నిన్ను ఒల్లని తెలివి ఒల్లకుండెడి తెలివి ,
తగిలియుండెడి తెలివి నెనరుంచి కలిగించు!
కనగలుగు జగమెల్ల కనువిందుగా నిన్నే,
కనగలుగు కనులిచ్చి కరుణతో కరుణించు!!
పలుకు కూపిరులూది భావములు పలికించు
నాదమును ఆలింప వీనులను దీవించు!!
నాద రూపా నీదు సంచారమును తెలిసి,
అనుదినము ప్రతి క్షణము ఆలించు స్ఫురణిమ్ము !!
నీ చేతనననొంది చేరియించు నా నాడి,
కుడుచు చేతన విలువ వాసి ఎరుగనిదాయె !
చేతనై లోలోన చేరియించు చెలికాడా ,
చెలిమి కురిసెడి చేయి ఎరుగుండు ఎరుకిమ్ము!!
యోచనల యదలోన సాలోచనగ నీవు ,
సరగు జేయక నిలిచి ఏమేమి చూసావు?
సవరించి నా తెలివి సరిదారి నెరిగించు,
మరలు దారుల దారి నను నీవే నడిపించు!!
ఆనంద మీయగల అమరేంద్ర పతి నీవు,
అనరు అంకురమైన నీ చెంత కనరాదు!
చేరి చింతలు నాదు చెరితెల్ల చిదిమేను,
చిదిమి నా చింతలను చెలిమి నీ రాదా!!
తనువు దొంతుల మాటు మరి నేను మనలేను,
మాటి మాటికి నిన్ను వేటాడి కనలేను!
దొంతి భారము దీర్చి నీ జతను గొనరాదా,
ఒదిగి మాటున దాగు మురిపాలు విడరాదా!!