ఒక పరి జూడుమా

నవమోహనా – జూడుమా- ఒకపరి – నవమోహనా జూడుమా,
సిరి పంతాన నిను పొంది – మము మాటు జేసేను,
నవమోహనా జూడుమా – ఒకపరి – నవమోహనా జూడుమా!

గొల్లపల్లెల జేరి గోపాలు జతజేరి,
లేగదూడల సాటి ఆటలాడెడి నిన్ను,
గోవిందుడా యంచు గారవించెడి తరిన,
మురళి చేతిన బెట్టి ‘రాధ’గా మురిపించె…..
నవమోహనా జూడుమా – ఒకపరి – నవమోహనా జూడుమా!

కైక కోరిక మీర వనవాసియగు నిన్ను,
జంట వీడననంచు వెంట నడచిన ‘సీత’,
యెడబాసినా నీదు ఎదనిండ నిలచుండ,
యేది దారయమాకు దరిజేరగా నిన్ను!
నవమోహనా జూడుమా- ఒకపరి – నవమోహనా జూడుమా!

దితి సంతు దునుమాడ – దివిని వీడిన నిన్ను,
వనజాతులై మేము వేడుకొందుదమంటె,చ ఛ
మించు తాపముమాప తరమౌనె మాతరికి..
తరలి జేరెను నిన్ను తరళాక్షి యగు ఇంతి..
నవమోహనా జూడుమా – ఒకపరి – నవమోహనా జూడుమా..

ఒక పరి

నవమోహనా జూడుమా – సిరి పంతాన నినుపొంది మము మాటుజేసెను,
నవమోహనా జూడుమా…. ఒక పరి .. నవమోహనా జూడుమా..

క్షీరసాగరు పట్టి – పట్టి విడువని చేయి,
పట్టి వెన్నల దోచి – పట్టుబడి దొంగంచు ,
పట్టి పంతము మీర – పలుమారు దండింప,
పట్టి కొంగున జేరి – గారవించే వాడ!
నవమోహనా జూడుమా…. ఒక పరి .. నవమోహనా జూడుమా..
వసుధ వేడగ వచ్చి – వసుమతినె మరచేవొ,
జలజాక్షి జతలోనె జగమెల్ల జూసేవొ,
జామురాతిరి దాటె జాడైన గనరాదుర,
రాధామనోధార – ధరనేల దిగిరారా!
నవమోహనా జూడుమా…. ఒక పరి .. నవమోహనా జూడుమా..

గొల్లపల్లెలు నిన్ను గోవిందుడని గొలువ,
విందులందుచు మమ్ము మరచియున్నావో,
పల్లెవాసులమయ్య రేపగలు తలచేము,
మనసార నినుజేర పురసీమ విడలేము …
నవమోహనా జూడుమా…. ఒక పరి .. నవమోహనా జూడుమా..

అలమేలు గొలుపంగ ఆలించు మామొరలు
ఆలించి లాలించి పాలింపగా నీవె,
పులకింప మామేను పలికించు నీమురళి
మురవైరి ముదమార మదినేల రావేల
నవమోహనా జూడుమా…. ఒక పరి .. నవమోహనా జూడుమా..
నవమోహనా జూడుమా – సిరి పంతాన నినుపొంది మము మాటుజేసెను,
నవమోహనా జూడుమా…. ఒక పరి .. నవమోహనా జూడుమా..

వెదురు – మురళి

వెదురునై నే మొలచినా – ఆ భాగ్యమందగ సాధ్యమా?
గొల్లబాలుని – సాధుసంగుని – మోవి ఊపిరి నందగా!
వెదురునై నే మొలచినా- భాగ్యమందగ సాధ్యమా?

వేలు వేలుగ ధరణి మొలచిన – వెదురు పొద యద గుబులులో,
గోపబాలుని గురుతు కదలిక – మరుగు నేరుగని సడులలో,
వెలతెరుంగని నిండు భావము – పుడము దారుల పంచగా,
నాడు మాధవుడంది ఊదిన కొమ్మ  భాగ్యము కలుగునా!
వెదురునై నే మొలచినా – ఆ భాగ్యమందగ సాధ్యమా!

పొన్నకొమ్మల కుదురులో కొమ్మ రాధిక తోడులో,
తారలమరిన రేయిలో – ఆ నిండు వెన్నెల వెలుగులో,
ఆదమరచిన పల్లెగొల్లల మరపు మాపెడి పాటలో,
ఊపిరందిన వెదురు కొమ్మల భాగ్యమందగ గలుగున?
వెదురునై నే మొలచినా – ఆ భాగ్యమందగ సాధ్యమా!

సావకాశము సన్నగిల్లిన పల్లె పడుచుల కనులలో,
పొంగు ఊహల కధల సందడి నెమ్మదించెడి రీతిలో,
వీనులందున జేరు సవ్వడి అంకురించెడి మురళిగా ,
గొల్లబాలుని మోవినందెడి భాగ్యమందగ గలుగునా?
వెదురునై నే మొలచినా – ఆ భాగ్యమందగ సాధ్యమా!

చల్లకవ్వపు జతగ ఆడెడి కంకణంబుల లయలలో,
లేగ జేరగ మురియు గోవుల కంఠ హారము సడిలలో,
కరిగి రేయిక కలుగు వెలుగని తెప్పరిల్లెడి అలలలో,
ఊపిరూదెడి మధుర మురళగు భాగ్యమందగ గలుగునా?
వెదురునై నే మొలచినా! ఆ భాగ్యమందగ సాధ్యమా !

వెల్లువై రేపల్లె మంచిన మధుర భావపు మరులలో,
తెల్లబోయి మింటివాసుల కంటి వెలుగుల జాడలో,
చల్లముంతల నదుపు జేసెడి గొల్లభామల ఉలుకులో,
ఉనికిగా ఉల్లాసమొందెడి భాగ్యమందగ గులుగునా?
వెదురునై నే మొలచినా! ఆ భాగ్యమందగ సాధ్యమా!
గొల్లబాలుని – సాధుసంగుని – మోవి ఊపిరి నందగా!
వెదురునై నే మొలచినా………………

.

భ్రమ

కంటి నేనను కొంటినే ,
ఆ కలువ కన్నుల బాలునీ,
కంటి మాటున మాటువేసెడి,
మదన మోహను నునికినీ!
ఒరుగు వెన్నెల నీడలో,
తొంగిజూసెడి వెలుగులో,
కదిలి మెదిలెడి జాడలో,
ఆ నంద బాలుని గంటి ,
నేనను కొంటినే!
వెదురు కొమ్మల గుబురులో,
కుదురు నెరుగని కొమ్మలో,
కదలు రెమ్మల కులుకులో,
గొల్లబాలుని పాట పోలిక,
కంటి నేనను కొంటినే!

పరిమళించెడి పొన్నపూవుల,
సందడెంచెని నడకలో,
రాధికాసతి నంటి నడచెడి,
గడుసు గొల్లని మందగమనము
కంటినే నను కొంటినే!

నీలి మేఘపు అంచుపై
అలరారు చంద్రిక చలువలో,
నల్ల వాడగు గొల్ల బాలుని,
హాస రేఖల చిగులు మెరపును
కంటినే నను కొంటినే!

గోధూళి సోకిన తులసిలో,
తిరుగాడు తెమ్మెర గుబులులో
సిరులు కురిసెడి తల్లి మెచ్చిన
విభుని గంధపు గంధ వీచిక,
కంటి నే ననుకొంటినే!

లేగలందిన పొదుగులో
పొంగారు కమ్మని రుచులలో,
లీలగా గోవిందు డందిన,
రుచుల రూపము ,
కంటినే ననుకొంటినే!

కంటి నేనను కొంటినే ,
ఆ కలువ కన్నుల బాలునీ,
కంటి మాటున మాటువేసెడి,
మదన మోహను నునికినీ!

నావారు

ఎవరయ్య నావారు? ఏటికీ బంధాలు?
ఎరుగవే ఏ తీరు – దరిజేరు దాకా!
దారి నెరుగని జనులు – దరిజేర్చు మనువారు,
దొరలి పొరలిన దారి మనుప మరచేరు!

తనువు నిచ్చిన వారు తమ వంతు నడిగేరు,
తరలించు దాక తమ తోడు గోరేరు,
తనువు చీల్చుక నాడు ధరణి కురికిన వారు,
తనువేటికిస్తివని తీరుగడిగేరు!
ఎవరయ్య నావారు? ఏటికీ బంధాలు?
ఎరుగవే ఏ తీరు – దరిజేరు దాకా!

వివరమెరుగనినాడు వివరించి ఎరిగింప
విలువేది నీకంచు వెలితి జేసేరు!
విందుగా అందింప వివరమెరుగని నేను,
ముందు నడచెడివారి నీడనయ్యేను!
ఎవరయ్యనావారు? ఏటికీ బంధాలు?
ఎరుగవే ఏ తీరు – దరిజేరు దాకా!

వల్లమాలిన మనసు వశమాయె మోహపడి,
వలువ గట్టని మేను మొలచునాడు,
వల్లకాటికి దారి ఎరిగించు తరిజూచి,
వసతి నొందగ వగచు వెఱ్ఱి మనసు!
ఎవరయ్యనావారు? ఏటికీ బంధాలు?
ఎరుగవే ఏ తీరు – దరిజేరు దాకా!

కూరిమొందెడి కూడు కుడుపి నడిపేమంచు,
కోరి పిలిచిన వారు కరిగిపోయె,
కుడువ కూరిమిలేక కోరి చేరినవారు,
కసరి కూరిమినొంద తరలిపోయె!
ఎవరయ్యానావారు ? ఏటికీ బంధాలు?
ఎరుగవే ఏ తీరు – దరిజేరు దాకా!

తరలించి తొలగుండ తగుతీరె యగునీకు,
తరలు తొందరనొందు తప్పునాది,
తారకంబగు త్రోవ నడిపించి మరలించు,
తనువు తొలగెడినాడు తోడు నిలచి!
ఎవరయ్యనావారు? ఏటికీ బంధాలు?
ఎరుగవే ఏ తీరు – దరిజేరు దాకా!
దారి నెరుగని జనులు – దరిజేర్చు మనువారు,
దొరలి పొరలిన దారి మనుప మరచేరు!

ఎవరయ్యనావారు? ఏటికీ బంధాలు?
ఎరుగవే ఏ తీరు – దరిజేరు దాకా!

జత

వాసవనుత వసుమతి నిను పలుమారులు పలవరించ,

వసతిగ సేవల నందక  పంతములాడెడి వాడవు!

నాడెన్నడొ ఒలికించిన సోముని సోదరి నగవుకు,

మైకము నొందిన కన్నులు తెరువగ నొల్లని వాడవు!

తేటగు తీయని పలుకులు ఒలుకునొ ఏమోనంచు,

మువ్వల మురళికి మోవిని బాడుగ కొసగిన వాడవు!

పదసేవకు తావొసగిన తీరుగ బ్రోవగ వలెనని

పదిలంబుగ పద్మాక్షికి పాదము లొసగిన వాడవు!

కరములు సోకిన కర్మలు కడతేర్చగ వలెనంచు,

మోపగు గద పదిలంబున కరమున కలిగిన వాడవు!

చతురానను డందముగా చేతులు నాలుగు నొసగిన,

శంఖము,చక్రము తోడుగ కమలము గద కలవాడవు!

వీనుల వేదన జేరిన త్వరపడి వెడలగ వలెనని,

వేదపు నాదపు ఘోషకు వీనుల నమ్మిన వాడవు!

సొంపగు పరిమళ పంక్తులు ఇంపారగ అందబోక,

రాధాసతి గంధంబున ఊపిరి నూదెడి వాడవు!

దాపుల జేరిన  వారల బాధలు మాపగవలెనని,

పరివారపు పంక్తులతో అనుదిన మమరెడివాడవు!

కలిబాధల కడతేరని కాముని గంటివనందురె,

కానగ లేవా మా దశ – కరుణామయ వరుణా!

నందుని నందన తగునా తరుగని దారుల నడుపగ,

రాధామాధవ రాదా ఇంచుక వేదన తీరగ,

మించిన మోహము దీరగ పలు దారల మసలు వాడ,

రాదా మా దారివెంట పదముల జతగా!

 

జాడ

కలువ కన్నులవాడు – కటిన వేణువు వాడు,
కవ్వించి కవ్వించి – కన్ను మరుగాయే!
కనిన వారెవరైన – కరుణించ రాదా!
కొంతైన ఆ జాడ నెరిగించ రాదా!

నీలి మేఘపు మేని ఛాయ గలిగిన వాడు,
నెమలి పింఛము సిగన అమరున్నవాడు,
అల్లనల్లన కదులు కచము కలిగిన వాడు,
కనినంత మోహపడు ఉనికి కలిగిన వాడు!
కనిన వారెవరైన కరుణించ రాదా!
కొంతైన ఆ జాడ నెరిగించ రాదా!

పసిడి చేలము గట్టి పాల కడువల గొట్టి,
పలుమారు పొరుగిళ్ళ పారాడు వాడు,
పలుమారు పిలిచినా మారుపలుకని వాడు,
పిలవకే ఉలుకుగా మదిన జేరెడివాడు!
కనిన వారెవరైన కరుణించ రాదా!
కొంతైన ఆ జాడ నెరిగించ రాదా!

కామ జనకుడు వాడు – కామించ తగువాడు,
కమలాక్షి కనులందు కొలువుండు వాడు,
కాలగమనపు గతుల గతిని ఏలెడివాడు,
కాలుడెరుగని కాల రూపమగు వాడు!
కనిన వారెవరైన కరుణించ రాదా!
కొంతైన ఆ జాడ నెరిగించ రాదా!

అందె సవ్వడి లేక అడుగు లేసెడి వాడు,
అందాల వదనంబు ఆరబోసెడివాడు,
అమరేంద్ర వందనము అందబోనని జెప్పి,
గొల్లరూపమునంది మోదించు వాడు !
కనిన వారెవరైన కరుణించ రాదా!
కొంతైన ఆ జాడ నెరిగించ రాదా!
కరిరాజు మొరనెంచి కరిగి కదలిన వాడు,
కడతేర్చి కరిరాజు హరుని గాచినవాడు,
కలడందురన్నింట కనగలుగు కనులున్న,
కంటి చుపగువాని గంటిరే యెబరైన?
కనిన వారెవరైన కరుణించ రాదా
కొంతైన ఆ జాడ నెరిగించ రాదా!
జీవజాలముకెల్ల జీవంబు యగువాడు,
జడుల జాడను నిలుపు జడుడువాడు,
జీవనాడులు కృంగ చేరెనే జరనేడు,
కనుమరుంగగు నట్లు కంటి వెలుగు!
కనిన వారెవరైన కరుణించ రాదా
కొంతైన ఆ జాడ నెరిగించ రాదా!

భాగ్యము

కలుగు భాగ్యము నీది – కలిగించుమది మాకు,
కరుణా కటాక్షి – ఓ కమలాక్షు నింతీ!
కామజనకుని మదిన కదలు భాగ్యము నీవె,
కలుగ నీ సంగంబు – సకలంబు మరచీ!

తరుగు కాలమువెంట – తగని పరుగుల తోన,
తరియింతుమని ఎంచి – తరలేటి మేము,
తామసోల్లాస హరు – తలుప నెంచే తీరు,
తెరవు తెలుపవె మాకు – తోడు నిలచీ!

హరుని రాణివి నీవు – హరియించు తాపముల,
హరిమోహమందించి మనుపు మమ్ము!
హుంకరించెడి మాయ యూధంబు హరియించి,
హరిసేవ నెరిగించి పాలింపు మమ్ము!

మకరి క్రీడ

కండలూడేటట్లు మొసలి కొరుకుచు నుండ,
కావరమ్మని పిలిచె కరిరాజరాజు!
కొలువు జేసిన వారు – కోరి కొలిచెడి వారు,
కొలను అంచుల జేరి జూచుచుండ!

కొరతాయె కన్నీరు – తరిగె తనువున బలము,
తలుప తామస హరుని – తోచదే ఏదారి,
తారకంబగు దారి దరిజేర వలె గాని,
వలచి తా వరియింప తరమౌనె కరికీ!

మరుగెరుగనారాజు మదిజేరి మన్నింప,
మాటేల కావగా కదలిరమ్మని పిలిచె,
మదిలోని చిరుకాంతి కొలనంత నిండగా,
బడలి తొలగెను మొసలి కరిని వీడి!

కమలాక్షుడా ఎపుడు కాంతువో ఇక నన్ను,
కరుణ కాసారంపు కమల వాసా!
కరివంటి నా అహము కోరదే ఏ తెరపి,
మకరి క్రీడను మాపి మనుపు మయ్య!

గంగ

  పరమేశు శిరమంది వసుధ పాపము దీర్ప,
వాసుదేవుని పదము వీడి జనినీరోజు,
వందనంబిదే అందుకో గంగమ్మ,
వదల కుందుము నీదు పణ్య పదము!
అష్టవసువుల శాప మాదరంబున బాప,
అవని నడచిన దివ్య దేవతవు నీవు,
ధరణి నడచెడివారి పాపభారము దీర్ప,
పలు ధారలై పుడమి ప్రవహించు నీవు!
వందనంబిదే అందుకో గంగమ్మ,
వదల కుందుము నీదు పుణ్యపదము!
అదితి సంతును సాక ఆదరంబున నీవు, (అదితి – భూమి)
జీవధారల నిచ్చు జనయిత్రి నీవు,
కలుషహారిణి నీవు – కైవల్య ఝరి నీవు,
కరుణ చినుకుల వాన కురిపించు నీవు!
వందనంబిదే అందుకో గంగమ్మ,
వదలకుందుము నీదు పుణ్యపదము!
జీవయాతనతోన మనలేని మనుగడన,
మన్ననెరుగని మనిషి నిను వేడకున్నా!
మానదానముజేసి మముబ్రోవుమో తల్లి,
మనుపమా కింకెవరు మధుర చరిత!
వందనంబిదే అందుకో గంగమ్మ,
వదలకుందుము నీదు పుణ్యపదము!