సెలవు

సెలవు1

పంతమాడిన పసి తనంబును పోరు పెంచిన పరువము,

సెలవు కోరకే తరలి పోయెను – ఎరుక మిగిలెను గురుతుగా!

చేవచచ్చిన ముదురు దేహము –పంతమేలిక సెలవు నిమ్మని,

తరలు తీరును ఎరిగి మనుమని- మందలించెను మెల్లగా!

పంచుకొనుచూ అమ్మవొడిలో తోడు ఆడిన  వారికి,

చింతపిక్కెలు లెక్క తేలక చింతచెందిన చెలులకి,

అలుపు నెరుగక ఆనతిచ్చుచు తోడు నడిచెడి వారికీ,

తరుగు తెలివిన ఏల తగిలితిమేమి గతియను వారికీ,

విన్నపంబిదే విలువ నెంచుము తరలి పోయెడి తోడుగా,

ఘడియ  ఘడియకు వేదనొసగిన వెలితి తెలివిని మరువుమా!

మాలిమిగ నే మసలి గడిపిన మధుర ఘడియలనె  ఎంచుమా!

నమ్ముడిదె నను – ఎన్నడును నే నీడనై  నడయాడన!

కోరబోవను కానుకలు నే – కోరబోవను గురుతులూ,

కోరబోవను ఎన్నడును మీ – మాలిమందిన పదములు!

సెలవు మీకిక  సెలవు సఖులకు సెలవు సాటగువారకు,

సెగలు చేరని చలువ దారుల తరలి నేనిక సాగెద!

దారిలేనీ దారిలో నా తోడు కూడగ వేచియున్నది,

తేట కన్నుల చెలిమి చూపులు పరచి రా రమ్మన్నది,

వెరపు లేదిక వేకువేయిది వెలితి భావన వీడుమన్నది!

వెదకి అలసిన ‘నేను’ నేనని ఎరుగు మన్నది తీరుగా!

విద్యావైభవము

తెలిమబ్బు తునకలట తొందరగ తరలాయి

ఏమెరుంగగ నెంచి పరుగు పరుగున తరలె?

ఇటనున్న వనిలోన లేనిదెచ్చట నుంది?

లేనిదానాగురుతు  ఏతీరు నెరిగేరు?

భావించినంతనే ప్రభవించు వైభవము,

భావనల కల్పించు శక్తిశాలగు మనసు,

శృష్ట్యాది పర్యంత అనుభవంబుల రాశి,

కలిగున్న మాన్యులగు మానవుండిట నుండె!

కల్లోల కల్పనలు కల్పించు కార్యమున,

తన తండ్రి కేపాటి తీసిపోనని తెలుప,

ధరణి సహజత్వమున సౌదర్యమొందింప,

కత్తెరలు,కొడవళ్ళు,జలరాశి బంధములు,

అణుశక్తి చిత్రములు ఆకాశ గమనములు,

చిత్రించు కార్యమున వాసికెక్కిన వారు!

స్ఫురియించు ప్రతి స్మృతికి తార్కికత్వపు తీరు,

తీరుగానందించు నేర్పు నోర్పుగ గలిగి,

తర్కమున తగులగాప్రతి స్మృతిని తగుల్కొని,

తనువు తీరేనాడు తన తప్పు తెలుసుకొని,

పరితపించెడివారు పలువురిట ఉన్నారు!

తనువు వైభవ వైన మందలేకున్నారు!

నీచిరుత చేష్టలను నీసొగసు సోయగము,

భీషణంబైనట్టి నీ భీమ గర్జనము,

ఉల్లాసమందించు నీ గమన గతి తీరు,

రచన జేసినవాని జాడతెలియగ లేని,

కోటి విద్యల విలువ ఏటికని తెలియగా,

ఏవిద్య నొందవలె? ఏతీరు నేర్వవలె?

జాడదెలసిన వాని జాడ నీవెరిగెతే,

చినుకు చినుకున వాని పేరు ఇటకంపు,

తళుకు మను నీ హాస రేఖలను సవరించి,

వాని రూపపు రేఖ నీ యదన జూపు!

గర్జనల గాంభీర్యమందెంతో లయగలిపి,

వాని గతి గమనముల తీరు నెరిగించు!

నీలి గగనపు నేల మూల మూలలదాక,

పరుగు పరుగున తరలి ఏమేమి ఎరిగేవు?

ఎటనుండి ఈ మనిషి ఇట కేగినాడు?

ఏటికీ వ్యధలందు పొరలుచున్నాడు?

ఎరిగించు వారెరుక ఎరుకగొన్నావేళ,

తరలి ఈ సీమలో తిరుగి తారాడు!

నాఉనికి గుర్తెరిగి నాకు కబురంపు!

విందు

రాలి పోయెను నాదు తనువని వేదనెందుకు జీవుడా,

రాలుటకె తా తగిలె గాదా నీకు మోదము సేయగా!

రంగరించిన రంగులతొ ఏ ఛాయలెరుగని తోటలో,

వాడుటెరుగని శోభలన రాజిల్లు రసమయ వనులలో,

వాసముండుట విసుకు గొని నీవరిగితివి ఈ విడిదికీ,

వాడు తనువుల తోపులో ఈ తాపమొందెడి ఇచ్ఛతో!

వాణి పలుకని పలుకులను విని మోదమొందెడి తావులో,

వాసుదేవుని ఊహ సవ్వడి అందె కట్టెడి నగరిలో,

వసతిగొను నీ ఉనికి విలువను ఎరుగు దారుల జూచుచూ,

వాదులాడుట మోదమని నీవెంచి నడచిన దారిదీ!

మాటపొంతన కుదరలేదని మాధవుని విడనాడకూ!

వాని వేడుక నాకు ఏదని వాదులాడుట వీడుమా!

తల్లి ఒడిలో జోలలూగుచు కలల దేలుట మోదమే!

ఒడిని విడితే కలలు కల్లలు- వెరపు మాపగ ఎవరురా?

ఎంతగా నీ ఉనికి తెలిపిన తెలియకుంటివి తీరుగా!

వెఱ్ఱి మోహపు వేటలో నీ ఉనికి మాటుగ మిగెలెరా!

ఉనికి మరచిన వెరపు నిను ఈ వల్లకాటికి జేర్చెరా!

వెరపు మానిక  మరలు గూటికి మధుర భక్ష్యము వేచెరా!

వసంత – పంచమి

శ్రీచక్ర సంచారి – చిన్ముద్ర ధారిణీ,

శ్రీవత్సముగ సేవలందు  రాణీ!

శ్రీకరంబగు పలుకు నాలోన పలికించు,

శ్రీవాణి గా నిన్ను- నేను నుతియింప!

నిర్మలత్వపు జాడ – నిర్మోహ మురిపెంబు,

నిర్గుణంబుల గుణము లెన్నగాను,

తగుభావ మొందగల అక్షరంబుల చెండు,

తీరుగా నెరిగింపు తరుణమందు!

పంచ భూతములందు చేతనర్వపు కొమ్మ,

పాంచజన్యపు మధుర నాద నెలత,

ఋతుశోభ నెరిగించు పికము పలికెడి స్వరము,

ఎన్నుకొంటవి ఏల మమ్ముబ్రోవ?

అనుదినము -ప్రతిక్షణము- ఎడమెరుగకుండా,

అవ్యాజమగు నీదు కరుణ చిలికి,

విస్తారముగ నీదు దివ్యలీలల దెలియ,

మొలిపించు మా మదిన శృతుల విత్తు!

రావోయి రావోయి

పన్నగంబుల పరుపు-పన్నగపు మాల,

పన్నగపు కటిసూత్ర మమరున్న వాడు,

చెలువార చేయిచ్చి చెలిమి జేరగ రాదె,

భీతి భావము మరలి భోగంబులమరా!

వెన్నాడు పన్నగపు తనువు తగిలిన వాడ,

పెరుగు తరుగుల పరుగు నలసి యున్నాను,

ఓరిమొందగ ఇంక ఓపికుడెను సామి,

యెద జేరి ఓరిమిగ ఓదార్చ రాదా?

పార్ధసారధి పట్టు పగ్గముల బండీ,

నారాయణుని నమ్ము నరుడు నిలచిన బండి,

నడచు దారుల నెరిగి నడువగా లేను,

నుడవగా ఆ నామ మెరుగగా లేను!

పూనికగ పలుమారు పూజించలేను,

వన్నెకిక్కిన వారి వాసి గనలేను,

నాడెన్నడో నాడు నడక నేర్వని నాడు,

తనువు తోడువు నీవు తరలు మన్నారు!

ఉడిగి పోయెను కసరు- ఊపిరుడిగేను,

నరనరంబుల నడచు ఉరుము లిగిరేను,

భావపొంతన లేని పలుకు లమరేను,

పయనింపు మిక యంచు కాలుడరిగేను!

ఎన్నడరుగును వాడు నన్నేలు వాడు?

ఎరిగున్న వారెవరు ఎరుక గరపంగా?

ఎఱుక గలిగిన దోవ నెటులనో నడిచాను,

ఎంచుమోయిక నిదే పూర్ణ పర్వముగా!

రావోయి రావోయి రాకేందు వదనా!

రాజిల్లగా నాదు ఉడుగు సత్వములు!

ఊరడింపుము నన్ను శ్రీవత్స వక్షా,

సిరి నన్ను లాలించి ఒడి జేర్చునట్లు!

రంగుల జగతి

రంగు రంగుల జగతి రంగారు వైభవము,

నన్ను మురిపించేను రంగా!

నిన్ను మరిపించేను రంగా!

నిన్ను జేరుటకొరకు ఆతురుత నోంది నే,

నెన్ని రూపములైతి రంగా!

ప్రతి రూపమొక భావమై మదిని జేరింది,

మనసు కాళిందాయొ రంగా!

రంగు రంగుల జగతి రంగారు వైభవము,

నన్ను మురిపించేను రంగా!

నిన్ను మరిపించేను రంగా!

లెక్కమించిన జన్మ లెనెన్నొ గడిచాయి,

జన్మ జన్మకు ఒక్క ఛాయ నను జేరింది,

వింతైన ఆ ఛాయ దొంతరల క్రిందణిగి,

నిన్ను గనలేనైతి రంగా!

నన్ను నే మరిచేను రంగా!

 

 

రంగు రంగుల జగతి రంగారు వైభవము,

నన్ను మురిపించేను రంగా!

నిన్ను మరిపించేను రంగా!

నీ మోహ మొక వంక- వాసనలు ఒక వంక,

మదిని మధియించాయి రంగా!

సిరి మోహమును వీడి మోహినై ఏనాడు,

నా మదిని జేరేవు రంగా!

రంగు రంగుల జగతి రంగారు వైభవము,

నన్ను మురిపించేను రంగా!

నిన్ను మరిపించేను రంగా!

మృతము..

క్షీరసాగర మధనమందున-జన్మనెత్తిన అమర రాసుల,

తోడబుట్టితి వానివలెనే – అమరనైతిని అంమృతములో!

కఠిన కాలపు క్లేశములను – మదన సౌఖ్యపు సౌరభమును,

లాలనల తేలింప జేయుచు – అందజేసెడు ‘సుర’కు సఖుడను!

అదుపు లేనీ విష్ణుమాయకు – నియమ బంధపు దరిని జూపగ,

అగ్రజుడనై వెలుగు జూచితి – పార్వతీపతి గళము జేరితి!

జన్మజన్మల గులకదారుల – నడక సాగని దీన జీవుల,

తృటిలొ కడతేర్చగల తరిని – కలిగి యుంటిని కణ కణంబున!

మాయమోహపు కాననంబున – దరి ఎరుంగని విష్ణుఛాయలు,

ఏలనో నా చెలిమి చలువను- ఇచ్చగించక మరలు చున్నవి!

మోహనుని మురళీ రవంబుకు- మోదమొందెడి గోపకాంతకు,

వన్నె తెచ్చిన యమున అలలకు-స్పూర్తియౌ ఆ చంద్రు చెలుడను!

జగన్నాటక రంగమందున – ముందుగా నా ఉనికి నెరిపి,

జగన్నాయకు నాగమమునకు- స్తలిని నెరపెద లాఘవముతో!

క్షణక్షణమొక వింతరూపము – సంతరించెడు నియమ పాలన,

నెరపునైజము గల జగంబున- అమర వాంఛలు పాడియౌనే!

మోహనాంగిగ మోహనుడుతా-పంచి ఇచ్చిన మధుర రసమును,

పొంది తా పోగొట్టుకున్నది – ఎన్నడెరుగును సుర గణంబులు!

వేసారి పోయెను జగములెల్లా-లీల  మోదము సలుపకుంది,

ఆజ్ఞనిడుమో పద్మవల్లభ-కమలోద్భవునికిక అలసటాయే!

మనుపు తల్లీ

తరుగైన మెరుగైన తనయులమె తల్లీ! కరుణించి మమ్మేలు అనురాగ వల్లీ!

ఒకడు చింతల మూట ! ఒకడు ఊహల ఊట ! ఒకడుఆశల కోట! ఒకడు వేట!

పాటు పాటున నిన్ను తలపోసి తలపోసి విసిగి వేదన మునుగు ఒకడి బాట!

వాడైన వీడైన వీడకే వెన్నంటి నడుపు సమయపు చాలు నీదుబాట !

ఒక వంక నెలవంక – ఒకట వెలుగుల పుంత – ఒక చోట మినికు మను వెలుగు జిలుగు,

ఒక గిరిన తుహినములు –  ఒక గిరిన వెలి మంట – ఒకట చోట పొంగారు గంగ ఊట!

పరిగ పైరులు కొన్ని – పరువంపు పరి కొన్ని – పంతమాడెటి ఝరుల వసతి కొన్ని!

ఆవంక ఈ వంక ఏ వంక ననకుండ వంక వంకన వంక నీవెగాదా!

బహు భావనల పుంత – బోగ భాగ్యపు ముంత –అణగారు లేమిలో వణుకు గుటిక,

పలుకు లల్లెడి మాల – పలు దూషణల దండ – పలుకు లొల్లని మూగ పలుకు దొంతి,

వలదన్న – వరమన్న – పలుమారు వినుమన్న –  ఒల్లనొల్లక తొలగు తెలివి తెలివి ,

ఉంది ఉందను దాన ఉన్నదంతయు నీవె – ఉరుము చూపుల నాపి మనుపు తల్లీ!

పార్వతీ పుత్రుడు

ఏకదంతుడు వీడు ఎలుక నెక్కెడి వాడు –   తొలిపూజ తనదంచు పంతమాడెడివాడు,

పలికింపడే కథను పలుగురెరుగంగా,   –   పార్వతీ తనయుండు తలపులో నిలచి!

పలుకులల్లే తల్లి పలుమారు దరిజేరి – పలుకు పలుకున జేరి పలుకరించి,

విబుధుండు ఎరిగించు తలపు లన్నిటిజాడ- తగు పలుకులో జేర్చి కూర్చుమమ్మా!

గుణములన్నిటి యందు గురుతై గురువరులు – దయజూసి నా ఊహ నిలవరుంచి,

గానలోలుని గుణము గానాన కదలంగ – గజముఖుని కథ నేడు తెలుపుమయ్యా!

ఋతురాజు సందడుల సందడించే వనులు – హిమ నగంబుల శోభనినుమడించె,

కొమ్మకొమ్మన విరులు పొంగారు రంగులతొ – పుప్పొడుల పరుపులై పరువమొందె!

గగనాన గమనించు రవిచంద్రులే పగిది – ఈ వనుల గనకుండ కదులగలరు?

కాలనియమము మరచి కన్నులచ్చటె నిలిపి- పలుమారు ఆ పురిని కనుచు జనిరి!

వనికంత సోయగము కలుగగా కారణము – కామదహనుని ఇంతి జాడలేమొ,

నవజాత కలువంటి కనులున్న నాతల్లి – సంచారముగ నచట సంచరించి ,

పతిసేవ కనువైన విరులు ఎంపిక జేసి – మొలక నవ్వులతోన దీవెనొసగె!

పన్నీరు అత్తరులు కస్తూరి జవ్వాది – అగురు చందన గంధ కలశములతో,

ఫలరసంబుల విందు పతికి ప్రియమొనరింప – కదలె పార్వతి నేడు కనియరిదియే!

హిమనగంబుల పైన నందీశు సముఖాన కొలువు దీరెడి రేడు కానరాడె,

చిన్నబోయిన నంది చింతించి చింతించి – వివరమ్ము వివరింప వేగపడదె!

ఏమనెరిగింతు నా భాగ్యంబు ఇటులుండె – ఎరుగనే నా విభుని జాడనేను,

కనులు మూసుక నేను కనుచుండగా హరుని – హరియించిరే ఎవరొ సడిని విడిచి!

ఆర్త రక్షణ గోరి అరిగి యుండగ వచ్చు – అదురు బాటును మాని నెమ్మదించు,

అరుగుతరి నెరిగించు వేచియుందుననఁచు -అరిగెనే గిరికన్య అంతరముకు!

వనులన్ని వాడాయి – వెన్నెలలు వెలిశాయి – మరల మరలా వనులు తడివలువ చుట్టాయి!

విభును జాడను దెలుపు కబురందనే లేదు – కనుల కలువలు నేడు కమిలి పోయాయి!

ఆనాటికానాడు జాడ దెలిశేనంచు వేచియుండిన వనిత వేదనొందేను,

భక్త సులభుడు విభుడు ఏ నాటజొచ్చెనో – ఎరిగింపమని వేడె వేణులోలుడిని!

సంశయింపకు నీవు సరితీరు నే జేసి – తరలించి నే దెత్తు నీదు పతిని,

ప్రమధగణముల మేళమమరించి మరిపింతు ననియంచు తరలేను చక్రధరుడు!

గజ్జెగట్టిన నంది ఆడింది పలుమారు – పురజనంబుల మనము సంతసింప,

పురశేఖరుని ముందు హరహరాయని ఆడి- వరముగా తాబొందె విభుని తెరపి!

కబురంది గిరికన్య మోదానమునిగేను – దారిజూచుట మాని ధీరతొందె!

తనువు నంటిన  ధూళి తొలగించగా నెంచి – నలుగు బెట్టుక నేడు జలకమాడె!

నలుగు రాశిని నలిపి గుజ్జుబాలుని జేసి – బాలునందము జూసి మురిపెమొందె,

భండాసురుని వధన విఘ్నయంత్రము ద్రుంచి – వైరి సేనల దండు మాపినాడు,

కామేశ్వరుని జాడ కదలాడు కనులున్న ముద్దుపాపడి రూపు కనుల గట్టె,

ఎన్నగా తనయుండు తలపులో మెదలంగ – మెదలి ముచ్చట దీర్చె విఘ్నహరుడు!

 

తీరైన కనుదోయి కదలించి చూచాడు – కాలుచేతులు కదిపి కొంగుపట్టాడు,

నవమిచంద్రుని బోలు నగుమోము గలవాడు – లేనగవులొలికించి చేరవచ్చాడు!

ముంగురులు , మొలనూలు , కాలిఅందెలు కదిలి -ఉలికి పాటేలనని పలుకరింపంగా!

తలచి పిలచిన తల్లి తెరపెరుగు తరిజూసి – ముచ్చటింపగ బూనె ముదిమిమీర!

ఆనాటి ముచ్చట్లు తలపోసి మురిశారు – ఆటపాటల యందు తేలి యాడారు,

ఉయ్యాల లూగారు ఉల్లాసమొందారు – వనులు వాడలు తిరిగి అలసటొందారు,

గడియ గడిచిన జాడ ఎరుగకున్నారు – అలుపు సొలుపుల చాల అదమరచారు,

ఆనాటి తనయుండు ఈనాడు ఒడిజేర – నెనరొంది మురిసేను శంభురాణి!

 

శాకాలు పాకాలు విందులో అమరించి – కొసరి కుడిపెను నేడు గిరిరాజ పుత్రి!

అనువైన దండంబు అందించి బాలునికి – ఆడుకొమ్మని ఉంచె ఆంగనమున!

తల్లి కుడిపిన కుడుపు కడుపారగా కుడిచి – కడుభారమగు కడుపు కదలకున్నా!

చిరుత తనువుకు తగిన చిందులేయుచు కదిలి – విఘ్నుడాడెను ఆట అలుపులేక!

అంతలో అరుదెంచె ఆజాను బాహుండు – నందివాహనుడైన పరమ శివుడు,

ఏనాడు విడిచెనో ఈ అంతరాలయము – నేడు జేరును మరల సతిని జూడ!

ఆటలాడెడి బాలు నాదరింపడు హరుడు – అనువైన ఏ మాట పలుకడాయె,

తొలగి నెమ్మదినుండు సందడింపకు మిచట- వినయమొందుట నీకు పాడి యనెను!

గురుతొందనా హరుని పరులనెంచినవాడు – తల్లి ఆనతి నెరగ అరుగ దొడగె,

తొందరించిన హరుడు తొలగు నీవననంచు – పోరుసలుపగనెంచె గుజ్జుబాలునిపై,

జగమేలు జనయిత్రి జననైన బాలుండు ఎరుక లెరుగని విద్య లుండగలవె!

తల్లి ఆనతి లేక తరలు వారల యందు – పోరు మోదముగాదె బాలకునకు!

పంతమాడిన హరుడు పోరువీడుమనంచు బుజ్జగించడె నేడు బాలకుడిని,

రణ విద్య రమణుండు వీడడే పంతంబు -బాలునహమును జూచి కినుకగొనెను,

శక్తిపాశము జుట్టి చిట్టి శివమును ద్రుంచి -వ్యగ్రతొందుచు నరిగె అంతరముకు!

అర్ఘ్య పాద్యము లిచ్చి అర్చించి సేవించి – ఆదరించెడి సతికి అలరు నొసగి,

ప్రియ భాషణములంది ముచ్చటించెడి తరిన – తెలిసె బాలుని ఉనికి వనితవలన!

తొందరించితి నేను తొలగు మని పోరితిని – పొంత నెంచక పోతి నాదు సతిది,

నాడు జేసిన బాస ఏతీరు మరుగాయె – బాస బాసిన పతికి గతులు గలవె!

గోపికావల్లభా గతిఏమి నాకిపుడు – గాచి తెచ్చిన ఫలము విఫలమాయె!

హరిని తలచిన హరుడు వివరంబు దెలిపేను విన్నపముగా సతికి వివరమంతా!

నెమ్మదెరుగని వాడు తొందరించెడి వాడు – కరుణ కాణాచిగా పేరున్నవాడు,

తామసంబులు తగులు తనువు గలిగినవాడు – తారకంబును వీడి మనలేని వాడు,

తనువు జేసెడి పూజ తనకు తగినదెయంచు  – తనువు చెల్లెడి వరకు తగిలుండువాడు,

పత్రపుష్పపు పూజ కోరనేరనివాడు – కోనేటి నీటితో తుష్టినొందెడివాడు!

తుమ్మిపూలే చాలు – కాష్టబూడిదె చాలు – హరహరా యని పలుకు పలుకుచాలు,

తప్పుకుప్పలు తుడిచి తోడుండి నడిపించి – పరమ పథమును జేర్చు గురువువాడు,

బిచ్చమడిగెడి వాడు బింకమెరుగని వాడు – భవరోగ భారమును హరియించువాడు

శరణన్న మృతమైన మింగి గాచెడివాడు – మిగుల భాగ్యపు రాశి విభుడువాడు!

జగము గాచెడి వాడు -తానె జగమగువాడు – జగమున్న లేకున్న ఉండునొకడేవాడు,

నాదమునకాధారి – నాదరూపుడు వాడు – నాదమెరుని మౌన మునివరుడు వాడు,

భావింప తగువాడు – భావరూపుడు వాడు -భావసీమల మించి భాసించు వాడు,

నామంబు ఇదియన్న నామమెరుగని వాడు – అన్నినామములందు అమరున్నవాడు,

ఎల్లలెరుగని వాడు – ఎల్లలందలివాడు – ఎంచగానేపగిది అంతుచిక్కనివాడు,

కాలరూపుడు వాడు -కాలహంత్రియు వాడు-కాలమెరుగని కాల రూపుండు వాడు,

జగతి రూపము వాడు – రూపమెరుగని వాడు – రూపుగట్టెడి రూపభావమగువాడు!

 

 

 

 

 

అనియంచు తలపోసి తల్లికెరిగించితిని – వివరంబుగా విబుధ గుణములెల్లా!

వల్లెయన్నను వినక వనికేగి తపియించి – తపము ఫలముగ బొంది సంతసించి,

మదనాంతకుడు హరుడు – మోహించెనే నన్ను – భాగ్యమేమని నాది మురిసిబోతి,

అంపకంబులు పెట్టి అంపేటి ఆనాడు – తోడు ఎరుగుమనంచు తల్లి తెలిపె!

నీడలెరుగని వాడు తోడంచు తరలేవు – వాడ వాడలు వాని యశము నెరుగు,

తిరుపమెత్తెడి వాడి – త్రైలోక్య సంచారి – తోడు తగులని నాడు తరుగు గనకు!

గౌరమ్మ నీ తోడు – గాయత్రి తోడు – గగనాన కదిలేటి గోళములు తోడు,

పగలు సూర్యుడు తోడు రేయి నెలరేడు – నెలరేడు లేకున్న గగనమే తోడు!

పసుపు కుంకుమ తోడు -మన్ననలు తోడు – సిరులు చిందేచిన్న సిగపువ్వుతోడు!

అట్టి తోడును బట్టి దినదినము నిను జేరి – భక్తిమీరన కొలుతు భర్తయనుచు,

తపము పండగ నాడు అందుకొంటి నేను – ఏమనందును నేడు వెలతి గాదె!

మదను జంపిన నాడు ముదిమినొందిన నేను- ఎరుగనే నీవింత విముఖుడంచు!

మృకుపుత్రుగాచినా ముక్కంటి దేవరవు – కావవే నా సుతుని కరుణతోడ!

ముచ్చటెరుగని వాడు నామనోహారుడని – ముజ్జగంబుల కెటుల విన్నవింతు?

కడుపారడులు దీర్ప కోరికొలిచెడివారి నేరీతి నేనింక  ఆదరింతు?

పతిమన్ననొసగుమను పలుమారు పూజించు సతులకేమని ఇంక అభయమిత్తు?

తెలుపుమో పరమేశ పాడియౌనిదినీకు – ముందరాడిన బాస బుగ్గిజేయ?

 

అంతలోనరిగారు సురలోక వేలుపులు – ఆతురతతో నరిగె విబుధులంతా,

నాగారివాహనుడు లచ్చితో నరిగాడు – పద్మసంభవుడరిగె పడతి తోన,

యక్షకిన్నెరు లరిగె గంధర్వులరిగె – నారదాదులు అరిగె ప్రమధులును అరిగె,

వైనంబు వివరముగ అడిగడిగి తెలియంగ-విదిత విధి నెరుగగా వెడుకొనిరి!

దిక్కులన్నిటి దిక్కు దిక్కైన దేవుండు – దీనతొందుట జూడ వేడుకగునా?

పలుమారు ఏమంచు పలుకరింపగ వలెను- పలుక కుంటే ఏమి కష్టమగునో!

వల్లమాలిన వాడు వాదేల ఆడవలె – వల్లెయంటే ఏమి దోషమగును?

తొల్లిఏమని పలికి తప్పినాడీ హరుడు? తెలియదే వివరంబు తేటతెలియ!

కబురంది అరుదెంచె హిమవంతునిల్లాలు – నగరాజునూ అరిగె వివశతొంది!

జపతపంబులు మాని భీతిల్లి మునిజనులు-శంకరా శాంతమని ఘోషనిడిరి!

రవిపుత్రుడరుదెంచె ఇది ఏమి వింతంచు – ఎరుగనే ఈ జీవి వాసమంచు!

తొందరొందకుడంచు నెమ్మదెరిగించుచూ – పద్మనాభుడు కదిలె విధినిదెలుప!

తొందరొందిన నీవు తుంటరని ఎంచేవు – తెలియనేరగబోతి వసలు కథను,

భండుజంపగ నాడు కోరిబిలిచిన సతికి – మారుజెప్పనటంఛు మాటనిచ్చి,

సతియాంగనమునాడు బాలుండు వైరియని – వేగపడి దుంచితివి వాని శిరము,

దక్షుదృంచిన నాడు దయనేలి నిడలేద మేకముండము  వాని శిరముగాను,

ఆ విద్యనే ఎంచి ఒసగుమా గజముండ బాలుడాడును జనులు మోదమొందా!

లీలనెరిగిన హరుడు హరిహరీయని పలికి – అసురుడగు గజరాజు వరము తలచి,

గజముండమును దెచ్చి బాలుమొండెము జేర్చి – జీవమందగజేసె మరలవాని  !

హర్షాతిరేకమున విరుల వానలుకురిసె –  దిక్కులన్నిటియందు సుధలు కురెసె,

దేవదుందుభి మ్రోగి శుభమంచు దెలిపింది – ధేనువులు కురిపించె దీవెనల వృష్టి

దేవగణమందించె పలు యశంబులను  – ఋషిగణంబులు పలికె శుభములన్నీ,

విషయమెరిగిన  జనులు వైకుంఠు పొగిడారు – వారిజాక్షిని జేరి ముదము దెలిపారు!

వింతరూపము గొన్నబాలు వైనము జూసి – మిన్నకున్నా హరిని వివరమడిగారు!

విఘ్నేశ్వరుని వివరమెరిగున్న శ్రీకరుడు వివరంబు నెరిగించె జనులు వినగా-

కలియుగంబున వీడు కడుదొడ్డ దేవుండు -కరుగ జేయును గట్టి గడియలన్నీ,

మోదరూపుడువీడు మోదాన మనచుండు – మోదకంబుల విందు మోదమమరు!

గడ్డిపరలకల పూజ – వడపప్పు నైవేద్య మంది సంతసమొందు చంటివాడు!

చెరకుముక్కలనంది చదువు సంపదలిచ్చు- గజముఖుండను పేర వాసినొందు!

సంతసించిన అతివ సంతునొడిజేర్చుకొని – ముద్దుమరిపెము గొనుచు మరియుచుండ,

జయమఁచు పలుకరే పరమేశు సుతుకూ – జయమఁచు పలుకరే పార్వతీ సుతుకూ

కడగండ్లు మాపంగా కనికరముబూని – కనుదెరచినాడమ్మ కమలాక్షి ఇంట,

సంకటంబుల భయము మనకేలనమ్మా – కోరి కొలుతము రండి గజముఖుని నేడు!

జయమఁచు పలుకరే పరమేశు సుతుకూ – జయమఁచు పలుకరే పార్వతీ సుతుకూ

చంటి బాలుడటంచు చులకనగ జూసేరు – కురచ వాడననంచు చిన్నబోయేరు,

ముక్కంటిపై గెలిచి జీవమందిన వాడు – గడము లెన్నిటినైన గడిపించు వాడు!

జయమఁచు పలుకరే పరమేశు సుతుకూ – జయమఁచు పలుకరే పార్వతీ సుతుకూ

పరమ పావని అంబ అండనొందిన వాడు – పరమేశు మన్ననలు కాణాచివాడు,

వసుదేవు సుతువలన పేరునొందిన వాడు- పలుదేవతల నుతుల నందిమనువాడు,

అనిఅంచు జనులెల్ల నుతులు పలికేరు – పాప మురియగ నేడు పండగంచు!

 

 

 

సావధానమునొంది దీవించె శంకరుడు – చరిత నెరిగిన వారి ఫలము నిటుల:

తారకంబగు చరిత ఎరిగి ఎరుగకనైన వినినంత అనినంత వివరించినంత

గర్భశోకము సమసి సంతు నెమ్మదినొందు – ఆన ఇదె ఎరుగుమో ఇందువదనా!

అనియంచు శంకరుడు గిరికన్య పుత్రునికి జీవమొసగిన తీరు తెలసి కొనరే!

మంగళంబగునయ్య నందబాలునికీ – మంగళంబులు గల్గు గౌరీశు సుతుకీ,

మంగళంబులు గల్గు గిరిరాజ సుతకూ – మంగళంబులు గల్గు సకల దేవతకూ,

మంగళంబులు గల్లు మమ్మేలు హరికీ- మంగళంబులు గల్గు మా శంకరునకు!

మంగళంబులు గల్గు వాణి -బహ్మలకు- మంగళంబగుగాక సాధుసంతులకు!

సర్వం శ్రీగణేశ్వర చరణారవింద మస్త

భయ హర

అంధకరిపు నభయంబను అంబుధి మునుగగ నెంచెద,

అంబుజనాభుని ఆదర మరకుగ త్రాగగనెంచెద!

అతివల బలముల కొలికివి- కులుకవె నా మది వీధుల,

కోమల గమనపు గతులన – గజ్జల సడి చెవులొప్పగ!

నీ నాధుని అలరించెడి మంజీరపు మృదు సవ్వడి,

కంపింపగ జేయుమమ్మ కామిత మణుగగ నాలో,

కాలుని పాశపు కోరల కొలుపున జేరెడి తనువిది,

కోరను నే నే నెలవును – కూరిమి గొనుమమ్మా!

పదమానిన కమలంబును శిరమున గైకొని విజ్ఞులు,

అనవరతము సాన్నిధ్యపు అనుభూతిని అనుభవించి,

ఏలికయౌ నీ మహిమను ఏమర కెరుకను గైకొని,

భవ సాగర డోలలలో లాలన నోదక మనెదరు!

నడయాడగ పదమాడని పాశపు మోపున జిక్కితి,

ముకుళిత కమలపు కొలనున మడియని బుడుగగ తేలితి,

చూపానని చీకటిలో దరి జేరెడి జాడ తోడు,

ఇడుములు తొలుగంగ జేసి మనిపెదరంచూ..

దృతి ఎరుగని ఇరుసుగ నే నాధారము నైతి గాని,

కాలుని గమనపు గతిలో కమలాక్షుని గననైతిని!

బాధల మాన్పెడి భానుని వెలుగులు నిండిన కన్నుల,

అల్లార్చకె  ముజ్జగములు పాలన జేసెడి చూపులు,

కనికరమున ఒక మారీ కొలనున నాటవె శౌరీ!

శరణాగతి జేయగ నా పాశంబుల మధియించవె!