చెవినొగ్గు మనసా!

పాపచింతన మాని గురుపదంబుల తలచి ,

పరమ పథమందగల పథముగను మనసా!

పలుతెరంగుల తిరిగి తళుకు తోపుల తగిలి,

నశియింపగా నలిగి వగవగానేలా?

వరదుడగు మహరాజు వద్దనున్నాడంచు,

పలుకు పెద్దలమాట మన్నించు మనసా!

సాధుజన పాలకుడు సమయ సారధివాడు,

సాక్షిగా నిలచునట సకల సమయములా!

పాపచింతన మాని గురుపదంబుల తలచి ,

పరమ పథమందగల పథముగను మనసా!

పలుతెరంగుల తిరిగి తళుకు తోపుల తగిలి,

నశియింపగా నలిగి వగవగానేలా?

తెరపెరుంగని రేయి భీతిగొలపగ నీవు,

తెగుదారి వేదుకకే మనసా!

సావధానమునొంది పార్ధసారధి తలపు,

నియమముగ నిలుపుకొను మనసా!

పాపచింతన మాని గురుపదంబుల తలచి ,

పరమ పథమందగల పథముగను మనసా!

పలుతెరంగుల తిరిగి తళుకు తోపుల తగిలి,

నశియింపగా నలిగి వగవగానేలా?

అవధెరుంగని అంధ అంబుధని తలపోసి,

అలుపేల నొందేవు మనసా!

ఆదరించెడివాడు ఆవరించుండెనను-

ఆర్యోక్తి నందుకొను మనసా!

పాపచింతన మాని గురుపదంబుల తలచి ,

పరమ పథమందగల పథముగను మనసా!

పలుతెరంగుల తిరిగి తళుకు తోపుల తగిలి,

నశియింపగా నలిగి వగవగానేలా?

సోహమందలి హంస – ఎరిగించు సత్యమును,

నిలుకడగ ఎరుగుమో మనసా!

సోమశేఖరు జాడ జగమంత నిండెనని,

తలపు తలపున నిలుపు మనసా!

.                                                                           పాపచింతన మాని గురుపదంబుల తలచి ,

పరమ పథమందగల పథముగను మనసా!

పలుతెరంగుల తిరిగి తళుకు తోపుల తగిలి,

నశియింపగా నలిగి వగవగానేలా?

గోపికా…

ఆ నందనందను తోడుగా  – ఆనంద మందిన గోపికా!

ఎంచుమా నను తోడుగా – ఆ మధుర భావన పంచగా!

నల్లవాడట – గొల్లవాడట – మాటు నొల్లని వాడట!

పొదుగు జేరెడి లేగ చందము- చల్ల జేరేడి వాడట!

||ఆ నందనందను తోడుగా – ఆనంద మందిన గోపికా!||

చేరవచ్చిన చెలియ నొల్లక – చలము జేసెడి వాడట!

వెదకగా తా కానరాకనె – కనుల నిండెటి వాడట!

||ఆ నందనందను తోడుగా – ఆనంద మందిన గోపికా!||

వెదురు బొంగులనూదుచూ – తన జాడతెలిపెడి వాడట!

చేరుదారుల జాడలను తా-మదిని నింపెడి వాడట!

||ఆ నందనందను తోడుగా – ఆనంద మందిన గోపికా!||

జగతి దారుల జాడలో- తా నడువ నొల్లని వాడట!

తాను నడచెడి  దారికే  జాడనొల్లని వాడటా!

ఆ నందనందను తోడుగా – ఆనంద మందిన గోపికా!

ఎంచుమా నను తోడుగా – ఆ మధుర భావన పంచగా!

ఒంటివాడవన నంటినా?

ఒంటివాడన నంటినా? నా జంట వీడుమనంటినా?

ఎల్ల లెరుగని ప్రేమ తత్వపు ఎరుక గరుపుమనంటిగానీ!

నే నొంటివాడన నంటినా? నా జంట వీడుమనంటినా?

నరునివై వానరుల గూర్చుక – వైరి మోహము మాపుచూ,

వాని తమ్ముని శరణు విన్నప మంది బ్రోచిన వాడవే!

సూర్య చంద్రులు తోడుగా – వన వనరులన్నిటి తోడుగా,

నిన్నె నమ్మిన జనక పుత్రిని – జేర సందియమేలయా?

ఒంటివాడన నంటినా? నా జంట వీడుమనంటినా?

ఎల్ల లెరుగని ప్రేమ తత్వపు ఎరుక గరుపుమనంటిగానీ!

ఒంటివాడన నంటినా? నా జంట వీడుమనంటినా?

ఏల రావని పంత మాడెటి దైత్య దనుజుల గావగా,

లంపటంబుల తగులు నాడే పంతమెరుగని వాడవే!

రాజభోగపు లాలసను విడి – ఆలిగా నీ సేవ జేయగ,

కోరి జేరిన కోమలాంగిని కొలుపు కంపగ పంతమా?

ఒంటివాడన నంటినా? నా జంట వీడుమనంటినా?

ఎల్ల లెరుగని ప్రేమ తత్వపు ఎరుక గరుపుమనంటిగానీ!

ఒంటివాడన నంటినా? నా జంట వీడుమనంటినా?

దారిజేసుక నిన్ను జేరెడి – రక్కసుల రవమణచగా,

మోహమెరుగని మధుర నగరినివాసివై కొలువుంటివే!

రేయిపగలని భేదమెంచక -తగు సమయమేదని వేచియుండక,

రెప్పపాటును ఒల్లకే- నిను తలచు గొల్లల జేరవేలనొ!

ఒంటివాడన నంటినా? నా జంట వీడుమనంటినా?

ఎల్ల లెరుగని ప్రేమ తత్వపు ఎరుక గరుపుమనంటిగానీ!

ఒంటివాడన నంటినా? నా జంట వీడుమనంటినా?

కోరి కొలిచెడి వారలను ఏ కారణంబుల నొల్లవో!

వైరి మనమున వెంట తగిలెడి వైనమేమని అందువో!

తేట తెలుపుము తీరుగా ఈ ప్రేమ తత్వపు  తీరునూ,

తారకంబగు భావ మోహము మరగు నొందక మనుపుమా!

ఒంటివాడన నంటినా? నా జంట వీడుమనంటినా?

ఎల్ల లెరుగని ప్రేమ తత్వపు ఎరుక గరుపుమనంటిగానీ!

ఒంటివాడన నంటినా? నా జంట వీడుమనంటినా?

 

 

 

 

 

అరుణాచల శివ

అరుణాచల శివ

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా

అరుణారుణములు భానుని వెలుగులు – అర్చన జేయగ అరుణాచలా,

తూరుపు కనుమల తలుపున నిలచెను – ఆనతినీయుము అరుణాచలా!

పికములు శుకములు సందడి జేయుచు – శుభమును దెలిపేనరుణాచలా,

పూపొదరిళ్ళన రేకులు విరిసెను – పూజలనందుము అరుణాచలా!

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా!

గోక్షీరంబుల కావడి గైకొని – గోపకులరిగిరి  అరుణాచలా,

గంగాజలముల కలశము దెచ్చిరి – అర్ఘ్యము నీయగ అరుణాచలా!

పలుభక్ష్యంబులు పండిన ఫలములు – పళ్ళెమునుంచిరి అరుణాచలా,

పున్నెపు చూపును చిలుకుము ప్రేమతొ – నైవేద్యము నందుము అరుణాచలా!

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా!

కర్పూరంబును పరిమళ పలుకులు – జేర్చిన విడెమిదె అరుణాచలా,

అంబకు తోడుగ అందవె ముదమున – మోదమునొందగ అరుణాచలా!

అలరింపులు ఇవె అందుము మా మొర – మా ఏలిక నీవయ అరుణాచలా,

అద్దరి జేర్చెడి దేవర నీవని – నానుడి నెరుగవె అరుణాచలా!

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా!

ఋణరూపములగు బంధము మాపుము – మమ్ముల బ్రోవుము అరుణాచలా,

ఋణముల దీర్చెడి తారక నామము – మనసున నాటుము అరుణాచలా!

బహుబంధంబుల తంపర తగిలితి – తారక మెరుగను అరుణాచలా,

తామసమణచెడి తరుణోపాయము – తగులగ జేయుము అరుణాచలా!

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా!

చిన్మయ రూపము చెంతనె గలదను – చింతన నొసగుము అరణాచలా,

చింతల నణచెడి భావన నిలుపగ – నెమ్మది నొసగుము అరుణాచలా!

వేదన వేగపు వెరపున నలగితి – వెరపును మాపుము అరుణాచలా,

వేదాంతంబుల సారము నెరిగెడి – సాధన నొసగుము అరుణాచలా!

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా!

పలువాసంబుల వాసనలందుక – ఆదిని మరచితరుణాచలా,

నాటికి నేటికి ఒకటిగ నిలచిన – నీదయ నలదుము అరుణాచలా!

నామము నుడివెద చేతుల మేడ్చెద – మన్నింపుము నన్నరుణాచలా,

అంగములెరుగని అంతర వీధుల – అలజడు లెన్నకు అరుణాచలా!

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా!

అంతము నెరుగని ఒరవడి జొచ్చితి – అవధిని నెరపుము అరుణాచలా,

అచలంబగు నీ ఆదరమొసగుము – ఆవరణగ నాకరుణాచలా!

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా!

అమ్మల గన్న అమ్మ

అమ్మల గన్న అమ్మ

రక్కసుల దునుమాడు కాళరాత్రివి నీవు,

అనురాగమును పంచు శంభు రాణివి నీవు,

ముదమారగ తనయు ముద్దు చెల్లించగల,

పూర్ణశోభల వెలుగు గిరి తనయ యున్నీవు!

ముజ్జగంబుల నడుప ముమ్మూర్తులన్నిలిపి,

వారి సరసన నిలిచి వారి ధర్మము గరిపి,

దరహాస రేఖలను యదమాటునే అణచి,

ముద్దరాలిగ మసలు జదంబయున్నీవు!

అచలాచలము లందమరున్న నీవు,

ప్రతి రూపముల ఉనికి కలిగించు నీవు,

కర్మ మర్మములెల్ల ఈశునకు ఎరిగించి,

దరిజేరు దారులను ఎరుకగొను నీవు!

కోకొల్ల లగు సంతు నీకు సంబరము,

వారి కయ్యములన్ని నీకు మురిపెములు,

హద్దు మీరిన నాడు భద్రకాళివి నీవె,

ఆదరించెడి నాడు అన్నపూర్ణవు నీవె!

సంతు సందడిలోన సంతసించే తల్లి!

సడిజేయలేని ఈ సుతుని సైగల జూడు!

విశాలాక్షివి నీవు, మీనాక్షి నీవు,

నళినాక్షియున్నీవు వనజాక్షి నీవు!

భూచరులు జలచరులు ఆకాశ చరులు,

చలనమే లేనట్టి అచల వారాసులు,

కన్నతల్లివి నీవు కరుణ వల్లివి నీవు,

ఎరుక గొనుమో నన్ను ఏమరక నేడు!

భాను కిరణపు లెక్క ఎన్నగా వచ్చు,

జగతి రేణువు సంఖ్య తెలియగా వచ్చు,

ఎన్న నెరుగగ తరమే నీసంతు లెక్క!

సాంఖ్య సామర్ధ్యముల సీమ మించినది!

కోటానుకోట్లతో తోడబుట్టాను,

కోటికొకనాడైన నిన్ను గనలేదు!

కోరిజేరగ నిన్ను ఎరుగనే దారి!

దారిజేసుక నన్ను దరిజేర్చుకొమ్మా!

త్రిపురాంతకేశ్వరీ – త్రిపుర సుందరీ

త్రిపురాంతకేశ్వరీ – త్రిపుర సుందరీ

త్రిపురాంతకేశ్వరీ త్రిపుర సుందరి నీవు,

తొలగగాజేయుమా తిమిరంపు తెరలు!

అన్నార్తులౌ మేము అన్నకోశపు కొలువు,

ఆనందమని తలచి దినదినము కొలిచేము,

ఎరిగింపుమో తల్లి లాలించి దరిజేర్చి,

అన్నపురముల మితిని మా మతెరుగు నటుల!

త్రిపురాంతకేశ్వరీ త్రిపుర సుందరి నీవు,

తొలగగాజేయుమా తిమిరంపు తెరలు!

మనొకోశపు మెరుపు మైమరుపు గొలిపేను,

మోహ తిమిరపు వెలుగు మత్తుగొలిపేను,

మదను జంపినవాని-మురళి నూదేవాని,

మచ్చుకొక మారైన మది నెంచబోను !

త్రిపురాంతకేశ్వరీ త్రిపుర సుందరి నీవు,

తొలగగాజేయుమా తిమిరంపు తెరలు!

ఆనంద కోశమను ఆవరము గలదంచు,

ఎరుక జేసిన వారి ఎకసెక్యమే గాని,

అట్టి పురంబున మెట్టు తరి ఎరుగలేనైతి,

తేట తెలుపుము నీవె దివిరాజ వంద్యా!

త్రిపురాంతకేశ్వరీ త్రిపుర సుందరి నీవు,

తొలగగాజేయుమా తిమిరంపు తెరలు!

జంట నెలవుల తోన మూడు పుతముల మేను,

మోదాన వసతాయె- నీ జాడ గననాయె!

ఎన్ని కల్పము లందు నీ కల్పనల గంటి,

ఎడబాటు ఆటలిక యదనిండ కుండె!

త్రిపురాంతకేశ్వరీ త్రిపుర సుందరి నీవు,

తొలగగాజేయుమా తిమిరంపు తెరలు!

పురము పురమున అసుర ఆవాసమాయె,

పోరగా నా ప్రతిభ పరిహాసమాయే,

ఎన్నడో ఒకనాడు ఎరిగియే ఎరుగకో,

నిన్ను తలచిన తరిని ఎరుకగొని ఏలుకో!

త్రిపురాంతకేశ్వరీ త్రిపుర సుందరి నీవు,

తొలగగాజేయుమా తిమిరంపు తెరలు!

నాదమై నడయాడు నారాయణా!

నాదమై నడయాడు నారాయణా నీవు,

నాదించు నాలోన నారాయణా!

భక్తి భావన నాది నారాయణా,

నా పలుకు లో కులుకు నారాయణా!

ఆది నాదము నీవె నారాయణా,

అమరిస్తి వీ జగతి నారాయణా,

భావరూపము నీవె నారాయణా,

భావింపగా నీవె నారాయణా!

నాదమై నడయాడు నారాయణా నీవు,

నాదించు నాలోన నారాయణా!

చిలుకలో చిరుతలో – చెలరేగు ధృతిలో,

నందీశు నాధు పద మంజీరముల లోన,

మత్త మధుపపు మంద ఝుంకారముల లో,

గూడుకొక నాదమై నయము నమరే వాడ!

నాదమై నడయాడు నారాయణా నీవు,

నాదించు నాలోన నారాయణా!

బ్రహ్మమానస పుతృ గానమందున భక్తి,

శంభునిల్లాలి ఆ పలుకు లందనురక్తి,

ఋషిపుంగవుల స్తుతుల వెల్లివిరిసే కొలుపు,

పొందికగ పొదిగినా వైభవంబుల రేడ!

నాదమై నడయాడు నారాయణా నీవు,

నాదించు నాలోన నారాయణా!

తనువొంది లోకమున తల్లడిల్లె సుతుని,

మరపించు జోలలో లాలిత్యమై నీవు,

పలుకు లల్లేతల్లి పేర్చు పలుకుల వెల్లి,

భావనల భూషణము లమరించు గాదా!

నాదమై నడయాడు నారాయణా నీవు,

నాదించు నాలోన నారాయణా!

అస్తి అస్తిన నీవమరుంటి వను ఎరుక,

విదితముగ నెరిగించు నారాయణా!

నీ నాద భావనల భావమెరుగగ జేసి,

బ్రతుకు భారము దీర్చు నారాయణా!

నాదమై నడయాడు నారాయణా నీవు,

నాదించు నాలోన నారాయణా!

మాతంగి సేవ

శృంగార మమరెనిట – సిరులొలుకు తల్లీ,

కనులు పండగ చూడ- తరలి రా రండీ!

నెలత నేలెడి వాడు – నాగభూషణుడు,

ఒడిన జేరిన వాడు- విఘ్న నాయకుడు..               ||శృంగార||

తళుకు చెక్కిలి చుక్క – గరళ కంఠుని గురుతు,

కలువ కన్నుల మెరుపు –ఆసామి గురుతూ  ||శృంగార||

దివిరాజ వని పూలు ముడిచి మెరెసే కురులు,

విభుని ఉరమున నాడు ఫణిరాజు గురుతూ  ||శృంగార||

మనసు మరిపము దేల – మరులు గొని గనరే!

మాతంగి పదసేవ – మదినెంచి మనరే!             ||శృంగార||

 

*మాతంగి: పార్వతి

గోవింద గోవింద

గోవింద గోవింద

గోవింద గోవింద గోవింద యని తలచి

గోపికా వల్లభుని మదినెంచి మనరే!

గోవింద గోవింద గోవింద యని పలికి,

గోవర్ధనోద్ధారు పద పీఠి కనరే!

గోమాత సేవలో మసలేటి గోపకులు,

గోక్షీరముల సిరులు పొంగేటి లోగిళ్ళు,

గోధూళితో నిండి మెరిసేటి పుర సీమ,

పూజ ఫలముగ వాని వాసమైనారే!

గోవింద గోవింద గోవింద యని తలచి

గోపికా వల్లభుని మదినెంచి మనరే!

ఆలమందల నడుమ నాడేటి బాలునిగ,

ప్రేమ మన్ననలంది మురిపించు తరుణాన,

గోవర్ధనుని భారమవలీలగా మోసి,

గోప జనులను గాచి గారవించిన హరిని –

గోవింద గోవింద గోవింద యని తలచి

గోపికా వల్లభుని మదినెంచి మనరే!

కురువంశ రణమందు నరుని సారధ్యమును,

కుశలముగ నడపించి వన్నెకెక్కిన సామి!

గాంగేయు శరఘార మోర్వనేరగ లేక,

సఖుని గావగ తాను తొందరించిన వాని-

గోవింద గోవింద గోవింద యని తలచి

గోపికా వల్లభుని మదినెంచి మనరే!

గోవింద గోవింద                    మేటి వానిలొ మేటి నెలవు తానేయనీ,

క్రోధమును శోకమును తన ఛాయలేయనీ,

తనువు తనువున తానే తగిలియున్నాననీ,

నెమ్మదించెరుగు మని పలికినా పరమేశు-

గోవింద గోవింద గోవింద యని తలచి

గోపికా వల్లభుని మదినెంచి మనరే!

గోవింద గోవింద గోవింద యని పలికి,

గోవర్ధనోద్ధారు పద పీఠి కనరే!

స్నేహము

ఆలయంబున అమరు వేల్పులు వరదులని నే వేడబోతే,

పూజక్రతువులు, దీక్షధ్యానపు బదులు నిమ్మని నుడివినారు!

వరుస గలుపుక వచ్చిచేరెడి బంధు జనముల సుఖములన్నీ,

వన్నెకెక్కిన వారిజాక్షిని వలచి వచ్చిన వైనమే గద!

జన్మనిచ్చిన తల్లిదండ్రులు వారు పంచిన ప్రేమ బదులుగ

మలివయస్సున సేవ గోరుచు-వారి బదులని ఎంచినారు!

ఆలి సేవల ప్రేమలాలన బ్రతుకు బాధ్యత బదులు కోరెను,

విద్యగరిపిన గురువులెల్లరు దక్షిణంచూ బదులు కోరిరి!

బదులు కోరని మధురబంధము-వెన్నుజూపని బ్రతుకు బంధము,

యుగయుగంబులు గడచిగూడా- వాడి ఎరుగని స్నేహబంధము,

జగమునందిల చాటగా పరమాత్మ నిల్పిన ఆత్మబంధము,

ఎరుగరే మీరెల్లరింకను – పార్ధుడందిన కిృష్ణ    స్నేహము!

అన్నదమ్ములు అక్కచెల్లెలు ఆడపడుచులు అత్తమామలు,

లెక్కమించిన వరుసలెన్నో మనిషి బ్రతుకున అల్లియున్నా,

మౌనమానస యోచనలలో తర్కమెంచని తోడునీయగ,

పెక్కుమోముల పెద్దవారలు స్నేహబంధము కూర్చినారు!

Sent to Mytales – poem contest  : on 16th July 2017