ఎన్నక గురు చరణంబులు

ఎన్నక గురు చరణంబులు – మన్నన నెంచరె విబుధులు,
వీనులు మెచ్చగ వినరే- సేవకజన భాగ్యంబును!
భవతారక సుధనందరె సాధకజన సంపన్నులు!
సారంబిదె సేవింపరె కులమంతయు తరియింపగ!!

వైకుంఠుడు గోపాలుగ ధరగావగ తరలినపుడు,
సాందీపుని సేవజేసి సరి విద్యల నెరుగలేద!
గురునాదరమందలేని విద్యలు వెలి యనలేద!
సరి సమయమనెరిగి మీరు సేవింపరె గురుపదములు!
||ఎన్నక గురు చరణంబులు – మన్నన నెంచరె విబుధులు,
వీనులు మెచ్చగ వినరే- సేవకజన భాగ్యంబును!||

శ్రీనారద గురుమౌనుల దీవెనచే త్యాగరాజు,
భవతారక తేరగు శుభ నామంబును గనలేదా!
గురుసేవల నెన్నలేక హరిపదముల కనలేరని,
మునుపెందరొ వివరించిన వివరము గని మనరాదా!
||ఎన్నక గురు చరణంబులు – మన్నన నెంచరె విబుధులు,
వీనులు మెచ్చగ వినరే- సేవకజన భాగ్యంబును!||

గోవిందుని జాడ దెలుపు గురుసన్నిధి విడరాదని,
గోస్వాములు ఎరిగించిన తత్వార్ధము వినలేదా!
బోయకు జ్ఞానంబిచ్చిన కరుణను కనుగొని మీరిక,
కలవరముల కడకుత్రోయు గరుసన్ని గొనరాదా!
||||ఎన్నక గురు చరణంబులు – మన్నన నెంచరె విబుధులు,
వీనులు మెచ్చగ వినరే- సేవకజన భాగ్యంబును!||

ఎవ్వరో ‘అది’ ఎవ్వరో!

జాలి ఇంచుక లేక తనువు తా జారంగ,
అంబరపు చేయంద తరలిపోయే దెవరు?
తనువు జారకముందు బంధు బంధాలలో,
తెరపెరుంగక తగిలి తల్లడిల్లే దెవరు?
|| ఎవ్వరో ‘అది’ ఎవ్వరో! ఎవ్వరో ‘అది’ ఎవ్వరో!||

కుడుచు అన్నంబొకటే కూడు ఊపిరి యొకటె,
నీరు నిప్పులు యొకటె ధరణీతలంబది యొకటె,
తనువు తనువున జేరు పంచభూతములొకటె,
తనువు తలపుల భేద మమరించునది ఎవరు?
|| ఎవ్వరో ‘అది’ ఎవ్వరో! ఎవ్వరో ‘అది’ ఎవ్వరో!||

తరువులన్నిట తగులు ధరణీతలంబొకటె,
ధరణి ధరియించేటి ఆకాశమును ఒకటె,
చినుకులై చిందేటి నీటి తుంపరలొకటె,
తరువు తరువున భేద మమరించునది ఎవరు?
|| ఎవ్వరో ‘అది’ ఎవ్వరో! ఎవ్వరో ‘అది’ ఎవ్వరో!||

తనువులో తరువులో తగిలున్న వాడెవడు?
సహపంక్తి భుజియించి భేదమొందే దెవరు?
సంగమందలి సంగమొల్ల నెంచేదెవరు?
బదులెరుంగని ప్రశ్న వివరించగా నెరవు?
|| ఎవ్వరో ‘అది’ ఎవ్వరో! ఎవ్వరో ‘అది’ ఎవ్వరో!||

చింతించవే మనస చింత చెదిరే దాక,
చింత దీర్చెడి వారు చేరువయ్యే దాక,
చేరవచ్చిన గురుని గురుతులందేదాక,
గురుపాద సన్నిధిన మనసు నిలిచేదాక!

ప్లవ

కాలమెంతో కరుణ గలదని కరగిపోవుటె దాని కరుణని,
వేగమించుక తరుగనీయక తరగి కరిగెను కటిక ‘శార్వరి’,
ఓపలేమని వల్లగాదని నిముషమైనా నిలువ లేమని,
పలుకు పలుకులు రంగరించుక కరగి తొలగెను – ప్లవను పిలిచెను!

అదుపెరుంగని జాతి నడకకు అదుపు నేర్పగ ఓడినాని,
కట్టడంటే కటిక చేతని అధిగమించుటె అసలు చేతని,
వల్లమాలిన వసతి మోజున మోసపోయే జాతి జాడను,
జాలెరుంగని జాడగాతా కరిగిపోతూ ప్లవను పిలిచెను!

కటిక కాలపు కాటు తీర్చెడి తీరు తెన్నుల తెరవునిమ్మని,
కంటి కునుకులు కూర్చి అల్లిన దండలన్నీ అందువారలు,
అంధకారము తొగచేసెడి వెలుగు పుంతల కుమ్మరించగ,
కరగి ‘శార్వరి’ తొలగి పోయెను – ‘ప్లవ’ను ముంగిలి స్వాగతించెను!

అందువారలు కరిగి వెలుగల తేరుపై నిక తరలిపోవగ,
తల్లడిల్లెడి జనుల తీరును ఏమనెంచునో ఏలువాడిక!
ఆదుకొమ్మని చేదుకొమ్మని ముడుపులెన్నో కట్టివేడిరి,
చేదు తీరుల చీదరింతురు వింతవారలు నాదుసంతని!

కూడబెట్టిన కూరిమంతా కనులముందే కరిగి పోగా,
పొరుగువారలు ఇరుగువారలు ఇంచుకైనా తోడుకాకే,
కోరి పిలువగ వస్తి నేనిక వీడనొల్లను వెంట రమ్మని,
పట్టి నావన కట్టి ఆదరి జేర్చు దయ నిక ఏమనందును?

కుమ్మరించిన కరుణ ధారల ధవళ కాంతులు తరుగజాలవు,
జాతి జాడ్జపు జీవధారల మూలముల తరుగంగ జేయును!
జీవ మెత్తిన ఆర్తి తీర్చగ ధరకు జారిన జీవ ప్లవమిది,
వొడ్డు జేర్చక వొల్లనన్నది వొడ్డు ఏదని ఎరుగమన్నది!
వొడ్డు ఏదని ఎరుగమన్నది!

ఎవరు – ఎవరు

ఎరుకగొను వాడెవడు? ఎరిగించు వాడెవడు?
పగలు రేయను బాట పరిచున్న ప్రగతిలో,
పయనించి ప్రతివారు పలుతెరంగుల తిరిగి,
అలసి సోలిన నాడు – సోలిపోయే దెవరు?

నేను నాదని తలచి జగమంత తిరిగేను,
వయసు వన్నెల వెంట వడివడిగ నడచేను,
మనసు తాకిడికోర్వ పసలేని ఈ తనువు,
పిగిలి నలిగిన నాడు నేనవరనెంచేను!

పలుకు నేర్పిన తల్లి పరుగు నేర్పిన తండ్రి,
బ్రతుకు బాటల వెంట కూడి వీడిన వారు,
తమదన్న ఉనికొకటి మనసు నద్దిన నాడు,
మురియువాడెవరంచు తనువంత వెదికేను!

ఆకులన్నీ రాల్చి చిరుగు తొడిగిన తరువు,
నిన్న క్రుంగియు నేడు ఉదయించి సూరిడు,
ఉప్పొంగు నదులన్ని ఉరుకు పరుగుల జేర,
ఉల్లసించని కడలి – ఏమేమొ ఎరిగించు!

కలిమి కలిగిన వారు కడు పేదలగువారు,
ధరణి నడచిన నాడు యశమెంతొ గలవారు,
ధీరధనులగువారు దీనాతి దీనులును,
మూగబోయిన నాడు మౌనమేదో పలికు!

సాధుజన సంచారి పలికించు పలుకులను,
సావకాశము జూసి – సరిదారి నెరిగించ,
ఆదరంబున జేరి అలుపుసొలుపూ దీర్చి,
లాలించి ఒడిజేర్చు సన్నిధెట కలదో!

లీలా వినోదుడట జరతి నెరపిన వాడు,
ఉనికైన ప్రచి చోట ఉనికంది యుండునట,
గురుతెరింగిన గురువు గురిదారి నడుపునట,
గురుతొంది గురువరులు మన్నించుటెపుడో !

రామ రాంరామ రాంరామ రాం

ధరణి భారము దీర్చ కోదండమందినా,
ధిక్కరించగ అహము పరశువే అందినా
పలుక చక్కని పదము నామమై పొందినా,
రామ నీకే తగును – తగులనీ నీ పదము || రామ రాం||

సుగుణ భూషణు నీకు సొమ్మలిచ్చిన దాసు,
చరసాల బంధించి కటిక కాలము జూపి,
రాచ బిడ్డవు గనుక రాజు కన్నుల గట్టి,
కాసు మూటలనిచ్చి దాసు చర విడిపింప-
||రామ నీకే తగును – తగులనీ నీ పదము || రామ రాం ||

తళుకు చెక్కిలి సొగసు స్వరమాలికన గూర్చి,
తనువు తంత్రుల జంత్ర మమరించి సేవించ,
కరుణ జూపగ నీవు కనుమరుగుగా నిలచి,
సకలమందలి ఉనికి ఎరిగించి మురిపింప-
||రామ నీకే తగును – తగులనీ నీ పదము || రామ రాం ||

తరుణి లాలననొంద తపియించు మూఢుడిని,
తరియించు దారులన తరలించి దరిజేర్చి,
దాసు మన్నన నెంచి నగుమోము జూపించి,
తారకంబగు చరిత పలికించి దయజూడ-
||రామ నీకే తగును – తగులనీ నీ పదము ||

రామ రాం రామ రాం రామ రాం రామ రాం రామ రాం

గురువు సంగము

జగతి నడకన తోడునీడై నిలచువాడిల ఎవరురా?
జన్మ జన్మలు వెంటనుండిన పరమ గురువని ఎరుగరా!

జగతి దారుల దుడుకు వేళల వెంట నుండే దెవరు రా?
జన్మ జన్మల వెంటనుండిన పరమ గురువని ఎరుగరా!

మోహమున నే మునిగి వగువగ ఆదరించే దెవరు రా?
జన్మ జన్మల వెంటనుండిన పరమ గురువని ఎరుగరా!

కన్నవారలు ఆలి సంతును మించు సంగత మెవరురా? ( సంగత :స్నేహము; చేరిక)
జన్మ జన్మల వెంటనుండిన పరమ గురువని ఎరుగరా!

కూడబెట్టిన పాప కర్మల కరుగ జేసేదెవరు రా?
జన్మ జన్మల వెంటనుండిన పరమ గురువని ఎరుగరా!

కరుగు కర్మల కొలిమి బాధను బాపువారిల ఎవరు రా?
జన్మ జన్మల వెంటనుండిన పరమ గురువని ఎరుగరా!

పరమ గురువుల కరుణ నొందెడి తరుణ మార్గంబేదిరా?
శరణు వేడుటె తరుణ మార్గము గురువు నిను దరి జేర్చురా!

శరణు వేడెద కరుణ కోరెద గరుపదంబుల జేరెదా!
జన్మ జన్మల జంటబాయని గురువు సంగము నెరిగెద!
గురువు సంగము నెరెగెద! నే గురుని కరుణనే కోరెదా!

గురు చరణమాడిన తావు

గురు చరణమాడిన తావునే నే తనువు నుంచగ నెంచెదా!
దాస దాసుల దాస్యమందే సంతసంబును ఎంచెదా!
దాస దాసుడు వాసుదేవుని వచనముల నెర నమ్మెదా!
దారి జూపగ పరమ గురువుల పాదములనే వెదకెదా!
|| గురు చరణమాడిన తావునే నే తనువు నుంచగ నెంచెదా!||

మచ్చికెరుగని కదలి వనముల సోయగంబుల నెంచునే,
వనము వనమున లేత పచ్చిక ఏరి రుచులను మెచ్చునే,
తరలు ఋతువుల తారకంబును తలప నెన్నడు నెంచదే,
మనసు కదలిని గారవించెడి పాదములనే వెదకెదా!
|| గురు చరణమాడిన తావునే నే తనువు నుంచగ నెంచెదా!||

చెరల నెంచని చెంచెలత్వము సొంతమని తలపోయునే,
ఇంద్రియంబుల విభవమే విధి వైభవంబని ఎంచునే,
తనువు జేరెడి కాలునెంచక కామితంబుల మునుగునే,
మితి నెరుంగక మనెడి చతురిని సాకు పాదమె వెదకెదా!
|| గురు చరణమాడిన తావునే నే తనువు నుంచగ నెంచెదా!||

గురు పాదమునె గోవిందునందిన పుణ్యచరితుల జేరెదా,
చిందులేసెడి మనసు నొడుపున నాపు తీరుల కోరెదా,
గురు పదంబుల కరుణ నొందిన సాధు సంతుల వేడెదా,
చేతలన్నిట చేరి దయగని గురు పదంబుల జేర్చగా!
|| గురు చరణమాడిన తావునే నే తనువు నుంచగ నెంచెదా!||


(కదలి – చతుర – లేడి)

దారులన్నీ నీవె

తొలగి దారులు తరల గలనే – దారులన్నీ నీవెగా!
దరి దూరమంచూ లెని దారుల – తరల నంపిన దెవరయా?
గోవిందునాటల గుట్టు దెలుపగ – ఇలను నాకింకెవరయా?
గురుతొంద నెరుగని దీన నిక నీ శరణమీయర గురువరా!

కుసుమాకరుండిట కుమ్మరించెడి – కుశలముల నేనెంచెదా!
బడలి పోయెడి తనువు బడలిక తీర్చమని నే వేడెదా!
వల్లకాటికి వెడలు వేళన వెలితి నెంచిక కుమిలెదా!
వాద బాధల వెడల జేయగ శరణమీయర గురువరా!
|| తొలగి దారులు తరల గలనే – దారులన్నీ నీవెగా!||

మనసు మన్నన మరచి భవమున భోగమొందగ నెంచెనే!
పాంచభౌతిక రధములో తన ఉనికి నిత్యమనెంచెనే!
అందబోయిన చందమామిక అందబోదని తెలియగా,
కుమిలి కృంగెడి మనసు జేరిక శరణమీయర గురువరా!
|| తొలగి దారులు తరల గలనే – దారులన్నీ నీవెగా!||

సన్నిధి గురుతు

లోనున్న లోకాల చీకటులు తొలగంగ,
లోకాల జాడలను లోలోనె ఎరుగంగ,
లోచనంబుల నిండ మెండైన దయగల్గు,
గురుపాద సన్నిధిని – నే నెన్నుటెపుడో!

లాలిత్య మెన్నంగ మన్నించు మదినేడు,
లలిత భావనయందె లయమొంది మురిసేను,
వెలియైన భావాల వెలితెరిగి వెనుదిరిగి,
గురుపాద సన్నిధిని – నే నెన్నుటెపుడొ!

తరిగి పోయే బాట వసతి వన్నెలు కోర,
కొరగాని బాటలన బ్రతుకంత నడిపేను,
నడత వడి సడలించి సరి నడత నెరుగంగ,
గురుపాద సన్నిధిని – నే నెన్నుటెపుడో!

గురుని గురుతెరిగేటి తెలివెరుంగని నన్ను,
గురుతెరింగిన వారు గురుతొంది దరిజేరి,
గురిదారి నడిపించి దరిజేర్చి గురుతిచ్చి,
గురుపాద సన్నిధిన – నన్నుంచుటెపుడొ!

పదము – పథము

పదము పుట్టెడి పదము భావనన భావించి,
పదము లందే నేను పలుమారు మనసుంచి,
పదము ఉనికిని యొంద కారణంబగు తరిని,
పదము లల్లెడి గుడిన గరుతుగా నుంచగల,
పదములందగ జేసి పలికించు తల్లీ!

పదము పథముల వెంట పథగామివై యుండి,
భావ మానస మధువు గ్రోలేటి మధుపంబు,
యోచించు పురహరుని నూత్న చేతన విభవ,
మందించ గల పదము లమరించు పథములో
అనుదినము నడిపించు ఆదరము నందించు!

వన్నెతరుగని విరుల వనమాల వైభవము,
పొందు నందిన యట్టి గోపజన భాగ్యంబు,
యదు బాలుడాడేటి యమునా తరంగాలు,
గోపికా కనుదోయి దొరలు కమ్మని కలలు,
పట్టగల పదములను పలికించవే నేడు!

మౌన మధనము నండి మొలచినా పలుకు,
మనసు మౌనపు తెరల తొలగించు పలుకు,
నాదమందగ తాను హరుని శ్వాసను వీడి,
ముని మానసోద్యాన వనము నడచిన పలుకు,
పొదిగి అల్లిన పదము పలుకు పలుకిమ్మా!

సోహమందిన హంస శ్రమయనక శ్రమియించి,
లోన వెలుపల యన్న అంతరంబులు మరచి,
తెలియ దలచినదేదొ – తెలియ వలసినదేదొ,
వెదికి వెదికీ వెదికి – అలసి సొలియక ముందె,
సావధానమునొంది శోభిల్లు పదమిమ్మ!

పలికించుమో పదము పురహరుడు పులకింప,
పలికించుమో పదము వరమౌని పతి మెచ్చ,
పలికించుమో పదము వాసవాదులు నుడువ,
పద పద్మ గంధాన కరిగి గగనము మురియ,
సుర వందితుడు మెచ్చి మన్నింపగా మమ్ము!

నాద మందలి నడత భావ రూపమునొంద,
నరులైన సురలైన కశ్యపుని సుతులైన,
దైత్యమర్దను దయను అందించగల పదము,
కొలిచి నీ పదములను పదిల పదములనొంది,
మన్ననొందిన వారె ముల్లోక వాసులును!

దయనీది కరువైన దొరుకదే ఏ పదము,
నుతియింపగా నిన్ను నీవె దయ గనవలయు,
తగిన పదముల కూర్పు కరుణతో పలికించి,
పదము పదమున నీదు పద ముద్రనెగడంగ,
పదిల పదముల చెండు విందుగా నిమ్మా!