ఎక్కడో దూరాన

ఎక్కడో దూరాన ఏ కొండకొమ్మునో
కొలువుంటివని తలచి ఎలుగెత్తి పిలిచేను!
పిలుపు లో నాదమై నడయాడు నీవెయని,
ఎరిగి అచ్చరువొంది -మౌనమొందితి నేను!!

మౌనమందున జేరి మంతనంబులు సలిపి,
వివరమేదో నాకు వివరించనెంచేటి,
నిలకడెరుగని మనసు మధనంబు నీవెయని ,
ఎరిగించగానెవరో విస్తుపోయితి నేను!!

ఎరుక నేనని ఎంచి ఎరుగనెంచితి నిన్ను,
ఎరుగు తీరుల నెరుగ యోచనందుచునుండ,
యోచనందున నిలిచి యోచింపజేయు’నది ‘ (యోచింప చేయు ‘అది’)
‘నీవే’ యనెరిగింప – చెలితనైతిని నేను!! చెదరి చేతనలన్ని!!

చేతనందున చిందు చేతనత్వము నీవు!
పలుకులందున కులుకు కమనీయ నాదమువు!
ఎరుకవై ఎరిగించు ఎరుక యంతయు నీవె!
ఎరిగించు’నది’ ఎరిగి మోదమొందగ నీవే!!

చేతనై – నాదమై- యోచనై – ఎరుకవై,
దిశ దిశన దశ దిశల నిండున్న ‘అది’ నీవు,
అంతరంగము నీది- అచట స్పందన నీది,
సందు లేదయ ‘నాకు’ సందడేదో నెరప!!

ఉనికెరుంగని ‘నేను’ బేలనైతిని నేడు,
బెదరి చెదిరిన ‘నాదు’ బెరుకు మాపుము ఇపుడే!
నా యునికివై నీవె యురమందు మనుచుండు,
ఎరుకెరుంగని ఎరుక ఇకనైన మరలించు!!

                                       

Leave a comment