తోడు లేనీ జగతి

పగలు గడిచిన వెలుగు మొలచెను,
బాల భానుని వయసు మళ్ళెను,
మరులు గొలుపిన విరులు వాడెను,
వెలసి వెలుగులు నన్ను పిలిచెను!

మరలి రమ్మని తెరవు గాదని,
తరలు కాలము దాపురించెని,
దాపునెవరో తోడ నెంచితి,
నీడ నాదది తరలి పోయెను!

తనువుతో నడిచేరు కొందరు,
తగిన తెరవును చూపగా,
తెరపు మరపుల మాయమాటున,
మాయమై ఇక రారుగా!

మనసు కొందర మరచిపోవును,
కొంత తడవది వగవగా,
కొందరేమో కరుగ కుందురు,
మనసు అచ్చరు వొందగా!

కోరి కొందర చేరదీసిత,
కొందరికి నే చేరువై,
చేరువైనా – చేర దీసిన,
చెదరి పోయిరి నీడలై!

ఒంటరిగ నే నొస్తి నంటూ,
ఎరుక దెలిపిరి ఎందరో,
ఒంటిగానే వెడల వలెనని,
తెలసి కొంటిని బ్రతుకులో!

తొల్లి తగిలితి తనువు తోడని,
తోడెరుంగని దారిలో,
మరుగు నున్నా మనసు నేనని,
నమ్మి జారితి మాయలో!

నిలుకడెరుగని గాలి తరగలు,
తుళ్ళి ఆడే జలధి చిందులు,
జంటగా ఎరిగించు నిలకడ,
ఎంచ నెంచితి కదురుగా!

తోడు లేనీ జగతి తనకో,
తోడు వెదుకక మానినా,
తోయజాక్షుని తలచు కన్నులు,
తోడు వెదుకక మానునా!

సోలిపోయే తరుణమాయెను,
సన్ననాయెను సారము,
సావధానము నొంది తొందర,
సాకరా నను శశి ధరా!

బలిచక్రవర్తి మనోగతం

తనను దానం అడుగ వచ్చిన కురచ వటువు శ్రీమహా విష్ణువని, తన గురువు అయిన శుక్రాచార్యుని వల్ల తెలుసుకున్న బలి చక్రవర్తి – తన మనసులో ……..

చాటు మాటున జేరి చల్ల ముంతలు దోచి,
పల్లె పడుచుల మురిపె మందువాడ!
మితి లేని లోకాలు లోనున్న రూపమును,
గుజ్జు రూపము చాటు జేసినావా?

చిన్ని గజ్జెలు గట్టి శిఖిపింఛమును బెట్టి,
చిన్ని శిశువని నిన్ను చేరదీసి,
మురిపాన దేలేటి నందునిల్లాలింత,
టక్కరివి నీవంచు ఎరుగ లేదు!

గోవిందుడని నిన్ను గారవించే వారు,
గోరు ముద్దలు కుడిపి మురియువారు,
మాటుగా లోనున్న మహనీయు నెరుగరే,
తడబాటుతో తొలగి ఒదిగి నిలవంగా!

సిరి మెచ్చినా చేయి మానంబు గాయకే,
చాచి ఎంగిలి నంది కుడుచు వాడా!
మోమాటమే లేక పలుమారు చాచితివి,
భక్తి బిచ్చము నంద అదుపులేక!

గంగ బుట్టిన పణ్య పదమైన పాదంబు,
నమ్మి మునివరులెల్ల కొలుచు పదము,
కామినీ పాపంబు గాచి కడిగిన పదము,
కావదే నా అహము అసురవైరా!

హరిహరాదులు పూజ లందేటి పాదంబు,
రమ రమించెడి దివ్య పుణ్య పదము,
నారదాదులు గొల్వ వేచుండు పాదంబు,
నేడు నే నర్చింతు నళిన నేత్రా!

వైరాన నిను జేరు దనుజునై బుట్టినా,
కోరిజేరితివయ్య పూజనంద!
ముల్లోకముల కోర్కె లీడెర్చు చైజాచి,
తిరుప మడిగితివయ్య తిమిరహరణ!

శ్రీలక్ష్మి చెంగావి పైట అద్దిన పదము,
నేడు నా పాలాయె నళిన నేత్రా!
కరకు కర్మలనాడు కరమనెంచగబోకు,
కోరి కొంచెంబైన కంద నీను!

మౌన భాషలనంది భాసించు దైవమా!
మదిన మర్మమునెల్ల చెల్లజేయి,
అంది నా దానంబు దానవుల దయనేలు,
దుడుకు వారమెగాని పరులు గాము!

మాయ నల్లగ మాకు సాటి మేమేయంచు,
పలు మాయ లల్లి రణ మాడువార,
మోహాన ముంచగల జాణ రూపము గట్టి,
వైనముగ వైరులను గాచువాడ!

నేటి నీ రూపంబు మాయ పొర మరచెనో!
మించి నీ దయ నన్ను ఎంచ నెంచో!
గురువులకు గురువైన నిన్ను గురువే చూపి,
గురుతు దెలిపెను నీదు ఉనికి నిపుడు!

కోరి కులమున బుట్టి కావ నెంచితి వయ్య,
తోడ బుట్టిన మమ్ము మరువ బోకు,
దుందుడుకు వారమని వైర మెంచగ తగున,
లీల లాడగ నీకు తోడు మేము!

వటువుగా నను జేరి భిక్షగోరిన వాడ,
పదము బట్టిన వాని గాచువాడ,
ఏరీతి నీ నీతి నేడు నను గావకే,
హరియించు నా యశము లోకవంద్యా!

నామము

రంగు రంగుల జగతి రంగు వెలియక మునుపె,
శ్రీరంగ నీ జాడ నెరిగించ రారా
రస హీనమై జగతి రాగమందుటె మరచె,
రస రాజమైనట్టి నామ మీరాద!
రంగు రంగుల జగతి రంగు వెలియక మునుపె…
రాస లీలల నాడు రమణీయ రూపంబు,
కనువిందుగా నేడు కనుపించరాదా!
చేరి చెలిమిని పంచ అనువైన భాగ్యంబు,
ఆనంద బాల మా కందించ రాదా!
రంగు రంగుల జగతి రంగు వెలియక మునుపె….
రమణీయ మౌ చరిత రమ్యముగ పలికేటి,
శుక మానసోల్లాస కరుణించరాదా!
రసధారలో మునిగి రమియించు భూసురుని,
మనసు పోలిక నొసగి మన్నించ రాదా!
రంగు రంగుల జగతి రంగు వెలియక మునుపె…..
ముని వరులు మోహించి మౌనమొందే రూపు,
నారదాదులు నమ్మి కీర్తించు ఆ రూపు,
కలి బాధ కడదేర్చ కరి నమ్మినా రూపు,
కాపుగా నుంటినని బదులీయ రాదా!
రంగు రంగుల జగతి రంగు వెలియక మునుపె,
శ్రీరంగ నీ జాడ నెరిగించ రారా
రస హీనమై జగతి రాగమందుటె మరచె,
రస రాజమైనట్టి నామ మీరాద!
రంగు రంగుల జగతి రంగు వెలియక మునుపె…

మిత్తి మందు

వెన్ను గాచెడివాడు వెన్నఁడు వెంటుండ,
కడలి బుట్టిన మందు కుడియ నెంచి,
చేజారినా ముంత చేవచే గొనలేక ,
కుమిలి ఖిన్నత నొంది విభుని జేరి,
మోటువారగు వారు మోమాటమేలేక,
అంది కలశము నంత వెడలిరంచు,
హరమానసోల్లాసి పదపంకజము జేరి,
వెలితెరుంగక హరిని వేడుకొనిరి!
దితి సంతు వేడుకల ఊరేగుచుండగా,
అదితి సంతరిగేరు అమరు సన్నిధికి!
దితి యైన అదితైన ముని సంతుయగు మూక,
వెన్ను గాచెడి వాని మహిమ గనరైరి!
కోరి పాదము బట్ట కాదనగ లేనట్టి,
కరుణ కాసారంబు కాంతాయె నాడు
సిరి మెచ్చు సుందరుండింతిగా నడయాడి
వైరులందర ముంచె మోహమందు!
గోవిందు రూపమే విందాయె అసురులకు,
మిత్తి మాపెడి మందు మరచి రపుడు,
వేడు వారల గాచి వేడుకొందెడి వాడు,
అమరమౌ ఆ మందు సురల కొసగె!
లీలా వినోదుండు తోడుండ వలెగాని,
వెరపు మాపగ తరమె అన్యమునకు,
అంది ఆతని తోడు సుధనొంది సురలెల్ల,
అమర వాసము నొంది అతని గొలిచె!
ఎరుగరే జనులెల్ల మితి లేని మందేదొ,
కడలి బుట్టిన ముంత లోనుంది కాదంచు,
కమలాక్షు కరమంటి పంచి ఇచ్చుట చేత,
చింత చెల్లగ జేసి చేరదీసె!

పట్టి చేయిక

పట్టి చేయిక విడువ నెన్నకు – పట్ట నా కింకెవరు రా!

పన్నగాసన పదిల పరచగ – పరుల వేడగ నెంతునా!
పట్టి చేయిక విడువ నెన్నకు – పట్ట నా కింకెవరు రా!

పెంచి మోహము ద్రుంచ తగునా – పాలసంద్రపు ఏలికా!
మరలుటెరుగని మనసు పగ్గము – పట్టి నీ దరి జేర్చుమా!
పట్టి చేయిక విడువ కెన్నడు – పట్ట నా కింకెవరురా!

తరుగు ఆయువు పెరుగు వయసని ఎరిగి చిందులు ఎందుకో,
తరలి నీ పురి కరుగు తరుణము చేర వేడుక నెంతునో!
పట్టి చేయిక విడువ కెన్నడు – పట్ట నా కింకెవరురా!

కంటి వెలుగులు వెలసి పోయెను – వెలసె ఈ పురి వన్నెలూ,
వెన్నెలందలి చలువ నెంచెటి చేవ తనువున తరిగెరా!
పట్టి చేయిక విడువ కెన్నడు – పట్ట నా కింకెవరురా!

నాడు నీ జత వీడినానని – చిన్నబోవుట చెల్లునా,
వెడలి నీ సతి ఒడిన జేరితి- నీదు ఊహల మసలగా!
పట్టి చేయిక విడువ కెన్నడు – పట్ట నా కింకెవరురా!

ఒంటివానిగ నడచి అలసితి – తోడు నీయర నగధరా!
నగవు పంచెడి తోడువై నా జంట నుండర గిరిధరా!
పట్టి చేయిక విడువ కెన్నడు – పట్ట నా కింకెవరురా!

వనమాలీ

వనమాలీ గిరిధారి – హరి -వనమాలీ గిరిధారి,
హరియింపవె నా భవ భారము దయగని,
వనమాలీ గిరిధారి….

హాలా హలమును హరునికి పంచిన,
హరమానస సంచారీ!
వనమాలీ గిరిధారీ – హరి – వనమాలీ గిరిధారీ!

వేడుక మీరగ గొల్లల జోడుగ – గోవుల గాచిన లీలా విగ్రహ ధారీ!
వెన్నలు పంచగ ఎంచిన బాలురు – పంచిన ఆ ఫలమేమీ?
హరీ – వనమాలీ గిరిధారీ ……..

చల్లలు చిలికెడి పడుచుల మనసుల – హరియించిన ఓ గొల్లల బాలా!
పంచిరి ఏమని ఎంచితివా మది – ముంతెడు వెన్నకు అంతటి ఫలమా?
హరీ – వనమాలీ గిరిధారీ ….

విసమును చిలికిన పన్నగ రాయని – పదముద్రలతో బ్రోచిన శౌరివి!
పర కంటకమౌ పన్నగ మేమని – పొగడెనొ గాదా నీ దయ నొందగ!
హరీ – వనమాలీ గిరిధారీ!

లీలల మాలలు లాలిగ పాడెడి – నందుని కాంతకు నందను డైతివి,
గొల్లల నేలెడి పల్లెల పడుచుకు – యోగము నొసగిన యోచన ఏదో!
హరీ – వనమాలీ గిరిధారీ…

గడిచిన గాధలె గానముగా గొని – మన్నన నందిరి మునివరులంతా,
తీరుగ నీ కధ పాడగ ఎరుగను – పలికిన తీరునే మన్నింపుమురా!
హరీ – వనమాలీ గిరిధారీ…
హరియింపవె నా భవ భారము దయగొని,
వనమాలీ గిరిధారీ… హరీ – వనమాలీ గిరిధారి!

వీడని తోడు

పట్టి చేయిక విడువ నెన్నకు – పట్ట నా కింకెవరు రా!                                                              పన్నగాసన పదిల పరచగ – పరుల వేడగ నెంతునా!
పట్టి చేయిక విడువ నెన్నకు – పట్ట నా కింకెవరు రా!

పెంచి మోహము ద్రుంచ తగునా – పాలసంద్రపు ఏలికా!
మరలుటెరుగని మనసు పగ్గము – పట్టి నీ దరి జేర్చుమా!
పట్టి చేయిక విడువ కెన్నడు – పట్ట నా కింకెవరురా!

తరుగు ఆయువు పెరుగు వయసని ఎరిగి చిందులు ఎందుకో,
తరలి నీ పురి కరుగు తరుణము చేర వేడుక నెంతునో!
పట్టి చేయిక విడువ కెన్నడు – పట్ట నా కింకెవరురా!

కంటి వెలుగులు వెలసి పోయెను – వెలసె ఈ పురి వన్నెలూ,
వెన్నెలందలి చలువ నెంచటి చేవ తనువున తరిగెరా!
పట్టి చేయిక విడువ కెన్నడు – పట్ట నా కింకెవరురా!

నాడు నీ జత వీడినానని – చిన్నబోవుట చెల్లునా,
వెడలి నీ సతి ఒడిన జేరితి- నీదు ఊహల మసలగా!
పట్టి చేయిక విడువ కెన్నడు – పట్ట నా కింకెవరురా!

ఒంటివానిగ నాడచి అలసితి – తోడు వీడకు నగధరా!
నగవు పంచెడి తోడువై నా జంట నుండర గిరిధరా!
పట్టి చేయిక విడువ కెన్నడు – పట్ట నా కింకెవరురా!

భావ భావం

వస్తాయని వసంతాలు వేచిన కోయిల అలువదు,
వస్తాడని రేరాయడు వేచెడి కలువలు అలువవు,
వస్తాడని గోపాలుడు వేచెడి గోవులు అలువవు,
గొల్లల కేలో తొందర గోవిందుని దారి గాయ!

విరిబంతులు వివరించవు విరిసిన కారణమేమని,
మది పొంగెడి మధురూహల విందుల వైభవమేమని,
పొందుగ నందుని నందను నందను డాడగ రాడని
వేగిర పడి వేసారవు వేకువ జత విడనాడవు!

విచ్చిన కలువల కన్నులు వెలుగులు జల్లక మానవు,
తారా నాయకు నలజడి తలపున నిలుపక మానవు,
కోటికి మించిన కరముల తాకిడి తనువందకున్నా,
కొలువుగ కోనేట నిలచి విందులు పంచక మానవు!

వేసారవు వెలియేమని వెలితిగ నెంచవు తమగతి,
వెలసెడితనువుల రాలుచు ఎంచును రంగని పదమని,
పదిలంబగు పధమందిన పరవశ భావన నెంచుచు,
పంకజ నాభుని పంచకు పరుగున జన తరి ఇదెయని!

తాపము దీరక బెంగన తపియించెడి పవనంబులు,
తరలని గ్రీష్ష్ముని కఠినత ఓరిమి మీరగ నోపుచు,
చినుకుల చేలము గట్టెడి అంబుద సేవలు జేయగ ,
కడలిన ఆడెడి చుక్కల రెక్కల మోయుచు నాడును!

గగనపు వీధుల దేలుచు దేవేంద్రుని సేవించుచు,
ధరణీ పతి ఛాయనంది తనువుల తేజము నింపుచు,
తారామండల శోభను హారంబుగ ధరియించుచు,
తిరిగెడి మబ్బులు త్వరపడి కరివల్లభు పదమంటవు!

నందుని నందను సంగమ మందిన గొల్లల సందడి,
సంధ్యల నడుమన జతగా వెన్నాడుచు వేడుకొంద,
మానిని రాధికా వల్లభు మెల్లని అడుగులు తోడుగ,
అడుగుల నల్లగ నెంచుచు అడుగాడక వెనుకాడునా!

రతివల్లభు మద హారిని మది నెంచెడి సురవైరిని,
తలుపక తరలెడి దారులు తరుగని ఎరిగున్నా,
విధి నడిపెడి పెడదారులె నందాత్మజు శాసనమని,
ఎంచుచు నెమ్మది నొందుచు నరకాంతకు గనరే!

నరులుగ నడచెడి గోపకు లందని తీరుల గైకొని,
నగవుల నగముల నందుచు నడయాడెడి వనివాసులు,
మదినెంచెడి మధురూహను మన్నించెడి మతినొందగ,
గోపీవల్లభు సంగమ మమరంబై ధర నేలద!

అంబుజోదరునింతి

ఆనంద ముప్పొంగ ఆదరించవె నన్ను,
అంబుజోదరునింతి – అరవింద నేత్రి,
అవని గాచెడివాడు – అరమోడ్పు కన్నులతొ,
కను లీల కనగలుగు భాగ్యంబు నీవే!

సురలు వైరుల గూడి వైరంబు దెగనరికి,
అలుపు సొలుపూలేక తగిలుండి తెగ చిలికి,
వెన్నుగాచెడి వాని మించినా సుధ నొంద,
మోహపడు మూకలను మోదాన గనునేమొ!
ఆనందముప్పొంగ అవని గాచెడివాడు,
కను లీల కనగలుగు భాగ్యంబు నీవే!

ఇది నీది ఇది నాదు అని యంచు వేగపడి,
ఎంచి పంచెడి పనిని పొంచి చూచెడివాడు,
పంతాన పొందినా ఫలరాసి ఒకటైన ,
వెంట నడువక నిలువ -వగవగా గనునేమొ!
ఆనందముప్పొంగ అవని గాచెడివాడు,
కను లీల కనగలుగు భాగ్యంబు నీవే!

వెదురు కొమ్మన జేరి వేణుగానంబాయె,
బొంది ఉరమున జేరి ఊపిరాయె,
జీవమొందెడి జీవి జీవంబు నేనంచు,
విర్రవీగెడి వెర్రి వైనంబు గనునోమె!
ఆనందముప్పొంగ అవని గాచెడివాడు,
కను లీల కనగలుగు భాగ్యంబు నీవే!

తరలు కాలము వెంట పెరిగి తరిగె మేను,
మేరువంతటి ఘనత తనకు కుడిపేనంచు,
తెనెవ్వరో తానె ఎరుగనీ పురవాసి,
పడెడి పాటులనెల్ల పలుమారు గనునేమొ!
ఆనందముప్పొంగ అవని గాచెడివాడు,
కను లీల కనగలుగు భాగ్యంబు నీవే!

పాప పున్నెపు పుంత పండి తానాయెనని,
పొరుగు లెరుగని సొమ్ము తనసొంతమాయెనని,
ఓరిగించినా సామి వంతు తానొసగునని,
దానమిచ్చెడి వాని దయనెంచి గనునేమొ!
ఆనందముప్పొంగ అవని గాచెడివాడు,
కను లీల కనగలుగు భావ్యంబు నీవే!

ధరణీశు నిల్లాల దయనేల రావమ్మ,
దుడుకు భావన తుడిచి దయనీయ రావమ్మ,
దుందుడుకు సంతుయని దండనే తగునంచు,
తలచు నాధుని తలపు తొలగించ తెలుపమ్మ!
ఆనంద ముప్పొంగ ఆదరించవె నన్ను,
అంబుజోదరునింతి – అరవింద నేత్రి!

హర హర

వస్తాడిక వనరాజని వనివేచిన వేళలోన,
గిరికన్నియ కంటి వెలుగు అరుదెంచెను ఎందుకో!
కరుణన వని కనగలడా రతి వల్లభ హారీ,
కారణ కామ్యపు రూపుడు కామాంతక శూలి!

జగముల నేలెడి వాడని పొగడగ పనిలేదు,
జాగేలిక దయగనుమని వేడగ వినబోడు,
జంగమ దేవర వినుమని విన్నపమిడినంతే,
జంభారికి తగు వసతులు ఇంపుగ నందించు!

మిన్నగువానికి పట్టము ముదమున గట్టంగా,
తీరగు పోరును తనయుల తలపడుమని దెలుప,
దిక్కని వేడిన బుడుతకు వేదము నెరిగించి,
మెప్పించిన మహనీయుని మహిమేమని యందు!

అన్నుల మిన్నగు సుందరి ఏలగ రమ్మనగా,
ఎరుకల వేషముగట్టుక హేయపు గతి మెదలా,
మోహపు మునుకల మనిగెడి ముదితకు తా నొగ్గి,
దేహపు భాగము నిచ్చిన దేవుని ఏమని అందు!

కమ్మని పాలను  చిలుకగ చిమ్మిన విషమును మింగగ,
దితి దనుజుల వైరులెల్ల వెరపున వేడగ బోగా,
వెలియగు విసమును పండుగ వైనంబున చేతబట్టి,
గళమందున నిలిపినట్టి – నిటలాక్షుని ఏమందు!

చెదిరిన రోహిణి విభునకు వేడుకయౌ పదవినిచ్చి,
గంగను జుట్టిన కొప్పున ఇంపుగ నుంచిన వానిని,
గగనాంతర పురమునుండి ధరణికి దూకిన గంగకు,
తలపట్టిన తామసహరు – తమకము నేమందు!

నాటికి నేటికి మేటిగ మోదము నొసగెడివానిని,
ఏటికి ఇట కేగితివని ఏమని నే నందు!
నందుని నందను నందను నగుబాటును గావుమంచు
వేడెడి వనముల వేదన – వెలి యెంచగ తగునా!

వేడెదనా మదహారిని – వేడెదనా రిపు వైరిని,
వేడెదనా ఖలుమర్దను – వేడెదనా ఫణిభూషణు,
వేడెదనా శశి మౌళిని – వేడెదనా ఫాలాక్షుని,
వెన్నెల నాడెడి రాయని జంటగ నిట నేల!