంటి!
వైరి భావము గొనక వాసుదేవుని తలచు,
కులము కొమ్మలనూగు వైభవంబును గొంటి!!

కలికి కన్నుల వెలుగు కామేశ్వరుని గనగ,
లంకె వంకలు లేని నున్ననై నొకదారి,
ఉగ్గు గుడిపెడినాడే ఎరుక పరచినగాని ,
ఉల్లాసమున నొరిగి ఉర్వి మోహము మరిగి,
ఊపిరుల ఊటలను ఇగుర జేసితినయ్యా !
ఉనికి మాసెడి ఘడియ ఉరము నిండెను నేడు,
ఊదినీ నాదమును ఆదరించుము నన్ను!!

ఏనాడు ఏపూజ ఏ తీరు జేసితినో ,
నీ తలపు తలుపగల తనువిచ్చె నాతల్లి,
లోటులెన్నో నేను రేపవలు జేసినా,
ఆ తల్లి తలపులను మన్నించ వలెగాద!!

జగతి వాసనలన్ని నీ ఇంటి పంటేనట ,
మోహపడి కామింప కూడదందువదేల!
మాయ మధురిమ గొనగ జగము నెరపిన నీవు,
మము మాయ విడుడనుచు పంతమాడెదవేల!
మెరుగైన తరుగైన జగతి జీవులకెల్ల ,
తండ్రి నీవే అయిన – తగువార మేగామా!!

వసుదేవ సుత నీదు గంధమంటక జగతి ,
మన నగునె ఘడియైన కుడిచి గంగెంతైనా !
నాకవాసులు మునులు ఘనతకెక్కగ నీవే ,
వారసుల మమ్మేల- చెరల చెలికెదవయ్య !!

ఏనాడూ ఏపూజ ఏ తీరు జేసితినో,
మాయకవ్వలి వాడ నీ లీలలను వింటి!
లాలిత్యమేగాని కరుకుదన మెరుగవట,
కరుణ కురిసెడి కనులు రెప్పలే ఎరుగవట,
పలు కాయముల దొంతి నా ఉనికి మాపెను,
(మాలిమిన నను నీవే నెనరుంచి పాలించు !!)
మాలిమిన మాయమ్మ మనసెరిగి నను బ్రోవు !!

ఏనాడూ ఏపూజ ఏ తీరు జేసితినో
ఏమరక ఏలినను – తల్లి తలుపును దీర్చు ప్రభువా!

Leave a comment