ఆది ముందర వాడు – అంతమావల వాడు,
ఆద్యంతముల నడుమ అలముకున్నది వాడు ,
ఆనుపానుల నెరిగి జగతి నడిపెడి వాడు,
ఆనవాలుగ తానె జగతి నిండిన వాడు!!
ఆదమరచి తెలివి తెలియ జేసిడి వాడు,
తెలియ జేసిన తెలివి తరల జేసెడి వాడు,
తెరిపైన తెలివైన తగిలి తెలిపెడి వాడు,
తరలి పోయెడినాడు తరలజేసెడి వాడు!!
నమ్మి కొల్చిన గురువు – గురుతు తెలిపిన దారి,
తెలివిలో పదిలముగ పదిల పరచెడివాడు!
పదునైన తరుణాన తగిలుండి తెలివందు,
తెలియ నెన్నిన తీరు తెలియజేసెడి వాడు!!
కలత నెరుగని వాడు కొలత కందని వాడు,
కలనైన ఇలనైన కలిగుండకల వాడు,
కలిగుండినాగాని కనుల గట్టనివాడు ,
ఉనికిగా ఉరమందు తెలియునది వాడు!!
నిన్న రేపుల మధ్య కుడి ఎడమ మధ్య,
నింగి నెలల మధ్య ప్రతి జంట మధ్య!!
మాలిమై మేలిమై మౌనాన ఒదిగుండి,
కరిగిపోయిన ఉనికి కిలిగుండు ‘వాడు’!
అట్టివానిని తెలియు తెలివి నందగజేసి,
ఆదరంబున నాదు అరమరలు సరిచేసి,
అందించినా తెలివి అనుభవింపగజేసి,
ఆదరించెడి ‘వాడు’ నను బ్రోచుగాక !!