కన్ను లెరుగనివాడు – కంటి వెలుగగువాడు
యోచనన్దే గాని ఎదుట నిలువనివాడు,
లోనుండి ఏవేవో ఎరుక పరచెడి వాడు,
ఎన్నడో కద నన్ను కరుణ గొన నెంచు!
నాడెన్నడో ధరణి నడిచినా డంటారు,
నమ్మి కొలిచెడివారి చెలికాడననంటారు ,
నామ మందినవారి జత గాడననంటారు,
ఎన్నడో కద నన్ను ఎలినా డంటారు !!
వారు వీరెరిగిరని ఎరిగించు కథలెన్నో,
కనుల గాంచిన వారి వివరణలు ఎన్నెన్నో,
నమ్మ కుండిన నన్ను పెడవాడననంటారు,
నమ్మ నాకొక తెరవు తెలియనగు నెపుడో!!
జగతి నడతకు వాడే ఆధార మంటారు,
తనువు తెలివికి వాడే కారకుండంటారు,
తావులన్నిట తానె తారాడు సంసారి,
సందు జేసుక నాకు శరణీయునెపుడో !!
తనువు లోపలి హంస సోహమని అంటారు,
నాడులన్నిట నడుచు సామమని అంటారు,
అంతరంగము లోన అణువంత వెలుగువై ,
వెలయు నిను తెలియగల తెరవిచ్చుటెపుడో !!
అక్షయంబగు పదములంతమౌతున్నాయి ,
అవని తన పనితనము తిరిగీయమంటోంది,
ఆదరించగ నీవు యోచనలనిక మాను,
పోవ తావులు లేవు – నీ చరణకే శరణు!
వట్టి వావడను అయిన-గట్టివాడను అయినా ,
నీవు కూర్చిన వాడ – నీవాడనే నేను,
మాయలో మరగి నే మరపు నొందినగాని,
మాయ కూర్చిన నీవు – నను మరువ తగునా!
నేర్పుతో కూర్చినా పొరలన్నీ తొలగించు,
మాలిమితో మలినముల మొదలంట తొలగించు,
నీ వాడనగునట్లు ననునివే సవరించు,
సావకాశము మాని సావధానమునొందు!
చెండ శాసనుడైన నీ బంటు నిలువడట,
ధరణి తన ధాతువుల అరువునిక ఈయదట,
అంగ వాహకుడింక అలసత్వమొందడట,
జగతి నిండిన నీకు- జేర నను జాగేల!!
పొంతనెరుగని పాత ప్రారబ్ధ సంచితపు,
సవరణలన్నియు నీవే – చెల్లజేయఁగ నీవే,
పలుమారు నిను వేడి పంతమాడగ లేను,
పిన్నవాడని నీవే కరుణగొని దరిజేర్చు!!
ఏమరపు యోచనల ఏల మునిగేదవైయ్యా ,
ఎవ్వరో పిలిచిరని – ఎవ్వరో తలచిరని ,
జగతి నిండిన వాడ – జలమేలయ నీకు,
ఏలుకోనగా నన్ను – ఇత్తరినె మేలుకో !!!!!!!
మేలుకొని ఈ క్షణమే శరణిచ్చి ఏలుకో !!
మేలుకొని ఈ క్షణమే శరణిచ్చి ఏలుకో !!