నారసింహుడు : నరసింహావతారము ధరించిన విష్ణువు.
భక్త పరాధీనుడైన భగవంతుడు, భక్తుని కోరిక తీర్చటానికి ఏమైనా చేస్తాడు – అనటానికి, నరసింహ రూపం ఒక నిదర్శనం. జన్మ జన్మల ఎడబాటు ఓర్వలేమని, శాపవశాన సంక్రమించిన జన్మములందు వైరులుగా ప్రవర్తిస్తున్న తమని , సంహరించి దరి జేర్చుకోమని – జయ విజయులు చేసిన విన్నపాన్ని, స్వామి మన్నించక మనగలడా!
దుందుడుకు దితిపట్టి దుడుకు చేష్టలు మాప,
తానె కొమరుండాయె వైకుంఠ వాసుండు!!
కరుణ కురుయుటె కానీ కాఠిన్య మెరుగనా
కమల లోచనుడాయె వింతనరుడు!!
ఎడబాటు ఓపనా విజయుండు జయుడును,
చేరదీయుము మమ్ము చెరిత చెదరగజేసి,
మనలేము నినువీడి నీరజాక్షా యనుచు,
మొరలిడిన మొరనేల మరచునా విభుడు!
సాధు సజ్జనులందు వసియిన్చువాడంచు,
రక్షకుండై వాని వెన్నంటు వాడెయని
వారినిడుములు బెట్ట ఓపలేడని తెలిసి,
కవ్వించు తన భక్తు- మన్ననెంచడె వాడు!
గండు రూపమెగాని గుండె నవనీతంబు,
తుంటరైనా బంటు తరలింప జేయుటకు,
ఏ తావు నే పగిది ఏ మంచు తలచినా,
చేరి చెర బాపంగా అణువణువునా నిండె !!
వైరి భావన నెంచి పలుమారు తలపోయు,
తనబంటు తలపులన తగిలె తరుణముకోరి,
సంగంబు విడలేక తనయుడై సన్నిధిని,
దిన దినము అందించి ఆదరము నెంచే!!
మాయ మాటున జేరి మారాము మరిగినా,
పట్టి పట్టును మాన్ప పన్నగాధీశుండు,
వింత బొందినజేరి మారాము చెల్లించి,
చెమితో ఒడిజేర్చి లాలనను ఎంచే!!
నారసింహుడు వాడు కర్మఫలం చోరుఁడు,
చేరి ఇడుములు బాపు ఇలనడచు దేవుండు,
పిలిచినా తలచినా చింత తీర్చెడివాడు,
తనువు తరియింపఁగ తలుపరే వాని !!
శ్రీ లక్ష్మి నరసింహ చరణారవిందములకు భక్తితో
శ్రీ లక్ష్మి నరసింహ చరణారవిందములకు భక్తితో