నారాయణా! హరే నారాయణా!
నాదమందిన రూపు నరుడాయె నందురే,
నాదించినది ఎవరు నారాయణా!
నాదమంలి తరుగు పెరిగి లోకంబాయె,
తరుగు మరపేదెవరు నారాయణా?
నారాయణా! హరే నారాయణా!
గొల్లవాడూదినా వెదురునాదము నుంచి,
వెన్నెల్లు పొంగెనట నారాయాణా!
పొంగులారెడి వెలుగు పుడమెల్ల నిండినా,
నీడ విడి మనదేల నారాయణా?
నారాయణా! హరే నారాయణా!
గొల్లభామల కాలి అందెనందడి నుంచి,
సిరులెల్ల పొంగెనాట నారాయణా!
సిరిమెచ్చినా నాడక సీమలన్నియుదాటి,
చింత పుంతాయెనిట – నారాయణా!
నారాయణా! హరే నారాయణా!
గోవు పితికిన గొమ్మపాల ధారల గోల,
భావరూపాయెనట నారాయణా!
భావరూపపు తీరు శిఖితోడు గొననాయె,
సేదదీర్చె దెవరు నారాయణా!
నారాయణా! హరే నారాయణా!
Author: yakshavani
మాధవా – మరుగేలరా
మాధవా మధుసుధనా – మరుగేలరా ? నను గావగా!
దూరమా ? నను జేరగా – పెను భారమా ? నను గావగా!
వింత లోకపు వీధిలో విధి విధించిన దారిలో,
వివరమేదని ఎరుగజాలని వివశ వేదన నెన్నవా?
గగన సీమల నగరులే – నిజ వాసమై వసియింతువా?
వసుధ నేలెడి దేవరా – వసివాడె నీ పురి కానరా!
మాధవా మధుసుధనా – మరుగేలరా ? నను గావగా!
దూరమా ? నను జేరగా – పెను భారమా ? నను గావగా!
అదితి సంతును గావగా – మోయలేదా నాడు మంధర!
సురరాజు గర్వము తుంచగా – గొడుగుగా గిరి నందలేదా!
అంత భారము మించునా – నా కర్మభారము – గిరిధరా!
మాధవా మధుసుధనా – మరుగేలరా ? నను గావగా!
దూరమా ? నను జేరగా – పెను భారమా ? నను గావగా!
నటనశాలల పాఠశాలలు నేటితోనిక ముగియునంచు,
సూర్యనందనుడంపెనంచు – అరిగిరే ఈ కాల దూతలు,
తుంచి దేహము తరలు వేళన – తోడు నీయకె నుందువా!
మాధవా మధుసుధనా – మరుగేలరా ? నను గావగా!
దూరమా ? నను జేరగా – పెను భారమా ? నను గావగా!
దురిత దూరుడవంచు పలువురు పొగడగా నే వింటినే,
ధరణి వేదన వెడలజేయగ – వేలరూపలు గొంటివే!
ధూళికన్నా పిన్ననగునను బ్రోవ యోచన ఏలయా?
మాధవా మధుసుధనా – మరుగేలరా ? నను గావగా!
దూరమా ? నను జేరగా – పెను భారమా ? నను గావగా!
యోచనల ఆ లోచనంబున కదలు వాడని యందురే!
లోచనెరుగని యోచనలు నీ జాడనెంచగ నెరుగవే!
నేరభారము దీర్చినన్నిక దరిజేర్చ యోచన ఏలయా?
మాధవా మధుసుధనా – మరుగేలరా ? నను గావగా!
దూరమా ? నను జేరగా – పెను భారమా ? నను గావగా!
శ్రీ లక్షీ కళ్యాణం
పాల్కడలి తూగుచూ ఆడేటి పసిడి – కడలి చిలుకగ చింది చిగురించెనమ్మా!
ముచ్చటగు ఆ ఇంతి ఇందీవరాక్షి – మెచ్చి మాధవు జేరు తీరు రుచిగనరే!
పొంగు చిందుల సందు మెరుపల్లె మెరిసి – అలల నురుగుల నలిగి కన్నె కనువిప్పె,
ఉయ్యాల జంపాల ఆడు అలలందు – అమిత గారవ మొంది ఇంతి పెరిగేను
||పాల్కడలి తూగుచూ ||
పాల బుగ్గల నిగ్గు తరిగి తొలగంగా – పడుచు వన్నెలు చిందె చెక్కిళ్ళలోనా,
కంటి రూపును జూసి కలువ రూపొందె – కురుల జాడలు జూచి తుమ్మెదలు మొలిచె
||పాల్కడలి తూగుచూ ||
పరువమందగ పొంగె పాలిండ్లు జతగా – జఘనమందెను వంపు సొంపుగమరంగా
నడుమ నలిగిన నడుము మూడు ముడుతలతో – నింగి పోలికలంది నిలకడొందేను
||పాల్కడలి తూగుచూ||
జగతి పున్నెము పండ మొలచినా మొలకా – మంగళాంగిగ పెరిగె పాల సంద్రమున,
లావణ్యములు మెచ్చు లలిత శోభలతో – కళ్యాన ఘడియకై తరుణి నిలిచేను
||పాల్కడలి తూగుచూ||
సిరులు కురిసే తల్లి నా ఇంటి పాప – వరుని గూడెడి తరుణ ముదయించెనంచు,
ముని వరుల రావించి వివరములనెరిగి – మంచి కాలము నెంచి క్షీరసాగరుడు
||పాల్కడలి తూగుచూ||
తరుణు లందరు గూడి అత్తరుల నద్ది – నలుగు నున్నగ బెట్థి జలకమాడించి,
సాంబ్రాణి ధూపంబు కురులంత నింపి – ముదురు చందన గంధ మద్దిరంగనకు
||పాల్కడలి తూగుచూ||
మయుడు దెచ్చెను మంచి ముత్యాల పీట – మందాకినిని దెచ్చె కరి రాజ రాజు
మణి కింకుణుల మాల దెచ్చె ధేనువులు – దేవాంగనలు దెచ్చి రగరు అత్తరులు
||పాల్కడలి తూగుచూ||
పద్మభవుడందించె స్వేత కమలంబు – శ్రీవాణి దీవించె నగుమోము కళను ,
ముక్కంటి ముదమార ధ్యాన రీతొసగె – వామాంగి అందుంచె కరుణ కంజమును
||పాల్కడలి తూగుచూ||
దేవతలు కిన్నెరలు యక్ష పరిజనులు – మణులు మానిక్యాల మాలలిచ్చేరు,
నందనంబున పండు విరులన్ని అల్లి – దేవేంద్రుడందించె వైజయింతికను
||పాల్కడలి తూగుచూ||
పలుకు పచ్చలబొమ్మ పగడాల రెమ్మా – పూర్ణ చంద్రిక వెలుగు సుకుమారి కలిక,
వరమాల చేబూని కదలగా జూసి – ఆనంద ముప్పొంగ సాగరుడు దెలిపె !
||పాల్కడలి తూగుచూ||
శాశ్వతుండగు వాడు శాంతికాముకుడు – పూర్ణ శేషము లందు కలిగుండువాడు,
కారణంబగు వాడు కార్యమగువాడు – కార్యకారణ కామ్య రూపమగువాడు,
కలిగి యుండిన యంత కలిగుండువాడు – కొల్ల లందున పొల్లు కలిమైనవాడు,
నడయాడు జగమెల్ల నడయాడు వాడు – తొలగి జగముల నెల్ల ఆడించువాడు,
ఆడి అలసిన వాని తెరవైన వాడు – అలుపు బాపెడి తెరవు తానెయగువాడు,
తలచి జగముల తొల్లి తరలించువాడు – మాపు తలపును మాపి తొలగించువాడు,
కలిమి బలిమియు కలుగు కారణము వాడు – కరువు కలిగిన కూడ కలిగుండువాడు
కంటి వెలుగుయు వాడు కన్నుయునువాడు – కాంచు మోహమువాడు కాంచునది వాడు,
మాయయై మోహమును రగిలించు వాడు – మోహమై పురమెల్ల పాలించువాడు ,
మచ్చికెరుగని మోహపాశమగువాడు – శరణన్న చెరబాపి శమమిచ్చు వాడు,
గుణగణంబులు వాడు – గుణము లెరుగనివాడు – గణనకందని గుణశేఖరుడువాడు,
గానలోలుడు వాడు – గానంబుయును వాడు – పలుతీరు నాదించు గళమైనవాడు,
పలుకు భావమువాడు – పలుకైనవాడు – పలుకు పలుకున పలుకు పలుకైనవాడు,
వేడుకొందెడివాడు – వేదనొందెడివాడు – వేడుకకు వేదనకు వెలియైనవాడు
వన్నెలన్నియు వాడు – వన్నెలెరుగని వాడు – వన్నెలకు వన్నెగా వెలుగొందువాడు,
సవ్యాపసవచయముల సారించు వాడు – సాధుజన మానసపు సంసారి వాడు
శమ దమంబుల సీమ నెరిగించువాడు – సీమ లెరుగని సీమ కలిగున్నవాడు
కలికి కలుగునుగాక నీకు సరి జతగా – జగము మెచ్చగ నీదు మనసు మురియంగా !
||పాల్కడలి తూగుచూ||
కన్నదెవరో గాని పెరిగినానిచటనే – పెను మురిపముల నే నాడినానిచటే,
తల్లితండ్రియునైన సాగరుండితడు – ఎరిగించు గుణరాసి నెన్నగా గలనా?
అనియంచు యోచించి ఇందీవరాక్షి – లోచనంబులు మూసి మౌనమొందేను,
అతులితుండగువాడు ఆత్మానుభవుడు కనికరంబున కనుల పొడగట్టు గాకా!
||పాల్కడలి తూగుచూ||
తరుణి తలచిన తీరు తమకమొందింప -తరలె తామస హరుడు తరుణి ముంగిటికి
తళుకు చుక్కల బాట హెచ్చరిక కాగ – వెడలె వైభవమొంద వైఘాన విభుడు!
||పాల్కడలి తూగుచూ||
ఆజాను బాహుండు అరవింద నేత్రుండు – ఆనంద సాగరము నేలువాడు,
అంబుజోదరుడతడు అవని గాచినవాడు – అంభోరుహాక్షుండు ఆత్మభవుడు,
నీల మేఘపు మేని ఛాయగలిగిన వాడు – లోచనంబుల నగవు లోలుకువాడు,
కస్తూరి తిలకంబు కలుగు ఫాలమువాడు – కామితార్ధము లిచ్చు చూపువాడు,
పట్టు పీతాంబరము కటిన అమరినవాడు – ఉరముపై కౌస్తుభము కలుగు వాడు ,
ఫాలాక్షు శిరమంది ధరణి పాపముబాపు – గంగ బుట్టిన పుణ్యపదము వాడు,
పున్నెముల పంటగా పరమపురుషులు దలచు పసినగవు నొలకించు మోమువాడు,
మునులు ఋషిపుంగవులు మన్నించి మన్నించి సన్నుతింపగ తరలు శౌరివాడు,
శంఖ చక్రాదిగా ముక్కోటి దేవతల నుతుల నందుచు తరలి చేరెనచట !
||పాల్కడలి తూగుచూ||
మోహనాకారుడని పదుగురాడగ వింటి – మోహమే రూపైన రేడువీడు,
రంగునలుపేగాని నునుశోభగలవాడు – రాజిల్లు రాజీవ మోమువాడు,
నింగి నీలముపైన మెరయు చంద్రిక వంటి – తెట తెల్లని తీపి నవ్వువాడు,
మాయకవ్వలి వాడు మనసెరుడనుకొంటి – మన్ననెరిగిన మనసు కలుగువాడు ,
పూర్ణకాముడు వాడు కామింపతగువాడు – పూర్ణపుషుడు వీడు పుణ్యధనుడు,
విద్యలన్నిటి విద్య వివరమెరిగిన వాడు – పలుకనేర్వని పలుకు లెరుగువాడు,
విదితపరుపగ రాని విన్నపంబులు తెలిసి -మానధనులను గాచు ధీరుడితడు
వందారు మందార వనవాసి యగువాడు – వాసవాదులు గొల్చు వేల్పువీడు
కామరూపుడు వీడు రూపమొందెను నేడు – వీడకుందును వీని ఎడద నిండి,
పాదపంకజ సేవ పలుమారు నే జేతు – ఋషి గణంబులు కొలిచి కమిలినపుడు
కారణంబేదైన కరుణగొనుటే చాలు – వైజయంతిని గొనగ వేడుకొందు!
||పాల్కడలి తూగుచూ||
నల్ల కలువను జేరు శశి కిరణమల్లే – నళినాక్షు దరిజేరె నెలత శ్రీలక్ష్మీ,
వరద విన్నపమంది మన్నింప దలచి – వాసుదేవుడు వంగె వనిత మురియంగా!
(వరద – పెళ్ళిగాని పిల్ల) ||పాల్కడలి తూగుచూ||
ఇంద్రమణి హారములు ఘనమంది మెరయ – వైజయంతమరేను విభుని యదపైన
ఇందిరా విభుడంచు జెయము పలుకంగా – దేవాంగనలు దివ్య నాట్యములు సలుప
దివ్య పుష్పపువృష్టి వేడుకమరంగా – దిక్కులన్నియు దివ్య దుందుభులు మ్రోగా,
సిరి నేడు సగమాయె దేవదేవునకు – శ్రీరస్తు యను సురలు దీవెనొసగేరు
శ్రీవత్స మై నిలచి విభును గొలవంగా – పాల్కడలి విడినాడి తరలె శ్రీలక్ష్మి
||పాల్కడలి తూగుచూ||
అమ్మల అమ్మ
శరమందితే నిన్ను శంభురాణందు – సిరుల నొసగిన నిన్ను శ్రీలక్ష్మి యందు,
భావమొసగిన నిన్ను ధవళాంగి యందు – ఆదరించిన నిన్ను అఖిలాంబ యందు!
అమ్మలందరి అమ్మ ఆదరించమ్మా – కరుణ పొంగువు నీవు కినుక తగదమ్మా!
వనమందు నిలచితే – వనజాక్షి నీవు – నీరముల నిలిచితే మీనాక్షి నీవు-
శాకముల నేలగా శాకంబిరి నీవు – శశి కిరణ సారమగు మహాసుధ నీవు!
అమ్మలందరి అమ్మ ఆదరించమ్మా – కరుణ పొంగువు నీవు కినుక తగదమ్మా!
తలకొక్క శీలమై శోభించు నీవు – గడి కొక్క ధర్మమై భాసించు నీవు,
కాలమంటని కాల కాణాచి నీవు – కలిబాధ మలిగించి మమ్మేల వమ్మా!
అమ్మలందరి అమ్మ ఆదరించమ్మా – కరుణ పొంగువు నీవు కినుక తగదమ్మా!
పిలుపు
కదలి రమ్మని పిలువ – నెమ్మదింతునొ ఏమొ,
కసిరి రమ్మని పిలవ – బెదరిపోదు,
చేర రమ్మని పిలువ – తొలగుందునో ఏమొ,
హరియించవే నన్ను – కమల నయనా!
కస్తూరి జవ్వాది అద్ది సాకిన మోను,
తోడు తానొత్తునని పంతమాడును గాని,
తగిలుండు తరుణంబు మించి పోయేనంచు,
తుంచి చెర విడిపించు – విమల చరితా!
తోడునడచినవారు తోడు నడచేమనగ,
నెమ్మదింతునొ ఏమొ నెనరుచేత,
మన్ననెరుగని జరతి నెనరన్న ఏమెరుగు,
నెనరుంచి నన్నేలు – నళిన మిత్రా!
పున్నెపాపపు ఫలము పలుమారు పిలిచెనని,
పలుక నెంతునొ ఏమొ ముదముతోన,
మోహపంజరమందు ముదమొందనేలంచు,
ముదమార ననుజేరు – మధుర వదనా!
సరివార మేమంచు సరసాన మన్నింప,
సావకాశమునొంది నిలుతునేమో!
సాధుజన పాలకా సావధానము నొంది,
గురిదారి మరలించు – గరుడ గమనా!
జతజేరి ఈ జగతి జాడ తెలిపితిమంచు,
వెంటనుందుమనంటె – మురుతునేమో!
జంటబాయని తోడ – జగమేలు జతగాడ,
జరభీతి మడియించి – మనుపు మయ్యా!
తరలించు
భవబంధముల బాధ భారమైయ్యేనంచు,
పలుమారు నిను పిలుతు – రంగా!
బంధమెరుగని నీకు – ఏ తీరు నెరిగింతు,
బంధ భారపు తీరు – రంగా!
తగులకుంటే తరుగు – తగిలితే అది బరువు,
జగతి తీరిదియేన – రంగా!
తగుల జేతురు – తనువు తొలగేటి దశవరకు,
తగులుటే మెరుగంచు – రంగా!
సుంకములు చెల్లింప సావకాశము లేక,
రేపగలు అలసేను – రంగా!
సంతు సాకను తగిన సంపాదనేలేక,
కుమిలి కృంగేనయ్య – రంగా!
లోనున్న వాడవని లోతెలివి నీవెయని,
లోకులందురు గాని – రంగా!
లోచనంబులు మూసి మురిపాన దేలేవు,
తెలివి పలికేదెపుడు – రంగా!
తనువుతో బంధంబు తగని భారంబైన,
తరలుటెరుగను నేను -రంగా!
తరలిపొమ్మను వరకు తగుల జేయకు నన్ను,
కరుణగొని తరలించు – రంగా!
చూపు
చూచెదనే నేరీతిన చూడగ దుస్సాధ్యమైన దివ్యుని రూపున్,
చూడగనే నెంచినంత చూడంగాగలన నేను,
చూడగ దుస్సాధ్యమైన దివ్యుని రూపున్,
చూపుల చిక్కని వాడని లోచూపులు కల్గువారు,
చూచాయిగ నెరిగింపగ ఎరిగితినయ్యా!
చూచితిరట దివ్యాంగుని చేతనలుడిగన అతివలు,
మానమునెంచని మతులన కోనేటిన నిలచినపుడు,
చూచితిరట చిద్రూపుని లీలామయ చేష్థితములు,
ద్రుపదుని పట్టిని గాచెడి దివ్యాంబర మిచ్చినపుడు!
చూడగనే నెంచినంత చూడంగాగలన నేను,
చూడగ దుస్సాధ్యమైన దివ్యుని రూపున్!
ధారుణి నడచిన వేళల చూచితిరా పరమపురుషు,
ధారణలో ధరనేలెడి దనుజాంతకు నెంచువారు,
దయగని ఎరిగింపనెరిగి జూచితిరట విబుధజనులు,
చేరిన చెలిమిని తెలుపగ కన్నుల జూచెను విజయుడు!
చూడగనే నెంచినంత చూడంగాగలన నేను,
చూడగ దుస్సాధ్యమైన దివ్యుని రూపున్!
చూడగనెంచని అసురులు జూచితిరట వైరంబున,
చూపున నిలిపిన గొల్లలు జూచితిరట స్నేహంబున,
చూపేవానిగ ఎరిగిన పల్లెల గోపీజనములు,
చూచితిరట చూపానిన చోటెల్లను గోనాధుని!
చూడగనే నెంచినంత చూడంగాగలన నేను,
చూడగ దుస్సాధ్యమైన దివ్యుని రూపున్!
చూచెడి భాగ్యము నొసగగ దీరిన కొలువున తీరుగ
చూపెరుగని నరనాధుడు చూచేనట సురనాధుని,
చిరకాలము చింతించిన కురవీరుడు చూడగలిగె
చితిచేరెడి తుదిఘడియన చిన్మయు దయచే!
చూడగనే నెంచినంత చూడంగాగలన నేను,
చూడగ దుస్సాధ్యమైన దివ్యుని రూపున్!
చూపుల నిండిన కరుణన చూడగరాదా నన్నిక,
చీకులు చింతలు దీరగ చిలుకగ రాదా చెలిమిని,
చిందెడి వెలుగుల రూపును చూడగలేనీ చూపును,
చెలువముతో చక్కజేసి చూపగరాదా ఉనికిని!
చూడగనే నెంచినంత చూడంగా లేని ఉనికి,
చూచెడి చూపీయరాద చింతలు దీరా!
రాడన్న రేడొచ్చె
రాడు రాడేమన్న రేడీ రోజొచ్చి -రమ్మంచు పిలిచేను నన్నే!
వేణువూదెడి వాడు- వెఱ్ఱి గొల్లడు కాడు,
వేవేల గోవులను పాలించు వాడు!
ఆలమందను జేర ముదమార పిలిచేను,
తరలి పోదును నేను – తరలింక రాబోను!
రాడు రాడేయన్న రేడీ రోజొచ్చి – రమ్మంచు పిలిచేను నన్నే!
వెన్నముద్దలు లేని వట్టి చేతులతోన,
మదినిండ నిండున్న ముదముతోన,
మారాముతోనన్ను విడనాడనీ తనువు,
తలుపు గొళ్ళము దీసి – తరలింక నేపోదు!
రాడు రాడేయన్న రేడీరోజొచ్చి – రమ్మంచు పిలిచేను నన్నే!
వెన్నెలాటల వాడు – వెన్నంటి యుండంగ,
వేల గోవుల మంద తోడుండి నడువంగ,
వెలితెరుగనా సీమ వెలుగు దారులవెంట,
సమయ చోరునివెంట తరలింక నేపోదు!
రాడు రాడేయన్న రేడీరోజొచ్చి – రమ్మంచు పిలిచేను నన్నే!
జంటనాడితి నంచు జతజేరగాలేవు,
వెంటనడచితి నంచు వెన్నాడిరాలేవు,
మరలి రమ్మని నన్ను మౌనాన పిలిచేవు,
మరలుటెరుగని దారి తరలినే పోదారి!
రాడు రాడేయన్న రేడీరోజొచ్చి – రమ్మంచు పిలిచేను నన్నే!
దేహిమే ఇహ
దేహిమే ఇహ దేహిమే – ఫణిరాజ భూషణు గేహిని, ( గేహిని – భార్య)
దేహిమే ఇహ జ్ఞాన మంజరి – దేహి సుఖద శుభంకరీ!
భువన పాలుడు – భువన పోషకు – భువన నాశక విభునకూ,
ఎంచి పంచిన పాయసాన్నము – కొంచె మీయవె కలికిరో!
భూతనాధుడు భావలోలుడు భోగమందును ప్రీతితో,
శ్రీ కాళ హస్తుల పూజ లందుక తుష్టినొందును మొండుగా!
మోహమెరుగని మోహనాంగుని అంతరంగపు భామినీ,
అంధమోహము మడియజేసెటి జ్ఞానమీయవె అంబరో!
దేహిమే ఇహ దేహిమే – ఫణిరాజ భూషణు గేహినీ!
అమరనాధుని అమిత కరుణను అందు జ్ఞానము నీయవే!
దేహిమే ఇహ దేహిమే – దేహిమే ఇహ దేహిమే!
ఎరిగి ఏదిక ఎరుగ నెంచను ఎరుక ఏదని పుడమిలో,
ఎదన నిలచిన వేదనాధుని ఎరుక నెంచగ ముదముతో
ఏలికైనీ విలను వెలసిన వాయురూపుని ఇంతివె!
ఎరుక గరపవె అట్టి జ్ఞానము – జ్ఞానమిచ్చెడి అంబికా,
దేహిమే ఇహ దేహిమే – ఫణిరాజ భూషణు గేహినీ!
అనరు మాపెడి అమర నాదపు జ్ఞానమీయవె అంబికా!
దేహిమే ఇహ దేహిమే – ఫణిరాజ భూషణు గేహిని, ( గేహిని – భార్య)
దేహిమే ఇహ జ్ఞాన మంజరి – దేహి సుఖద శుభంకరీ!
భువన పాలుడు – భువన పోషకు – భువన నాశక విభునకూ,
ఎంచి పంచిన పాయసాన్నము – కొంచె మీయవె కలికిరో!
దేహిమే ఇహ దేహిమే – దేహిమే ఇహ దేహిమే !
దేహిమే ఇహ దేహిమే – దేహిమే ఇహ దేహిమే!
చిన్ని ఆటలాడంగ రారా!
చిన్ని ఆటలాడంగ రారా – చిన్ని ఆటలాడంగ రారా
నందబాల యమున పిలిచే – చిన్ని ఆటలాడంగ రారా
మధురాపురాధీశ రారా – బృందామనోహార రారా!
భువనైక పోషకా రారా – చిన్ని ఆటలాడంగ రారా!
జానకిని బ్రోవనెంచి – శివుని విల్లు విరచి నీవు,
పరశువంది తిరుగువాని అహము దృుంచి అంపినావు!
అడవులందు ఉన్నవారి ఆదరించ నెంచినీవు,
అమ్మునంది అడవులంట తిరిగి తిరిగి అలసినావు!
చిన్ని ఆటలాడంగ రారా! నందబాల యమున పిలిచే!
చిన్ని ఆటలాడంగ రారా!
భీష్మకుని పుత్రి నిన్ను మనువునాడ రమ్మనంటె,
రచ్చజేసి రుక్మిణిని రాణిజేసి దెచ్చినావు!
సత్యభామ చింతదీర్చ మణిని మాటుజేసి నీవు,
కొండకోననున్న బంటు వెంట తగిలి ఆడినావు!
చిన్ని ఆటలాడంగ రారా! నందబాల యమున పిలిచే!
చిన్ని ఆటలాడంగ రారా!
పాండవులు కౌరవులు పందెమేసి జూదమాడ,
బావ వెంట అడవులంట తోడునీవు నడచినావు,
బండిగట్టి పోరులోన చీడనెల్ల బాపినావు,
వేటగాని వేటుతోన తనువుబాసి తరలినావు!
చిన్ని ఆటలాడంగ రారా! నందబాల యమున పిలిచే!
చిన్ని ఆటలాడంగ రారా!
మధురాపురాధీశ రారా – బృందామనోహార రారా!
భువనైక పోషకా రారా – చిన్ని ఆటలాడంగ రారా!