కరుణించుమో రంగా

కరుణించుమో రంగా – కరుణించుమో!

కరుణించు కరుణామయ నయనా – సాగర శయనా..

కరుణించుమో రంగా – కరుణించుమో!

సేవించి నిను జేర – దాసి పుత్రుడగాను,

సంగమున నిను జేర – సుదాముడగాను!

సరస సేవల జేర – గోపకాంతనుగాను,

సాదరంబుగ నన్ను కరుణించు రంగా.. కరుణించుమో రంగా – కరుణించుమో!

లాలించ నిను జేర – సతి దేవకినిగాను,

గోరుముద్దల గుడుప – నందకాంతనుగాను!

జతజేరి కవ్వింప గోపబాలుడగాను,

సాదరంబుగ నన్ను కరుణించు రంగా … కరుణించుమో రంగా – కరుణించుమో!

కావరమ్మని పిలువ – పాంచాలి నే గాను,

కదలి రావేమనగ – కరిరాజు నే గాను!

పంతాన నిను పొంద సురవైరి నే గాను,

సాదరంబుగ నన్ను కరుణించు రంగా … కరుణించుమో రంగా కరుణించుమో!

సకలంబు నీవన్న – దైత్యసుతు నేగాను,

నాదరూపుడవన్న నారదుడ నే గాను!

సకల లీలల పొగడ – వ్యాసపుత్రుడ గాను,

సాదరంబుగ నన్ను కరుణించు రంగా .. కరుణించుమో రంగా కరుణించుమో!

నీ పానుపమరంగ – ఫణిరాజు నేగాను,

నీ పాదమూనగా – ఖగరాజు నేగాను!

కరము సోకగ నీది – వెదురు కొమ్మను గాను,

సాదరంబుగ నన్ను కరుణించు రంగా … కరుణించుమో రంగా కరుణించుమో!

కరుణించు కరుణామయ నయనా – సాగర శయనా…

కరుణించుమో రంగా .. కరుణించుమో!

ఒక పరి

నవమోహనా జూడుమా – సిరి పంతాన నినుపొంది మము మాటుజేసెను,
నవమోహనా జూడుమా…. ఒక పరి .. నవమోహనా జూడుమా..

క్షీరసాగరు పట్టి – పట్టి విడువని చేయి,
పట్టి వెన్నల దోచి – పట్టుబడి దొంగంచు ,
పట్టి పంతము మీర – పలుమారు దండింప,
పట్టి కొంగున జేరి – గారవించే వాడ!       ||నవమోహనా జూడుమా…. ఒక పరి||

వసుధ వేడగ వచ్చి – వసుమతినె మరచేవొ,
జలజాక్షి జతలోనె జగమెల్ల జూసేవొ,
జామురాతిరి దాటె జాడైన గనరాదుర,
రాధామనోధార – ధరనేల దిగిరారా!       ||నవమోహనా జూడుమా…. ఒక పరి||

గొల్లపల్లెలు నిన్ను గోవిందుడని గొలువ,
విందులందుచు మమ్ము మరచియున్నావో,
పల్లెవాసులమయ్య రేపగలు తలచేము,
మనసార నినుజేర పురసీమ విడలేము …   ||నవమోహనా జూడుమా…. ఒక పరి||

అల  మేలు గొలుపంగ ఆలించు మామొరలు
ఆలించి లాలించి పాలింపగా నీవె,
పులకింప మామేను పలికించు నీమురళి
మురవైరి ముదమార మదినేల రావేల      ||నవమోహనా జూడుమా…. ఒక పరి||

నేను- నేను

నేను నేనని నీవు జగమెల్ల నిండినా – నేనెరుగ లే నైతి రామా,
నేనన్న నిను నేను ఎందెందు గనలేక – నలిగి నీరస నైతి రామా!

రాముడై నీవచట నిలిచి యున్నను గూడ – ‘నేను’ సోముడనందు రామా!
‘నేను’ రాముడ నైన – నే నెట్లు సోముడను – యోచనే కరువాయె రామా!

నేను నీ ‘తల్లి’నని లాలించగా మురిసి – రాగమందితి గాని రామా!
లాలించు లాలనల నీ లీల గనలేని – రాలుగాయిని ‘నేన’ రామా?

నేను నీ ‘గురువు’ నని గురుతు దెలుపగ మురిసి – గురి గొంటినను కొంటి రామా!
గురుతు దెలుపెడి నీదు గురిలోని గురిగనని – గుణహీనుడన ‘నేన’ రామా?

నేనె ‘తండ్రి’ని యంచు జగము నడుపగ నడిచి – వింత గొంటిని గాని రామా!
జగతి దారుల నడుపు నీ నడత గనలేను – బుద్ధిహీనుడ ‘నేన’ రామా?

నేనె నీ ‘తోడం’చు దరిజేరి జతగూడ – తమకమొందితి గాని రామా!
జతగూడు నీజాడ వివరమెరుగగ లేని – వెఱ్ఱి వాడన ‘నేన’ రామా?

నేన నీ ‘దైవ’మని దరిజేర్చ వత్తువని – పదురాడగ వింటి రామా!
రాచ బిడ్డవు నిన్ను నడచి చేరగ లేని – మందభాగ్యడ ‘నేన’ రామా?

ఏలువాడవు నీవు మోదమొందగ తగును – ఏతీరు గానైన రామా!
మోదమొందగ ‘నీవు’ నాలోమునకేయ – మతిమాలి ‘నేనై’తి రామా!

తీరు తెన్నులు నీవి- తీరమంతయు నీది – మున్నీట మునిగితిని రామా!
తెరపు మరపుల తెరపి తామసము హరియింప – తలపు తెరిపిని నిలుపు రామా!

పరిహాసమది ‘నీకు’ పలుశోకములు మాకు – పాలింపుమో ‘నన్ను’ రామా!
పరచింతనలు మాయ ఎరిగించు నీ ఉనికి – వెరపు మాపుము నాది రామా!

కనుల గట్టగ రాని కారుణ్యమది ఏల – కామ పాశము మాపు రామా!
కదలు జగమున నీదు జాడగాంచగల్గు – కనులు కల్గగజేయు రామా!

కరుణించుమో నన్ను రామా – కారుణ్యపుర ధామ రామా!
కావునను కనికరమున రామా – కాపాడ నా కెవరు రామా?

 

 

 

గురుతునెరుగరె!

గోవర్ధనంబే గొడుగుగా పురజనుల గాచిన గోపబాలుని,
గోవు వాచెడి గోవిందుడంచు గొలుచు వారలు ఎందరు?
గురుతెరుగు వారులు ఎందరో!

మన్ను నాడకు మాధవా యను – నంద కాంతకు వింత దోచగ,
భువనములు తన లోన చూపిన – గడుసుచేతల గోప బాలుడు,
విబుధు లెందరొ వేడుకొనగా – భువికి తరలిన వానవుండని,
గురుతెరుగు వారలు ఎందరో! గోపాలు గొలిచే దెందరో!

చేదుకొమ్మని చెలిమి నిమ్మని – చేరబిలిచిన గోపజనులకు,
తనువు కొక గోపాలుడగుచూ – ఆడిపాడిని నల్లవానిని,
తనువు తనువున తగిలి తిరిగెడి వాసుదేవుడ ఉనికియేనని,
ఎంచువారలు ఎందరూ? గురుతెరుగు వారలు ఎందరు?

వెన్న కడవల కొల్లజేయుచు గోపకాంతల గేలిజేయుచు,
వెదురు నూదెడి వింత పాటల ఆటలో అలరించువాడిని,
వేద విబుధులు వెదకి గొలిచెడి వేద నాధుని ధాతవీడని ,
ఎరుగు వారలు ఎందరూ? గురుతెరుగు వారలు ఎందరూ?

గోవర్ధనంబే గొడుగుగా పురజనుల గాచిన గోపబాలుని,
గోవు వాచెడి గోవిందుడంచు గొలుచు వారలు ఎందరు?
గురుతెరుగు వారులు ఎందరో!

జతగాడు జతగాడ

యమునా తరంగాల జతగాడు జతగాడ
జాగేల ఈ రేయి జతజేర రావేల?

నెలవంక ఏవంకో ఒరిగింది గగనాన,
తెలి మబ్బు పరిచింది చిరువెల్గు తెరచాప
వేణు గానపు నావ నడిపించగా రారా,
రాధా మనోభావ మందార వన వాస
జాగేల ఈరేయి జతజేర రావేల?
యమునా తరంగాల జతగాడు జతగాడ ..

వనిలోని విరులన్ని అరవిరిసి నిలిచాయి,
విరి తావి నీదంచు మరి విరియమన్నాయి,
వనమాల ధరియించి వనినేలగా రారా,
వరమౌని వరపోష వైకుంఠ పురవాస..
జాగేల ఈరేయి జతజేర రావేల?
యమునా తరంగాల జతగాడు జతగాడ…..

కమలాక్షి నిను గనక మనజాలనని తెలుప
కరిగి కన్నులజేరి జగమంత నిండేవొ,
కరుణాలయా నన్ను కరుణింప కరువేల
కలకంఠి గిరికన్నె జతగాని హృదివాస..
జాగేల ఈరేయి జతజేర రావేల?
యమునా తరంగాల జతగాడు జతగాడ…

కనగల కన్నులు

కన్నులు ఇచ్చి – చూస్తున్న ఆనందాన్ని ఇస్తూ – లేనిది కనపడే టట్లు చేస్తున్నావని తెలియను కూడా తెలీకుండా
ఇచ్చిన శరీరాలను తీసేస్తున్నావు ..

కన్ను లిస్తివి గాంచగా – నేనే మి గాంతును దేవరా?
గాంచగలిగిన జగతిలో నీ రూపు ఎందని గాంతురా!
నిన్ను గనగల చూపు నేర్వని కన్నులెందుకు దేవరా?
మాయమోహపు మోజుతో చెదరి చింతల మునుగనా!

మాయయన్నా మేలి ముసుగును ముచ్చటగ అమరిస్తివే,
ముసుగులో పడి తంపులాడెడి సంతు తంతును జూతువే,
తెరపి లేనీ తన్నులాటను రెప్పమాటున జూచుచూ,
మోదమొందెడి నిన్ను గాంచగ ఎరుగవే ఈ కన్నులు! ||కన్నులిస్తివి||

పూవు నీవని తావి నీవని పూర్ణచంద్రుని మోము నీవని,
తొలకరికి మొలకెత్తి నవ్వే గడ్ధి పరకల మెరుపు నీవని,
చిగురు చివరల తొంగిజూసే లెత మొగ్గల శోభ నీవని,
పలువురనగా వినుటెగానీ గాంచ నెరుగవీ కన్నులు! ||కన్నులిస్తివి||

ఏరు నీవని తేరునీవని గగన సీమల జలద నీవని,
తేట ఏటిని పలుకరించే కలువ కన్నుల కలిమి నీవని,
కలలు పండగ రెప్పమాటున మాటువేసిన బాట నీదని,
కవులు పలికిన వినుటెగానీ గాంచ నెరుగవీ కన్నులు ||కన్నులిస్తివి||

నింగి మబ్బుల ఒడిని విడిచీ ధరణి దూకెడి చినుకు నీవని,
చినుకు తట్టగ ధరణి తలుపులు తెరచి మొలచిన పరక నీవని,
పరక కంటిని పలుకరించే జిలుగు వెలుగుల మెరుపు నీవని,
నాటి నుండీనాటివరకు కనుల గట్టగ ఎరుగనే ||కన్నులిస్తివి||

కరకు కిరణపు ఘాతములచే చెలగి చంద్రుని తనువునుండి,
పొంగి వసుధను ఊరడించే సుధా ధారల రూపు నీవని,
సుధాకరములు సోకి పొంగెడి ఓషధులలో శక్తినీవని,
తెలియ జెప్పిన ఎవ్వరూ నీ ఉనికి కనగా నెరుగరే! ||కన్నులిస్తివి||

వాస వాసపు వాసియై ఈ వసుధ నడిచెడి వాడివందురు,
దుడుకు సంగత దడుపుమాపెడి ధీర సంగుడ వీవెయందురు,
తెరపు మరపుల ఆటలో మా తోడు విడువక ఉండినా,
కనుల గట్టగ ఎరుగరే ఈ తనువు వాసులు ఎన్నడూ! ||కన్నులిస్తివి||

వెలుగు గలిగిన కన్నులుండిన ఫలము ఏమనందుమో,
వెన్నుగాచెడి వాని ఉనికిని గాంచ నేర్వని కన్నులు,
మూసి కన్నులు జూడనెంచిన మోహనాంగుని రూపము,
కంటి వెలుగున కదలకుండెడి కంటి వెలుగేలిస్తివో ||కన్నులిస్తివి||

ఆనందా నిలయా

ఆనందా నిలయా – గోవింద రా రా
ఆనందా నిలయా – గోవింద రా రా
నిలు నిలు యని నిన్ను వేడిన నిలవవు
నిలుతువు రాధిక నయనము లందున … ఆనందా నిలయా – గోవింద రారా

నిలుకడ నెరుగని గోపకు గుంపుల ,
గూడుచు మోదము నొందెడి మోహనా,
వేడుక గాదిది మాటుల జేరుట
మాయను విడుమిక మనుపుము నా మొర ….
ఆనందా నిలయా … గోవింద రారా …. ఆనందా నిలయా…

నిను గన తలుపని అసురుల తలపుల
నగినగి నిలచెడి నంద కిషోరా
నిను గన వేచిన మనిగణ మనమున..
నిలువగ తలుపవె నీరజనాభా…
ఆనందా నిలయా … గోవింద రారా …. ఆనందా నిలయా…

మడుగుల దుముకుచు -జలకము లాడుచు,
జీవుల ద్రుంచెడి ద్విజ నణగార్చుచు ,
వేడుక దేలెడి వేద విహారా,
నిలువని నా మది నిలవగు రా రా…
ఆనందా నిలయా … గోవింద రారా …. ఆనందా నిలయా…

కాళిక

కరుణాలయ కనుదోయిని కలిగిన కాళీ,
కామాంతకు మదినేలెడి – దానవ వైరీ,
మణగించవె మదదాహము నామది జేరీ,
శమియింపగ గత కాలపు కర్మల కలిమీ!

పరమేశుని లయ లాస్యపు పట్టపు రాణీ,
పలికింపవె ఆ లయలను నాపురి జేరి,
లయమొందగ పుర వైరులు మూలము వీగీ,
పొంగారగ నునుశోభలు వాసము మించీ!

శత బాహుల మొలనూలును కలిగిన దేవీ,
కాలాంతకు కడతేర్చిన విషధరు నాలీ,
తలపాలను మెడ మాలగ పొసగెడి తల్లీ,
ఆ మాలన నాశిరమును పొదగవె కాళీ!

గొల్లబాలుని ఆట

గోకులంలో గోపాలుని వెంట ఆడుకునే భాగ్యం లేకపోయిందే అనీ, చిన్ని కిృష్ణుడిని దగ్గిరతీసుకుని వెన్నతినిపించే గోపకాంతను కూడా కాలేక పోయినందుకు బాధ పడుతూ, మీద పడిన ముసలితనంతో ఆ గోవిందుని ఆటపాటలు నిండుగా చూసి ఆనందించలేకపోతున్నానే, ‘నా లాంటి వాడికి ఆ లీలా వినోదుడి తోడు దొరుకుతుందా ‘ అని మదన పడుతున్నా ఒక ముసలి గొల్లవాడు…
గొల్లబాలుర గుంపులో గోవిందు డాడెడి ఆటలు,
కన్నులారగ జూచి మురిసే భాగ్యమందుటె వేడుక!
తరలు ఊపిరి వేచియుండగ వేడుకొందును ఎటులనో,
వాదులాడెడి మనసు వగలను చెల్లజేయుదు నెటులనో,
చెల్లిపోయెడి తనువు దయగని తోడువీడక యుండగా,
నందబాలుని బాల లీలల లోచనంబుల నింపెదా!
గొల్లబాలుర గుంపులో గోవిందు డాడెడి ఆటలు,
కన్నులారగ జూచి మురిసే భాగ్యమందుటె వేడుక!
సుడులు తిరిగే బొంగరంబుల ఆట నింపుగ నాడుచు,
సాటి గోపకు సాటి వానిగ సరసమాడెడి శ్యామలాంగుడు,
ఒరుగు బొంగర మందుకొనుచూ కాపు నేనని దెలుపునో
అలుపు దీర్చెడి ఇరువు తానని తీరుగా ఎరిగించునో!
గొల్లబాలుర గుంపులో గోవిందు డాడెడి ఆటలు,
కన్నులారగ జూచి మురిసే భాగ్యమందుటె వేడుక!
కొల్లగా కోలాటమాడుచు కొమ్మలందర బ్రోచుచూ,
కలువ కన్నుల కొలనులో శశి ఛాయగా శోబించుచూ,
కంటి మాటున మాటువేసిన వింటివానిని దృంచుచూ,
కొసరి మోహపు ముడుల నణచెడి వంకనే ఎరిగించునో!
గొల్లబాలుర గుంపులో గోవిందు డాడెడి ఆటలు,
కన్నులారగ జూచి మురిసే భాగ్యమందుటె వేడుక!
చెల్లెనాయువు తరలుమంచు ధర్మదూతలు పితలిచినా,
చెల్లనెరుగని మోహ పాశము పెనుగులాటను పెంచినా,
సురల సన్నుతి నందుకొను ఈ నందబాలుని చేతలూ,
చేరి చెలిమిని పంచుచూ చెరబాపు దారుల నడుపునా!
గొల్లబాలుర గుంపులో గోవిందు డాడెడి ఆటలు,
కన్నులారగ జూచి మురిసే భాగ్యమందుటె వేడుక!
పసివాడనై ఆ ఆటపాటల గూడు తరుణము మించినా,
గారవించగ గోపకాంతగ తనువు నొందక పోయినా
నందగోకులమందు నడచిన మందభాగ్యపు ముసలిని,
చేర బిలిచెడి చెలిమి తానని చెరి వెరపును బాపునా!
గొల్లబాలుర గుంపులో గోవిందు డాడెడి ఆటలు,
కన్నులారగ జూచి మురిసే భాగ్యమందుటె వేడుక!

కొమ్మల నూగుచు

కొమ్మల నూగుచు నందుని బాలుడు రమ్మని పిలిచే మురళిని ఊదుచు
కోమల గానము మోసిన గాలులు – దయగని తెలుపవె నా దీనపు దశలను!

పదములు కదిలిన మువ్వలు కదులును – మువ్వలు కదిలిన అడుగులు దెలియును,
అడుగుల కదులగ కారణమేమని – పదుగురు అడుగగ ఏమని దెలుపుదు?
కదలని పదముల పరుగిడు గుండెల వేదన దెలిపవె పిల్లన గ్రోవికి ….

కొమ్మల నూగుచు నందుని బాలుడు రమ్మని పిలిచే మురళిని ఊదుచు

చల్లల చిలుకుచు లేగల జూచుచు అలసిన తనువున తరలగ లేకనే,
తనువున చల్లిన చందన గంధము – దాగక తెలుపును తరలెడి జాడను,
జాడల చాటున నలిగెడి నెచ్చెలి – వేదన దెలుపవె వెన్నల దొంగకు …

కొమ్మల నూగుచు నందుని బాలుడు రమ్మని పిలిచే మురళిని ఊదుచు…

చల్లల నమ్మెడి తరుణము గాదిది – నీరము కేగెడి సమయము గాదిది,
వంకలు లేకనె వాకిలి దాటెడి – వసతులు ఎరుగని గొల్లల పడుచును,
ఉల్లము బాసిన చెలియను నేనని – చేరగ రమ్మని తెలుపవె గాలీ..

కొమ్మల నూగుచు నందుని బాలుడు రమ్మని పిలిచే మురళిని ఊదుచు…..