కన్నీరు

దీపముందను ఉనికి వెలుగులే తెలుపు,
వెలుగు వెన్నెల తెలుపు రేరెజు ఉనికి,
చిలుక పలుకులు చిలుకు ఋతురజునునికి,
కనుల చిందెడి నీరు తెలుపునే ఉనికి?

గండుకోకిల పిలుపు చిగురునికి తెలుపు,
చిలుక సందడి తెలుపు ఫలరసాలునికి,
లేగ చిందులు తెలుపు గోధనపు ఉనికి,
కనుల చిందెడి నీరు తెలుపునే ఉనికి?

మురళి గానము తెలుపు గోపాలునునికి,
అందె సందడి తెలుపు గోపెమ్మ ఉనికి,
విరిమధువు రుచి తెలుపు మత్త మధుపంబు,
కనుల చిందెడి నీరు తెలుపునే ఉనికి?

పాంచజన్యపు పిలుపు రణమునికి తెలుపు,
డమరుకం బెరిగించు లయకారు నునికి,
మధుర కచ్చపి తెలుపు పద్మభవునునికి,
కనుల చిందెడి నీరు తెలుపునే ఉనికి?

వనచరంబుల చరిత ముని ఉనికి తెలుపు,
కేకి నృత్యము తెలుపు మేఘ గమనమును,
కమలాలు కనువిప్పి రవి రాక తెలుపు,
కనుల చిందెడి నీరు తెలుపునే ఉనికి?

తపసు పండిన తపసి కనులు నిండేను,
ప్రియుని గాంచిన పడతి కన్నులూరేను,
తనయు నెడబాసితే తడియౌను కనులు,
తనువు తాపమునొంద పొంగేను కనులు,
చెలిమి చింతల మునుగ కన్నులూరేను,
చేర వచ్చిన చెలిమి కనులు నింపేను,
బహు భావ పునికైన కన్నీటి చినుకు ,
తెలుపనెంచిన ఉనికి తెలుపునది ఎవరు?

శార్వరి

హరి పుత్రుని సంచారము – హరియింపదె శిశిర చింత,
మోడులు తొడిగిన చిగురుల – మొలిచెడి నూతన ఊహలు,
గడచిన గండపు గడియల – గాయంబుల గురుతు మాపి,
కమ్మని కాలపు భావము – కన్నుల నిండుగ నింపదె!

పాలాంబుధి మధియించగ – పుట్టిన ముంతెడు విసమును,
ఫాలాక్షుడు నాడు మింగి – పాలించెను హరి పలుకులు!
రుచి సాగర మధనంబున – పుట్టి వింతగు పుంతను,
తనియారగ తినిన వాడు – తరళాక్షుని తలుపడాయె!

నిలుకడ నెరుగని కాలము – కాలుని చెలిమిని పట్టుక,
పట్టిన పట్టుకు తడబడి – పలుదారుల పరుగిడినా,
అంతము నాదియుగు ఆ – నందాంగన ముద్దు పట్టి,
మన్నన మీరగ గట్టగ – విడువక పట్టిన పట్టును,
నెమ్మది నొందిన మనసున – మన్ననతో కనడాయెను!

మాయామయ జగతి దారి – మన్నన నెరుగగ నెంచదు,
మతిమాలిన ఋచులు జూపి – మోహాంబుధి మడిగించును,
మడిగిన జీవుల దొంతులు – దొరలెడి దారుల నిలబడి,
మరలెడి దారుల జాడలు – పలుమారులు ఎరిగించును!

నెమ్మది నొందిన మనమున – ఎరిగించిన ఎరుక నెరిగి,
తీరిక నెరుగని పరుగులు – తగినంతగ తరుగ జేసి,
తనువున తోడగు వానిని – తలచెడి తీరెరిగి నేడు,
శర్వుని తోడుగ శార్వరి – శాంతుల కాంతుల మసలరె!
(శర్వుడు – శివుడు ; శార్వరి – చీకటి)

పడగ నీడ

ఈ రోజు మార్చి 22వ తారీకు 2020 సం|| ఈ రోజు భారతదేశం మొత్తం సమైక్యంగా కరోనా బాధితులకు సేవలందిస్తున్న వారిని support/ encourage చెయ్యటానికి, ప్రధాని పిలుపు మేరకు సాయంత్రం 5 గం. కు గంటలు మోగించడం, చప్పట్లు కొట్టడం ద్వారా తెలియ జేశారు. ఈ సమైక్యతకు కారణం ‘ప్రాణ భయం’. ఇదే రోజు ఇజ్రైలు విడుదల చేసిన ప్రకటనలో, ఈ కరోనా ముప్పు కేవలం వయసు పైబడిన వారికే అనీ, మిగిలిన వారికి ప్రాణభయంలేదని చెప్పింది. అంతే కాకుండా , ఈ వైరస్ ప్రతివారికీ సోకి తీరుతుందనీ, ఐతే మూడునుంచి నాలుగు నెలలలో అందరికీ ఈ వైరస్ కి ఇమ్యూనిటీ వచ్చేస్తుందనీ ప్రకటించింది.  ప్రకృతి తన పద్ధతిలో సవరణలు చేసుకుంటుంది అనికూడా ఆ ప్రకటనలో వెల్లడించారు. అది చూసి….

వేయి పడగల నీడ పవళించు వాడొకడు,
వేయి నాగుల నగలు ధరియించు వాడొకడు,
కటిన మి్ణాగులే సూత్రమగు వాడొకడు,
తానె నాగుగ నిలచి ఏలువాడొకడు!

నాగ పడగల పైన నర్తించు వాడొకడు,
నాగభూషణు డగుచు మోదించు నొకడు,
ఫణి వైరి యురముపై ఊరేగు వాడొకడు,
ఫణినె తనయుగ గలిగి మురియు వాడొకడు!

నాగులెరుగని వారు నాకాన లేరాయె,
నాగ సేవలు లేక లోకాలె లేవాయె,
నానాడు లోకాల మేలుకోరెడి నాగు,
నరుని మేలెంచునను ఎరుకె కరువాయె!

పెన్నాగు పడిగలే పదిలంబనెంచుచూ,
నిలవ నెంచిన పుడమి పుట్టినామయ్యా!
బుసల చిందిన చినుకు చిచ్చనెంచేము ,
బుడత జీవుల మమ్ము మన్నించు మయ్యా!

జోల పాట*

లోకాల లాలననేలు వాడిట జోల లూగెను చూడరె,
రేపల్లె భామల భాగ్యమే – ఆ నంద డోలల నూపగా!
రేపల్లె భామల భాగ్యమే – ఆనంద డోలల నూగగా!

ఏ నగవు నందిన నాకములు – నవ శోభలన శోభించెనో,
ఏ నగవు గని ఆ సిరుల రాణీ – తా దాసి యై తన నూచెనో,
ఆ నగవు ఏలెడి మోవి నేడిట చిన్ని నగవుల నేర్చెనే,
తా గొల్లభామల మోవి నడకల మెల్లగా జత జేరెనే!
లోకాల లాలననేలు వాడిట జోల లూగెను చూడరె,
రేపల్లె భామల భాగ్యమే – ఆ నంద డోలల నూపగా!
రేపల్లె భామల భాగ్యమే – ఆనంద డోలల నూగగా!

సుర గంగ పుట్టిన పుణ్యపాదము – సురలు కొలిచెడి పాదము,
సనకాది మునిగణ మానసంబులు ఎంచి కొలిచెడి పాదము,
సురవైరి నొల్లక లోకములు తా ఎంచి కొలిచిన పాదము,
ఆ పాదములు నే డాడి అలసెను – గొల్ల వీధుల ధూళిలో..
లోకాల లాలననేలు వాడిట జోల లూగెను చూడరె,
రేపల్లె భామల భాగ్యమే – ఆ నంద డోలల నూపగా!
రేపల్లె భామల భాగ్యమే – ఆనంద డోలల నూగగా!

ఈ జోల పాటను నా సొంత ట్యూన్ లో

https://www.youtube.com/watch?v=hi0FXF545gc 

లో విన వచ్చు

 

 

మనసు గతి

పాలసంద్రపు అలల పొంగుల – పురుడు పోసుకు నింగి కెగసిన,
రోహిణీ పతి లేత నవ్వులు – జలక మాడిన గంగ చినుకులు,
చింది తడిసెడి హరుని ఫాలము – వెన్నెలలు కురిపించదే!
విన్నపంబులు వినగ వేడిన – పంచ బాణుని మధుర గీతిని,
మన్ననెంచక మంట గలిపెడి – చూపులే కురిపించునే!

చింకి పాతలు చిగురుటాకులు – చేర్చి పేర్చిన మెత్త పరుపులు,
ఆదరము నానందమొందుచు – అందజేసెడి చిన్ని కుడుపులు,
ఉనికిగా ఈ జగతికురికిన – మనసు పదిలము చేయదే!
ఉగ్గు కుడిపిన కటిక రుచులను – ఊరడించని ఉడుకు చేతలు,
పొదిగి పరువపు పరుగులో – పలు ఛాయలై మది నిండులే !

మయుని మించిన వింత పోకడ – పొదిగి పెంచిన వింత లోకము,
మాయధారిది నిలకడెరుగదు – మనగ నెంచును మాయలో,
మనుగడెరుగక నలుగు మనసుల – వేదనను మడియించదే !
తగులు బంధము తెగెడి తీరులు – తొల్లి తెలియని మనసులు,
చెల్లిపోయెడి చెలిమి చింతన – చితికి కుములుట పాడియే!

వయను పెరిగిన మనసు విరుగదు – మంద భాగ్యము మనసుదే,
మాటిమాటికి నాటితలపులు తరచి – ఎంచుట మనదే!
ముందు దారుల మధుర ఊహలు – మసక మనసుకు తోచవే!
ముందు వెనుకలు లేని లోకము – వేడుకొందుట మానదే!
మది చితికి చివుకుట మానదే! గతి మాలి కుములుట మానదే!

బొంది బంధము

బొందినంటినవాడు తరలిపోయేరోజు,
తరలుతావుల జాడ తెలుపలేడు,
తనువుతోడగువారు తరలగాతరిలేక,
మన్ననెంచక దాని మంటగలుపు!
మాయలోకపు తీరు ఎంచ తీరికలేక,
మరల మాయనజేరి మరులమునుగు!

బొందితోజతజేరి బంధాలు పదివేలు
తొలగునాడవియన్ని తీరిపోవు,
తోడునడువని యట్టి బంధ మోహములన్ని,
తగిన తావులు గనక తరలి పోవు!
మాయమోసపు మదిర మత్తు మరగిన జగతి,
మరల మరలా మునిగి మనగ నెంచు!

కొరగాని ఈ కట్టె కాటివరకే గాని,
కోసరి కొంచెంబైన తోడురాదు,
కట్టె కాలకముందె కదలిపోయే జగతి,
కనుల గట్టగ నేల కలువరింత?
కానివారలు కారు కాల నియమంబిదే,
తెలసి తెరపిన తరలు తరుణమందు!

చిరు కెరటం

చిలిపి చిందుల చిన్ని అలలివి – చింత చెందకు చెలియరో,
చినుకు చినుకును చేరదీసెడి – కడలి కావలి యుండులే!
ఒరవడొందిన చిన్ని చినుకులు – ఓరిమొందగ నెంచవే,
పంతమాడెడి పరుగుతో పలు వింత రూపుల నొందులే!
రివ్వునెగెరెడి చిన్ని చినుకులు చేరవే ఏ నింగినీ,
తిరిగి చేరును అలుపు తీరగ – కడలి ఒడిలో నేరుగా!
చిలిపి చిందుల చిన్ని అలలివి – చింత చెందకు చెలియరో!

కడలి గుండెల లోతులో ఏ కదలికందిన చిందులో,
ఉరికి ఉప్పెన పోటుగా ఈ తీరమందున చేరెనో,
ఊరడించెడి ఒడిని విడెడి తీరు తెలియని చిందులే,
చిన్నబోయిన నాడు నయమున చేరు సాగరు సందిట!
చిలిపి చిందుల చిన్ని అలలివి – చింత చెందకు చెలియరో!

కాలుడందిన కదన లయలకు జోడు జేరిన చిందులు,
మేటి మువ్వల రవళులై లయ నాడు లాస్యము నెంచవే,
నీది నాదని భేదమెరుగని భువనైక మోహను కేళిలో,
లాలి జోలల ఊగనొల్లని చిలిపి చిందుల నెంచవే!
చిలిపి చిందుల చిన్ని అలలివి – చింత చెందకు చెలియరో!
చినుకు చినుకును చేరదీసెడి – కడలి కావలి యుండులే!

ఎవ్వడనేను ?

ఏ రూపుల ఛాయ నేను? ఏ ధ్వనులకు ప్రతిని నేను?
ఎన్నగ నేనను వాడను ఎవ్వడనే నెక్కడివాడను?
తెరపెరుగక మరపెరుగక మరిమరి తాపమునెంచక,
మరల మరల తిరిగి తిరిగి నేనిట కేగుట ఎందుకు?

ఏ లోకపు ప్రతిగ జగతి నిండారగ నెలవొందెను?
ఏ ఆనలు నెలవొందగ ముచ్చటగొని మాయమరెను?
ఏ సందడి సంతరించి సుందర నందనమమరెను?
ఏ మోహపు మడుల మునిగి నేనిట ఎందులకేగితి?

సన్ననైన సువాసనలు- బహు కమ్మని ఫలరాసులు!
రంగరించి పలు రంగులు రచియించిన పలు సంధ్యలు!
రుచికందని రుచులు కుడుప వలలుని వంటల సందడి!
వారాంగన వంటి జగతి మోహపు ముంపుల ముంచెను!

ఏగిన కారణమేమో మరుగాయెను మరుల మునిగి!
తనువొక్కటి తలపొక్కటి ఒకటికి ఒకటై కూడుచు,
ఎడతెరుపెరుగని దొంతుల పుంతలుగా పెరిగిపెరిగి,
వెనుకటి జాడల గురుతులు గురుతొందగ భారమాయె!
మున్నెందరొ తరచి తరచి మరులను వీడగ గనిరట,
మందాకిని వంటి మదిన మునకలు వేయగ గనిరట,
మునుకలలో మైమరపును మరచెడి తీరును గనిరట,
మన్నన నెంచరె వారలు మది చింతలు దీరా!

ఉదయించెద నే

ఏ రూపంబుల బింబము లోకంబై కనుల గట్టు?
ఏ నాదంబుల ధ్వనులవి వేదంబై చెవుల గట్టు?
ఏ ఊపిరి జొరబడి ఈ లోకంబున శ్వాస బుట్టు?
ఏరీ నా కెరిగించెడి వారిట ఎవరో?

ఏ కమ్మని ఊహలకిది ఊపిరులూదిన లోకము?
ఏ కన్నులు నిదురించగ కన్నుల గట్టెడి లోకము?
ఏ గానంబుల గమనము గుసగుసలాడెటి లోకము?
ఏరీ నా కెరిగించెడి వారిట ఎవరో?

ఏ ఆటల అలసి సొలసి మునిగి మైకపు పొరలివి?
ఏ నందన వనమునుండి జారిన సన్నని విరులివి?
ఏ భావము రూపమంది నిండుగ నడచిన నెలవిది?
ఏరీ నా కెరిగించెడి వారిట ఎవరో?

ఎన్నడు కరుగును ఈ కల – ఎన్నడు నే నెరుక గొందు?
ఎవ్వరు నను లాలించగ – మేలని నను మేలుకొల్పు?
ఏసవ్వడి సారంబులు సంసారపు సడుల మాపు?
ఏరీ నా కెరిగించెడి వారిట ఎవరో?

ఏమరపెరుగని వాడట లోకాలకు నాయకుడట,
ఏబదులెరుగని పలుకున బదులైతా పలికేనట,
ఏలీలల జోలలలో ఏమరుపొందెనొ ఏమో,
ఎరిగించరె ఎవరైనా నా ఎరుకను ఎరిగింపగ!

అన్నుల మిన్నగు ఆమని అందగ నే నుదయించగ!

మన్నించి దరిజేర

మాటిమాటికి నిన్ను మన్నించి దరిజేర – పల్లెవొల్లదు గొల్లబాలా!
గోధూళివేళందు యమున తీరుముజేరి – వేచియుందును నందబాలా!

ఉల్లాసమున నీవు వేణువూదేవేమొ – ఉలికిపడునీ పల్లె కిృష్ణా!
ఉరుకుపరుగున జనులు నిను గాంచ వచ్చేరు – దరిజేరలేనింక కిృష్ణా!

చిందులేయుచు నీవు సందడులు జేసేవు – చింతవీడును పల్లె కిృష్ణా!
చిరునవ్వు నగుమోము గాంచ వత్తురుజనులు – దరిజేరలేనింక కిృష్ణా!

నీవు నడిచేదారి విరులన్ని మతిమాలి – విరిసి చాటును జాడ కిృష్ణా!
జాడ నెరిగిన జనులు దరిజేర తరలేరు – దరిజేరలేనింక కిృష్ణా!

వెంట లేగలు నడువ నందబాలుడవంచు – నలుగు రెరిగేరయ్య కిృష్ణా!
ఆలమందలు నిన్ను అందగా తరలేను – దరిజేరలేనింక కిృష్ణా!

పొన్న కొమ్మల జేరి ఉయ్యాల లూగుచూ – రమ్మంచు పిలువకో కిృష్ణా!
పొంచియున్నా రాధ పలుసేవలందించు – దరిజేరలేనింక కిృష్ణా!

మాయ కవ్వలివాడ మన్నించు నా మనవి – మౌనాన దరిజేరు కిృష్ణా!
పల్లెలెరుగని వింత తీరునందున నీవు – దరిజేరి ననుబ్రోవు కిృష్ణా!