నీట ముంచినవాడు

నీట ముంచినవాడు – రేపెన్నడో ఎపుడో ,
పాల ముంచకపోడు – చింత తీర్చక పోడు!
చిగురంత ఆ ఆశ – అనుదినము చిగురింప,
చేరి చెంతనేయుండి – చెలిమి పంచకపోడు!!

నీట ముంచినవాడు – వేడుకేదో పొంద,
గట్టు నంటుక నిలిచి – గమనించులే నన్ను!
మునిగి గుటకలువేయ – వేదనొందెడి నన్ను,
నిముషమైనా విడక – వెంట జంటగ నుండు!!

ఏమేమి తీరులివి – ఏమి ఎరుకను తెలుపు?
తలపు లోపలివాని – తలపు తెలుపగబోదు !
తెరపి నొందెడితావు – తరచి తెలియగ లేను,
తగిలియుండెడి తెలివి – తోడుండి కలిగించు!!

అనిలుడలిగిన నాడు – ఆదరించునో ఏమో !
మునక మునకన మనసు – మరుగెంచినా గాని,
తనువు ఓరుపు తరిగి – తలుప మరచినగాని ,
కొలువ దిక్కగువాడు – కరుణ నెంచక పోడు !!

పాల్కడలి పాలకుడు – పంతమెరుగని వాడు,
పోరినా కోరినా – చేరదీసెడి వాడు!
ఆదరంబేగాని ఆదమరువడు వాడు!
అందనెంచును నన్ను – ఎన్నడో ఒకనాడు!!

పాల ముంచకపోడు – చింత తీర్చక పోడు!
చిగురంత ఆ ఆశ – అనుదినము చిగురింప,
చేరి చెంతనేయుండి – చెలిమి పంచకపోడు!!

Leave a comment