భ్రమ

తేట చక్కని రూపు – తెరపైన నా రూపు,
నాదనెంచుట మాని నేనె యని మురిసేను!

నను గన్న నా తల్లి – పలుమారు దెలిపేను,
ముచ్చటౌ నగుమోము గలిగి యున్నాననీ,
ననుగన్న నా తండ్రి – ఎన్ని ఎరిగించేను,
చూడ చక్కని తనువు తన పోలికేననీ!
పున్నెములు పండగా మొగ్గ తొడిగిన మేను,
నాదనెంచుట మాని నేనె యని మురిసేను!

తోడుగాడెడి వారు – వెంట నుండెడివారు,
తీరు తెన్నులు గల్గు తెలివి నాదేయనగ,
పలుకులల్లే తల్లి పలికించు పలుకెల్ల,
జిహ్వనాడెడి రుచికి ప్రకటరూపని ఎంచి,
మాయజగతిన మలుగ మనుగడొందే మేను,
నాదనెంచుట మాని నేనె యని మురిసేను!

పంకజాసను పడతి పంతమాడుట మాని,
కురిపించు కుసుమాల మాలలల్లిన మేను,
పద్మనాభుని ఇంతి పలుమారు దయజూసి,
కనికరించిన పంట భోగమందిన మేను,
వల్లెయన్నారోజు వెడల నడిపెడి మేను,
నాదనెంచుట మాని నేనె యని మురిసేను!

తనువు ముసుగున తగిలి తిరుగుటెరుగని నేను,
తరుణమంతయు తరుగు విధులంది మను నేను,
తనువు చక్రముబట్టి – తనువైరులను గొట్టి,
తెరపి తెలుపగ నన్ను తగిలుండు పన్నగుని,
తెలియు తెలివిని గల్గి – తెగనాడి మోహమును,
నేననెంచెడి మేను నాదియని గురుతెరిగి,
మదన జనకుని ఛాయ మదినెంచగలనా?

భావన

రమా రమణు కథ రమ్యము కాదా!

భావింపగ రాదా!

మంధర గిరిధరు మదినెంచుటయే,

ఆనందము గాదా!

శ్రీ రమా రమణు కథ రమ్యము గాదా,

భావింపగ రాదా!

ఇనకుల తిలకుని, ఇందిర నాధుని,

లీలలు గన రాదా!

శ్రీ రమా రమణు కథ రమ్యము గాదా,

భావింపగ రాదా!

హిమగిరి నేలెడి గౌరీనాధుని – మానస చోరుని ,

మంగళ చరితుని – చింతింపగ రాదా!

శ్రీ రమా రమణు కథ రమ్యము గాదా,

భావింపగ రాదా!

తోడెవ్వరే నీకు

తోడు తోడని వగచి – కోరి చేరివితి విటకు,
తోడెవ్వరే నీకు – చిలకా!
తొలగి నిలచును జగతి – తరలి పొమ్మని నిన్ను,
తోడెవ్వరే నీకు – చిలకా! తోడెవ్వరే నీకు చిలుకా?

రెక్క మొలవని నాడు – వేడుకొందగ నెంచి,
వెదకి జేరితి విటకు – చిలుకా!
వేడుకల వెలిమబ్బు వెలిసి వేదన మిగిలే,
వగపేలనే వెఱ్ఱి చిలకా!
తోడు తోడని వగచి – వెదకి చేరితి విటకు,
తోడెవ్వరే నీకు చిలకా? తోడెవ్వరే నీకు చిలుకా?

పరువమొందిన రెక్క – పరచి ఎగిరెడినాడు,
పంచ తోడెంచితివి – చిలకా!
పంపకంబుల బదులు పలువేదనలు దెచ్చె,
పొగిలి ఫలమేమింక – చిలుకా!
తోడు తోడని వగచి – వెదకి జేరితి విటకు ,
తోడెవ్వరే నీకు చిలకా? తోడెవ్వరే నీకు చిలుకా?

చిరుత రెక్కలు నిమిరి – మరిపాల మునిగేవు,
మోహపడి మురియకే – చిలుకా!
రెక్క ముదిరిన మొలక – తోడొంద ఎగిరేను,
తొలిగుండుటే మెరుగు – చిలుకా!
తోడు తోడని వగచి – వెదకి జేరితి విటకు,
తోడెవ్వరే నీకు చిలుకా? తోడెవ్వరే నీకు చిలుకా?

రెక్క అలుపుమును మరచి – రేయనక పగలనక,
తిరిగి కుడిపిన కుడుపు – చిలుకా,
కుడిచి పెరిగిన కూన – ఎంచదే పాశమును,
ఏది తోడిక నీకు – చిలుకా!
తోడు తోడని వగచి – తగిలితివి ఆనాడు,
తోడెవ్వరే నీకు చిలుకా? తోడెవ్వరే నీకు చిలుకా!

అలసి నలిగిన రెక్క – ఒరిగి కదలని నాడు,
తోడెవ్వరే నీకు – చిలుకా!
జగము తొలగిన నాడు – తోడుండు జతగాని,
తోడెంచి తరియించు – చిలుకా!
తోడు తోడని వగచి – తగిలితివి ఆనాడు,
తోడెవ్వరే నీకు చిలుకా? తోడెవ్వరే నీకు చిలుకా!

తోడు విడువని తోడు – జగతి నడిపే తోడు,
ఎంచి ఎరుగుము నేడె – చిలుకా!
తొలుత జేసిన తప్పు – తలచి వగచుట మాను,
లోనున్న తోడెరుగు – చిలుకా!
తోడు తోడని వగచి – తగిలితిచి ఆనాడు,
లోనున్న తోడెరుగు చిలుకా!
లోకేశు జతజేరు – చిలుకా! లోక చింతన మాను చిలుకా!

రాధా మనో భావ

రాధా మనో భావనా –  రాధా మనో భావనా !

యదుబాలా – గోపి వల్లభా!

రాధా  మనోభావనా!

నారద గాన – నాద విహారా

నానాహితకర – వేద విహారా

రాధా మనో భావనా – యదుబాలా గోపీ వల్లభా!

రాధా మనో భావనా!

గౌరీ వల్లభ – మానస చోర!

గోవర్ధన ధర – గోజన పోషా!

రాధా మనోభావనా – యదుబాలా గోపీ వల్లభా!

రాధా మనో భావనా!

శ్రీసతి సేవిత – శ్రిత జన పోషా!

శుకభావామృత – కారణ  సంగా!

రాధా మనోభావనా – యదుబాలా గోపీ వల్లభా!

కృిష్ణ – రాధా మనోభావనా!

Song : https://www.youtube.com/watch?v=ykdvYeoqsRU

 

ఎన్నడో… ఎన్నడో.

ఎన్నడో గద వేణుగానము – చేరి వీనులు నిండుట,
ఎన్నడో ఆ రాధికా సతి ఎంచి నా మొర తెలుపుట,
ఎన్నడో… ఎన్నడో..
నిండు వెన్నెల నీడలో -నిదురించు పల్లెల జోలలో,
ఎంచి చేరిన వీనులు – ఎంచి ఎరిగిన ఊసులూ…
ఎన్నడో మరి ఎన్నడో …. ఎన్నడో ఎన్నడో…
ఎన్నడో గద వేణుగానము – చేరి వీనులు నిండుట!

పండు వెన్నెల పొంగులో – మైమరచి కరగిన మనసులో,
తొంగి జూసిన ఊహలో – సిరి ఎంచి అందిన ఊసులూ..
ఎన్నడో మరి ఎన్నడో …. ఎన్నడో ఎన్నడో…
ఎన్నడో గద వేణుగానము – చేరి వీనులు నిండుట!

పంత మెరుగని రోహిణీ పతి – కుమ్మరించెడి వెలుగులో,
కలికి కన్నుల కదలు కలలో – ఎంచి చేదిన ఊసులూ
ఎన్నడో మరి ఎన్నడో …. ఎన్నడో ఎన్నడో..
ఎన్నడో గద వేణుగానము – చేరి వీనులు నిండుట!

ఎన్నడో ఆ రాధికా సతి ఎంచి నా మొర తెలుపుట,
ఎన్నడో… ఎన్నడో..

ఓరిమి

నా ఓరిమింతని – ఓపగా లేననీ – ఎన్న నేనెంతటి వాడయా?
ఓరిమొసగెడి వన్నెకాడవు – సందియంబుల బాపుమా!
సమసిపోయెడి సకల జగముల – సారసంపద నీవయా!
సమయ సీమన సంచెరించెడి – అల్ప జీవుల నెరుగవా!
ఆదమరుపే అన్నపానము – పుడమి నడచెడి దారులా!
ఆదుకొనగా నిన్ను వేడగ – కాల మెక్కడ తోచదే!

కదలుటెరుగని కటిక కాలము – కనికరంబుల నెరుగదే!
తోడు నీవని వినుటెగాని – కానగా నే నెరుగనే!
కంటకంబగు కలివనంబున – కాలు ఊనగ నోర్వకే!
ఓర్వలేనని వల్లగాదని – వేదనొందితి వెరపుచే!
వెరపు బాపుము – జాడ దెలుపుము – జాలితో దరి జేరుమా!
తరుగు దారుల తగిలినా – నీ తనయనే గద గిరిధరా!

కడుపు కుడుపగ కొలువుజేసితి – ఈడు వన్నెలు తరుగగా ,
కరుగు కండలె కాసులుగ నా కంటి వెలుగును దోచెనే,
వెలతిబడి నా చూపుతో నే నెరుగకుంటినే ఏ గతీ,
గతులు గడచిన గడియలో ఏది గతియని ఎంచెదా?

పలుకగలిగిన పరువమంతా మోహపడి నే పలికితి ,
పలుకు పలుకుకు కాసుకుయగ మోదమున నే మునిగితీ,
చెల్లిపోయెను పరువమంతా కాసుకుప్పలు తరిగెనూ,
తగిన దారిది తగులుమనియెడి తోడు తెలియనె నేటికీ!

వాని వేడితె వెలతి తీరును – వీని వెడితె వెలుగు కలుగును,
ఒకరి జేరితె ఒరుగు సంపద – ఒరగజేతురటొకను మన్నన,
మందగించిన మతిఎరుంగదె – ఏది ఎంచిన మరలగలనని,
మరలు దారిని ఒరగజేసెడి వాని వైనము నెగనే!

మందగాచెడి వాడవే – నా జాడనెన్నగ తోచదా!
తోవజేసుక చేదుకొనుమా -చేదగతి ఇక నీవెగా!
వేగపడమని వేడుకొందును వేయిపదముల దేవరా!
చేదొకొమ్మని చెతులెత్తెద చెలిమి దెలిసిన దేవరా!

మురికి మగటపు మాంద్యమెంతని ఎంచబోవకు దేవరా!
నీ ఊహ బొందిన రూపమే ఇది పోలికొందుము దేవరా!
ఓరిముడిగెను ఓపకుంటిని తప్పుఒప్పుగ జేయరా!

సామగానలోలా హరీ

సామగానలోలా హరీ – సామగాన లోలా హరీ,
సాధుజన విచారే – సామగాన లోలా హరీ,
మునిమానస సంచారే – మాధవ మదహర శౌరే!
సామగాన లోలా హరే!

వాసవ పరిజన సేవిత – వరనాయక సుర పూజిత,
వాణీపతి వందిత హరి వేడెద నినె కృప జూడగ,
వందిత చరణా మము గావవె – వైకుంఠాలయ వాసా!
సామగాన లోలా -హరీ – సాధుజన విచారే!
సామగాన లోలా – హరీ!

శ్రీసతి నుత మోదిత – శుక మానస సంసేవిత,
కామాంతకు నధి నాయక – కామిని పాప విమోచక,
కరిగాచిన కురు వందిత – నానా విధ విధి భంజక !
సామగాన లోలా -హరీ – సాధుజన విచారే!
సామగాన లోలా – హరీ!

నారద గాన వినోదిత నాదార్చిత వసు సేవిత,
నాగారీ అధిరోహిత నాగాసన సుఖ సేవిత,
నారీజన హిత మోదిత – నారాయణ బిరుదాంకిత
సామగాన లోలా -హరీ – సాధుజన విచారే!
మునిమానస సంచారే – మాధవ మదహర శౌరే!
సామగాన లోలా హరే!

నేనెరుగని నేను

 

నే నెరుంగని నన్ను కావుమో యనటంచు – పలుమారు పిలిచేను రంగా!
నెనరుంచి ఎరిగించు నేనెవ్వరను ఎరుక – వెరపు మాయగ నాది రంగా!
వేడుకొందును నిన్ను రంగా! వేంకటాచల వాస రంగా!

కుడుచు అన్నము నీవు కుడిపించు నది నీవు,
కుడుచు వాడెవ్వడో రంగా!
కడుచు రుచి మోహమున కడు వేదనల మునుగు,
లోనున్న వాడెవడు రంగా! లీలగా నెరిగించు రంగా!
లాలించగా నీవె రంగా! లయకారకుడ నీవె రంగా!
నేనెరుంగని నన్ను కావుమోయటంచు పలుమారు పిలిచేను రంగా!
నెనరుంచి ఎరిగించు నేనెవ్వరను ఎరుక – వెరపుమాయగ నాది రంగా!
వేడుకొందును నిన్ను రంగా! వేంకటాచల వాస రంగా!
ఎవ్వరీ నేనంచు ఎందరడిగిన గాని – మౌనమే బదులాయె రంగా!
మూగ భావన దెలియు మతి నిచ్చి మన్నించు,
మునిమానసోల్లాస రంగా! మరుగేల రా నీకు రంగా!
మముగావగా నీవె రంగా ! మధుకైట మర్దనా రంగా!
నేనెరుంగని నన్ను కావుమోయటంచు పలుమారు పిలిచేను రంగా!
నెనరుంచి ఎరిగించు నేనెవ్వరను ఎరుక – వెరపుమాయగ నాది రంగా!
వేడుకొందును నిన్ను రంగా! వేంకటాచల వాస రంగా!
మోహమొందేదెవరు ? మోహించునది ఎవరు?
మోహ కారణ మేమి రంగా?
మోహ మోదము దీరి బడలి యున్నది ఎవరు?
మొరలెరిగి ఎరిగించు రంగా! మోహ నాశక మేటి రంగా!
నేనెరుంగని నన్ను కావుమోయటంచు పలుమారు పిలిచేను రంగా!
నెనరుంచి ఎరిగించు నేనెవ్వరను ఎరుక – వెరపుమాయగ నాది రంగా!
వేడుకొందును నిన్ను రంగా! వేంకటాచల వాస రంగా!
పాప పున్నెపు పుంత పంతాన పలుమారు
తగిలి తిరునదెవరు రంగా!
పాపచింతన దీర పలుచింతనల మునిగి
పొగిలి పొరలునదెవరు రంగా!
పోలికెంచుము నాకు రంగా! పొంకాన ఎరిగించు రంగా!
నేనెరుంగని నన్ను కావుమోయటంచు పలుమారు పిలిచేను రంగా!
నెనరుంచి ఎరిగించు నేనెవ్వరను ఎరుక – వెరపుమాయగ నాది రంగా!
వేడుకొందును నిన్ను రంగా! వేంకటాచల వాస రంగా!

 

తొలిగుండగ తగునా

తొలిగుండగ తగునా ఓ కరుణా మయ నయనా!
తుంటరి చేతలు నావని – తొలగుండగ తగునా!
తరుణము ఏదని ఎంచకు – తగులగ నా మదినా!
తీరులు తెన్నుల నెంచకు – తెలుపగ నీ కరుణా!

పిలిచిన పలికెడివాడని పదుగురు నిను పిలువా,
పంతంబున బదులీయక తొలిగుండుట తగునా!
పలుచన జేయగ తగునా పిలిచెడి నీ చెలికాడిని?
పిలుపున లోపములెంచుచు తొలిగుండగ తగునా!
తొలిగుండగ తగునా ఓ కరుణా మయ నయనా! తొలిగుండగ తగునా!

వానరు వాలిని గూల్చుగ మాటున జేరిన వాడవు,
మాటున దాగిన అతివను కరుణను జూచిన వాడవు,
మాయల మాటున మలిగెడి మము గావక తొలగుండగ,
మోదము నొందున నీ మది – మదనాంతక శరణా!
తొలిగుండగా తగునా – ఓ కరుణా మయ నయనా !
తుంటరి చేతలు నావని – తొలగుండగా తగునా!

అంబర వీధిన రాశిగ గోళములెన్నో యుండగ,
వసుధను గావగ వెడలిన వేదాంగుడ వైన నీవు,
వసుమతి సంతును గావక తొలగంగా తగున నీకు,
వాసము జేసిన నెలవున మొలచిన మొలకల నేలక..
తొలిగుండగా తగునా – ఓ కరుణా మయ నయనా!
తుంటరి చేతలు నావని – తొలిగుండగా తగునా!

మోహపాశము

మోహపాశము దృంచి పాలింప రావె,

భవమోహ భావనల హరింప రావె,

కలిమి బలిమియు నీవె కరుణింప రావె,

అంధ మోహపు ముడుల నణగింప రావె!

దరివి నీవని ఎరిగి – దారెరుగ లేనే,

దానవాంతక నన్న దయనేల లేవా?

దురిత దూరా యింత దూరమా నీకు?

దుడుకు చేతలు నావి – దయనేల తగనా?

మోహపాశము దృంచి పాలింప రావే,

భవ మోహ భావనల హరియింప రావే!

ఆవలున్నది నీవు – అవని గాచెడి నీవు,

అంతరంగపు గిరుల ఆవరించెడి నీవు,

అదునుగాదయ నీకు ఆలసింపగ నేడు,

మనుగడెరుగని నన్ను మన్నించ రావే!

మోహపాశము దృంచి పాలింప రావే,

భవ మోహ భావనల హరియింప రావే!

మేలు మేలన నీకు మేలెంచు మాకు,

మేను వాలెడి నాడు తోడుండు మాకు,

మోహ తిమిరము  బాప భేదమా నీకు?

భవ బంధ నాశకా భారమా నీకు?

మోహపాశము దృంచి పాలింప రావే,

భవ మోహ భావనల హరింపరావే!

కలిమి బలిమియు నీవె కరుణింప రావే,

అంధ మోహపు ముడుల నణగింప రావే!