మేలుకో మమ్మేలుకో

మేలు కొలుపగ మాకు – మేలుకో దేవరా!
మాయ ముసుగును మరగి బడలియున్నాము!
మావి కమ్మిననాడు తోడుండి తరలించి,
తొడుగు తొలగిన నాడు మాటేలనయ్యా!

కన్నులివి, కరములివి, పరుగిడగ పదములివి,
చెలిమి చిలికెడి  పలుకు పలుకగల పెదవులివి,
రాగ రసపానమున రాజిల్లగల మనసు,
ఉప్పొంగి ఊగేటి తను భవన రూపమిది!

అంగాంగమున నమరు అంగమెరుగని వాడ,
భావ గమనపు గతుల గతియైనవాడా!
గతిమాలి చరియించు నా మతిని సవరించి,
సార సారధ్యముల ఋచి దెలుప రాదా!

ౘవులు పుట్టెడి ఋచులు చిలికింగల రసన (  తేజోవంతమైన రుచులు కలిగించగల నాలుక),
సరసములు విరసములు విరివిగా నమరించి,
వేడుకొందుమటంచు అమరున్న దిన గతులు!
కొలుపు కూరిమి నొసగ కారణం బెరిగించు!

కలిగున్న కలిమికే కారణంబును లేక,
కనరాని కారణపు కలిమి నందగ లేక,
కుమిలి కమిలెడి కనుల కదలాడరాదా!
కొలతకందని కరుణ కురిపించ రాదా!

మేలు మేలనటంచు మేనంటి మనువాడ!
మేలేదొ మరుగేదొ మన్నికెరుగని వాడ!
మాయతొలగిన కలుగు మేలేదొ ఎరిగింప,
మేలుకో దేవరా – మా మేలు గొలుపా!

శాపమా ? ఇది పాపమా?

శాపమా ? ఇది పాపమా? నే కోరి పొందిన లోకమా?
వింతగా నే పంతమాడగ ఎంచి జేరిన తీరమా?
తల్లి యందురు – తండ్రి యందురు – తోటివారని కొందరందురు,
తనువు జీల్చుక పుట్టి కొందరు తనయులందు తీరుగా!
సొంతవారని – సాటివారని – సంగముననే మెలగ వలెనని,
సాకులెన్నో ఎన్ని తెలిపియు – చాటుయై నేడెచట జేరిరి?
శాపమా ? ఇది పాపమా? నే కోరి పొందిన లోకమా?
వింతగా నే పంతమాడగ ఎంచి జేరిన తీరమా?
అవనిపై తమ గురుతు నిలుపగ అమిత యత్నమె జేసినా,
ఆనవాలుగ మిగిలినా శిల గురుతులన్నీ చెదరినా,
నిన్న నేదో ఉంది నేటికి – నేటి మూటది నిలువ ఏటికి?
తెలియ జేసెడి కబురులన్నీ సందియంబుల దీర్చునా?
శాపమా? ఇది పాపమా? నే కోరి పొందిన లోకమా?
వింతగా నే పంతమాడగ ఎంచి జేరిన తీరమా?
అనరులన్నీ అంతరంగపు అడుగు దాచెడి అంబుదై,
అందరానా అంబరుంబును అందు పొంగుల పొంగుచూ,
సీమలెరుగక సాగియున్నా సమయ సాగర తీరము,
వెదకి వేదన మునుగుటే నా గతియనెరుగక పోదునా!
శాపమా? ఇది పాపమా? నే కోరి పొందిన లోకమా?
వింతగా నే పంతమాడగ ఎంచి జేరిన తీరమా?
సొంతమందురు కొంత లోకము – సొంతమేదని కొందరందురు!
సమయమెరుగని కాలజలనిధి – కడకు జేరుటె కార్యమందురు!
ముందు కొందరు వెనుక కొందరు- తొందరొందుచు తరలు చుందురు!
తరలి జేరెడి నగరి జాడను – తెలియ జేయగ మరతురందరు!
శాపమా? ఇది పాపమా? నే కోరి పొందిన లోకమా?
వింతగా నే పంతమాడగ ఎంచి జేరిన తీరమా?
వెన్నెలాటల వన్నెకాడా – వెన్నుగావగ కదలి రారా!
వెలుగు నీడల వేటలో నే నలసి నాడని తెలియరా!
వేచియుంటిని ఒంటిగా – నా జంట జేరగ రావయా!
జంటబాయక వెంటనుండీ – సంకటంబును బాపరా!
శాపమైనా – పాపమైనా – నే కోరి పొందిన లోకమైనా!
పంతమాడక పరుడనెంచక – పంచజేర్చర పురధరా!
నీ పంచ జేర్చర పురధరా!

కావరమ్మని పిలిచినా

కావరమ్మని పిలిచినా – కదలిరావు అదేలయా!
కనికరంబును నొందగా – నే తగని వాడననెంతువా?

నీవె దిక్కని నమ్మినా – నమ్మికందున లోపమా?
దిక్కు నీవని నమ్మటే – నా మనసు జేసిన లోపమా?
లోని లోకపు లోతులెరుగడి – తీరు తెన్నుల నెరుగనే!
తీరుగా నా పిలుపు నందవె – తిమిర లోక వినాశకా!
కావరమ్మని పిలిచినా – కదలిరావు అదేలయా!
కనికరంబును నొందగా – నే తగని వాడననెంతువా?

అంబుజాక్షిని ఆదరించిన ఆదిపురుషుడ వీవయా,
అంబతోడుగ నీవు నెరపిన లీల ఛాయలు మేమయా!
ఆదరింపగ నీవు గాకిక ఎవరు దిక్కయ ఏలికా!
ఏలరావయ కావగా నను – కామ జనక మనోహరా!

కావరమ్మని పిలిచినా – కదలిరావు అదేలయా!
కనికరంబును నొందగా – నే తగని వాడననెంతువా?

నందనా యదు నందనా

నందనా యదు నందనా – ఆనంద గోకుల వందనా!
విందుగా నీ వింత లీలలు వేడుకొందగ విందువా!

మంధరందిన వింత రూపము – చల్ల కవ్వమనెంతువో!
చైయనెగిరెడి చల్లచినుకులు – పాల పొంగులనెంతువో!
చల్ల కెరటపు చెరగువై వెలయు వెన్నల ముద్దలే,
క్షీరసాగరు పట్టిగా తలపోసి పట్టగ నెంతువో!

నందనా యదు నందనా – ఆనంద గోకుల వందనా!
విందుగా నీ వింత లీలలు వేడుకొందగ విందువా!

పల్లె గొల్లల పాటలే – ఆ సామగానమనెంతువో !
సరసమాడెడి సంగములనే – సరస సేవలనెంతువో!
అంగ సుందరులంతరంగపు వికట రూపము దృంచగా,
వెఱ్ఱి గొల్లని వోలె వలువలు దోచి వేడుక నొందువో!

నందనా యదు నందనా – ఆనంద గోకుల వందనా!
విందుగా నీ వింత లీలలు వేడుకొందగ విందువా!

పల్లె మడుగున పన్నగుండా శేషుడేయని ఎంతువో,
పానుపమరగ పంతమాడుచు ఫణులు మర్దన జేతువో!
గొల్ల రూపము నొందిగా ఈ గోల మేలని ఎంతువో?
ఫాల లోచను నాజ్ఞనందకె జీవ జగమును వీడునా?

నందనా యదు నందనా – ఆనంద గోకుల వందనా!
విందుగా నీ వింత లీలలు వేడుకొందగ విందువా!

వెదురు కొమ్మలె పాంచజన్యపు పుడమి రూపని ఎంతువో!
బెదురు మాపగ వింత నాదము వెదురులో పూరింతువో!
గోపబాలా నీదు ఊపిరి నిండి జగములు మురియవా?
నాదలోలా నీదు నాదము కుడిచి వీనులు మురియవా!
నందనా యదు నందనా – ఆనంద గోకుల వందనా!
విందుగా నీ వింత లీలలు వేడుకొందగ విందువా!

కనకదుర్గ

కలిగున్న కలికివని – కలికముల దీర్తువని,
కరుణగని ఏలుమని – వేడెదను నిన్నే,
కామితార్ధము దీర్ప – నీవుగాకింకెవరు,
కనకదుర్గగ నీవె కదలి రావమ్మా!

పాలకడలిన పుట్టి – పరమేశు చైబట్టి,
ఖగవైరి పానుపున పతిని సేవించి,
ఇహ పరంబుల నేలు ఇంతిగా వెలుగొందు,
మూల శక్తివి నీవె – కరుణ గన వమ్మా!
కనక దుర్గగ నీవె కదలి రావమ్మా!

పాలపొంగుల మించు వన్నె గలిగిన గిరుల,
పాలించు పరమేశు మదినేలు ముదితా,
పాప హారిణి నీవు అసుర మర్దిని నీవు,
ఆదరంబున మమ్ము దరిజేర్చుమమ్మా!
కనక దుర్గగ నీవె కదలి రావమ్మా!

పాలపుంతల పొంగు మురిపించు వలువతో,
పలుకు మాలల వెలయు ఆదికవి పత్నీ,
ధాత మెచ్చగ మాకు దరిజేరు తెలివిచ్చి,
భవతరిణి దాటించ దరిని జేరమ్మా!
కనక దుర్గగ నీవె కదలి రావమ్మా!
కలిగున్న కలికివని – కలికముల దీర్తువని,
కరుణగని ఏలుమని – వేడెదను నిన్నే,
కామితార్ధము దీర్ప – నీవుగాకింకెవరు,
కనకదుర్గగ నీవె కదలి రావమ్మా!

హరి నీవయ

హరి నీవయ – సిరి నీవయా!
హరి నీవయ – సిరి నీవయా!
హరా హరా హర – హర హర హర హర!
మోదము మీరగ వెన్నెల కొండన ,
వెలయుట వేడుకె – వందిత చరణా!
కాముని దృంచిన – కరుణా భరణా,
పాలింపుము నను పశుగణ పాలా!
హరి నీవయా – సిరి నీవయా!
హరా హరా హర – హరహర హరహర!
హరియించితి వట హాలాహలమును,
హరియింపవె నా మోహము నెల్లా!
మోహన రూపుని మోహము నొందెడి,
మానస మొసగవె మంగళ చరణా!
హరి నీవయా – సిరి నీవయా!
హరా హరా హర – హర హర హర హర!
రూపము నొందిన కాలుడ వీవని,
కొనియాడెదరే నర్తిత చరణా!
లయలను పలుకవె లాస్యపు గతులన,
లయమొందగ నా లోపములెల్లా!
హరి నీవయా – సిరి నీవయా!
హరా హరా హర – హరహరహర!
మోహిని మోహము మునిగిన వాడని,
మాటను మోసిన గిరిసుత నాధా!
అందిన మోహపు మందాకినిలో,
ముంచుగ రాదా అంబుజ మౌళీ!
హరి నీవయా – సిరి నీవయా!
హరా హరా హర – హరహర హరహర!

కరుణావరణా

కరుణావరణా – కమలాభరణ ,

కనినా చరితా – కడతేర్చగరా!

భవతాపహరా – భయనశకరా,

భవదీయుడ నను దరిజేర్చగ రా!||2||

హిత పోషకరా – శ్రీత పాలకరా,

వరదాయక వానర సేవిత రా! ||కరుణా||

శివే – శివా

రమావినోది వల్లభా ఉమామహేశ దుర్లభా
సురేశ శ్రీశ సన్నుతా తమోమయా సదాశివా
సునాద మోద మానసా సునంద నంద మోదితా
అమోఘ లాస్య సేవితా సదా వసంత శోభితా |
||రమావినోది వల్లభా ఉమామహేశ దుర్లభా
సురేశ శ్రీశ సన్నుతా తమోమయా సదాశివా||

హిమాద్రి కన్య సేవితా ఉదార భవ్య మానసా
భవాబ్ధి బాధ నాశకా – కుమార ధాత శంకరా
|| రమావినోది వల్లభా ఉమామహేశ దుర్లభా||

మనోవికార నాశకా సుధాబ్ధి పాల మోదకా
అనంగ శోభనాశకా అనంత శేష సేవితా
|| రమావినోది వల్లభా ఉమామహేశ దుర్లభా||

హిమాద్రి కీల సుస్థిరా అపర్ణ చిత్త సంస్థుత
మహా గణేశ సేవితా – అనంత తాండవ ప్రియా
|| రమావినోది వల్లభా ఉమామహేశ దుర్లభా||

శివే ముకుంద మోదకా – మహా వినాశ కారకా,
సదా మునీశ సేవుతా – కరాళ అంగ భూషితా
|| రమావినోది వల్లభా ఉమామహేశ దుర్లభా||

భ్రమ

తేట చక్కని రూపు – తెరపైన నా రూపు,
నాదనెంచుట మాని నేనె యని మురిసేను!

నను గన్న నా తల్లి – పలుమారు దెలిపేను,
ముచ్చటౌ నగుమోము గలిగి యున్నాననీ,
ననుగన్న నా తండ్రి – ఎన్ని ఎరిగించేను,
చూడ చక్కని తనువు తన పోలికేననీ!
పున్నెములు పండగా మొగ్గ తొడిగిన మేను,
నాదనెంచుట మాని నేనె యని మురిసేను!

తోడుగాడెడి వారు – వెంట నుండెడివారు,
తీరు తెన్నులు గల్గు తెలివి నాదేయనగ,
పలుకులల్లే తల్లి పలికించు పలుకెల్ల,
జిహ్వనాడెడి రుచికి ప్రకటరూపని ఎంచి,
మాయజగతిన మలుగ మనుగడొందే మేను,
నాదనెంచుట మాని నేనె యని మురిసేను!

పంకజాసను పడతి పంతమాడుట మాని,
కురిపించు కుసుమాల మాలలల్లిన మేను,
పద్మనాభుని ఇంతి పలుమారు దయజూసి,
కనికరించిన పంట భోగమందిన మేను,
వల్లెయన్నారోజు వెడల నడిపెడి మేను,
నాదనెంచుట మాని నేనె యని మురిసేను!

తనువు ముసుగున తగిలి తిరుగుటెరుగని నేను,
తరుణమంతయు తరుగు విధులంది మను నేను,
తనువు చక్రముబట్టి – తనువైరులను గొట్టి,
తెరపి తెలుపగ నన్ను తగిలుండు పన్నగుని,
తెలియు తెలివిని గల్గి – తెగనాడి మోహమును,
నేననెంచెడి మేను నాదియని గురుతెరిగి,
మదన జనకుని ఛాయ మదినెంచగలనా?

భావన

రమా రమణు కథ రమ్యము కాదా!

భావింపగ రాదా!

మంధర గిరిధరు మదినెంచుటయే,

ఆనందము గాదా!

శ్రీ రమా రమణు కథ రమ్యము గాదా,

భావింపగ రాదా!

ఇనకుల తిలకుని, ఇందిర నాధుని,

లీలలు గన రాదా!

శ్రీ రమా రమణు కథ రమ్యము గాదా,

భావింపగ రాదా!

హిమగిరి నేలెడి గౌరీనాధుని – మానస చోరుని ,

మంగళ చరితుని – చింతింపగ రాదా!

శ్రీ రమా రమణు కథ రమ్యము గాదా,

భావింపగ రాదా!