వివరమెరుగని మనసు

నేను నేనే యంచు ప్రతిజీవి పలికినా,
ఎరుకగొన నొల్లనా ఎరుకేది మనసా!
ఏమరపుతో నెపుడు ఏ ఎరుక నెంచేను,
వివరమెరుగవె నీవు మనసా!
వివరింపవే నాకు మనసా!

వెలుగైన నీడైన వెంటనుండేవాని,
ఎరుకగొన నొల్లనా ఎరుకేది మనసా?
వెలుగు నీడల వెంట ఏమెరుగ తిరిగేనొ,
వివరమెరుగవె నీవు మనసా!
వివరింపవేనాకు మనసా!

వెలియైన లోనైన నిండియుండేవాని,
ఎరుకగొన నొల్లాన ఎరుకేది మనసా?
లోకాల లోతులను ఏమెరుగ వెదికేనొ,
వివరమెరుగవె నీవు మనసా!
వివరింపవేనాకు మనసా!

తలపు లన్నిటతానె తగలియుండేవాని,
ఎరుకగొన నొల్లనా ఎరుకేది మనసా?
తలపు తలుపులు మూసి తలపోయు తలపేది,
వివరమెరుగవె నీవు మనసా!
వివరింపవే నాకు మనసా!

జగమంత తానగుచు తోడుండుజతగాని,
ఎరుకగొన నొల్లనా ఎరుకేది మనసా?
తొలిగి పోయె జగతి తోడువెదికే దెవరు?
వివరమెరుగవె నీవు మనసా!
వివరింపవే నాకు మనసా!

నిదుర మబ్బులలోన తెలివైన పరమేశు,
ఎరుకగొన నొల్లనా ఎరుకేది మనసా?
నిదుర మత్తున దేలి మగత మునిగేదెవరు?
వివరమెరుగవె నీవు మనసా!
వివరింపవే నాకు మనసా!

పిలుపు పిలుపుకు తానె బదులు పలికేవాని,
ఎరుకగొన నొల్లనా ఎరుకేది మనసా?
పలుక నెరుగని జగతి బదులు వెదికేదెవరు?
వివరమెరుగవె నీవు మనసా!
వివరింపవే నాకు మనసా!

పుట్టుకెరుగని వాడు పురుడుపోసిన జగతి,
నినుజూసి నగునేమొ మనసా!
ఉనికి ఊపిరి నెరుగ ఉల్లాసపడునెవరు?
వివరమెరుగవె నీవు మనసా!
వివరింపవే నాకు మనసా!

మహనీయులెందరో పలుమారు తలపోసి,
మౌనాన మునిగిరట తెలుసా!
మునిగి మౌనములోన మతినెరిగి మురిసిరట,
మౌనమొందట నెరుగు మనసా!
వివరింపవే నాకు మనసా!

గంగ జత

విష్ణునానతి నంది ధరణికురికిన గంగ,
జడలు చుట్టున కుండ పొంగి పొరలే గంగ,
గారవంబున నడచి వసుధ తడిపే గంగ,
చిందు చినుకుల అందె లయలు పలుకంగా!

వెలిబూది పై పూత ఒడలంత మెరయా,
వెన్నెలొలికే రేడు సిగ పూవు గమరా,
వన్నెలన్నిటి రాణి తిలకించుచుండగా,
లయనంది శివపదము నర్తించు గాదా!

నందీశు నయనాల నవశోభలే మెరయ,
నారదాదుల శృతులు నాదలోలుని పొగడ,
ఇల్లాలి జతగూడి చిందులేశే రేడు,
గంగ చిందుల వెంట చిందేయుగాదా!

గంగ చినుకుల అందె జెతులెన్నొ పలుక,
దిక్కులేలేవారు జంత్రముల పలుక,
స్మృతులు పలికేరేడు పదజతులు పలుక,
పలుకదా శివపదము పలు లాస్యహేలా!

ఫణిరాజు పలుమారు పైయదన కదుల,
ఫాలమందలి శిఖలు దిశెలెల్ల వెలుగ,
సిరిమెచ్చినారేడు మురిపెమున మునుగ,
గంగ అడుగుల జంట హరుడాడు కాదా!

పొద్దుగడిచెను

పొద్దుగడిచెను  పొన్నపూవులు – వాడి వసుధను జేరేనే,

వెన్నెలాటలు మాని రయమున – పంచజేరర మాధవా!

లేగ పిలిచెను  గోవు పిలిచెను – గొల్లభామలు వెదకిరే!

నందునంగన ఆంగనంబున – నిన్నుగానక వగచెనే!

పొద్దుగడిచెను పొన్నపూవులు – వాడి వసుధను జేరెనే,

వెన్నెలాటలు మాని రయమున – పంచజేరర మాధవా!

చల్లకుండలు ౘలము జేసెను – ౘలము జేసిరి గొల్లలూ,

విరిసి కన్నుల నిన్నుగానక – చిన్నబోయెను పూబాలలూ!

పొద్దుగడిచెను పొన్నపూవులు – వాడి వసుధను జేరెనే,

వెన్నెలాటలు మాని రయమున – పంచజేరర మాధవా!

మరలి రావయ మాధవా – రేపల్లె పూజల నందగా,

నందగోకుల మందు విందుగ – వెన్న విందులు జేయగా!

పొద్దుగడిచెను పొన్నపూవులు – వాడి వసుధను జేరెనే!

వెన్నెలాటలు మాని రయమున – పంచజేరర మాధవా!

తలపు

తనువు నిచ్చిన తల్లి తరలిపోయిన రోజు,
తలచి తద్దిన మంచు విందు చేసే రోజు,
తలపోసి క్షణమైన తపియించకుందునా,
తోడు వీడని తనువు తలపింపకుండునా!

తరుణ ప్రాయపు తలపు తీపనగ లేను,
తలపోయ ఒకటైన తీరుగా లేదు,
రోజు గడచుటె మిన్న తిట్లు తినకుండా,
తల్లి వేదన తెలియ తెలివి లేదపుడు!

తనువు కారణమెరిగి మనగ వలెనంచు,
పలుమారు పరుషములు ఎంచి కుడిపేను,
నేడు నిన్నగ మారు నడిరేయినందు,
తోడు తోడని వగువ తొలగియుండేను!

పలుకు పరుషంబుగా పౌరుషంబెరిగించి,
బ్రతుకు ఒంటరి బాట బ్రతుకనంపేను,
సడిలేని సమయాన సావకాశము జేసి,
మాయ ఆటలనెరిగి మనగ తెలిపేను!

జన్మ జన్మల దారి దరిజేరమంచు,
జగదేక పాలకుని జతనెంచమంచు,
పలుమారు ఎరిగించె పసితనమునుంచే,
ఉగ్గుపాలన కలిపి వైరాగ్య అరకు!

ఎంచి ఏదారంచు ఎరిగించకున్నా,
ఎదనిండ ఊహలై ఎరిగించుచున్నా,
బ్రతుకు బంజరు సాగు కొనసాగకున్నా,
తగిలుండి ఈ తనువు కొనసాగుతున్నా!

నీవు నేర్పిన విద్య నేనెరుగకున్నా,
నీవిచ్చినీ తనువు తీరెరుగకున్నా!
తీపెరుగనీ బ్రతుకు తెరపెరుగకున్నా!
తలచి నిన్నే తల్లి నే బ్రతుకుతున్నా!

మాయ మన్నన

గురువులందరి గురువు – గోవిందుడట వాడు,
గోవులను గాచేను – తెలుసా?
గుమ్మపాలను గుడువ – గొల్లభామల ఇంట,
పిల్లివలె దూరెనట – తెలుసా?
మనసా – మాయలోకపు తీరు – తెలుసా?
మన్ననెరుగదు మాయ – తెలుసా!

లోకాల గావంగ – విసము మింగిన వాని,
గూడు కొండల కొమ్ము – తెలుసా?
కడుపు కుడిచే కుడుపు – కరువాయి ఆ రేడు,
బిచ్చమెత్తే నంట – తెలుసా?
మనసా – మాయలోకపు తీరు తెలుసా?
మన్ననెరుగదు మాయ – తెలుసా!

మాటతప్పని రేడు – దేవాధి దేవుణ్ణి,
అడవులకు అంపెనట – తెలుసా?
తపసి జన్నముగావ – మాటిచ్చి ఒక రేడు,
ఆలినమ్మేనంట – తెలుసా?
మనసా – మాయలోకపు తీరు తెలుసా?
మన్ననెరుగదు మాయ – తెలుసా!

ధరణి నడిచేవారి పుణ్యాలు తరుగంగ,
కడగండ్లు కలునట తెలుసా?
ఏపున్నెములు తరిగి- నగరినేలే రేడు,
ఆలుబిడ్డల విడిచె – తెలుసా?
మనసా – మాయలోకపు తీరు తెలుసా?
మన్ననెరుగదు మాయ – తెలుసా?

మాయనేలేవాడు – పాలసంద్రము పైన,
పవళించి ఉండునట – తెలుసా?
ఆసామి కనుగప్పి ఆటలాడేమాయ,
మడిసిపోయె దెపుడొ తెలుసా?
మనసా – మాయ మడిసేదెపుడొ తెలుసా?
మన్ననెరుగదు మాయ తెలుసా!

బదులు కోరినవారు కొండ కోనలు పట్టి,
మౌనాన మునిగిరట – తెలుసా?
వారి దారుల బట్టి – తనువు తొలగేదాక,
మూగబోవుటె మేలు -తెలుసా?
మనసా – మారుకోరుట మాను మనసా?
మన్ననెరుగదు మాయ తెలుసా!

అభయంబు ఇచ్చు చేయి

గోవుల గాచెడి చేయది – గోక్షీరము లందు చేయి,

గొల్లల తోడుగ చల్దిని – మురిపెముగా అందుచేయి,

గోపెమ్మలు చాటుజేసి – మాటుగ దాచిన వెన్నను,

గోప్యంబున వెదకి చేరి – అందుకు పంచెడి చేయది!

చాటుగ మాటుగ జేరిన – సురవైరుల మాటుజేసి,

నందాంగన కొంగుజేరి – కొసరుచు కుడిజెడి చేయది!

పిల్లన గ్రోవిని ఆడుచు – రాగంబుల రేపు చేయి,

గోవర్ధన మంది నాడు – కులమును గాచిన చేయది!

దేవేంద్రుని పురిని నిల్ప – దానవ పతి నగరి జేరి,

మూడడుగులు దానమంది – దానవు బ్రోచిన చేయది!

గజరాజంపిన కబురుకు – బిరబిర మని తరలి వచ్చి,

శోకము బాపెడి తీరుగ – శరణము నిచ్చిన చేయది!

దిక్కని నమ్మిన చెలునికి – వీడని తోడుగ నిలబడి,

హయముల చోదన జేయుచు – రక్షణ నొసగిన చేయది!

పాలాంబుది తరక వంటి – తరుణీ మణి మెచ్చినట్టి,

కోమల శోభల నెలవగు – సన్నిధి నిచ్చెడి చేయది!

సంసారపు వెతల బాపు – సుఖదాయి యైన చేయి,

మునిజన మానస వైరుల – నిర్జించెడి కరకు చయి!

కరుణన నా మేనినాని – కరగించవె అహమునెల్ల ,

తనియారగ తనువునాని – తరగించవె తాపమెల్ల,

అంబుజ నాధా అందవె – అరమర నెంచక మనవిని,

భయనాశని యైన కరము – భుజము నాన కదలిరమ్ము!

నమ్మిక

ఏనమ్మిక ప్రహ్లాదుని – ఇడుముల సుడి బాపెనో,
ఏనమ్మిక పాంచాలిని – పదుగురిలో గాచెనో,
ఏనమ్మిక దుర్వాసుని – అహమంతయు తుంచెనో,
ఆనమ్మిక నిలకడయై – నను చేరగ రాదా!

ఏనమ్మిక లలనామణి – మది భావన నందెనో,
ఏనమ్మిక గోపాలుని – శ్రీ హరిగా జేసెనో,
( శ్రీ – రుక్మిణి , హరి – హరించినవాడు)
ఏనమ్మిక పరమాత్ముని – తులసిగ తా తూచెనో,
ఆనమ్మిక నిలకడయై – నను చేరగ రాదా!

ఏనమ్మిక గజరాజుకు – మోక్షంబై పలికనో,
ఏనమ్మిక సుదామునికి – సిరి రాసుల నొసగెనో,
ఏనమ్మిక సలిలంబై – భగీరధుని బ్రోచెనో,
ఆ నమ్మిక నిలకడయై – నను చేరగ రాదా!

ఏనమ్మిక నందుని నందను ఉనికెన్నగ నెంచునో,
ఏనమ్మిక యదుభూషణు యదనిండుగ నింపునో,
ఏనమ్మిక గిరిధారిని ధారణలో నిలుపునో,
ఆ నమ్మిక నిలకడయై – నను చేరగ రాదా!

నమ్మితి నేనని నమ్మను – నెనరున ఎంతైనా,
నగుబాటగునేమో యని – వెరపున ఎంతైనా,
నిలుకడ నెరుగని జగతిన – నిలువగ కొంతైనా,
నమ్మిక నిలుకడ నెంచెద – మనసున సుంతైనా!

జగతిని నమ్మెడి తనువిది – నమ్ముట తానెరుగు,
జగదాధారుని నమ్మెడి తీరెరుగక మరుగు!
నమ్మిక తరుగని తొలుగకు తోడెవరిక నాకు?
తరుగని నమ్మిక నిలుపుము తడబడుటిక ఆపు!

శ్రీహరి కర స్పర్శ

అందించుము నీ స్పర్శను – ఆనందము తనువు పొంద – అంబుజ నాభా!
అలుపెరుగని నీ నామము – అలసిన తనువున నాటుము – నీరజనాభా!

ఆదరమెరుగని అవనిని – అమ్మాయని జేరి మురిసి – నమ్ముక యున్నా!
తరలుము నీ తీరముకని – తరలించును తరినిజూసి – తామస హరణా!
పెరిగెడి తనువది ఎరుగదు – తరుగును తన గడియలంచు – తమకము లోనా!
అలుపొల్లక పోరాడును – పొందగ ఈ ధరణి పొందు – ధరణీ నాధా!
అందించుము నీ స్పర్శను – ఆనందము తనువు పొంద – అంబుజ నాభా!
అలుపెరుగని నీ నామము – అలసిన తనువున నాటుము – నీరజనాభా!

కరిగెడి కల యని ఎంచక – కలవరపడి పలవరించు – పంతముమీరా!
మూసిన కన్నులు చూపుగ – మసిలెడి వాడెవ్వడన్న – యోచనెలేక!
దుడుకగు చేతల వేదన – కరిగించదె ఈ మాయను – మన్ననతోనా!
శిరమున నీ కరము నుంచి – కలవరమణచగ రాదా -కరుణాభారణా!
అందించుము నీ స్పర్శను – ఆనందము తనువు పొంద – అంబుజ నాభా!
అలుపెరుగని నీ నామము – అలసిన తనువున నాటుము – నీరగ నాభా!

తనువున బుట్టిన వారలె – తన వారని తగిలియుండు – ప్రాయము నెల్లా!
తనువే తన తోడు వీడ – ఎవ్వరు తనవారనెరుగ – తికమక పడునా?
ఒంటరితన మోపలేక – బహు రూపలము లైనవాడ – శ్రీసతి సామి!
దేహపు దాహము మాపగ – దయమీరగ నిమిరి నన్ను – చేకొన రాదా!
అందించుము నీ స్పర్శను – ఆనందము తనువు పొంద – అంబుజ నాభా!
అలుపెరుగని నీ నామము – అలసిన తనువున నాటుము – నీరజ నాభా!

జయ జయ శ్రీరామా!

జనకరాజసుత జానకి రమణా – జయ జయ శ్రీరామా!
ధరణిని గాచిన కరుణా వరణా – వారిజ వర నయనా!
దశరధ సుత మము దయనేలగరా – భవ మోహము దీరా,
దశకంఠుని దునిమాడిన దేవర – దరినను జేర్చగ రా! రామా!
జనకరాజసుత జానకి రమణా – జయ జయ శ్రీరామా!

దురిత దైత్యులను కూలగనేసిన – దశవిధ రూప ధరా,
మదిజేరిన సుర వైరుల గూల్చెడి – తీరగు రూపున రా! రామా!
జనకరాజసుత జానకి రమణా – జయ జయ శ్రీరామా!

ఏలగ రమ్మని వేడిన వారిని – మరవక బ్రోచు దొరా!
వేడగ నెరుగని వెలతిని తలుపక – బ్రోవగ బిరమున రా! రామా!
జనకరాజసుత జానకి రమణా – జయ జయ శ్రీరామా!

ఏలిక నీవని నమ్మిన వారిని – నెనరున గాచు హరా!
నమ్మిక లోపము మదినెంచక నను – గావగ బిరమున రా! రామా!
జనకరాజసుత జానకి రమణా – జయ జయ శ్రీరామా!

మోహపు మడుగుల మునిగెడివవారిని – మురిపెము నేలుదొరా!
మరువక ననీ మనమున నుంచవె- మంగళ కర చరణా!
జనకరాజసుత జానకి రమణా – జయ జయ శ్రీరామా!

వసుదేవుని తన జనకుగ నెంచిన – వాసవ నుత వరదా!
వందన మందగ వేడగ లేదని – వేరుగ నుంచక రా ! రామా!
జనకరాజసుత జానకి రమణా – జయ జయ శ్రీరామా!

సురలను గావగ మన్ధర మోసిన – జలచర రూప ధరా!
మించిన భారపు పాపము నాదని – తొలగక ఏలు దొరా!
జనకరాజసుత జానకి రమణా – జయ జయ శ్రీరామా!

గోవర్ధనగిరి గొడుగుగ నందిన – గోజన పాలక రా!
గొల్లల సాటిగ కొలువగ లేదని – కినుకను పూనక రా!
జనకరాజసుత జానకి రమణా – జయ జయ శ్రీరామా!
ధరణిని గాచిన కరుణా వరణా – వారిజ వర నయనా!

బోధ

చెదిరి పోయే కలను – చెదరనొల్లక నిలుప,
మరలి మగతన మునుగ ఎంచకే మనసా!
కల చెదురు కాలాన – వెదురు నూదేవాని,
జాడ నిండుగ నెంచు మనసా!
జాగు జేయక ఎరుగు మనసా!

తళుకు బెళుకుల రాళ్ళు – తనువు పై మెరవంగ,
మరల తమకమునొంద ఎంచకే మనసా!
తళుకు వెలిసేనాడు – తోడుండు జతగాని,
తోడు నిండుగ నెంచు మనసా!
తీరికొందుట మాను మనసా!

కలనైన నొకమారు -కమలాక్షు గన నెంచి,
పలుమారు నిదురించ నెంచకే మనసా!
నిదుర తీరెడినాడు – దరిజేర్చు నావికుని,
దరిని జేరగ నెంచు మనసా!
మందగించుట మాను మనసా!

కంటిమాటున నిలచి కలల నంపేవాని,
కనగ కన్నులు మూయ నెంచకే మనసా!
కనుమూసి జనునాడు – కావలుండే వాని,
కనుల నింపగ నెంచు మనసా!
కనులు మూయుట మాను మనసా!

లోన మసలెడివాని లోచనంబుల నింప,
లోకాల లోతులన మునుగకే మనసా!
లోనుండి నినుగాచు – లోకేశుడగువాని,
యోచనెంచగ నెంచు మనసా!
బదులు వెదకుట మాను మనసా!
భద్ర మార్గంబిదే మనసా!