వేనుడి కథ – భాగవతం

4th  స్కంధము :  ధృవుడి వంశములో అంగరాజు సంతానం లేకపోవటం వల్ల – పుత్రకామేష్టి చేసి ‘వేను’ అనే కొడుకుని కన్నాడు.  ‘వేనుడు’ పరమ కిరాతకుడు.’దుష్టుడైన పుత్రుని భరించటం కంటే త్యజించటం ఉత్తమం’ అని – అంగరాజు ఒక నాటి అర్ధరాత్రి అందరిని వదలి వెళ్ళిపోతాడు. ఎంత ప్రయత్నించినా అతని జాడ తెలియక పోవటం వల్ల, ఋషులు వేనుడికి రాజ్యాభిషేకం చేస్తారు. వేనుడి కిరాతకత్వానికి రాజ్యాధికారం తోడై  ప్రజా కంటకుడిగా మారిన వేనుడిని ఋషులు మందలించబోయి అవమానింపబడతారు. ప్రజాహితం కోసం ఋషులు వేనుడిని శపించటం వల్ల అతను మరణిస్తాడు. వేనుడి తల్లి ఆశరీరం పాడుకాకుండా తన యోగశక్తితో కాపాడుతుంది. కొంతకాలానికి ప్రజాక్షేమం కోసం ఋషులు వేనుడి వంశాన్ని ఉద్దరించడానికి అతని శరీరాన్ని ‘మధ్ధిస్తారు’. ముందుగా వేనుడి ఊరువులు (తొడలు) నుంచి ‘కిరాతుడు’ పుడతాడు. అతడే బోయ వంశాంకుతరం. వేనుడి ‘బాహువులు’ మధ్ధిం’చటం వల్ల – విష్ణాంశ సంభూతుడైన ‘ప్రుథు’వు , లక్ష్మీ అంశ గల పుత్రికా కలుగుతారు.

కనుక:  దుష్టునికి దుష్ట సంతానం – శిష్టునికి మంచి సంతానం కలుగుతుందని చెప్పలేము.

🙏🏼

నామ ఋచి.

మహతి పలికెడి దివ్య నామంబు వినరే!

కుడిచి వీనుల ఉనికి మోదంబు గనరే!

ఆద్యంతములు లేని ఆనంద నాదంబు,

అలుపెరుంగక మహతి పలికేటి నామంబు,

అసురాంతకుని జాడ నెరిగించు నామంబు,

అందరే తరియింప తలపు గల వారంత!

వరమౌని వరియించి జపియించు నామంబు,

వనిత శ్రీసతి మెచ్చి వరియించు నామంబు,

వనవాసులనుదినము జపింయించు నామంబు,

వరదుడై మనివరుల గాచేటి నామంబు!

నింగి నేలను మ్రింగు మహిమ గల నామంబు,

నియతి నియమము దెలుపు దొడ్డ నామంబు,

నిటలాక్షు మదినేలు బహు పుణ్య నామంబు,

నిహిత హితకర గంధ ఋచియైన నామంబు!

విన్నపాలు

విన్నపంబులు వినగ రమ్మంచు పిలుతురని,
కనులు మూసుక నిదుర నటియింతువేమో!
వెన్న తిందువు రారా ! రాజీవ లోచనా!
చల్ల కుండలు నిన్నె కలువరించేను!

ఆలమందలు నిన్ను మరిమరీ పిలిచెనని,
అలసి నానని నీవు తొలగుందువేమో!
లేగ లెరుగని గుమ్మ పాలు నీకిమ్మంచు,
గంగి గోవులు పితికె కడవ  పొర్లంగా !

యమున పై నాడేటి పిల్ల గాలులు నిన్ను,
పలుమారు పిలుచు నని మలయింతు వేమో!
వెదురు వేణువు జేరి పలుక నేర్చిన గాలి,
రాధ ఊపిరినందె నిన్ను  జేరంగా !
(మలయించు : తప్పించు)

గొల్లకాంతలు నిన్ను గారవింపగ నెంచి,
గోవింద యని పిలువ మాటు నొందేవో!
చద్ది సర్దిన ముంత అరుగుపైనే ఉంది,
అందుకుని పొమ్మంచు కబురు పంపేరు!

పాల్కడలి పరుపై పవ్వళించె తండ్రి,
జగమెల్ల నిండినది నీ ఉనికెగాదా!
నిన్ను తలచెడి వారు నీవుగాకింకెవరు?
అంబుజోదర పరులెవరు నీకు?

విన్నపంబులు వినగ మరుగేలనైయ్యా !
వృషభాను పట్టి నీ దారిచూసెను !!

🪷

మరుగు వీడు

దిక్కు నీవని నమ్మి – దీనతొందుట మాని,
ధీమంతనై మసలు ధీరతొందెటి తరిని,
దివిజేంద్ర వందితా – మన్నించి ఎరిగించు,
దివ్యుండు దరిజేరి తరలు మనులోపు!

అందుబాటున ఉన్న అందలేననుకుంటె,
ఆవేదనధికమై బ్రతుకు బడలు,
అవని అంచులపైన ఎక్కడో కలవంటె,
అందు తరి లేదంచు బడలు మనసు!

పాల్కడలి డోలలకు తూగు పానుపు పైన,
సిరి కొలువగా మురిసి పవళించు సామి!
కలువ కన్నుల కలల ఆడేటి బొమ్మనని,
మోదమొందుచు నన్ను పరికింతువేమో!

కలనీకు ఇలమాకు కావుమో దేవరా,
కలలోని నను జేరి కరుణ జూడు,
నీ ఊహ ఊపిరుల ఉయ్యాల జంపాల,
ఊపు తాళగ గల్గు తీరు దెలుపు!

ముని కంటి చెర నీకు మచ్చటైయ్యేనో!
మౌని మానస వనులు మరులు గొల్ఫేనో!
మాధవా యని చేరు గోపకాంతల గూడి,
మాపు రేపూ యంచు నన్ను మరచేవో!

నంద నందన యంచు భావించుటే గాని,
సుందరుండగు నిన్ను గాంచలేను,
మందగించిన నాదు భాగ్యంమ్ము సవరించి,
బృందావనోల్లాస మనుపు నన్ను!

తనువిచ్చి ఆడించి మోదింప తగునీకు,
ఆడించు నిను దెలియ తగద మాకు?
ఆట ముగిసే లోపు ఎరిగించు నీ ఉనికి,
శ్యామసుందర సంధ్య చేరువాయె!

(దివ్యుడు : యముడు)

కబురు

మహతీ నాదము పంచుచూ ఈ జగము దిరిగెడి దేవరా!

నాదలోలుని దయను పొందెడి దారి దెలుపుము తీరుగా!

వాడ వాడల నడచు వేళల వైనతేయుని ఏలువాడిని,

జంట బాయక వెంట గైకొని వెడలు తీరును దెలుపవే!

వాదులాడుట మాని నామది వాసుదేవుని నామ పానము,

కోరి కొసరుచు అంది మసలెడి దారి దెలుపుము దేవరా!

గగన వీధుల దేలుచూ ఈ జగము వింతలు జూచుచూ,

సురగంగ బుట్టిన పాదమును నీ మానసంబున తలచుచూ,

తగిన దిదియని తగదు ఇదియని తలుప నేరక ఎంచుతచూ,

తామసాంతకు తగిలి యుండెడి తీరు దెలుపుము దేవరా!

పలు విధంబుల పలుకరించే వసుధ శోభల ఉనికిలో,

పాపహరుడగు మాధవుని నీ కనుల గట్టగ చూచుచూ,

కర్మ బంధపు కొలిమిలో చిరు సమిధలౌ ఈ జీవుల,

ఇడుము దీరెడి ఇందువదనుని నామమొసగ నెంచవా?

వసుధ మరువని వల్లభుని ఈ వాసులేమని మరతురో,

వల్లమాలిన మాయ చెరగున చేరి మురిసేదేటికో,

కలలు మానా కలువ కన్నులు నిన్ను గాంచెటి వేళలో,

వేడి ఎరుగుము దేవరా మా పాటు మాపెడి తీరును!

పాలసంద్రపు ఇంతి సేవల సేదదీరెడి వేళలో,

పుణ్యపురుషుల పూజలందుక మోదమొందే వేళలో,

దారిజేసుక దరిని జేరిక కబురు దెలిపే వేళలో,

తెలుపుమా ఆ పద్మనాభుకు నన్ను కన్నుల జూడగా!

వరహావతారము

శ్రీమన్నారాయణు యజ్ఞవరాహ రూపం ధరించి దేవతలకు సంతోషం కలిగే విధంగా హిరణ్యాక్షుడితో యుద్ధం చేస్తుండగా – ఆ తాకిడికి తట్టుకోలేక సముద్రుడు పొంగి ముల్లోకాలను ముంచాడు – అన్న సంఘటనకు …
పెను రక్కసుడు జేరి పెకలించె పురినెల్ల,
జీవజాలంబెల్ల కొల్లబోయె,
ధాత్రినక్కున జేర్చి గొంపోయె తనపురికి,
దిక్కుదోచన నేను బిక్కనుంటి!

వల్లమాలిన వాడు వదులడే ధారుణిని,
ధాత సంతతి నడలి ఏలుకొనను,
వెలికి వానిని బంప వైన మెరుగను నేను,
జగము గాచెడి వాడు అరుగువరకు!

అల్లదే అరుదెంచె అరుదైన రూపమున,
అవని గావగ వెడలె ఆర్త హరుడు,
అంది యా పాదమును తరియింతునే నేను,
తరతరంబులవరకు తరిని గొనగా!

హతమార్చగా అసురు అందినా రూపంబు,
వరహావతారమని మునులు పొగడె,
మునుపెన్నడెరుగనీ ఆవేశమును బొంది,
ఆడెనే ఆ సామి నాదు ఒడిలో!

ముట్టె తగిలిన నన్ను మద్దాడెనని ఎంతు,
గిట్ట దగిలిన నాదు భాగ్యమందు,
సిరి మెచ్చినా పదము కోరి ఊనగ నాకు,
తరమౌనె ఏ తపము జేసియైనా?

మేని రోమమునంటి తరియించె జలరాశి,
మేలు సేయగ నేను మనుగడెల్లా,
శమియించె మదమెల్ల పెను ఘాతములనంది,
శేష శయనుని మేని వర్ణమంది!

తిరిగి తిరిగీ సామి తిమిర లోకములందు,
దృంచె నసురుని దెచ్చె ధరణిపైకి,
పంకమంటిన మేను ప్రేమతో సవరింతు,
అలల చేతుల తోన తనివిదీరా!

ఎన్నడో మరియింక ఆసామి నే జూతు,
జగము లే లెడివాని నంద గలనే!
భాగ్యమన్నను నాదె జలకంబులాడింప,
జగము లాడించేటి విభుని నేడు!

గంగబుట్టిన పదము పలుమారు లాడగా,
పరమ పావనమాయె జలములన్నీ,
పున్నెంపు మునకలని పున్నమికి మునిగేరు,
యుగము నాడెడి జనులు భక్తిమీర!

ధవళ వర్నపు మేను ధరియించి నాసామి,
గాచి దెచ్చిన పుడమి నేలు వారు,
కొనియాడరే వాని వరహావతారుడని,
ధరణిచ్చి గాచెనని ఆయువంతా !

శుద్ధ వర్ణము నంది వరహావతారుండు ,
గాచి దెచ్చిన భుమి నడచువారు,
కల్పంబు పేరిడరె శ్వేతవరాహంబంచు,
కదలాడు ప్రతిజీవి వాని తలువ!

తొందర!

గోవుల గాచెడి వాడట – గోపీజన వల్లభుడట,
గోపాలుర గూడి ఆడి మోదించే గోపకుడట!
గొడుగుగ గోవర్ధనంబు నిలిపిందీతండేనట,
గొనునట ఏ పూజైనా గోవిందాయనగా!

సిరి మెచ్చిన శ్రీకరుడట – శ్రీవత్సము గలవాడట,
మణి మాణిక్యపు కొల్లలు వెల్లువ గలిగినవాడట,
చల్లన దేలెడి వెన్నకు వెనుకాడని పసివాడట,
పన్నగసాయి అంటే పాపము హరియించేనట!

ముల్లోకపు మూలంబును కడుపున కలిగినవాడట,
ముచ్చటగా గోపెమ్మల విసురుల నందెడివాడట,
మునుగడచిన యుగములన్ని వివరముగెరిన వాడట,
మూసిన కన్నుల లోపల కదలాడే దొరవాడట!

కామిత వరదుడు వాడట – కారణ మడుగని వాడట,
హరిరూపమె హరియంచు మాయన మునిగిన వానికి,
హరిరూపము నందజేసి మోదముగా మదమణచిన
జగమెరిగిన ఈశుండీ తుంటరి మాధవుడేనట!

(శ్రీ నారద మునీంద్రులు ఒకానొక సందర్భంలో ఒక రాకుమారి శ్రీహరిని వరిస్తుందని తలిసి, హరి మాయ వల్ల ఆమెను మోహించి, తనకు శ్రీహరి రూపము ఉంటే మాగుండును అనుకొని, ఆ పరమేశ్వరుని తనకు ఆ లీలామానుష స్వరూపుని రూపము ఇవ్వమని అడిగాడట. అప్పుడు ఆ పరంధాముడు నారదునికి తన శరీర ఆకృితిని ఇస్తూ శిరస్సు మాత్రా ‘హరి’ (కోతి)ది ఇచ్చాడట. ఆ పరాభవానికి ఉగృడైన నాదుడు (శ్రీరామావతారానికి నాంది పలుకుతూ,) ” ఒక నాడు నీ కార్యం నెరవేరడానికి కోతి ముఖం గలవారినే శరణు వేడెదవుగాకా’ అని, భక్తసులభుడైన ఆ వైకుంఠుడిని శపించాడట. )

పూలను మించిన మెత్తటి శ్రీసతి కరముల సేవలు,
శేషించని సోయగమున అమరిన శేషుని తల్పము,
మోదముకై అమరియున్న ముల్లోకపు కల్లోలము,
అందెడి లీలాలోలుడు గోకుకలమున ఆడేనట!

అంతటి ఆ మహనీయుని జంటగ ఆడినవారలు,
పంతముతో వైరమొంది రణమున పోరిన వారలు,
రారా యని ముద్దుజేసి బుగ్గలు పణికిన వారలు,
ఏరీ ఈ ధారుణి పై స్థిరముగ నుండగ లేదే!

తెరపెరుగక మరుగగునీ మహిబుట్టిన వన్నీ,
కారణమడుగని కాలుడు తరలించును అన్నీ,
తెరిగొనగా తగియున్నది తారక నామంబొకటే,
తొందర నొందుము తగులగ తర్కమువిడనాడి!

 

ఆత్మ బోధ

ఆర్తి దీర్చెడి వాడు అణువణువునా వుండి – ఆవరించుండునని ఎరుగవే మనసా!

అంధకారపు వెరపు అవధి దాటేనంచు – ఆయాస పడనేల మనసా?

నిలవరింపుము వెఱ్ఱి మనసా!

పగలు రేయీ నిన్ను పరికించి చూడంగ – సూర్య చంద్రులు ఆయె మనసా!

ఆ సామి కన్నులను కనుల జూడక నీవు – పలవరించే వేల మనసా?

వాదులాడుట మాను మనసా!

వద్దు పొమ్మని నీవు వెడల నడిపిన గాని – ఊపిరై జేరునే మనసా!

గాలి తరకగ జేరి తనువు నిలిపెడివాని – జాడనెంచ వదేల మనసా?

జాగేలనే నీకు మనసా!

ఎన్నడో ఒకనాడు ఎరుక పరచిన తెలివి – నిలిపి నీ కెరిగించు మనసా!

వాడు తొలగిన నాడు తెల్లబోవును తెలివి – తునకలై పోవునే మనసా!

తుది గడియ నీకదే మనసా!

వగచు కన్నుల తాను నీరుగా ఉప్పొంగు – తల్లి చన్నున తాను పాలుగాను,

తనువొల్లనా తిండి తనువు బైటకు నెట్టి – తనువు గాచును నీది మనసా!

తగిలుండునే నిన్ను  మనసా!

తీరు తెన్నూ లేని దారి నడిపేనంచు – దెబ్బలాడకు వెఱ్ఱి మనసా!

వింత దారుల జగతి వివరమెరుగక వేచి – విశ్రాంతి నొందవే మనసా!

విసిగి వేసారకే మనసా!

దారిలేనొక దారి నడచునీ జగమెల్ల – నింగి తారల జూడు మనసా!

యుగము గడచినగాని ఎరుగరే ఏదారి – మనుగడెంతని నీది మనసా!

మారాము మానవే మనసా!

నీదిగానీ తనువు తొలగి పోయేనాడు – తోడెవ్వరే నీకు మనసా!

నిదురలో నినుగాచు నీరజాక్షుని ఉనికి – తెలసి తగులవదేల మనసా?

తరియింప తలపవే మనసా!   తారకంబదె నీకు మనసా!

నిలువని కాలము

ఏదీ నీ సంచార జాడ ఎదగట్టుట లేదే ,

మంజుల భావపు కుంజము అగుపించుట లేదే!

అద్దరి జేర్చటి నావీ కనుచూపున లేదే ,

కమలాకర పొడ గట్టర కన్నుల కిపుడైనా!

ఆగని కాలపు వాహిని తరలించుకు పోకమునుపె,

తనుభారము బహుళంబై తెగి వీగక ముందుగానె,

భస్కర పుత్రుడు నాకై కబురంపక ముందుగానె,

తెలియగ జేయుమ నీదయ తాపంబులు దీరా!

వెలుగులు తరిగీ కన్నులు మరుగున జేరక మునుపే,

చేతన ఉడిగీ చేతులు చేతల వీడక మునుపే,

వీనుల వాకిలి తలుపులు మూసుకు పోవక మునుపే,

వేడుక గాదిది వేగమె కరుణింపగ రారా!

మరి రానని నా ఊపిరి మరలగ నెంచక ముందే,

అశ్రాతపు నా నాడులు శాంతింప ముందుగానె,

ఊహల మెదిలెడి భావము ఊనికి వీడకముందే,

విశ్వాంగుడ వివరింపర నీదయ వివరముగా!

ఏదీ నీ సంచార జాడ ఎదగట్టుట లేదే ,

మంజుల భావపు కుంజము అగుపించుట లేదే!

అద్దరి జేర్చటి నావీ కనుచూపున లేదే ,

కమలాకర పొడ గట్టర కన్నుల కిపుడైనా!

నల్లనయ్యా !

తప్పులెన్నక గాచు గట్టి దేవుడవంటె –
నను తుంటరని ఎంచి తొలగుందువేమో!
గొల్ల పల్లెల నాడు మా మంచి దొర యంటె,
చల్ల ముంతల దోచ రమ్మందు వేమో!
నల్లనయ్యా నన్ను ఉడికించ కయ్యా!
నీ లీల దెలియ నా తరము గాదయ్యా!

విజయు మెచ్చిన మంచి వన్నెగాడవనంటె,
కరకు దారుల నడువ రమ్మందు వేమో!
పాల్కడలి చిన్నారి పెనిమిటివి నీవంటె,
కడలి చిలకగ కదలి రమ్మందువేమో!
నల్లనయ్యా నన్ను ఉడికించ కయ్యా!
నీ లీల దెలియ నా తరము గాదయ్యా!

కరుణాల బాల నను కరుణ చూడు మనంటె,
కరిగి కన్నుల జేరి కవ్వింతు వేమో!
కాలయవనుని బ్రోచి కడదేర్చినా రీతి,
ఆటగా నను జేరి పూడ్ఛరావయ్యా!
నల్లనయ్యా నన్ను ఉడికించ కయ్యా!
నీ లీల దెలియ నా తరము గాదయ్యా!