సంధ్య

మెరుపు అంచుల మబ్బు మాటున – మాటువేసిన కలువ వైరికి,
వన్నెచిన్నెల మబ్బు తునకల – ఆట పాటలు తెలియునా?
చెదరి జేరిన వెలుగు చినుకుల – చేర్చి అల్లిన మెరుపు చెండును,
మురిపెముగ తమ కురుల తురుముక – మోదమొందే తీరులు!

ధరణి దాహము తీరగా ఒక చినుకు నిమ్మని వేడుచూ,
చిలిపిగా ఆ ముదిత తోడుగ వరుణుడాడే ఆటలూ,
అలుకలొలికే కులుకుతో ఆ తునగ నడిచే నడకలూ,
చూచు కన్నులు కలిగియూ తా చూడడెందుకు ఎన్నడూ!

వేడుకొందగ వేళగాదని తొలగి పోయే తీరులు,
వెరపు తగదని వైనమేనని కొసరి జేసే కబురులు,
తాళజాలక తనువు కరుగగ వీగిపోయే మబ్బులు,
ఊహచందము కన్నులారగ గాంచదెందుకు తీరుగా!

మయుడు అల్లిన మాయదుప్పటి మాటువీడుట ఎన్నడో!
మనసు మురియగ మదనమోహను లీలగాంచుట ఎన్నడో!
వీగిపోయే తనువు తొందర నెమ్మదించే దెన్నడో!
సోలుటెరుగని రవికి రమ్యత రుచులు తెలిచేదెన్నడో!

వరద

కరిగాచిన వరదుడ వని – కనకాంగికి వేలుపువని,
కమలాసను ప్రభవించిన చిరు బొజ్జను కలిగితివని,
యోచన మునిగిన లోచన లోకంబుల నేలేనని,
పలువురు దెలుపగ నమ్మితి గతి నీవని ఇలనా!

పద్మాసను పలుకులన్ని హరియించిన సురవైరిని
పలుమారులు హరి యనగా క్రోధించిన ఇంద్రారిని (ఇంద్రారి – రాక్షసుడు)
ముజ్జగముల పాలకుడౌ సురనాయకు గతిమాలిని,
ఒడుపుగ అక్కున జేర్చిన అనఘవు నీవని నమ్మితి! (అనఘ – నిర్మలము / మనోజ్ఞము)

హరి నామమె అరిబాధల హరించెడి గరళంబని,
తనువాడెడి తరినుండి తలచిన దానవబాలుని,
కనుసన్నల కదలాడగ పూరకమై పురినిండిన,
సింగపు తలగల నరుడవు గతినాకని నే నమ్మితి!

గగనపు ఛాయన మెలిగెడి గగనాంతర వాసివైన,
గమనము మరచిన కాలపు గతినందిన దృతివైనా,
గారవమొందెడి గోపిక నగుమోమున మొలకవైన,
నీరజనాభా నాకిక గతినీవని మదినెంచితి!

యోచన ఏలయ చేరను దయనెంచను తగనంచు,
వెన్నెల కురియక కలువలు పంకముపాలైన పగిది,
పంకజనాభా నీదయ కురియక నేనెటుల మనదె?
మాధవ మాదరిని జేరి మనుపుము తండ్రీ!

వసంతపంచమి ప్రార్ధన

శ్యామలవు శారదవు శతరూపి నీవు – క్షయమొందగాలేని అక్షరము నీవు!

ఆదినాదములోని అంకురము నీవు – ఆదరింపుము మమ్ము అనురాగ వల్లీ!

సోహమందలి చిలుక ఎరుగగా లేదు – తనఛాయ నీ శకట రూపుబోలేననీ,

అల్లార్చు రెక్కలన రవళించు రాగములు – రంగరించిన అరకు రుచియందు నెలకొల్పి,

నీదివ్య గుణములను పలికించుకొమ్మా!

శ్యామలవు శారదవు శతరూపి నీవు – క్షయమొందగాలేని అక్షరము నీవు!

భాషభావపు రతిన ప్రభవించు పదములో – నీ పదము మోపుమో మంజుఝరి ముదితా!

మోహనంబగు నట్టి ‘పద’ పద్మముల మాల – అలరింపుగా నీకు అర్పించు తెరపిమ్ము!
శ్యామలవు శారదవు శతరూపి నీవు – క్షయమొందగాలేని అక్షరము నీవు!

ఆదినాదములోని అంకురము నీవు – ఆదరింపుము మమ్ము అనురాగ వల్లీ!

రెప్ప లేని కన్ను

రెప్పలేనొక కన్ను రేయన పగలనక – బాహ్యంతరము లేక తెరపి లేక,

కాపుగా నుండునని కరుణ కురిపించునని -కనగలిగి మన గలుగు  చూపెపుడు ఉదయించు?

రెప్పలేనొక కన్ను రేయన పగలనక..

తరగుటెరుగని చింత చింతామణిగ మారి – సుధారస సారముల సంగమెటు గలుగూ?

సంగమెరుగని సంగ మమరియుండంగా – సావధానము నొందు సాధ్యమెటు గలుగూ?

రెప్పలేనొక కన్ను రేయన పగలనక..

సారహీనంబైన సకల కాలములందు – సాక్షియగు ఆ చూపు ఏమనెరించూ?

వీనులందున ఊది ఊరడింపగ జేయ – జాగుజేసెడి వాని జాగెటుల తొలగు?

రెప్పలేనొక కన్ను రేయన పగలనక..

నిలకడెరుగని మనసు నియమ పాలనలేక – వేదనల వనములన బీతిగొని చరియింప,

నిమ్మదింపగ జేయు జాలమేదని తలుప – బదులు పలికెడి చూపు ఏమనెరిగించు?

రెప్పలేనొక కన్ను రేయన పగలనక – బాహ్యంతరము లేక తెరపి లేక,

కాపుగా నుండునని కరుణ కురిపించునని-

ఎరుక జేయుము తల్లి తలపు తెర తొలగించి- నా మంద భాగ్యంబు కనుమూయకుండా!

రెప్పలేనొక కన్ను రేయన పగలనక – బాహ్యంతరము లేక తెరపి లేక,

కాపుగా నుండునని కరుణ కురిపించునని -కనగలిగి మన గలుగు  చూపెపుడు ఉదయించు?

రెప్పలేనొక కన్ను రేయన పగలనక..

మనసా

దున్న నెక్కిన వాడు దూరానగలడంచు – కునికిపాటేలనే మనసా!

ఆసామి రాకడకు రెప్ఫపాటేచాలు –  ఏమరపు మానవే మనసా!

తరలిపోయేనాడు వెంటరానీ తనువు – మురిపెముల నెంచకే మనసా!

సాటివారలమంచు సాకులెన్నెడివారి – సావాసమును విడుము మనసా!

వెంటనడువు మటంచు నడిచేటి మహనీయు – మాన్యతను ఎరుగుమో మనసా!

భీకరంబైనట్టి జగతి నీడలజూచి – బీతిగొని మడియకే మనసా!

ఆదరంబగునీడ అద్దమందున జూసి – మోహమొందకు వెఱ్ఱి మనసా!

అద్దరుండెడి వాని ఆధారమగు వాని – పోలికలు పోల్చుకొను మనసా!

పలికేటి ప్రతి మాట నాదముగ నాదించు – నారాయణుని గనుము మనసా!

నాదమున కాధారమగు వాని నెరుగగా – మౌనమును మనువాడు మనసా!

కోనేటి నీటిపై ఊయలూగే అలల – అలరింపు నందకే మనసా!

అలకు ఆధారమై నెమ్మదించే మడుగు – నిలకడను నేర్వవే మనసా!

గహనమగు గగనాన తళుకు తారల జూసి – తమకమును మానవే మనసా!

తళుకు తారల దండ  ధరియించు గగనంబు- గాంభీర్యమును గనము మనసా!

వెఱ్ఱి గుఱ్ఱము నీవు – నిలకడెరుగక ఉరికి – ఆయాసపడనేల మనసా!

తలచినంతనె నిన్ను తరియింప జేయగల- తలపు తగులవదేల మనసా!

మార్తండ పుత్రుండు మాలిమెరుగని వాడు – మన్నించడే నిన్ను మనసా!

తరుణమిదె తరలుమని తరలించుకొని బోయి – చిత్ర సమ్మతి దెలుపు మనసా!

అంతమెరుగని గతుల గమనించమని నిన్ను – ఘోర గతులను నడుపు మనసా!

వెట్టిబాధల మాపు పరమేశు నామమును – కోరి జేరుము నేడె మనసా!

కొనియాడ నేర్వవే మనసా! మోహాన మునుగవే మనసా!

నామ మోహాన మునుగవే మనసా!

మనసా

దున్న నెక్కిన వాడు దూరాన గలడంచు – కునికిపాటేలనే మనసా!

ఆసామి రాకడకు రెప్ప పాటేచాలు – ఏమరపు మానవే మనసా!

తరలిపోయేనాడు వెంటరానీ తనువు – మురిపెముల నెంచకే మనసా!

సాటివారలమంచు సాకులెన్నెడివారి – సావాసమును విడుము మనసా!

వెంటనడవు మటంచు నడిచేటి మహనీయు – మాన్యతను ఎరుగుమో మనసా!

భికరంబైనట్టి జగతి నీడల జూచి – భీతిగొని మడియకే మనసా!

ఆదరంబగు నీడ అద్దమందున జూసి – మోహమొందకు వెఱ్ఱి మనసా!

అద్దరుండెది వాని ఆధారమగు వాని – పోలికలు పోల్చుకొను మనసా!

పలికేటి ప్రతి మాట నాదముగ నాదించు – నారాయణుని గనుము మనసా!

నాదమున కాధారమగు వాని నెరుగగా – మౌనమును మనువాడు మనసా!

కోనేటి నీటిపై ఊయలూగే అలల – అలరింపు నందకే మనసా!

అలకు ఆధారమై నెమ్మదించే మడుగు – నిలకడను నేర్వవే మనసా!

గహనమగు గగనాన తళుకు తారల జూసి – తమకమును మానవే మనసా!

తళుకు తారల దండ  ధరియించు గగనంబు- గాంభీర్యమును గనము మనసా!

వెఱ్ఱి గుఱ్ఱము నీవు – నిలకడెరుగక ఉరికి – ఆయాసపడనేల మనసా!

తలచినంతనె నిన్ను తరియింప జేయగల- తలపు తగులవదేల మనసా!

మార్తండ పుత్రుండు మాలిమెరుగని వాడు – మన్నించడే నిన్ను మనసా!

తరుణమిదె తరలుమని తరలించుకొని బోయి – చిత్ర సమ్మతి దెలుపు మనసా!

అంతమెరుగని గతుల గమనించమని నిన్ను – ఘోర గతులను నడుపు మనసా!

వెట్టిబాధల మాపు పరమేశు నామమును – కోరి జేరుము నేడె మనసా!

కొనియాడ నేర్వవే మనసా! మోహాన మునుగవే మనసా!

నామ మోహాన మునుగవే మనసా!

💐

నవరంధ్రముల నౌక

నవరంధ్రముల నౌక నడయాడు నౌకా,

నావికత్వము నీది నావికుడ నేను!

నవరంధ్రముల నౌక నడయాడు నౌకా,

నాయకత్వము నీది నావికుడ నేను!

లంగరెరుగని నౌక-లయమొందు నౌకా,

లాలించు ఈజగతి లాస్యమీ నౌకా,

లోనున్న లోకముల నెరుగదీ నౌకా,

లేశమంతగు నిలకడోర్వదీ నౌకా!              ||నవరంధ్రముల||

మిత్తి దారులబట్టి మసిలేటి నౌకా,

మితిలేని మోహమున మైమరచు నౌకా,

మీదున్న బడబాగ్ని నెరుగదీ నౌకా,

మిగులు భాగ్యపు మదిర పుంత ఈ నౌకా!        ||నవరంధ్రముల||

తళుకు చుక్కల వెలుగు చుక్కాని యౌనౌక,

తెలియ నెరుగని తీరమేగు నీ నౌకా,

తరలించు వాడవని తగిలితీ నౌకా,

తుదిలేని తావునకు నడిపించు నౌక!        ||నవరంధ్రముల||

నందబాలా – ఆనందబాలా

నందబాలా – ఆనందబాలా – రాధావల్లభ – భవభయ హారా

నందబాలా – ఆనందబాలా

గోపీజన నయనాధివాసా- నారద మునిగణ మానస వాసా

నందబాలా – ఆనందబాలా – రాధావల్లభ – భవభయ హారా

నందబాలా – ఆనందబాలా

ఋషిజన జీవన తారణ కారా – హాలాహల హర కారణ కారా

నందబాలా – ఆనందబాలా – రాధావల్లభ – భవభయ హారా

నందబాలా – ఆనందబాలా

వేదాంగంబుల లాలన లోలా – లాలిత్యమే  నీ లీల ల లోలా

నందబాలా – ఆనందబాలా – రాధావల్లభ – భవభయ హారా

నందబాలా – ఆనందబాలా

తోడు

తోడు

అడుగడుగు నీ తోడు –అడిగడిగి అలిశాను – గుడి వీడి వడి వడిగ నడచి రావయ్యా!

దడి వంటి నీ జోడు – ఒడలంత నొనగూడ – సడిలేక దాపుడుగ శరణుడిగ రారా!

తోడు వీడనటంచు –ఆడి వీడెదవేల?ఆగడంబుగ అడుసు తొడగనేలా!

గొడుగంటి నీ పడిగ నీడందు నడయాడ – కడతేరు నా వొడలు కుడియుగాదా!

||  అడుగడుగు నీ తోడు –అడిగడిగి అలిశాను||

దుడుకు వాడనటంచు – గడుసు గడపల గడిన –

విడిచి వెడలకు నన్ను వేడెదను నిన్నే!

సుడిలేని జడిలోన బుడిబుడీ మనిగాను –

వెడలు వాడల జాడ కడనైన పడదే!

|| అడుగడుగు నీ తోడు –అడిగడిగి అలిశాను||

ముడుపు గట్టిన ముడియ –  ఇడు జాడ పొడ మడియ –

కొడి కొండెముల కుడుప పాడియౌనే!

ఆడువాడను నేను –ఆడు ఆటది నీది –

దండనల దాడులను విడనాడుమయ్యా!

||  అడుగడుగు నీ తోడు –అడిగడిగి అలిశాను ||

తారక నామ – శివా

భవ తారన తారక నామ – శివా, భవ తారన తారక నామ – శివా,

భవ తారన తారక నామ – శివా, భవ తారన తారక నామ – శివా!

పన్నగభూషణ పార్వతి వల్లభ – కైలాసాచల వాస -శివా,

కనికరమున మము కరుణన జూడుము – కాలంతక శ్రీసాంబ శివా!

భవ తారన తారక నామ – శివా, భవ తారన తారక నామ – శివా,

భవ తారన తారక నామ – శివా, భవ తారన తారక నామ – శివా!

శరణుకు శరణగు చరణ – శివా, తాండవ ప్రియ శ్రీసాంబ శివా,

సాలిగ్రామ నివాస శివా – నిను శరణని వేడెద – మనుపు -శివా!

భవ తారన తారక నామ – శివా, భవ తారన తారక నామ – శివా,

భవ తారన తారక నామ – శివా, భవ తారన తారక నామ – శివా!

హాలాహల హర పరమ శివా – హరి మానస వరదుడ సాంబశివా,

త్రిపురాంతక హర – త్రిపుర శివా – త్రిశూల ధారివి శరణు శివా!

భవ తారన తారక నామ – శివా, భవ తారన తారక నామ – శివా,

భవ తారన తారక నామ – శివా, భవ తారన తారక నామ – శివా!

నందీశాదుల వరద శివా – ఋషి యోచన లోచన – సాంబశివా,

యోగీశ్వర శ్రీ యోగ శివా – చండీశ్వరి ప్రియచరణ శివా!

భవ తారన తారక నామ – శివా, భవ తారన తారక నామ – శివా,

భవ తారన తారక నామ – శివా, భవ తారన తారక నామ – శివా!

గంగాధర – ధర జీవన పోషక – దాక్షిణ్యాలయ సాంబశివా,

దురిత దైత్యహర పరమశివా – దానవ పూజిత చరణ – శివా!

భవ తారన తారక నామ – శివా, భవ తారన తారక నామ – శివా,

భవ తారన తారక నామ – శివా, భవ తారన తారక నామ – శివా!

కామేశ్వరి ప్రియ పరమశివా – కరి కామిత వరదుడ – కరుణ శివా!

కామాంతక హర మోక్షశివా – హరి మోహము నొసగుము -మోహశివా!

భవ తారన తారక నామ – శివా, భవ తారన తారక నామ – శివా,

భవ తారన తారక నామ – శివా, భవ తారన తారక నామ – శివా!

నిగమాంతక నగ – వరద శివా – సాదర సాగర సాంబశివా,

పరచింతన చింతిత పరమశివా – గుణగణ వర్జిత వేద్యశివా!

భవ తారన తారక నామ – శివా, భవ తారన తారక నామ – శివా,

భవ తారన తారక నామ – శివా, భవ తారన తారక నామ – శివా!