చెలిమి

నెలరేడు కురియనా అరుదైన సుధలు,
ఋతురాజు అందనా గంధాల గనులు,
కొసరి కుడిపెడి బలిమి నిండైన చెలిమి,
కలిమి కురియని మేటి సంగమిదె భువిని!

తరుగైన మెరుగైన తగిలుండు బంధంబు,
భారమెంచక బంధ భయము బాపెడి మందు!
విల్లు విడిచిన చెలుని చింతలన్నియు దీర్చి,
వన్నెకెక్కగ జేయు – చెరగ నేర్వని చెలిమి!!

పొల్లు గాయని అన్న భీతిగొలుపగజేయ ,
ప్రాణ భయమున పొల్లు కపివరేణ్యుని గాచి,
ధరణి నడచిన రేడు నెరపె ఆ బంధమును,
సంగ సౌరభ మహిమ – మహిన చాటిన చెలిమి!!

చిననాటి చెలికాడు చేరవొచ్చిన నాడు,
చేరి చెంతన జేర్చి – నాటి మాటలు తలచి,
మన్నించి మన్నించి మన్ననలు కురిపించు,
తారతమ్యపు సీమ తలుపు నేరని చెలిమి!

ఆగంధ మించుకై నెరిగి యుందము నేడు,
ఆ బంధ బలిమిగొని భాసింతమిక ముందు,
దేవ దేవుడు తానె తెలియ జేసిన తరిని,
తగిలి యుందము మనము తనువున్నవరకు!!

.

                  
                 
                
               

Leave a comment