మేడిపండీ జగతి

మేడిపండీ జగతి మేలిమని ఎంచేవు,
మోసపోతివి నీవు మనసా!
పండుపొట్టన యున్న పురుగు చందము జగతి,
కడుపు నింపదు నీది మనసా!

ఆటాడ రమ్మంచు ఆదరంబున పిలచి,
అడుసు లందగ జేయు మనసా!
అడుసు కడిగెడి తీరు ఏరీతి ఎరిగేవు?
జగతి తెలుపదు నీకు మనసా!

ఆటపాటులు నీవి అలుపు సొలుపులు నీవి,
మోదమొందును వాడు మనసా!
సొమ్మసిల్లిన నీవు వగచి వేడగ వలయు,
వాని సంగమునొంద మనసా!

తోలుతిత్తిన జేర్చి తోడుండు వాడొకడు,
తెలుపడే ఏ తెరపు మనసా!
తీరుతెలియని నడత వాని తీరని ఎరిగి ,
తొలగుండుటే బ్రతుకుమనసా!

జిలుగు జగతిని అల్లి వేడుకొదుమనంటే,
వేగపడి తరలేవు మనసా!
జిలుగు మాటునదాగి మిత్తినిను ముంచేను,
మతినొంది మరలవే మనసా!

తోడుండువాడొకడు కాపుగాచేనంచు
దుడుకు దారుల దిగకు మనసా!
దుందుడుకు చేతలకు దండనలనందించి,
దరి నుండి నడిపించు మనసా!
దయలేన సంగమది మనసా!

కరుగనెంచనివాని కలిగున్న ఈ జగతి,
కరిగి నిను కబళించు మనసా!
కరుగకుండెటివాడు కరుణ కాణాచనుచు,
కథలెన్నొ కలవిలను మనసా!

సారధై ఆనాడు నరుని నడిపినవాడు,
సంగుడని నమ్మకే మనసా!
సుతుని బాసిన సఖుని శోకంబు బాపగా,
సలుపడే ఏ లీల మనసా!

పల్లెపడుచుల ప్రేమ కుడిచి పెరిగినవాడు,
మరలిచూడక మరలె మనసా!
పలుమారు తలపోసి వేడుకొనుటే దారి,
పంతమాడుట తగదు మనసా!
పరమాత్ముడే వాడు మనసా!
పలుమారు తలుపవే మనసా!

నిగమ గమని

తనువు తంబుర జేరి తారకంబును తలచి,
రాధికా మంజీర లయను భావన జేసి,
రాకేందు ధరు తలప నిలువదే నా మనసు,
నిలువరించరె దీని నిజవాసులగు వారు!!

ఇంద్రియంబుల యందు ‘మనసు’ తానే యంచు,
వివరించె నానాడు విజయు గురువగు వాడు!
తానెయైనా మనసు తలుపదే తన ఉనికి,
తెలియజేసెడి వార తెలియగా తెరవేది?

జగతి మొలువక ముందె ఉనికైన వాడొకడు,
ఉలుకు పలుకులు లేక పసిపాపడై తాను,
కాలాంబుదిన  దేలు వటపత్ర శయనుడై,
వేడుకొందెడి వాని జాడకను దారేది? 

బహు రూపములు కాగ భావించినా ఉనికి,
రూపు రూపున జేరి మోదించ నెంచనట,
తనకు తానే హితుడు వైరి తానే యంచు,
మోదమొందెడి వాని తెలియనగు తీరేది?

రాగ ఖేదములన్న భేదమెరుగని వాడు,
రచియించినాడంచు వివరింతురే గాని,
నలిగి పొగిలేవాని అనునయించెడి వాని,
ఉనికి తెలిపెడి వాని ఎరుకిచ్చు వారేరి?

రూపమెరుగనివాని అనురూపి ఈ జగతి,
రూపమందిన జీవి కల కల్పనీ జగతి,
భావించు భావనల భోగంబే ఈ జగతి,
భావమిచ్చెడి వాని భావింప తెరవేది?

రమియించగా తాను రచియించినీ వసతి,
వైభవంబుల నెంచి రాగమొందగ తానె,
ఎడబాటు ఆటలని పంజరంబున జేరి,
బంధాల నలిగెనట విడుదారి మరచెనట!

మరపె మన్నన యైన మహిమగల వసతయ్య,
మరువ చక్కని తండ్రి నీ మరుపె మేమయ్య!
సంగమందలి మరపు సవరించు తలపులను,
తలుప తొందరలేక తీరికొందగ తగునా?

తనువు తంబుర జేరి తారకంబును తలచి,
రాధికా మంజీర లయను భావన జేసి,
రమియించ నెంచినా రమ్య భావన నెంచి,
నిలువవే నిగమమై మనసు గమనమన !!

పలుకు చక్కని తల్లి

పలుకు చక్కని తల్లి పలుమారు పలుకవే,
పలుకు పలుకున నింపి పవనాత్ము కరుణ!
పాతకంబులు కరుగి నిగమ పదమెరుగంగ,
నాదమందవె నాదు నవనాడులందు!

నారదాదులు నాడు నాదించినా పలుకు,
నారాయణుని కరుణ కాణాచి యగు పలుకు,
అసుర గణములు పలుక తెగనాడు పలుకు ,
పలికింపవే నాదు నవనాడులందూ!

వశిన్యాదులు నాడు నుతియించినా పలుకు,
వనదేవతలు మురిసి వచియించినా పలుకు,
వరదాయినా రమణి రాగమందిన పలుకు,
రచియించవే నాదు నవనాడులందూ!

పరమేశు వీనులకు విందుజేసే పలుకు,
పరదేవి పలుమార పలుకనెంచే పలుకు,
చెలికత్తియలు మెచ్చి మారుపలికే పలుకు,
పలుకనెంచవె నాదు నవనాడులందూ!

నాడులన్నియు మురిసి నర్తనొందే రీతి,
హరిహరుల పదఘటన జంట జేరెడి రీతి,
జంట జంటను మాని జాడమరచెడి రీతి,
లయనొందవే నేడు లలితపద జాలా!

తనువిచ్చినా తనువు

    తనువిచ్చినా తనువు తరలిపోయే రోజు,
    తలపులెన్నో పొంగి తనువంత తడిపేను,
    తలనిమిరి లాలించి లాలపోసిన చేయి,
    చితిమంట చిటపటన చిన్నబోయిన రోజు! 

   గోరుముద్దలు కుడిపి దుడుకు దండనలిచ్చి,
   కాననంటిది జగము దిక్కుదారులు లేవు,
   నాకమేలెడివాని  మనము నెంచుమనంచు ,
   బ్రతుకు బాటల వెంట పయనించగా నంపె!

   సావకాశంబేదొ సావధానంబేదొ వివరించ నెంచకే,                                                                                                        
   పలుతెరంగుల పరచు జగతి జిగి దారులన 
   విధి తెలుపు వివరములు మదినాటు నని తలచి,
   వినువీధి వాసులను వేడుమని మరలెనో!

   వాదులాడిన నాడు వారించ మరచేను,
   వాదమందున నిలచి వివరముల నెంచేను, 
   బ్రతుకు  వరదన నిలచు తావెంచకే నేను, 
   తరలి తీరగు గట్టు తగులుమని తెలిపేను!   

  జోలపాటలు చాటు బ్రతుకుబాటల  నీటు,
 నిదుర మబ్బుల మాటు మగతగా మిగిలేను,
  మగత తీరిన నాడు నాటి నీతులు పాట,
  జోలలూగుచు నన్ను జాలిగా చూసేను! 

  తనువు చెల్లిన నాడు చెలిమెంచి చేరునో,
  చెల్లిపోయిన చెలిమి చెదిరి చితి చేరునో,
  మరపెరుంగని ఊహ ఉయ్యాల ఊపులో.
  ఊరడింపుల పాట ఉనికి ఊపిరి పోదు!

భవతారిణి

భవతారిణీ నావ భక్తియను నావ,
లంగరందెను నేడు తరలి రండంచు!
పరమ గురువుల కరుణె చుక్కాని కాగా,
శరణు యను తెరచాప తెరచి తరలేను!

ఏల ఈ జగతఁచు పలుమారు లడిగినా,
తర్కమున పలుమారు తనువులే పండినా,
తొంగి చూడడె వాడు తలపులందెపుడూ,
ఒదిగి అంతరమందు ఆదరమునుండు!

మనసు మచ్చికజేసి మహనీయు తలుపగా,
తనువు కృంగగ తాను నియమమెంతో ఎంచి,
కొండ కొమ్మలపైన కటిక చీకటి చెరల,
ఆయువంతయు కరుగ కలుగదే ఆ కరుణ!

ఎదుర నడచిన శబరి -ఎరయైన సురవైరి,
(రామ బాణానికి ఎర అయిన మారీచుడు)
చరణమందిన గుహుడు చేరి కొలిచిన కోతి,
చల్ది కుడువుమటంచు చేర బిలిచిన చెలిమి,
చిరుగు పాతన కట్టి అటుకులిచ్చిన సఖుడు,
వేట నిచ్చిన బోయ వేడి అలసిన దంతి , ( దంతి – ఏనుగు)
వెన్న కడవల వేట వెన్నెలాటల జంట,
కోర మరచిన కలిమి కొంగుపట్టగ జేయ,
చేసిరే పూజలని చింతచెందగ రాదు!

భక్త దాసుడు వాడు భవరోగ హరుడు,
భక్తి కైమోడ్పులకు భవదీయు డతడు,
భాగవతులెడబాడబాసి మనజాల నంచూ,
భువనమెల్లను నిండి జంటనుండేను!

భవతారిణీ నావ భక్తియను నావ,
లంగరందెను నేడు తరలి రండంచు!
పరమ గురువుల కరుణె చుక్కాని కాగా,
శరణు యను తెరచాప తెరచి తరలేను!

తనువె తంబుర

తనువె తంబుర తారకంబగు నామమును పలికించగా,
మించు ఋచిగల మంచి నామము ఎంచి ఋచినిక నెంచరా!
వేల నాడుల దుడుకు నడకల – లయన నిపిపెడి లయలతో,
నిలకడెంచెడి హృదయలయ జత నెంచి నామము పలుకరా!
||తనువె తంబుర||

ఆసనంబున అంకురించి అమర నాదము నెంచరా! ఆ………………………..
ఊపిరై నీ ఉనికి తోడుగ ఉన్న నాదము నెంచరా!
ఊ…………………………….
ఆసనంబున అంకురించి అమర నాదము నెంచరా!
ఊపిరై నీ ఉనికి తోడుగ ఉన్న నాదము నెంచరా!
ఆ…ఊ…….. ఆ….ఊ………….ఆ..ఊ….
రూపమందిన అమర నాదపు రూపు గోవని ఎంచరా!

||తనువె తంబుర||

వాచకంబుల మరచి లోనే వెలుగు నాదము నెంచరా! ఉమ్………..ఉమ్……………ఉమ్…………….
నాదమందను నాదమందెడి ఉనికి నెరుగగ నెంచరా!
…… ……… …….
వాచకంబుల మరచి లోనే వెలుగు నాదము నెంచరా!
నాదమందను నాదమందెడి ఉనికి నెరుగగ నెంచరా!
ఉమ్………… ఉమ్…………..
ఉనికి యై ఇల నిండియుండిన స్పందనల పలికించగా!
||తనువె తంబుర||

కూరుపేదది? కూరిమేదది? కుదురు నెరుగగ నెంచరా!
తనువు తనువున కొలుదీరిన కొలుపు భావన నెంచరా!
( కొలుపు- ఎడతెగని సంభాషణము/ప్రసంగము)
భావనై భవతాప మణచెడి మధుర దారువు నెంచరా! (దారువు – విగ్రహము)
ఎరిగి నెరుగకొ ఎన్ని నేడిక తారకంబును పలికించరా!

తనువె తంబుర తారకంబగు నామమును పలికించగా,
మించు ఋచిగల మంచి నామము ఎంచి ఋచినిక నెంచరా!
వేల నాడుల దుడుకు నడకల – లయన నిపిపెడి లయలతో,
నిలకడెంచెడి హృదయలయ జత నెంచి నామము పలుకరా!
తనువె తంబుర …తనువె తంబుర ..తనువె తంబుర ..

గురువు

గురుతెరింగిన గురువు గుమ్మాన నిలచుండ,
తలపు తలుపుల తెరువ తొందరొందవదేల?
తరలించి దరి జేర్చు తేరంటి గురుపదము,
తగులు తొందర లేని సావధానమదేల?

పొద్దుపొడువక ముందె పూలన్ని పుణికేవు,
అగరు చందన గంధ అత్తరుల నందేవు,
తనువు సింగారించి తరలి గుడి కరిగేవు,
పూజించగా నెవని తలపందు నిలిపేవు?

పొందనేదో ఎంచి పలుమారు తలచేవు,
తగిలి తలపులలోనె బ్రతుకంత గడిపేవు,
పొందునందిన వాని పోలికే మరచేవు,
మరపు మాపెడి మందు ఎరుకేల గనలేవు?

మనసు నిండని పూజ తీరుగా జేసేవు ,
పలు తెరంగుల తిరిగి శాస్త్ర విజ్ఞత నెరిగి,
తీరైన తీరొకటి తలపందు నిలుపంగ,
పట్టగలిగిన పట్టు పట్టనెంచే దెపుడు?

తనువు రాలక ముందె తెలివి నొందవదేల?
తలపు తలుపుల తెరిచి గురుతొంద వేల?
గుమ్మాన నిలచినా గురువరుని గరుతెరిగి,
కదిలి పాదము కడిగి కరిగిపోవేలా?

ఎరిగించు చిలక

గరుచరణ సేవంచు ఊరంత తిరిగేవు !
గురువేమి ఎరిగించు చిలకా?
తనువు నిచ్చినవారు – తనువు పంచిన వారు-
తోడుండ దిగులేల చిలుకా?

తనువు నిచ్చినవారి తోడు నెంచితివేని,
వారు తరలిన నాడు – వేదనల మునిగేవు,
వెదకి అలసిన కూడ కనలేక వగచేవు,
వగపుదీరెడి తావు గురుచరణమని ఎరిగి …
నేడె చేరుము గురుని నరుడా!
తనువు తరుగక ముందె నరుడా!

తనువు పంచినవారి తోడెంచి పురజనులు,
సంతు బంధము నందు బ్రతుకంత నలిగేరు,
 వగపు బాపెడి తావు వెదకేల అలసేవు,                                         గురుచరణ సన్నిధియె సకల తీర్ధమనెరిగి…. 

నేడె చేరుము గురుని నరుడా!
తనువు తరియించగా నరుడా!

తనువు బంధాలన్ని తరిగి కరుగనవేన?
తగిలుండు వారెల్ల తొడువీడెడి వార?
తరియించు దారులన తరలించు తేరైన,
గురుని శరణమునెంతు చిలుకా …..

చరణసేవల జేతు చిలుకా!
తరియింప తలతునే చిలుకా !!

                    

నిండుమనసులు

ధరణి పంచెడి దివ్యతేజము – ధారణందున నిలిపి నిత్యము,
నిదుర లేచిన నిండుమనసులు – దారి జూసెను పరమ గురువుల!
గరుడ గమనుని గమ్యమేమని – కాలగతులకు దిశలు ఏవని,
ఎంచ నెంచని నిండుమనసులు – దారి జూసెను పరమ గురువుల!

గడచి కరిగిన కాల వాహిని – వదలి తరలిన మేలి గురుతులు,
నీడలై మది మందిరంబున – నిలచి నిత్యము నాట్యమాడగ,
మాటి మాటికి మరలిజూచుట- మాన నెంచిన పుణ్యజీవులు,
మనసు మలినము కంచికెళ్ళగ- దారి జూసెను పరమ గురువుల!
|| ధరణి పంచెడి దివ్యతేజము – ధారణందున నిలిపి నిత్యము,
నిదుర లేచిన నిండుమనసులు – దారి జూసెను పరమ గురువుల!||

వాదమెంచక వేదనొందక వెలుగు దారుల తరలు గురువుల,
జాడలందుక జగతి దారుల తరల నెంచిన బాటసారులు,
సావధానము నెంచ నెంచక ఎంచి బోధల భావనందుక,
తెరచి మనసులు చేర రమ్మని – గురుపదంబుల దారిజూసెను!!
|| ధరణి పంచెడి దివ్యతేజము – ధారణందున నిలిపి నిత్యము,
నిదుర లేచిన నిండుమనసులు – దారి జూసెను పరమ గురువుల!||

విడువకే నన్నెపుడు

విడువకే నన్నెపుడు – విరిరాజ హర వినుత,
వింత లోకపు దారి – దూరి దరి మరచేను!
విడువకే నన్నెపుడు – విరిరాజ హర వినుత!

మాటుమరచిన క్రోధ మెదిగి మోహంబాయె!
వన్నె చిన్నెలు తొడిగి తనువంత నెలవాయె!
శమ దమంబుల యశము – సూటిగా మదినాటి,
నాటి సంగము నెరపి – దరి దారి నడిపించు!
|| విడువకే నన్నెపుడు – విరిరాజ హర వినుత!!||

లోభమెంచక జగతి లాలనెంతో జేసి,
పలు తెరంగుల మనిపి మరలించ నెంచేను,
మరలి మరుగున జేర దొడ్డతనమా నీకు?
నలిగి మలుగక ముందె – దరి జేరి మన్నించు!
|| విడువకే నన్నెపుడు – విరిరాజ హర వినుత!!||