ధాత కరుణ

ఆది అంతము లేని ఆనందరూపుడా – అలరారు ఆనంద అరవింద లోచనా !
అంతరంగపు రంగ మమరుండు యోచనా – అంది యోచన రూపు నలరారు తేజమా!

లోనన్న ఒక చోటు లోపించు లోచనా – లోకమంతా తానె నిండున్నా యోచనా!
లోపమెన్నగలేని లయలొందు లాస్యమా – లోతెరుగ లేనట్టి లోతైన భావమా !

రమ్యమగు నీ ఉనికి భావింప భాగ్యంబు – రసమయంబగు రీతి భాసించు భావనలు,
రమణీయమగు నీదు మోహ మాయను దెలియ – రజోగుణములు రగిలి రాజిల్లవలెనా?

చతురానుని మదిన చిరు అంశవైనీవు – చతురతగ నెరిగింప నెరుగొందె నతడు,
చలనమొందెడి తావు ఇరువెరుంగని నీదు – చక్కదనమును పొగడ పదముగలదె!

సాటిలేనీ ప్రతిభ ప్రభవించు భావముల – సారమెరుగగ గలుగు సాధ్వులెవరు?
సావధానము నొంది శోధించవలెగాని – సాధుమానస వర్తి నెరుగ గలమే!

అంబుజాసను ధాత అరవింద నయనముల – అందచందము లెంచ అలవి యగునే!
అణువణువు తానుగా భాసించు భాస్కరుడు – అనుభవముకే గాని విదతమగునే!

వాణీశుడెరిగినా మూలపురుషుని రూపు – జగతి మూలమనెంచె మానసమునా!
జగమె తానగు రూపు కట్టడికి తగదంచు – జగమెరుంగగ దెలుపు ధీరుడెవరు?

మందహాసము చిందు మధురానను కనిన – మధుర భావన పొంగి పొరలుగాదె!
మదినిండినా తరిన మూగదనమేగాని – మణులు మాణిక్యాలు మెదల గలవె!

కనువిందు జేసేటి కరుణాంతరంగుండు – కదిలి మది జేరేటి దారి దెలిసి,
కరుణగొన్నా విభుని కొనియాడ తరమౌనె – కర్ణకుహరపు దారి తెరచి ఉంచి!

దిక్కు

వెలి మబ్బు తొలగింక వెన్నెలలు కురియునని
వేచి యుంటిని నేను కమలాక్షు దయగోరి,
వెలి ఆయె బంధంబులు – తొలుత నే నల్లినవి,
వెతలాయె మోదములు మౌనముగ మదిలో!

తనువు నిచ్చిన తల్లి తరలి పోయెను వీడి,
వాసమిచ్చిన తండ్రి ఆమె వెంట,
బ్రతుకు దారుల వెంట వెన్నాడు బంధాలు,
పిలిచి పన్నులు గుంజె పాడియంచు!

పరువంపు పరుగులో పగలురేయీ గడిచి,
పంతమందిన బిగువు వీగిపోయే!
పలుమారు మురిపించి చేరినా చెలులంత,

పలుకరింపుల మాని తొలగిరిపుడు!

పాలుగారే వయసు ఆటపాటల గడిచె,
పాలుపంచుక తోటి సఖులతోన,
పాయసాన్నము పంచి సంతు నందితి నేను,
పాతకంబుల గంప పంచుకొనగా!

వీనులందున విందు నందించు పవనాలు,
వీణ తంత్రులు మాని మీటె నరము,
వీని జాడన జేర వెతలు దీరేనంచు,
వీధి వీధీ తిరిగి అలసినాను!

వెన్న కుడిచేవాని వెన్నలాటల జేరి,
వెదురు పాటన పలుకు కలుపుకొనుచు,
వెతల మరచేవారి తోడు తగులెడి తీరు,
వెదకి వేదన నొంది విసిగినాను!

భవసాగరము దాటు తీరునెరిగిన వారు,
భవబాధలను మాపు మంత్రమెరిగిన వారు,
భయము బాపెడి తోడు నంది నడిచెడివారు,
భవదీయుడని నన్ను చేరనగునే!

భావమున వసియించు వాసుదేవుని తలచి
భావ మాలల నల్లె మునుపు మునులు,
భాగవత రూపమౌ మహనీయు జతనొందు,
భాగ్యవంతులు నన్ను కరుణ గనరె!

తార సంగము వీడి రోహిణీ పతి నేడు,
తామసంబున మునిగె విభుని జూచి,
తాను జేరగలేని కలువ కొలనున మనిగి,
తారకంబగు పదము నందగోరె!
తగులడే ఆ విభుడు కొంత తొందరనొంది,
తరుగు ఆయువు కరిగి తొలగులోపు,
తరుణ పాదము మోపి అహము భిన్నము జేసి,
తరలించి ఈ తనువు తోడునిడగా!

వెలి మబ్బు తొలగింక వెన్నెలలు కురియునని
వేచి యుంటిని నేను కమలాక్షు దయగోరి,
వెలితి నెన్నకు నన్ను తగుదాన గాదంచు,
వెతల బాపెడి దిక్కు నీవెగాదా!

పదము

ఆర్తజనమానసము లందగోరే పదము,
అవనీశులనవరత మాశ్రయించే పదము,
అతివ శ్రీసతి మెచ్చి మనసిచ్చినా పదము,
యోచనందున నిలుప యోచించు మనసా!

మునిమనోవాటికలు వేచి జూచే పదము,
మునుల మౌనమునందు నాదించు పదము,
ముని సంగముల సంగమాదరించే పదము,
యోచనందున నిలుపయోచించు మనసా!
అవని భారము దీర్ప అవతరించిన పదము,
అసురు ద్రుంచగ  ధరణి నడిచెనీ పదము,
అలస మానస అరకు అనరు ఈ పదము,
యోచనందున నిలుప యోచించు మనసా!

భవ బంధముల బాపు భవ్యమగు పదము,
భవ సంకటము గూల్చు సౌజన్య పదము,
భయభారమును దీర్చు దాక్షిణ్య పదము,
యోచనందున నిలుప యోచించు మనసా!

ఋషి యోచనాలోచ నందాడు పదము,
ఋగ్యదుసామములు కీర్తించు పదము,
ఋణ సంకటము దీర్చు ఋజువైన పదము,
యోచనందున నిలుప యోచించు మనసా!

ఎరుక దెలుపు

ఎల్ల వాసములందు వసియించు వాడెవడు ?
వైనమేమది వాని నెరుక గొనగ?
తెలుపవే నా తల్లి తేట పలుకుల కలిపి,
ఏమరక నే నెరిగి మసులుకొనగా!

వాసమేదని ఎంచు వైనమెరుగనివాడు,
వాసమౌనది వాని ఉనికి వాలన,
వాని ఉనికిని వీడి వీగిపోవీ జగతి,
వాసుదేవుడు వాడు ఎరుగు తండ్రీ!

రూపు రేఖలు ఏవి? ఎవరి పుత్రుడు వాడు?
గురుతు దెలుపుమూ వాని నెరుకగొనగా!
పలుమారు లడుగకే పలుకవే నా తల్లి,
ఏమరక నేనెరిగి మసులుకొనగా!

ఆది దేవుడు వాడు ఆద్యంతమును వాడు,
అమరుండు నీ జగతి అణువులెల్లా,
అలికిడందున వాడు ఆలకించెడి వాడు,
అంతరంగము నందు నెరుగు తండ్రి!

అంగమెరుగని వాని నే పురము నే గాంతు?
అవని అంచులనేను అందలేనే!
ఆదరము నెరిగించు అనురాగముల తల్లి,
ఏమరక నేనెరిగి మసలుకొనగా!
అంగాంగముల నాడు జీవనాడులు వాడు,
అవని ఉనికిన నిండి ఉండువాడు,
అవధులెరుగని వాడు అవధెవాడగువాడు,
అండవాడే నీకు ఎరుగు తండ్రీ!

అన్నపానము లేమి ఏమి కుడుచును వాడు?
అందనెంచును ఏమి ఆదరమునా?
ఏరీతి నర్పింతు నెరిగింపుమో తల్లి
ఏమరక నే నెరుగి మసలు కొనగా!

కుడుచు కుడుపులు వాడు కుడిచెడదియును వాడు,
అందునే కుడుపైన ఆదరమున,
అందించు అంతరపు ఆదరంబేగాని,
కడుపు నెన్నడు వాడు ఎరుగు తండ్రీ!

నామ మేమది వాని నోరార పిలువంగ?
వాడు మెచ్చెడి నామ మేది దెలుపు
నలుగు రెరిగెడి రీతి నెరిగింపుమో తల్లి,
ఏమరక నే నెరిగి మసలు కొనగా!

నామమొకటని లేదు ప్రతి నామమును వాడె,
నామ మెరుగని వాడు నాది వాడు,
నామమెంచక నాద భావంబు వినువాడు,
ఆది నాదము వాడె ఎరుగు తండ్రీ!

మధుర వాసా

నను బ్రోవ తగినంత ఆర్తి లేదని తలచి – చిద్విలాసము నొంది చూతువేమో,
అనరు లెరుగని నేను ఆర్తియన్నెరుగనే – ఆ నంద నందన నన్నాదరించు!

తపియించినే గాని తగులనని ఎరిగించి – తొలగియుండుట నీకు తగినదౌనే!
తాపసుల తరమౌనె నీవు మెచ్చెటి తపము – తామసపు తనయులము మాకుతరమె!

తోయజాక్షుడవంచు తలపు నింపిన వారు – తపోభూముల తనువు తార్చువారు,
తరగు ఆయువు లెక్క తలపుజేరగ నీక – తగుల గలరే నీదు తపము నందు!

వాసనా మయమైన జగతి దారుల బట్టి – తెరపెరుంగని సుడుల తరులు మేము,
వాసుదేవా యనగ తెరపెరుంగగ లేము – వారిజానన మమ్ము వొడిసి బట్టు!

కల్ల లెరుగని వాడు కలిదోష నాశుండు – కాచు మమ్ములనంచు వేచియుండ,
కంటకబైనట్టి గడుల గడువమటంచు – కొసరి పంతములాడ తగునె నీకు?

కమలాక్షి వల్లభా కటిక వారముగాదు – కాల దోషమునంది క్రుంగువార,
ముని మానసోద్ధార మనపు మమ్ములనింక – భాగ్య మాంద్యము దీరి మోదమొంద!

కులశేఖరుడ వీవు కావ నీవే మాకు – కొదువ లెన్నగ నీకు తగదు తండ్రీ,
కూరిమొసగ నీవె కీడైన నీ సెలవె – కావమాకింకెవరు కామజనకా!

కీడు గడుపగ నిన్ను కీర్తింప లేమైతి – వనగచు మనసును నిలుప మాకు రాదు,
నిగమాంతకా నీవె నిలవరించుము మమ్ము – నెమ్మదొందగ మేము కీడు గడిచి!

చాటు మాటున నిలచి చారెడగు కన్నులతొ – కనిన మాకేమంత కదురు గలుగు,
మాయతెర తొలగించి నగుమోము జూపించి – కనుల గట్టిన నీకు ఘనతగాదె!

పేరు పేరున నీవె – పిలిచి పలికెడి నీవె – వీనులందేలనో వీగిపోవు,
మూయుటెరుగని దారి నెరపి ఎంచవదేల – ఎంచి లోపములంచు మరలకయ్యా!

మారాము మరిపింప గోపకాంతను గాను – ముద్దుశాయగ నేను రాధ గాను,
మరుగు మాపుమటంచు మరగు జీవిని నేను – మాధవా మదిజేరు మధురవీడి!

 

 

 

హరియింపవె వడిగా!

ఎన్నడు గులుగును తెరపిక – ఎన్నడు నే తరిని గొందు?
ఎన్నడు నే నెరుక గొందు – ఎదనిండంగా !
ఎన్నడు నే నరమరికలు మరువగ తలుతును వానివని?
ఎవ్వని మును తలచి మునులు మాన్యత నొందె!

ఎన్నడు గులుగును నాకిక వివరంబగు విదిత బుద్ది?
ఎన్నడు నా మానసంబు మడియును తుదిగా!
ఎన్నడు నే సంగమింతు సాంత్వన నొందగ నాలో
ఎవ్వని సంగము సాంత్వన సారంగుల కిలలో! (సారంగుడు – వేటగాడు/శివుడు)

ఎన్నడు తొలగును బంధము ఎన్నడు నే బారగలుగు?
ఎన్నడు బడయుదు నే బంధంబుల మాపు తరిని?
ఎన్నడు నే నడయాడెద బంధము తొలిగెడి బాటన?
ఎవ్వని బాసిరి విబుధులు బంధంబులు తొలగా!

ఎన్నడునే నెరుక గొందు బంధపు మూలంబేదని?
ఎన్నడు మూలము మాపెడి మందాకిని కనుగొందును?
ఎన్నడు ఆసాంతంబుగ శాంతమొందు తరి తెలియును?
ఎవ్వని శాంతాకారము లిచ్చును శాంతంబున మునకా!

ఏబాంధవు బంధుత్వము బంధము లూడ్చెను మునులకు?
ఏబంధము భవబంధపు బంధము మాపును మదిలో?
ఏబంధము బాయంగా బంధువు లగుదురు ఎల్లరు?
ఎన్నగనే బంధంబున జిక్కగ నెంచిరి తపసులు !

ఎన్నగ నా పరమేశుడు ఎన్నిక జేయునదెన్నడు?
ఎడబాయని బంధము నా కందగ జేయునదెన్నడు?
ఎదనిండగ ఆ బంధపు ముడి నే మడయుటదెన్నడు?
ఎరుకగ నే నా బంధపు బాంధవు గాంచుదన్నెడు?

ఏమరపాటెరుగక నే తగు యోచన తగిలియుండ,
ఏకాంతపు జతగానిని మచ్చిక నామది ఎన్నగ,
ఏ కారణ మెంచకనే కారుణ్యాలయు తలుపగ,
ఏదీ ఆ మధుర మూర్తి హరియింపడె నన్ను!

వింత

రేయి గడిచెనె వేకువాయెను -కమల నాధుడు కనులు తెరిచెను,
నిదురమానుకు పశుగణంబులు కదిలి చేతన మొందెను!

చేవగలిగిన చేత చేయను మతిన దలుపని వింత జీవులు,

మనుగడకు తగు పనులె మెరుగని తలచి కదలిరి విఁతగా!

ఎవరు పంపగ వెలుగు నందిరి? ఎవరు పంచగ గాలి నందిరి?
ఎవరు కోరగ పరుగు పరుగున తరలి పానము జేసిరి?
ఎవరుతా నిట నేలనుంటి ననింక చింతన జేయరే!
ఎరుక దెలిపెడి వాని ఎరుకను ఎంచగా చింతించరే!

తరువు లొసగెడి ఫలము లందుచు తనువు పెంచగ నెంతురే!
తరువు తీరును తెలియగా తమ తెలివి మెరుని ఎంతురే!
తరువు నొసగిన దాత ఎవరని ఎరుగగా చింతించరే!
తరుగు ఆయువు గతిని మాపెడి తీరునెరుగగ నెంతురే!

కలిమి గలిగిన సంతసింతురు కారణంబది ఎరుగకే,
బలిమి గలుగగ మన్నననుకొని వింత చేతల జేతురే!
కలిగి యుండెడి వాడు ఎవడని కొంత చింతన జేయరే!
కలిమి బలిమగు కమలనాభుని కోరి జేరగ నెంచరే!

వేడెద వినుమా!

శేషుడు తల్పము ఒకనికి – ఆతడే మెడనూలొకనికి,
శేషము లెరుగని దయగల వేషంబున మనునొకతరి,
శేషాచల వాసుడగుచు గాచును సంపదలొసగుచు,
శేషింపక నా సంచిత నాశము జేయవె దయతో!

కరిగాచిన వరదుడొకడు – కరిచర్మాంబర ధారియొకడు,
కరి వదనుడు ఇంకొకండు కరుణను గనగా!
కరిభారము తరుగగు నా కర్మల భారము దీర్పవె,
కరిగిన దయగల వానివి గతినాకిక నీవే!

సోముడు శిఖపువ్వొకనికి – ఒకనికి వైరియు తానగు,
సోముని సోదరి మెచ్చిన సుందరుడింకొకడౌ,
సోమరి తనమున మునిగిన తనయుడి నేలుమటంచు,
సోముని వెలుగుల నాడెడి దేవుని నే గొలుతు!

అనఘా!

1. ఎవ్వని చెలిమిని గలిగిన గలిగుండును సకల జగము,
ఎవ్వని పదములు తగిలిన తొలగుండును బంధంబులు,
ఎవ్వని కరములు సోకిన శమియించును శోకమెల్ల,
ఎవ్వని నామము జేరిన రాజిల్లును సకల రుచులు,
అవ్వానిని మదినెంచెడి తెరపొసగవె అనఘా!

2. ఎవ్వని ఆనతి నొల్లక మననొల్లవు జగములన్ని,
ఎవ్వని కనుసన్న నంది శోభన శోభల దేలును,
ఎవ్వని తలపుల మెదిలెడి మోదంబై పరిమళించు,
ఎవ్వని తలుపగ తెరిగొను తరుగగు దశలెల్లా,
అవ్వానిని మదినెంచెడి తెరపొసగవె అనఘా!

3. ఎవ్వని వలనీ పుడమిన పులకించును మొలకలెల్ల,
ఎవ్వని వలనీ తరువులు తరుగని ఫలరాసులిచ్చు,
ఎవ్వని వలనీ అవనిన అరువుగ పెరిగెను పశువులు,
ఎవ్వని వలనీ తలమున అరమర నెరుగరు విప్రులు,
అవ్వానిని మదినెంచెడి తెరపొసగవె అనఘా!

4. ఎవ్వని తలపుల మునుగగ తపియింతురు ఋషిగణంబు,
ఎవ్వని తలపుల దేలుచు యోగింతురు యోగీంద్రులు,
ఎవ్వని తలపుల జేరిన జరజేరదు ముజ్జగముల,
ఎవ్వని తలపులు తరుగగ ముప్పిరిగొను మోహంబులు,
అవ్వానిని మదినెంచెడి తెరపొసగవె అనఘా!

5. ఎవ్వని కొలువున తొలగును కలిబాధల ఇడుములన్ని,
ఎవ్వని కొలువగ తలుపరు సరవైరులు అనవరతము,
ఎవ్వని కొలువగ వగతురు వనవాసులు తెరపిలేక,
ఎవ్వని కొలువను గలుగును నిజవాసపు మోదంబులు,
అవ్వానిని మదినెంచెడి తెరపొసగవె అనఘా!

6. ఎవ్వని గుణముల నెంచగ గణనంబులు గతిమానును,
ఎవ్వని గుణముల నెరుగగ తరమగునే తాపసులకు,
ఎవ్వని గుణముల నెనరుగ ఎరిగింతురు విబుధజనులు,
ఎవ్వని గుణముల దలచిన దమియించును తనువైరులు,
అవ్వానిని మదినెంచెడి తెరపొసగవె అనఘా!
7. ఎవ్వని ఏలిక మెరుగని మదినెంతురు మహనీయులు,
ఎవ్వని ఏలిక నొందగ ఒదిగుందురు పుణ్యజనులు,
ఎవ్వని ఏలిక పొసగిన పొంగారును సుధలు మదిన,
ఎవ్వని ఏలిక కలిగిన కలిగుండును కలిమిబలిమి,
అవ్వానిని మదినెంచెడి తెరపొసగవె అనఘా!
8.ఎవ్వని తలపోసినంత తరుగును తామస తంపర,
ఎవ్వని తలపోసినంత తనువులు తారకమొందును,
ఎవ్వని తలపోసి సురలు అజరామరు లై మనెదరు,
ఎవ్వని తలపోసి మునులు మాన్యతనొందెదరిలలో,
అవ్వానిని మదినెంచెడి తెరపొసగవె అనఘా!
9. ఎవ్వని కారణమందిన కామాతుర కరగిపోవు,
ఎవ్వని కారణమందిన కాలాంతకు కరుణగలుగు,
ఎవ్వని కారణమందిన కలుగునె విభవములెల్లను,
ఎవ్వని కారణమందిన కడదేరును కటిక ముడులు,
అవ్వానిని మదినెంచెడి తెరపొసగవె అనఘా!

10. ఎవ్వని నెంచిన ఇలలో విభవంబులు ప్రభవించును,
ఎవ్వని నెంచక అసురులు బిలమూలము వశియింతురు,
ఎవ్వని నెంచుక కౌముది ఓషధి కుంజము లొసగును,
ఎవ్వని నెంచిన నరపతి మనిసేవన తరియించును,
అవ్వానిని మదినెంచెడి తెరపొసగవె అనఘా!

11. ఎవ్వని వాసము జగమని వచియింతురు విప్రులెల్ల,
ఎవ్వని వాసన వీడిన లయమొందును సకలజగము,
ఎవ్వని వాసవ ముఖ్యులు నుతియింతురు అనుదినమును,
ఎవ్వని వాసము మూలము ముజ్జగములు మనగా,
అవ్వానిని మదినెంచెడి తెరపొసగవె అనఘా!

హరియింపవె హరియై

కలడో లేడో యన్న కరిరాజుకు గురుతుదెలుప,
రయమున వెడలిన రమణుడు దయగనడేనన్ను,
తావెక్కడ తెలుపుమంచు త్వరపడినా సురవైరికి,
కంబము జీల్చుక నిలచిన దేవుడు నను గనడే!
పట్టముగట్టగ ఇంద్రుకు దైత్యని చై పైనజేయు,
సిరిబట్టిన కరముగల్గు శ్రీనాధుడు ననుగనడే!
వైరముతో దరిజేరెడి కశ్యపు సంతతి నడతకు,
తగురూపము తగిలెడి ఆ పరమేశుడు ననుగనడే!
హరియించెను హారమంచు పాచికలాడెడి సఖుడను,
సంకటమందున నిలిపిన ధరణీపతి ఎరుకగొనగ,
కరిరూపముగైకొన్నా శేషాచలగిరి వాసుడు,
కరుణన నా మొరవినడే దయనేలగ జనడే!
పోతన కలమున పద్యము త్యాగయ గళమున గీతము,
సారముగా మీరామది నేలిన ఆ గోపాలుడు,
కలడని నే నెరిగుంటి కారణ మేమని అడుగక,
కన్నుల గట్థగరాదే కరుణనుగని పూనికతో!
పంతములాడెడి కన్నులు పలుమారులు వెదకబోవు,
వెదకెడి తావులు ఏవని వివరంబులు అడుగనౌను,
తావున కాధారమగుచు తావుగ మెలగెడి వానిని,
చూపులతో కనగలుగుట చోద్యంబని కినుకగొనును!
వరమాలను చేబూనుచు చేరగ రమ్మని బిలిచిన,
జలజాక్షిని వరియించిన వనమాలాధారి నన్ను,
వైనంబున హరియింపడె పెడగడియల ముడులబాపి,
వారిజ వరదుడు వేగమె మోహపుమడి నీడ్చి!