శ్రీరంగని రంగు

రంగ రంగని రంగు రమియింప రమ్మనగ – వెరపంది వెనుకాడి వెలిగాక రండు!
రమియింపగా రండు – రస నామమందూ – రాగాది లంపటపు చెరలు చెదరంగా!

రంగులన్నిటియందు రంగరించిన రంగు – శ్రీరంగ రంగనీ రమణీయ రంగు,
రమణి శ్రీసతి మెచ్చి రమియించు రంగు – మోహాన జగమెల్ల లయమొందు రంగు!
రంగ రంగా యనగ రాజిల్లు రంగు – అంతరంగపు వెరపు బాపేటిరంగు,
రాగమందినవారు విడలేని రంగు – అవని భారముమాపు అరుదైన రంగు!

రంగ రంగని రంగు రమియింప రమ్మనగ – వెరపంది వెనుకాడి వెలిగాక రండు!
రమియింపగా రండు – రస నామమందూ – రాగాది లంపటపు చెరలు చెదరంగా!

రామదాసుని మనసు సంతరించిన రంగు – నాతి శాపముబాప కరిగినా రంగు,
రంగు రంగుల పురిని మడియించు రంగు – మనసు సద్దును మాపు మాలిమగు రంగు,
మాతంగి పతి మెచ్చి మనసిచ్చినా రంగు – గగనమై ధరనెల్ల పాలించు రంగు,
పాతకంబుల రంగు హరియించు రంగు – హరిచరణ సాయూద్యమందించు రంగు!

రంగ రంగని రంగు రమియింప రమ్మనగ – వెరపంది వెనుకాడి వెలిగాక రండు!
రమియింపగా రండు – రస నామమందూ – రాగాది లంపటపు చెరలు చెదరంగా!

దాసానుదాసులను దరిజేర్చు రంగు – ధాత తన ధారణన ధరియించు రంగు,
ధరణి భారము బాపు ధీరతగు రంగు – దుడుకు దైత్యల త్రుంచు దుందుడుకు రంగు,
రూపు గట్టిన దయకు ఉనికైన రంగు – రవ్వసేయక రిపుల నణగించు రంగు,
నారదాదుల మనములానంద మొందగా – మునక లేసెడి రంగ నామమను రంగు!

రంగ రంగని రంగు రమియింప రమ్మనగ – వెరపంది వెనుకాడి వెలిగాక రండు!
రమియింపగా రండు – రస నామమందూ – రాగాది లంపటపు చెరలు చెదరంగా!

* మాతంగి పతి  =>  మాతంగి : పార్వతి ; మాతంగి పతి : పరమేశ్వరుడు

నల్లని మేని ఛాయ కలిగిన పార్వతిని మెచ్చిన పరమేశ్వరుడు.

విష్ణుపాదము

పల్లెల నాడిన పాదము – బహు యశమగు పాదము !
గోపాలుర జంట జేరి – గోవుల గాచెడి పాదము!
గోపీజన మానసముల నమ్మిక నెలవగు పాదము,
గారవమున మునిముఖ్యుల వందన లందెడి పాదము!

ఫణిరాజా కాళీయుని పడగల నాడిన పాదము !
శేషుని పడగల నీడన శయనించెడి పాదము!
శేషించిన పలుకర్మల శమియించెడి పాదము!
శ్రీశారద నుతి లయలన నర్తించెడి పాదము!

పలు పాపపు వ్యధల బాప పావని పుట్టిన పాదము!
తలచిన తలపుల తనువుల తాపము బాపెడి పాదము!
తారా చంద్రుల గతులకు గతియగు ఈ పాదము!
మాయని తలపుల మౌనులు మన్నించెడి పాదము!

సురవైరుల మదమణచగ ధరణిని గొలిచిన పాదము!
మన్ననతో సురనాధుని శిరమును జేరిన పాదము!
వేడిన శరణుని విడువక వెనుగాచెడి పాదము!
గండపు గడి గడుప తానె గతియగు ఈ పాదము!

పంతంబున నా మనమున నడయాడగ రాదా!
జడిమాపగ నా మనసును మధియింపగ రాదా!
నిలకడ నెరుగని నడతల నణగింపగ రాదా!
చెరబట్టా పాదంబులు మదినేలగ రాదా!   నా మదినేలగ రాదా!!

 

గొల్ల విచారణ

గోపాలుడందిన మురళి పాటలు – ఏమి తెలిపెనె గోపికా?
తేలి గాలుల గొల్లవాడల ఏమి జగడము లాడెనే?
కంటి కునుకును కొల్లజేయగ ఏమి కబురులు పంపెనే?
గుండె గూటిన జేరి ఏమని గారవించెనొ తెలుపవే!

జగమేలు రాయుడు బాలుడై మీ పల్లెసీమల వీధిలో,
గోపబాలుర సాటిగా చిరు ఆటలాడుచు తిరిగిచూ,
దుడుకు ఆటల జోరులో తన సాటివీరుల మించుచూ,
కలువ కన్నుల ఒలకబోసెడి కబురు లేమని తెలిపెనే?

పాల కడలిన వెన్న మీగడ ఎన్నడెరుగని సరసుడు,
గొల్లలిండ్లన కొల్లజేసిన వెన్న ముంతల వేడుక,
తొల్లి ఎరుగని తమకమందుచు అల్లి జేసిన రచనలు,
అందజేసిన భావ వల్లరి కొసరి కొంచెము తెలుపవె!

ధరణి నాధుడు పొన్నకొమ్మన నిలచి ఏమని తెలిపెనే?
వెన్నెలాటల వేడుకందున మర్మమేమని తెలిపెనే?
కనుల కావల నిలచి చూపై రెప్ప తలుపులు దాటుచూ,
జగము నిండెడి జీవ నాధుని జాడ ఇంచుక తెలుపవే!

ఆది దేవుడు

తనుకు తానే తల్లి యట – తండ్రియును తానేనట,
తేట తెల్లని గిరుల గూటిన ఉల్లసించెడి విభుడట!
తెలియ నెంచిన తెలివి గలిగిన తెలుప తగువాడితడట,
తలుపుగా తనువందు కదలచు తెలియజేసెడి వాడట!
||తనుకు తానే తల్లి యట – తండ్రియును తానేనట,
తేట తెల్లని గిరుల గూటిన ఉల్లసించెడి విభుడట! ||

జగతి నాడెడి తనువులన్నిటి జనకుడీ గిరివాసట!
జీవమై జగమాడు జననికి తగిన ఈడగు వాడట!
జాలమెన్నక జీవులన్నిటి పూజలందెటి వాడట! (జాలము – కపటము)
జగతి జాలపు ఒడుపు మాపెడి అరకునొసగెడి వాడట! (జాలము – వల)
||తనుకు తానే తల్లి యట – తండ్రియును తానేనట,
తేట తెల్లని గిరుల గూటిన ఉల్లసించెడి విభుడట! ||

ఆది అంతపు అంతరంగపు పూరకంబగు వాడట!
పూని జగతిని మట్టుబెట్టెడి తెంపరగు దొర వీడట!
విసమె కుడుపట నగలు నాగట వలువ కాష్టపు బూదట!
వంక యగు నెలవంక శిగలో చెండుగా గలవాడట! (వంక – వంపు)
||తనుకు తానే తల్లి యట – తండ్రియును తానేనట,
తేట తెల్లని గిరుల గూటిన ఉల్లసించెడి విభుడట! ||

ఎగుడు దిగుడుల కొండ కోనల ఎగిరి నర్తనమాడట!
దుడుకు అడుగుల ఓర్వనేరని గిరులు గజగజలాడుట!
ఆలి జోలిని విడువ నొల్లని వల్లమాలిన సఖుడట!
సరస మెరుగక చిలుక రౌతును చిచ్చు జేసిన వాడట!
||తనుకు తానే తల్లి యట – తండ్రియును తానేనట,
తేట తెల్లని గిరుల గూటిన ఉల్లసించెడి విభుడట! ||

శివ శివా

కనులు మూడట కటిక పేదట – కాలమంటని వాడట!
తల్లి లాలన తండ్రి దండన ఎన్నడెరుగని వాడట!
కొండ కొమ్మునె కాపురంబట – ఆలి అంగపు పాలట ! (పాలు – భాగము)
ఆదిగా ఈ ధరణి నడిచిన – నాదరూపుడు వీడట!
||కనులు మూడట||

తనయు నెరుగని తండ్రి వాడట – తృంచి తల మరి జేర్చెట!
తారకాసురు తార్చు తనయుకు – తనువు నిచ్చిన తండ్రిట!
తరలు జీవుల తార్చి చేంతకు చెర్చు సంకట హరుడట!
సంకటంబుల కంటకంబులు మంటగలిపెడి విభుడట!
||కనులు మూడట||

మన్మధుని మదమణచి మగువను మనువునాడి వాడట!
వెన్న కుడిచెడి వాడు అంపిన విసము మింగిన వాడట!
రూపులెన్నియొ గలుగు రూపసి ఆలియై జతజేరగా!
గిరి నగంబుల నటనమాడుచు నగరి నేలెడి వాడట!
||కనులు మూడట||

ఆలి మానము నిలుప మామను మట్టు పెట్టిన వాడట!
తలకు మారుగ తలను పొదిగెడి విద్య నెరిగిన వాడట!
ధాత పుఱ్ఱెలు మాలయె తను భూషణంబగు వాడట!
మెచ్చి వరములనిచ్చి ఉచ్చున నలుగు మెత్తని వాడట!
||కనులు మూడట||

ధరణి కురికెడి గంగ పాదము శిరము నందిన వాడట!
పాదమందిన జీవులను దరి చూపి చేర్చెడి వాడట!
జీవధారల నొసగి నరులకు జీవమిచ్చెడి వాడట!
రూపమెరగని లింగ రూపుగ పూజలందెడి వాడట!
||కనులు మూడట||

పాదము

సిరి పట్టిన హరి పాదము – హరి నమ్మిన పాదము,
పలుమారీధరణి గొలిచి – దైత్యల దునిమిన పాదము||
గతియని నమ్మిన వారల – జత నడిచెడి పాదము,
గగనాంతర గతుల గతికి – ఆనతి నిచ్చెడి పాదము||

అవనిజ కొలిచెడి పాదము – అతి సుందర పాదము,
భావన నెంచిన భయముల – హరించెడి పాదము,
పాదుకలే ఏలికలై – ధర నేలిన పాదము,
పావని ఆ ముని శాలిని – శాపము బాపిన పాదము|| (శాలిని – భార్య)
||సిరి బట్టిన హరి పాదము – హరి నమ్మిన పాదము||

కాళియుని పడగలపై – అలవక ఆడిన పాదము,
గోపీజను లాశ్రయించు – సుఖదాయగు పాదము,
విడువక విబుధులు కొలిచెడి – వైకుంఠుని పాదము,
గతి యని గురుతెరిగి -గురువు లెరిగించెడి పాదము||
||సిరి బట్టిన హరి పాదము – హరి నమ్మిన పాదము||

కంటకమౌ కలి బాధలు – హరియించెడి పాదము,
కోసల నాధుని తపముల – మొలకగు ఈ పాదము,
కైకేయీ తనయుడు తా శిరమున దాల్చిన పాదము,
దశ కంఠుని కడతేర్చగ కడలిని దాటిన పాదము ||
||సిరి బట్టిన హరి పాదము – హరి నమ్మిన పాదము||

పరమగు పథమున పతియై – బాసట నిలిచెడి పాదము,
ముని మౌనపు మాటలలో – నడయాడెడి పాదము,
మన్ననతో నా మనమున – అనవతమమరగ కోరెద!
పదపంకజ మధుపమునై – సిరి సంగమునొంద!||

సిరి పట్టిన హరి పాదము – హరి నమ్మిన పాదము,
పలుమారీధరణి గొలిచి – దైత్యల దునిమిన పాదము||
గతియని నమ్మిన వారల – జత నడిచెడి పాదము,
గగనాంతర గతుల గతికి – ఆనతి నిచ్చెడి పాదము||

(హరి – శ్రీమహావిష్ణువు ; కోతి / హనుమంతుడు)

శివ శివా

పూవింటి దొర నణచి వన్నె కెక్కిన వాడు,
దుడుకు పదఘటనతో నాడువాడు,
పుణ్యాల రాసులను పట్టి కుడిపెడివాడు,
ధరనేలు గిరి పట్టి – విభుడు వాడు!

వెలిబూది వలువలను వలచి కట్టెడివాడు,
వెలి ఎరుంగని వెఱ్ఱి వేల్పువాడు!
నెలవంక వన్నెలను సిగన ముడిచినవాడు,
వెండికొండల కన్య వలపు వాడు!

కడలి పుట్టిన విసము పుక్కిటందిన వాడు,
కాటివాసము జేయు కటికవాడు!
సురగంగ శిఖయందు పట్టి నిలిపినవాడు,
మంగళాంగగు గౌరి మగడు వాడు!

భిక్షమడిగెడివాడు – భీతెరుంగనివాడు,
బిల్వపత్రపు పూజ లందువాడు!
తనువు భాగము పంచి ఆలి నేలెడివాడు,
అందాల జగదంబ ఆర్యుడతడు!

అరమోడ్పు కన్నులతొ అంబుజోదరునెంచి,
ఆనంద భావనల మునుగువాడు!
మితిలేని తమకాన కొండ కొమ్ముల వెంట,
ఆలితో నర్తించు అజుడు వాడు! (అజుడు – శివుడు)

కోరికొలిచెడివారు కోర విడువనివాడు,
కోరకున్నా వెంట నుండువాడు,
కొలువు కోరుటె తడవు కరుణ జూపెడివాడు,
కామాక్షికన్నులకు వెలుగు వాడు!

కాలమంటని వాడు – కాలుడే యగువాడు,
కాళితోడుగ జగము నూర్చు వాడు!
కరుణొంది కడతేర్చి కొలువీయడేలనో,
కటిక పథముల నడక కడకు జేర!

వేణు గానం

తరుణ మాయెను తరలి రండని పిలిచెనిదిగో తరలరే!
తరుణులారిదె పిలుపు నందరె పిల్లగాలుల తెరలపై,
తేలి తేలిదె మురళినాదము తేనె ఊటలు పంచెనే,
వీనులంజలి పట్టి కుడువరె మనసు మాధవు తలవగా!

వీనులందిన కుడుపు నందుచు లేగ కుడుచుట మానెనే,
మధుర గానము మదిన జేరగ గోవు నమలుట మానెనే,
మధువు గ్రోలగ విరుల జేరిన వెఱ్ఱి మధుపము లాగెనే,
కుడుచు టెరుగని వీనులీతరి మధుర పానము జేయగా!

వీనులెరుగని విరులు ఈ తరి విరిసి వేడుక జేసెనే,
వేణులోలుని అడుగు జాడలు మధువు మడుగుల జేసెనే,
చిత్తడందిన చిత్రమేఖల పురులు పరచుచు ఆడెనే,
గండుకోకిల కూయకే తన పెంటి జంటను జేరెనే!

అల్లనల్లన అలల పడగలు లయగ ఊగుచు ఆడెనే,
సుడులు తిరుగుచు నీటి ఊటలు పాట మధువును గ్రోలెనే,
సందడించక సకల జీవులు మధుర ఊహల మనిగిరే,
సావకాశము నొంద సమయము తనువు సంతనమొందగా!

వల్లభుండై వసుధ నేలెడి మాధవుని చిరు మోవిపై,
నిలువ పున్నెము జేసికొన్నా మురళి పుట్థిన పొదలలో,
పలుమారు తిరిగిన గాలితరగలు పలుకవే ఏ పాటలూ,
పాటపుట్టిన మోవి మహిమది ఎన్న మురళిది గాదుగా!

మోహనుండా నందబాలుడు మధురమే ప్రతి పోలికా,
మంద భాగ్యలు పుడమివాసులు అందరే ఆనందము,
నింగి దారుల తరలు వారలు తేరి జూడగ నిలుతురే,
నెలతరో ఈ నీరజాక్షుని కనగ కన్నులు మూయరే!

మంతనాలు

మనసు నాడెడి మంతనాలివి – మాధవుని మధురూహలు,
మాటమూటల జాడ వెదికెడి – భావ పుంతల ఊటలు! (ఊట – మూలము)
వనములందున ఆడి అలసిన పాదమందిన గొల్లలు,
పాలసంద్రపు పట్టి పట్టిన పాదమది యని ఎరుగరే,
మౌనమున ముని మనము తలచెడి పాదమని మన్నించరే,
పంతమున తన వంతుదీరగ ఒడిసి ఏమని పట్టిరో!

మనసు నాడెడి మంతనాలివి – మాధవుని మధురూహలు,
మాటమూటల జాడ వెదికెడి – భావ పుంతల ఊటలు!
ఉట్టిజేరని వెన్నముంతలు విందు జేయగ పిలిచినా,
మట్టినాడిన కరము వలదని గొల్లభామలు గదిమిరో!
చెలిమి మీరగ చేరదీయుచు కుడుపు నోటిన జేర్చిరో!
చెలుల సంగము వీడిరమ్మని చిన్నమనసును నొచ్చిరో!

మనసు నాడెడి మంతనాలివి – మాధవుని మధురూహలు,
మాటమూటల జాడ వెదికెడి – భావ పుంతల ఊటలు!
లోకములు లోనున్న ఉరమును లోన ఎంతగ దాచినా,
లోకమెరుగని నందునంగన గాంచి వింతను బోయెనే!
తల్లడిల్లెడి తల్లి కన్నుల తాపమేపగిదోర్చెనో!
తోడునడిచెడి మాయ మరపును కప్పి సామిని గాచెనో!

మనసునాడెడి మంతనాలివి – మాధవుని మధురూహలు,
మాటమూటల జాడ వెదికెడి – భావ పుంతల ఊటలు!

చేదుకో – నంద బాలా

దూరమెంతో నడిచి అలసినానని ఎంచి,
నెమ్మదించకు నంద బాలా!
ప్రతి అడగు పై అడుగు నిన్ను జేరేనంచు,
నమ్మి నడిచేనయ్య చాలా!

బొంది నందిన నాద మానంద మొందగా,
పలుకు లెన్నో మొలచు లోనా!
రూపొందినా పలుకు నీరూపు నెన్నదే,
దోసమెవరిది? నంద బాలా!

ధరణి మొలచిన నాడు నీ జాడ నెన్నేను,
ధరణి దొల్లితి నయ్య చాలా!
మన్నంటి నా మేను మరి మోయలేనంది,
మన్నించ మరుగేల? బాలా!

వెదురు నందిన గాలి వేణు గానంబారయె,
వేదమై భువి నేలు చాలా!
బొంది నందిన గాలి లోకేగి ప్రతిసారి,
వేదనేలొందించు ? బాలా!

తనువు భారంబాయె – భయమె జీవనమాయె,
బ్రతుకు దుర్లభమాయె చాలా!
చేయిచ్చి చేదుకో చెదరి పోవక ముందె,
ఊహలో నీ రూపు బాలా!

దూరమెంతో నడిచి అలసినానని ఎంచి,
నెమ్మదించకు నంద బాలా!
ప్రతి అడగు పై అడుగు నిన్ను జేరేనంచు,
నమ్మి నడిచేనయ్య చాలా!