భాగవతం : గోవర్ధన గిరిని గోపాలుడు ఎత్తి పట్టి, ఇంద్రుని కోపం నుంచి తనను నమ్మిన వారిని రక్షించటం. ఇక్కడ ఇంద్రియములకు ‘గోవు’ అనికూడా అర్ధం చెప్పుకుంటూ, ఇంద్రియ శాసకులైన దేవతల నుంచి, గోవిందుడు రక్షించును , అని వివరిస్తున్నారు. గోవిందుని నమ్మి , ఆయన రక్షణ పొందిన గోపాలకులను బాధించలేని ఇంద్రుడు, ‘గోవర్ధన గిరిని ఎత్తిన గోపాలుడిని’ “గోవిందా” అని సంబోధించాడు. ఆ గోవిందునికి దేవేంద్రుడు సమర్పించిన అభిషేకమే “గోవింద పట్టాభిషేకం”
నాకమేలెడి వాడు తన ఆలితోకలసి,
పరివారములు ఎన్నో వెన్నంటి నడువంగ,
వైభవంబును గొనక వినయంబు బూనుచు,
నంద బాలుని పదములంటి మ్రొక్కేను!!
గొల్ల గండడు వాడు క్రొవ్వినాడనుకొంటి,
దేవ కార్యము సలుప మన్ననెరుగడనంటి
గొల్ల పల్లెల శోభ హరించనెంచితిని,
హరి హరీ నను గావు హరియించి అహము!!
గోవు గాయగ నీవు గోలోకమును వీడి,
గొల్ల పల్లెల జేరి గోపాలకుని వోలె ,
ఆల మందల వెంట ఆడుటెరుగక నేను,
విర్రవీగితి నయ్యా – తప్పు గాయు !!
దితి సంతు దునుమాడి ధరణి గాచిన వాడ,
మూపుపై మంధరను నిలువరించిన వాడ,
లోకమెల్లను లోనే కలిగియుండిన వాడ,
గిరిని గొడుగుగ జేయ భారమగునే నీకు?
బాలుడని తలపోసి భ్రమల నేనుండఁగ,
నమ్మియుంటిరి నిన్నే ప్రేమ మీరగ వీరు,
ఇన్ద్రియంబుల నేలు ఇంద్రుండనని హెచ్చి,
ఇంద్రాది పతివైన నీ మహిమ కననైతి!!
మన్నించి నా తప్పు ఆదరించుమనంచు,
దివి దేవతల రేడు దీనతన వేడగా,
మంద గాచెడి వాడు మందహాసముతోన,
సమ్మతంబును తెలిపే పురజనులు మురియా!!
మణి ఖచిత ఆసనము మక్కువతో అమరించి,
దిక్కులన్నియు దివ్య శోభలతో సవరించి,
పుష్పబాణుని పిలిచి వనినేలగా తెలిపి,
వేయి కన్నులవాడు వైభవము నెరపే!!
యక్షులును కిన్నెరలు గంధర్వ గాయకులు,
తుంబురుడు నారదుడు వేదాంగ రూపములు,
దిక్కు లేలెడివారు ముల్లోకముల విభులు,
మునులు మున్నగువారు సేవించిరపుడు!
అమర సీమన నిలిచి వీక్షించు వారొకరు,
అరుదైన కానుకల నర్పించువారొకరు,
సుకుమార కుసుమాలు కురిపించువారొకరు,
గోవిందు వైభవము వివరించువారొకరు !!
దేవలోకపు వనులు వీడి తరలిన వనులు,
సురలోక గోష్ఠములు వీడు సురభుల మంద,
అడుగిడిన వ్రజభూమి ఇల నాకమునుపోల,
వైభవంబందేను వైకుంఠ విభుడు !!!
సాటి వాడను తలచు గోపాల బాలుఁడు,
గోవిందుడను ఎరుక పురమెల్ల వ్యాపింప ,
సంభ్రమాశ్చర్యాల మునిగి గోకులమంత,
వన వైభవమునందు తమ వంతు చేర్చే !!
నాటి ఆటలలోని వింతలన్నియు తలచి,
వివరమేదో ఎరిగి వివరించువారొకరు!
ఒడిన ఆడినవాడు దేవాధిదేవుడని,
తెలిసి తమ భాగ్యమని మురిసెనింకొకరు!
సందియంబులు దీరి తెరిపి గలిగినదంచు,
తన మనంబున పొంగు మందలోనొకడు!
గోవిందుడా వాడు! గోపాలుడనుకొంటి,
కొంటె చేతలనలసి కోపగించిన నన్ను,
ఏమంచు తలంచునో! చిబోయి అలుగునో!
నేరకెంచితినయ్యా నెనరుంచి మన్నించు,
మనసునెంచకు నన్ను మలినసంజాతనని,
అని మనమునే తలచు మౌనాన ఒకరు!!
నందు భాగ్యము తలచి ఉప్పొంగువారొకరు,
నందునంగన జేరి పొగడువారొకరు,
ఏపూజ ఏనాడు ఏరీతి జేసితిమో ,
దేవదేవుఁడిలను మన ఇంట జేరెనని,
ఉల్లాసమున మునిగి ఊరడిల్లొకరు !!
గోవర్ధనము నెత్తి గోకులము కాపాడి,
సురనాయకుని నుతులు లీలగా గైకొనుచు,
నిజరూప ఛాయలను తగువారికెరిగించు,
నీరజాక్షిని కథను భావించి ఆలించి,
ఆనంద మొందరే మనసార జనులు !!!