అక్రూరుడు బలరామ కృష్ణులను మధురకు తీసుకుపోవటానికి గోకులం వొచ్చి , కంసుని సందేశాన్ని విన్నవించాడు. నందుడు ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేయమని, పరివారాన్ని ప్రయాణానికి సిద్ధం కమ్మని చెప్పి, ఆ రాత్రికి విశ్రమించి, ఉదయం బయలుదేరమని చెప్పాడు. నందునింట కృష్ణపరమాత్మ తో ఒక పూట గడపగల తన భాగ్యానికి ఎంతగానో మురిసిపోయాడు.ఆ మనోభావం భావించటానికి చేసిన ప్రయత్నం
పర్యంకమగు వాడు శైయ్యపై తోడుండ,
పురమునేలెడివాడు పవళించె నిపుడు!
నీరజాక్షుడు వాడు ఏ లీల తలపోసి ,
చిరునవ్వు చంద్రికలు ఒలికించె నిపుడు!
శిఖి పింఛ చామరము వీచు తల్లుల పాట,
అలనాటి లీలలను జోలగా పాడగా,
ఆలకించుచు తానె ఆనందమందుచు,
చిగురు వెన్నెల చిలుకు చిరునగవు పరచెనో!
కుంతలంబులు కదిలి కర్ణమందున జేరి,
వింత వింతలు ఏవో వివరించెనో నెమో!
కాలుడందగజేయు వివరముల వైభవము,
వనజాక్షి కెరిగించి వసతి నొందేనో!!
విందుగా ఆ మోము వీక్షించు వసతాయె,
వివరమేదను శంక సరిదారి కాదాయే !
కనికరము గొనలేని కనురెప్ప పాటులను,
పంతాన పలుమారు నిలువరింతును నేడు !
శుక శౌనకులు మునులు కనలేని నగవు,
నారదాదులు కనగ తపియించు నగవు,
నగరి గెలిచినవారు కననెంచు నగవు,
ఆరబోసెను వాడు అందగా నిపుడు!!
భాగ్యమేమని యందు నా పూర్వజులది,
యదుకులంబున నన్ను జయింపజేయ!!
పూర్వ పున్నెములెన్ని- రాసులను గూర్చి,
కంసుడంపెను నన్ను ఈ భాగ్యమంద !!
తామసులు వైరమున చేరవొచ్చినగాని
చేరినాడనివాని చేరదీసెడి కరుణ,
కోరి కైయ్యాము నెరపు అహమందువాడైన,
కోరినాడని కోరి సంగమిచ్చేడి కరుణ!
చేరవొచ్చేడి వార చేరదీయుటెగాని ,
తొలగి పంతము లాడ తగని కరుణ!
కాఠిన్య మెరుగనా నిండైన కరుణతో,
దుడుకు లీలలు నెరప ఎటులోర్తునో ఏమో!!
పాల్కడలి పొత్తిళ్ళ ఒదిగి పెరిగిన కన్య,
సోము సోదరియైన సుకుమార ముదిత,
ప్రియమార పలుమారు సేవించు పాదములు,
కరకు రక్కసులణనచ కంది అరుణిమనొందె !
పంకజంబుల బోలు పద్మాక్షు పాదములు,
ఆలమందల వెంట నడయాడ నొచ్చునని ,
పదమాను ప్రతి తావు పులకాంకులను బోలు,
లేత పచ్చిక మడుగు పుడమి మొత్తగ పరచె!!
అడుగడునా విరులు అందుమో మమ్మంచు,
అర విరిసి మధుపముల మరుగుగా జేసే!
లేగలందక ముందే అందుమో క్షీరమని,
ధేనువులు పలుమారు నిను కుడిపి మురిసే!
వ్రజ వాసులేనాడు ఏ నోము నోచిరో ,
దివ్య చరణములాడు తావులను నడయాడ!
సంగులై సరసమున ఆ సంగతొందగా ,
తోయజాక్షుని తోడి జతగూడి కుడియగా!
వారి వైభవమిపుడు వంతు నొందితి నేడు,
ఆ దివ్య చరణాల కనువిందుగా గాంచ!
ఖగవైరి పానుపున పవళించు శ్రీపతిని,
కనుల భాగ్యము పండ కనియెదను నేడే!
నందబాలుని నేను గొంపోవ ఓస్తినని
కలత చెందిన పల్లె నిదుర మానేనో ఏమో !
గొల్ల పలుకుల చినుకు రేయంత నిండే ,
అణగిపోవని సడులు పురమెల్ల నిండే!
జాములెందుకో నేడు జాగరూకతలేక ,
రెప్పపాటున కరిగి కదలిపోయెను చూడ!
లేగమువ్వలు కదిలి గానమేదో పలికె ,
గొల్లలందెలు చల్ల సడులతో జత గూడె!!
పూర్వసంధ్యల పలకరింపులు -పాల కుండన చిందు ధారలు
మేలుకొమ్మను విన్నపంబులు -మంగళంబను వాద్య నాదము
మెలి అత్తరు చందనంబులు – కుర్చీ చాదిన నూత్న గంధము
అవిసి దండలు అగరు ధూపము – కింకిణీరవ సంగతంబులు ,
తరుణమాయిక తరలవలెనని కరుణ నెన్నక కబురునంపెను!
కటిక కాలము నిలకడెరుగదు – నిలువరించెడు తీరులెరుగను,
పల్లె వాసుల పలకరింపున – మధుర భావము మరుగు జేరెను!
చలువ తెరలను అమరజేయుచు-తేరు తీరును చక్కదిద్దుచు
అన్నదమ్ముల ఆసనంబున కొసరి వసతిని కొంత కూర్చుచు !
తేరు గమనపు తరుణమందున – నంద సుందరు తీరుగాంచక,
వాని శోభలనంది మురిసెడి – వనుల గాంచుట ఏమిభాగ్యము?
వాణి నాధుడు నేడు దయగొని – వింత చూపులనీయరాదా !
వసతిగా నా వెన్ను వెంబడి కనుల కొలనులు కూర్చరాదా!!
ధరణి నాధుడు దయనుగొనినను దరిని జేర్చగ నెంచునో!
వైరి కపటపు విన్నపంబుల కబురు తెస్తిననలుగునో!!
మాధవా! మధుకైట భంజన! మనసునేలుము చెలిమితో,
చెల్లజేయుము కుటిల కర్మలు కుర్చీ నీ దయ ఇంపుగా !!